Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : హుదూద్‌ పాఠాలు - 1

ఆంధ్రప్రదేశ్‌లోంచి తెలంగాణను విడగొట్టిన తర్వాత మిగిలినదాన్ని రెసిడ్యువల్‌ ఆంధ్రప్రదేశ్‌గా కేంద్రం వ్యవహరించింది. దాన్ని తెలుగు అనువాదం కూడా వారే యిచ్చారు. - 'అవశేష ఆంధ్రప్రదేశ్‌' అని. అసలు ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు ఎందుకు కొనసాగించాలి, సింపుల్‌గా ఆంధ్ర అంటే పోయె కదా అని నాయకులెవరూ సూచించలేదు. అది బ్యూరోక్రాటిక్‌ జార్గన్‌ కాబోలు, మధ్యప్రదేశ్‌ను కూడా ఆ పేరుతోనే పిలుస్తారేమో నాకు తెలియదు. నా వ్యాసాల్లో అవశేష ఆంధ్రప్రదేశ్‌ అంటూ వుంటే కొందరు బాధపడ్డారు - అదేదో న్యూనతాపదంలా! స్వర్ణాంధ్ర అనాలని కొందరు, నవ్యాంధ్ర అనాలని కొందరు సూచించారు. మనపాటికి మనం పేరు పెట్టేస్తే అది చలామణీ అవుతుందా? అయినా కొందరు అదనీ, కొందరు యిదనీ అంటే గందరగోళం రాదా? ఇప్పటికీ కొందరు వ్యాసకర్తలు తమకు తోచిన విధంగా ఆ రాష్ట్రాన్ని వ్యవహరిస్తున్నారు. ముందూ వెనకా ఏం పెట్టినా ఆంధ్ర పదం ఎక్కడో అక్కడ కనబడితే, ఓహో ఆ రాష్ట్రమే కదా అని గుర్తుపడుతున్నాం. హుదూద్‌ తాకిడి చూశాక ఆ రాష్ట్రానికి అవశేష ఆంధ్రప్రదేశ్‌ పేరు అతికినట్లు సరిపోయింది.  అన్నీ కొట్టుకుపోయి, విరిగిపోయి, కూలిపోయి మిగిలింది మాత్రమే కనబడుతోంది. 

నాశనమైనది వైజాగ్‌ ఒక్కటే కాదు, మొత్తం రాష్ట్రమని చెప్పాలి. ఎందుకంటే విజయవాడ-గుంటూరు ప్రాంతం రాజధాని అంటున్నా, వైజాగ్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు జనం. ఐటీ హబ్‌, ఫార్మా హబ్‌, నాలెజ్‌ సిటీ, సినీపరిశ్రమకు సిటడల్‌, మెరైన్‌ ప్రోడక్టులు, పోర్టులు, యింటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ప్రగతి రైలుకి యింజను, కాస్మోపోలిటన్‌ కల్చర్‌, రాజకీయంగా ప్రశాంతంగా వుండే పట్టణం, సాంస్కృతికంగా ఎంతో ముందున్న విద్యాధికుల నగరం... యిలా ఎన్నో విధాలుగా వైజాగ్‌ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమైన నగరం. ఈ రోజు అక్కడ ఏం మిగిలింది? తుపానులు మనకు కొత్త కాదు. ఎప్పుడూ వాటి గురించి వింటూనే వుంటాం. చాలా భాగం తుపానులు, మనల్ని దడిపించి ఒడిశాదాకా వెళ్లిపోయి అక్కడ తీరం దాటతాయి. మరీ చురుకైనవి బెంగాల్‌ దాకా, కొండొకచో బంగ్లాదేశ్‌దాకా వెళతాయి. పేపర్లో చదివి ప్చ్‌ప్చ్‌ అనుకుంటాం. మన దగ్గర ఒంగోలు, కాకినాడ వంటి చోట్ల ప్రమాదసూచికలు పెడతారు. 15, 20 ఏళ్లకు ఓ సారి పెద్ద తుపానులు వస్తాయి, తక్కిన సంవత్సరాల్లో ఓ మోస్తరుగా బాధపెట్టి పోతాయి. వైజాగ్‌ కయితే తుపానులు రావు. అక్కడి జాగ్రఫీ రానివ్వదు అంటూ వచ్చారు యిన్నాళ్లూ. హూత్‌, అదంతా పాత హిస్టరీ అంది హుదూద్‌. కావాలనుకుంటే ఎలాగైనా వస్తానని చేసి చూపించింది. 

నగరాలలో తుపానులు మనకు కొత్త. ప్రపంచంలో కొన్ని నగరాలలో వచ్చాయిట కానీ వాళ్ల సంసిద్ధత వేరు. మనం కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి దేవుడిపై భారం వేసే రకం. జరిగేది జరగక మానదు, మనం చెట్టుతొర్రలో దాక్కున్నా శనీశ్వరుడు పట్టుకోక మానడు అని వాదించే రకం. ముందు జాగ్రత్తలు తీసుకునేవాడు మన దృష్టిలో హాస్యగాడు. 'మరీ చాదస్తానికి పోతేనే యిరుక్కోవడం ఖాయం' అని సలహాలు యిస్తుంది మన సమాజం. కీడెంచి మేలెంచమన్నారు కదా అని సంజాయిషీ చెప్పుకోబోతే 'అన్నావూ, శుభం పలకరా మంకెన్నా.. అన్నట్టు! పైన తథాస్తు దేవతలుంటారు, నువ్వు తుపాను వస్తుందేమో అన్నావు, వచ్చింది. నీ దరిద్రపు నాలుకను అదుపులో పెట్టుకోరా బాబూ' అని కోప్పడతారు. ఇప్పుడు హుదూద్‌, ఇంతకు ముందు ఫైలిన్‌, దానికి ముందు కత్రినాయో, కైఫో.. ఏదో ఒకటి వస్తూనే వున్నాయి కదా. దానికి గాను మనం తీసుకుంటున్న జాగ్రత్త లేమిటి చెప్పండి. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ దళాలు అద్భుతంగా పనిచేశాయి, ఇందరి ప్రాణాలు కాపాడాయి, ఆస్తులు కాపాడాయి అంటున్నారు. అలాటి దళాలు రాష్ట్రస్థాయిలో ఏర్పడాలని కేంద్రం ఎప్పుడో చెప్పింది. ఇప్పటిదాకా మన రాష్ట్రం ఏర్పాటు చేసుకోలేదు. మన కంటె వెనకబడిన రాష్ట్రంగా పేరుబడిన ఒడిశా చేసుకుంది. హుదూద్‌ విషయంలో కూడా సంసిద్ధత విషయంలో మన కంటె ఒడిశా మెరుగ్గా వుందట. 

కొత్త రాష్ట్రం ఏర్పడి నాలుగు నెలలైంది. ఎప్పుడు చూసినా 'విజయవాడలో రాజధాని', 'ప్రతీ జిల్లాకో హబ్‌, గ్రిడ్‌, స్మార్ట్‌ సిటీ', 'ప్రతీ జిల్లాకు ఓ స్మార్ట్‌ సిటీ', 'రాష్ట్రంలో మూడు నాలుగు మెట్రోలు, ఫలానా మెట్రో పట్టాలు యిదిగో యీ దార్లో వెళుతున్నాయి' అంటూ ప్రకటనలు గుప్పించారు. స్టేట్‌ డిజాస్టర్‌ ఫోర్స్‌ నెలకొల్పడం గురించి ఏం చేశారు చెప్పండి. కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంగళగిరిలో ఓ యూనిట్‌ పెడతామని అన్నారు. ఇప్పుడు మంగళగిరి ఏకంగా రాజధానే అంటున్నారు. మరి దీనికి చోటుందో లేదో! ప్రపంచం నివ్వెరపోయే రాజధాని కడతాం, ఉన్న అడవులు కొట్టేసి నగరాలు కడతాం కాబట్టి, కొత్త మొక్కలు పాతతాం అని వాగ్దానాలు గుప్పించారు కానీ తీరప్రాంతంలో యిప్పుడు పాతతామంటున్న మొక్కలు పాతే కార్యక్రమం మొదలుపెట్టలేదు. ఎక్కడండీ వచ్చి నాలుగు నెలలేగా అయింది అంటే.. మరి ఆ నాలుగు నెలల్లోనే యిన్ని వాగ్దానాలు చేయడానికి టైముందిగా! రాజధాని నిర్మాణం అంటూ చందాలు సేకరించడానికి టైముంది కానీ దీనికి లేదా? ఋణమాఫీకై డబ్బులు ఎలాగైనా యిస్తాం అంటూ రకరకాల కబుర్లు చెప్పడానికి, ఆ భారం తగ్గించుకోవడానికి యుక్తులు పన్నడానికి టైముంది కానీ యీ ప్లానింగ్‌కి టైము లేదా? ఉన్నవి చాలనట్లు కొత్త సంక్షేమపథకాలు ప్లాన్‌ చేయడానికి టైముంది కానీ దీనికి లేదా?

ఇప్పటికిప్పుడు చెట్లు నాటితే హుదూద్‌ ఆగిపోయేదా? ఛస్తే ఆగేది కాదు. ఆ చెట్లు యిప్పటికిప్పుడు ఎదిగిపోయి గాలులను ఆపేసి వైజాగ్‌ను రక్షించేసేవి కావు. కానీ నవ్యాంధ్ర లేక స్వర్ణాంధ్ర లేక వజ్రాంధ్ర లేక వైఢూర్యాంధ్ర ప్లానింగ్‌లో తీరప్రాంతాల పరిరక్షణ గురించి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నదే ప్రశ్న. విజయవాడ-గుంటూరు కూడా తీరప్రాంతంలో కట్టబోయే రాజధాని అందాలను చూడడానికి ప్రపంచం నాలుగు మూలల నుండి పర్యాటకులు వస్తారంటున్నారు. వచ్చినవాళ్లు తిరిగి వెళ్లే గ్యారంటీ వుందా? అధికారంలోకి రాగానే దీని గురించి అర్జంటుగా ఆలోచించాల్సిందని తోచలేదు అంటారా? అదీ తప్పే. 

తుపానులు కలగజేసే నష్టాన్ని తట్టుకునేందుకు యిప్పుడున్నది 23 జిల్లాల రాష్ట్రం కాదు. 13 జిల్లాల రాష్ట్రం మాత్రమే, హైదరాబాదు వంటి ఘనాదాయం వున్న రాష్ట్రం కాదు, లోటు బజెట్‌ రాష్ట్రం. రాజధాని కట్టడానికి డబ్బు లేదు, ఋణమాఫీకి డబ్బు లేదు, జీతాలకు కూడా కేంద్రం వైపు చూడాల్సిన పరిస్థితి. ఇలాటి రాష్ట్రానికి హుదూద్‌ కాకపోయినా దానిలో నాల్గో వంతు తుపాను దెబ్బ తగిలినా తట్టుకోవడం కష్టం. అందుకని సంక్షేమపథకాల విషయం పక్కన పెట్టి తీరప్రాంత రక్షణకై నిధులు కేటాయించి అమలు చేయాలి. రాష్ట్ర బజెట్‌లో ఆ అంశం కింద కేటాయించిన నిధులెన్ని? అమలుకై ఉద్యమించిన పథకాలెన్ని? తెలిస్తే ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా వుందో తెలుస్తుంది. అవన్నీ యిప్పుడు చేస్తాం లెండి అంటే కొంపంటుకున్నాక బావి తవ్వించడానికి పురమాయించినట్లు వుంటుంది. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ యీ విషయమై గైడ్‌లైన్స్‌ ఎప్పుడో విడుదల చేసింది. మొన్న ఒఎన్‌జిసి పైప్‌లైన్‌ బద్దలు కావడం కూడా డిజాస్టర్‌ కిందే వస్తుంది. అది జరిగాక తీసుకున్న చర్యలేమిటో, మళ్లీ జరగకుండా తీసుకున్న జాగ్రత్తలేమిటో పేపర్లలో రాలేదు. మోదీగారు వచ్చి మీకు విశాల సముద్రతీరం వుంది అని ఆంధ్రావాళ్లను ఉబ్బేసినపుడు 'ఆ తీరంతో బాటు తుపానులూ వున్నాయి, పశ్చిమతీరంలో మీకు అవి రావు కానీ, మాకు వస్తాయి' అని అనుకున్నాం. 

ఇదిగో యిప్పుడు కొత్త రాష్ట్రానికి హుదూద్‌ మూలిగే నక్కమీద తాటికాయలా పడింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకున్నా, ప్రకృతి విలయాన్ని ఆపగలిగేది కాదు కానీ దాన్ని తట్టుకోవడంలో మార్పు వచ్చేది. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?