Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: బూట్లు లేని శవం

ఎమ్బీయస్ కథ: బూట్లు లేని శవం

‘‘సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటులో నాకు ఉద్యోగం రావడానికి ముందు నేను ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేసేదాన్ని. అప్పుడు జరిగిందీ సంఘటన.’’ అంటూ అర్చన మొదలుపెట్టింది.

‘ఆ ఊళ్లో ఒక మురికివాడలో మా ఆఫీసు ఉండేది. ఆ వాడలో సవ్యమైన కుటుంబమంటూ ఏదీ లేదు. స్థిరమైన ఆదాయం లేనివాళ్లు. పనీపాటా లేనివాళ్లు. ఇల్లూవాకిలీ లేనివాళ్లు... ఏదో ఒక సమస్య. దేనికో ఓ దానికి యింటాబయటా రోజంతా పోట్లాడుకునేవారు. అప్పులు తీర్చలేదనో, తిట్టాడనో ఏదో చిన్న కారణమున్నా సరే, ఒకరినొకరు చంపుకునేవారు కూడా. ఎంతోమంది అనాథ పిల్లలు. అమ్మానాన్నా జైల్లో ఉన్నవాళ్లు, యీ లోకంలోనే లేనివాళ్లు. చదువూ, సంధ్యా, సంస్కారం ఏమీ లేవు. చిన్నచిన్న నేరాలు చేసేవారు. దురలవాట్లకు లోనయ్యేవారు. ఎప్పుడూ తన్నుకులాడుతూండేవారు.

క్రైస్తవులు కూడా చాలామందే ఉండేవారు. దేవుడి గురించి మాట్లాడేవాళ్లు కాదు కానీ అస్తమానూ దెయ్యాల కబుర్లు చెప్పేవారు. ఏవేవో మూఢనమ్మకాలు. మాయామంత్రాలూ అంటూ భయపడేవారు. చదువు లేకపోతే యిలాటివి పెచ్చుమీరతాయి. సరైన కౌన్సిలింగ్‌తో వీళ్లని సంస్కరించి, నేరాలకు పాల్పడకుండా చూసి, విద్యాబుద్ధులు నేర్పించి, వారి జీవితాలు బాగు చేయడం మా సంస్థ ఆశయం. మా ఆఫీసు ఇరవై నాలుగ్గంటలూ పని చేసేది. ఇంట్లో వాళ్ల దెబ్బలకో, బయటివాళ్ల దెబ్బలతో తాళలేక చిన్న పిల్లలు ఏ అర్ధరాత్రో వస్తే ఆశ్రయం యిచ్చేవాళ్లం.

అవేళ రాత్రి 9 గంటలైంది. పొద్దుటి నుంచీ అలసిపోవడంతో ఆఫీసు కుర్చీలో కూర్చుని ఉండగానే మాగన్నుగా నిద్ర పట్టేసింది. దానిలో ఒక కల. భోరున వర్షం పడుతోంది. తడిసిన బట్టలతో ఒకతను నా దగ్గరకు వచ్చాడు. మసక చీకట్లో ఉన్నాడు. చూడగానే అతను అప్పటికే చచ్చిపోయా డనిపించింది. అలా అని నడుస్తున్న శవంలా లేడు. చచ్చిపోయాడని తోచిందంతే. తడిసిన న్యూసుపేపర్లలో చుట్టిన గుండ్రటి, ఫుట్‌బాలంత వస్తువేదో చంకలో దాచుకున్నాడు. పరీక్షగా చూస్తే అతనెవరో తెలిసింది. ఆ వాడ సందుల్లో, గొందుల్లో తిరుగుతూంటాడు. చింపిరి జుట్టు, మాసిన మీసం, గడ్డం, అట్టలు కట్టిన పాంటు, షర్టు. పిల్లలు అతని చుట్టూ తిరుగుతూ బూచాడు, బూచాడు అంటూ ఆటపట్టిస్తూంటారు. ఇతను అమితకోపంతో వాళ్లని చచ్చేట్లా తిడుతూంటాడు. రాత్రిళ్లు ఏ యింటి అరుగుమీదో పడుక్కుంటాడు. చూస్తే చికాకు పుడుతుంది తప్ప భయం వేయదు. ఏం కావాలి నీకు? అని అడిగాను కలలోనే. అతను ఆ వస్తువేదో నా చేతికి యిస్తూండగానే ఓ కుర్రాడు ‘అర్చనా మేడమ్’ అంటూ నన్ను లేపాడు. కల చెదిరింది.

ఉలిక్కిపడి లేచాను. ‘‘ఏమైందిరా బుజ్జీ?’’ అన్నాను.  ‘‘అక్కా, బూచాడు చచ్చిపోయాడు.’’ అన్నాడు వాడు, ‘‘సందు చివర పడి ఉన్నాడు. కదలటం లేదు.’’ నేను వెంటనే అతని వెంట వెళ్లాను. నిజమే నిశ్చలంగా పడి ఉన్నాడు. నాడి పట్టుకుని చూశాను. ఆడటం లేదు. ముఖం ప్రశాంతంగా ఉంది. కోపం లేకపోతే యిలా కనబడేవాడన్నమాట అనుకున్నాను. అతని పాదాలవైపు చూపు పడింది. బూట్లు లేవు! అతని బూట్లను ఒకసారి చూస్తే చాలు, ఎప్పటికీ మర్చిపోలేం. కింద అరిగిపోతే టైరు ముక్కలు వేసి కుట్టుకునేవాడు. అందువలన చాలా ఎత్తుగా కనబడేవి. ‘‘బూట్లేవీ?’’ అని అడిగాను.

‘‘పీటరన్న పట్టుకుని పోయుంటాడు.’’ అన్నాడు బుజ్జి.

‘‘నీతో పాటు పీటరు కూడా ఉన్నాడని చెప్పలేదే!’’ అన్నాను నేను. పీటరు వీళ్లందరి కంటె వయసులో పెద్దవాడు. 19 ఏళ్లుంటాయనుకుంటా. శారీరకంగా బలవంతుడు. నవ్వు మొహం. అందరితో సరదాగా ఉంటాడు. నవ్వుతూ మాట్లాడతాడు కానీ వీళ్లందరికీ వాడంటే బెదురే. అందుకే కాబోలు పన్నెండేళ్ల బుజ్జి ఏమీ మాట్లాడలేదు. వీధి దీపాల వెలుగు వాడి అమాయకమైన మొహం మీద పడి మెరుస్తోంది. ‘‘సరేలే, యింతకీ బూట్లెందుకు తీసుకున్నాడు?’’ అని అడిగాను.

‘‘ఎవరైనా చచ్చిపోతే, వాళ్ల బూట్లు తీసేసుకోవాలి. లేకపోతే తనను ఎవరైతే చంపారో వాళ్లను శవం వెతుకుతూ తిరుగుతుంది. బూట్లు లేకపోతే శవం నడవలేదుగా’’ అన్నాడు బుజ్జి, కళ్లు పెద్దవి చేసి. అన్నాళ్లుగా వాళ్ల మధ్య ఉండివుండి వాళ్ల చాదస్తాలు, మూఢనమ్మకాలు అన్నీ తెలుసుకున్నానని అనుకున్న నాకు కూడా యిది కొత్త! ‘‘నీకిలాటి పిచ్చి నమ్మకాలు లేవు కదా’’ అన్నాను బుజ్జి కేసి చూసి. ‘‘అబ్బే నేను నమ్మనక్కా. కానీ పీటరన్న నమ్ముతాడేమో!’’ అన్నాడు బుజ్జి.

పోలీసులకు ఫోన్ చేసి వాళ్లు వచ్చేదాకా శవానికి కాపలా కాసాను. పోలీసు స్టేషన్‌లో తేలినదేమిటంటే ఎవరో కానీ బూచాణ్ని (అతని అసలు పేరు జాన్ వెంకట్రామయ్య అని పోలీసులు చెప్పారు) కత్తి పెట్టి అయిదారుసార్లు పొడిచారు. ఆ కత్తి కనబడలేదు. చంపడానికి సరైన కారణమూ కనబడలేదు. పోలీసులు బుజ్జిని అడిగి చూశారు. తనూ, పీటరూ కలిసి శవాన్ని చూశామని, తను నా దగ్గరకు వస్తే, పీటరు ఎటో వెళ్లిపోయాడనీ చెప్పాడు.

తిరిగి వచ్చాక నా రూమ్మేటు ప్రతిమతో బూట్లు మిస్ అయిన సంగతి చెప్పి చూడు పిచ్చినమ్మకాలెలా  ఉంటాయో అంటూ నవ్వితే, తను నవ్వలేదు. ఈ నమ్మకం క్రైస్తవులలోని కొన్ని శాఖల్లో వందల ఏళ్లగా ఉందిట. బూట్లకు ఆత్మకు లింకు ఉందని వాళ్ల విశ్వాసమట. హత్యకు గురికాబడి చనిపోయిన కేసుల్లో శవాన్ని, బూట్లను వేరేవేరే పాతిపెట్టేవారట. లేకపోతే శవం లేచి, హంతకుణ్ని వెతికి, హత్య చేస్తుందని అనుకునేవారట. బ్లాక్ మాజిక్ చేసే మంత్రగాళ్లు ఆడవాళ్లను వాళ్ల ఎడమ కాలి చెప్పు యివ్వమని అడిగేవారట. ఆ చెప్పుకి ఏవో పూజలు చేస్తే ఆమె వశమౌతుందని నమ్మకంట. ‘‘ఇంతకీ పీటరు దొరికితే పోలీసులకు అప్పగిస్తావా?’’ అని అడిగింది.

‘‘పోలీసులతో కుమ్మక్కవుతున్నానని తోస్తే యీ పిల్లలు నన్ను నమ్మడం మానేస్తారు. వాళ్లు చేసే చిన్నచిన్న నేరాలు పోలీసుల దాకా వెళ్లకుండా చూస్తానని నామీద యిన్నాళ్లూ గౌరవం ఉంది. అయినా హంతకుణ్ని పట్టుకోవలసిన పని పోలీసులది. బూట్లు పట్టుకుపోయాడు కాబట్టి పీటరు హంతకుడని మనం అనేసుకుంటున్నాం. కానీ అదే నిజమని ఎవరికి తెలుసు? చంపినవాడు పీటరుకు కావలసినవాడేమో! బుజ్జికి తెలిసి వుండవచ్చు. భయం చేత దాస్తున్నాడనిపిస్తోంది. కాస్త కుదుటపరిచి అడిగితే చెప్తాడేమో’’ అన్నాను.

అంతటితో ఆగకుండా బూచాడు నా కలలోకి వచ్చిన సంగతి, కలలో అతను చనిపోయాడని నాకనిపించిన సంగతి చెప్పాను. అయితే నాకు దెయ్యాలు, భూతాల మీద నమ్మకమేమీ లేకపోవడం చేత అదేదో కోయిన్స్‌డెన్స్ అన్నాను.. కానీ ప్రతిమ మాత్రం అలా కొట్టేయలేదు. తను బొమ్మలేస్తుంది కాబట్టి, కాస్త యిమాజినేషన్ ఎక్కువ. ప్రతీ సంఘటన వెనుక మనకు తెలియని కారణమేదో ఉంటుందని వాదిస్తుంది. ‘‘నీకు యింతకు ముందెప్పుడూ యిలా జరగలేదు. ఇప్పుడే ఎందుకు జరగాలి? బూచాడు తన ఆత్మను నీ దగ్గరకు పంపాడు. నీకేదో చెప్పాలని చూస్తున్నాడు. నువ్వు అది అర్థం చేసుకోలేక పోతున్నావు. నీకర్థమయ్యేవరకు మళ్లీమళ్లీ కలలోకి వస్తూనే ఉంటాడు చూడు.’’ అంది ప్రతిమ. ‘‘తల్లీ, శాపనార్థాలు పెట్టకు. నన్ను శుబ్భరంగా నిద్రపోనీయ్.’’ అని దణ్ణం పెట్టాను.

పీటరే బూచాణ్ని చంపి ఉంటాడా? గత చరిత్ర చూస్తే అలా తోచదు. ఏడేళ్ల వయసు నుంచి పీటరు బాలనేరస్తుల జైలుకి వెళ్లి వస్తున్నాడు. అన్నీ చిన్నచిన్న నేరాలే. దొంగిలించిన వస్తువులు అమ్మడం, చిన్న మొత్తాల్లో డ్రగ్స్ సరఫరా చేయడం లాటివంతే. హింసాత్మకమైనవి ఏవీ లేవు. అయినా అవన్నీ పోలీసులు చూసుకుంటారు. నాకెందుకు? మధ్యాహ్నం ఆఫీసులో ఉండగా, రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం చేత కాబోలు, టేబులు మీద తల పెట్టి కునికిపాట్లు పడ్డాను. కల. అదే కల. అచ్చు అలాగే. ఈసారి మాత్రం నేను కలలోనే ‘నా కలలోకి ఎందుకు వస్తున్నావు?’ అని అడిగేశాను. ‘పిల్లల కోసం..’ అన్నాడతను. అంటూ తన చేతిలోది నాకు అందివ్వబోయాడు. అంతలోనే మెలకువ వచ్చేసింది. పిల్లల కోసమా? ఈ బూచాడు, ఎప్పుడూ పిల్లల్ని ఆదరంగా దగ్గరకు తీసుకున్నది లేదు. చచ్చిపోయాక హఠాత్తుగా ప్రేమ పుట్టుకుని వచ్చిందా? మా ఆఫీసులో పనిచేసే వాళ్లనీ, రోడ్డు మీద కనబడిన పిల్లల్నీ పిలిచి అడిగాను.

వాళ్లు చెప్పినదాన్ని బట్టి చూస్తే బూచాడు నేననుకున్నంత బూచాడు కాదని తేలింది. పైకి కోపంగా తిక్కమనిషిలా కనపడినా, ఆకలికి బాగా ఏడుస్తున్న పిల్లలకు ఏదైనా కొనిపెట్టేవాడట. అర్ధరాత్రి ఇంట్లో అమ్మానాన్నా భయంకరంగా పోట్లాడుకుంటూ ఉంటే భయపడి బయటకు వచ్చేసిన పిల్లలకు పడుక్కునేందుకు చోటు చూపించేవాడట. వాళ్లను ఎవరైనా దడిపిస్తే వాళ్ల తరఫున వెళ్లి పోట్లాడేవాడట. మట్టితో, కొయ్యతో బొమ్మలు చేసి యిచ్చేవాడట. అయినా అతన్ని ఆటపట్టించడం పిల్లలకు సరదా. వాళ్లని తిట్టి, కొట్టబోయినట్లు హంగామా చేయడం అతనికి కాలక్షేపం. డబ్బు సంపాదన ఎలా? అని అడిగితే, దొంగ సారాయి అమ్మేవాట్ట. నేరస్తుల గురించి పోలీసులకు సమాచారం యిచ్చేవాట్ట. అయితే అతని దగ్గర డబ్బు పోగుపడి వుంటుందని, దాని కోసం హత్య జరిగివుంటుందని మాత్రం అనుకోనక్కర లేదన్నారు.

మరి దేనికోసం పీటరు హత్య చేసివుంటాడు? అసలు వాడు చేశాడా? మరొకడా? పీటరు రూముకి వెళ్లి చూస్తే మంచిదనిపించింది. ఇల్లూవాకిలీ ఏమీ లేని పిల్లలు జమీందారుగారి పాడుపడిన బంగళాలో ఉంటారని, పీటరు గది కూడా అక్కడే అనీ నాకు తెలుసు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెళ్లాను. పెద్ద సింహద్వారం మూసేసి ఉంది. పిల్లలందరూ దొడ్డి దారిన ప్రహారీ గోడ దూకి లోపలకి వెళతారని తెలుసు. నేనూ అలాగే వెళ్లాను. పీటరు గది మూడో అంతస్తులో ఉంది. మెట్లెక్కి వెళుతూంటే, దుమ్ము కొట్టుకునిపోయివున్న గదుల్లో అస్తవ్యస్తంగా పడుక్కున్న పిల్లలు కనబడ్డారు. కొన్ని గదులకు తలుపులే లేవు. ఆ వేళప్పుడు నిద్రేమిటి? పనీపాటా లేకపోతే అంతే కాబోలు, కాకపోతే నా అడుగుల చప్పుడు విని నిద్ర నటిస్తున్నారా?

పీటరు గదికి తలుపుంది కానీ సగం తీసి ఉంది. గది శుభ్రంగా ఉంది. అన్నిటి కన్న ముఖ్యంగా తలుపు మూల అమర్చిన చెప్పులు, బూట్లు నా దృష్టిని ఆకర్షించాయి. చిన్నపిల్లల దగ్గర్నుంచి, ఆడవాళ్ల దగ్గర్నుంచి, పెద్దవాళ్ల దాకా రకరకాల సైజుల్లో మొత్తం 15 ఉన్నాయి. అన్నిటి కన్నా చివర తలుపుకి దగ్గరగా బూచాడి బూట్లున్నాయి. ఇప్పటిదాకా పీటరు బూచాణ్ని మాత్రమే చంపాడని అనుకుంటూ వచ్చాను. తక్కిన 14 మందినీ కూడా చంపేశాడా?

‘‘మేడమ్, మీరేమిటి యిలా వచ్చారు?’’ అన్న గొంతు విని ఉలిక్కిపడ్డాను. పీటరు గుమ్మంలో నిలబడ్డాడు. అదే నవ్వుమొహం. నా నోటివెంట అప్రయత్నంగా ‘‘ఈ చెప్పులూ, బూట్లూ యిక్కడెందుకున్నాయి?’’ అనే ప్రశ్న వెలువడింది.

వాడు చిన్నగా నవ్వి, ‘‘మనం వెళ్లిపోయినా మన ఆత్మ చెప్పుల్లో ఉండిపోతుంది. తెలుసా? పోయిన మన ఆత్మీయులను తలచుకోవాలంటే వాళ్ల చెప్పుల్ని తాకితే చాలు. పాత జ్ఞాపకాలెన్నో గుర్తుకు వస్తాయి.’’ అన్నాడు. నేను నా చెప్పుల కేసి చూసుకున్నాను. నా ఆత్మ కూడా చెప్పుల్లో దాక్కుందా? కొన్ని రోజుల్లో పీటరు గాడి గదిలో తలుపు మూల యీ చెప్పులు కూడా చేరతాయా? కొన్ని రోజులేం ఖర్మ! కొన్ని నిమిషాల్లోనే కావచ్చు. వాటి కంటె రెండు, మూడేళ్లు పెద్దదాన్నే అయినా వాడి ముందు నా బలం చాలదు. నోరు మూసుకుని యిక్కణ్నుంచి బయటపడితే చాలు అనుకుంటూనే ఉండబట్టలేక ‘‘నువ్వు అతన్ని చంపేశావా?’’ అని అడిగాను.

‘‘ఎవరు? బూచాణ్నా? నేను మనుషుల్ని చంపేవాడిలా కనబడుతున్నానా?’’ అని అడిగాడు ఆశ్చర్యపడుతూ.

నిజమే, అలా కనబడటం లేదు. చూస్తూంటే కాలేజికి వెళ్లే కుర్రాడిలా ఉన్నాడు తప్ప, హంతకుడిలా కనబడటం లేదు. ‘‘మరి అవి ఎందుకు పోగేశావ్?’’ అన్నాను చెప్పుల వరస కేసి చూపిస్తూ.

పీటరు నవ్వాడు. ‘‘అడవి కెళ్లి పులుల్ని వేటాడి, పులి తలకాయల్ని గదుల్లో పెట్టుకుని యింటికి వచ్చినవాళ్లకు గొప్పగా చూపించేవాళ్లలా నేనూ మనుషుల్ని చంపేసి, వాళ్ల చెప్పుల్ని జనాలకు చూపించడానికి పెట్టుకున్నా రనుకున్నారా ఏమిటి? భలేవారే! బూచాడంటే నాకిష్టం కాబట్టి అతని బూట్లు తెచ్చుకున్నాను.’’ అంటూనే హఠాత్తుగా ‘‘అయినా ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేనే మీ ఆఫీసుకి వెళ్లబోతూ రూముకి వచ్చాను. మీరే యిక్కడ కనబడ్డారు...’’ అన్నాడు. సంగతేమిటి అని అడుగుతున్నా, జవాబు చెప్పకుండా నా చేయి పట్టుకుని బరబరా రెండో అంతస్తులో ఉన్న బుజ్జి గదికి లాక్కుని వెళ్లాడు.

బుజ్జి గది అపరిశుభ్రంగా, చిందరవందరగా ఉంది. తలెత్తి చూస్తే బుజ్జి శవం కొక్కానికి వేసిన తాడుకి వేళ్లాడుతోంది. కింద ఒక కుర్చీ పడిపోయి ఉంది. వెంటనే కుర్చీ ఎక్కి, తాడు కోసేసి శవాన్ని కిందకు దింపాను. అప్పటికే ఆలస్యమైందని తెలిసినా, ప్రథమ చికిత్స చేసి చూశాను. నేనీ హడావుడిలో ఉండగా పీటరు మాయమయ్యాడు. పక్క గదుల్లోంచి కూడా పిల్లలెవ్వరూ వచ్చి చూడలేదు. వింతగా తోచి, వెళ్లి గదుల్లోకి తొంగి చూస్తే, ఆశ్చర్యం, ఎవరూ లేరు. బుజ్జి చావు గురించి పోలీసులు అడుగుతారని భయమేసిందో ఏమో అందరూ మంత్రం వేసినట్లు మాయమై పోయారు. గబగబా పీటరు గదికి వెళ్లాను. ఆ గది అలాగే ఉంది కానీ కొన్ని వస్తువులు అదృశ్యమైనట్లు గమనించాను. ఆ వస్తువులు తీసుకుని పీటరు పారిపోయి ఉంటాడు. గదిలో బూట్లు అలాగే ఉన్నాయి. బూచాడి బూట్లు మాత్రం తీసుకుని నేను బయటకు వస్తూ పోలీసులకు ఫోన్ చేశాను.

రెండు రోజుల్లో చాలా విషయాలు జరిగాయి. ఆత్మహత్య ఉత్తరం దొరక్కపోయినా, బుజ్జిది ఆత్మహత్య అని పోలీసులు తేల్చారు. పీటరు గదిలో దొరికిన చెప్పుల్లో రెండిటి ఆచూకీ దొరికింది. ఇటీవల హత్యకు గురైన యిద్దరి చెప్పులవి. తక్కిన పోలీసు స్టేషన్లలో రిపోర్టయిన హత్యలు, హతుల వివరాలు దొరికితే పీటరుకీ, తక్కిన వాటికి సంబంధం ఉందో లేదో తెలుస్తుంది. అతని పేర అరెస్టు వారంటు విడుదలైంది కానీ అతని ఆచూకీ తెలియటం లేదు. తక్కిన పిల్లవాళ్లను విచారిస్తే యింకా కొన్ని విషయాలు తెలిశాయి. పైకి నవ్వుమొహం ప్రదర్శిస్తున్నా పీటరు దుర్మార్గుడు. తన కంటె చిన్నపిల్లల్ని ఆడామగా తేడా లేకుండా లైంగికంగా హింసిస్తాడు. ఇతని బాధ భరించలేక పిల్లలు ఒక్కోప్పుడు బూచాణ్ని ఆశ్రయించేవారు. అతను పీటరును హెచ్చరించేవాడు. తాజాగా ఎవరైనా కుర్రాడి విషయంలో గొడవ పడి పీటరు బూచాణ్ని చంపేసి ఉంటాడు.

ఇవన్నీ తెలిశాక, నాకు ఒక ఆలోచన వచ్చింది. బుజ్జి కూడా పీటరు హింసకు గురై, బూచాడి రక్షణ పొంది ఉంటాడు. పీటరే బూచాణ్ని చంపిన విషయం బుజ్జికి తెలిసి ఉంటుంది. కానీ అది పోలీసులకు చెప్దామంటే పీటరేం చేస్తాడోనన్న భయం. కానీ తనకెంతో మేలు చేసిన బూచాడి ఆత్మకు ద్రోహం చేస్తున్నాడన్న అపరాధభావన. రెండిటి మధ్య నలిగి, బుజ్జి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. బూచాడు, బుజ్జిల ఆత్మలు శాంతించాలంటే పీటర్ని అరెస్టు చేసి, కోర్టుకి తీసుకెళ్లాల్సిందే. కానీ పోలీసులకు వాడు దొరకటమే లేదు. రెండు వారాలు పోయాక గట్టిగా అడిగితే ఇన్‌స్పెక్టర్ ‘‘తాడూబొంగరం లేని అలాటివాణ్ని పట్టుకోవడం కష్టం. సిటీల్లోని అండర్‌వరల్డ్‌లో వీళ్లు సులభంగా యిమిడిపోతారు. నీట్లో ఉప్పులా కరిగిపోతారు. దొరుకుతాడన్న ఆశ నాకైతే లేదు.’’ అన్నాడు. పీటరు లాటి వాడు సిటీలో మరి కొందరు అనాథ పిల్లల్ని పాడు చేస్తూ, ప్రాణాలు తీస్తూ మసలుతున్నాడన్న ఆలోచన నాకు దుర్భరమై పోయింది.

అదే ఇన్‌స్పెక్టర్‌తో అంటే ‘‘మనమేమీ చేయలేమండి. కానీ కథ ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. వాడికి వాడికంటె బలవంతుడెవడో తగులుతాడు. వీడు కర్ర తీస్తే, వాడు కత్తి తీస్తాడు. వాడిలాటి వాడి చేతిలోనే శిక్ష పడుతుంది. చూస్తూండండి.’’ అన్నాడు.

‘‘అలా విధిలీలపై వదిలేస్తే పోలీసు వ్యవస్థ ఎందుకండి? చంపినవాళ్ల బూట్లు పట్టుకుపోయే అలవాటు పీటరుకుందని మీరు అన్ని పోలీసు స్టేషన్లకూ కబురంపారా?’’

‘‘నిక్షేపంలా. ఇకపై శవానికి బూట్లు లేకపోతే వీడి మీదే అనుమానం పోతుంది, చూస్కోండి.’’

అంతే, కథ అక్కడ ఆగింది. పీటరు దొరకలేదు. నాకు రోజూ కల రావడం మానలేదు. అదే కల, నేనేదో చేయాలని బూచాడు సూచించడం, అదేమిటో నాకు అర్థం కాకపోవడం.  

ఓ ఆదివారం ప్రతిమ ఉన్నట్లుండి, ‘‘నాకో ఐడియా వచ్చింది. అలా చేద్దామా?’’ అంది. బూచాడి బూట్లు నీ దగ్గరున్నాయి కదా, అతని సమాధి తవ్వి తీసి, శవానికి బూట్లు తొడుగుదామంది. పోలీసులు దాన్ని ఎక్కడ పాతిపెట్టారో నాకు తెలుసు. కానీ తవ్వి తీస్తే నేరమౌతుందేమో. ఎవరికీ చెప్పకుండా రాత్రివేళ మనిద్దరమే ఆ పని చేద్దామంది. కాస్త తటపటాయించినా నేను చివరకు సరేనన్నాను.’

అర్చన కథ వింటున్న ముఖ్యమంత్రిణి ఆశ్చర్యంగా ‘‘అలా ఎలా ఒప్పుకున్నారు, అర్చనా? అదేం పిచ్చి నమ్మకం? బూట్లు లేకపోతే దెయ్యాలు ఎక్కడికీ వెళ్లలేవా? మన హిందువుల్లో అయితే ఒంటి మీద ఏమీ లేకుండానే అంత్యక్రియలు జరుగుతాయి. అలాటప్పుడు హత్య చేయబడిన హిందువుల దెయ్యాలు ఎలా సంచరిస్తాయట?’’ అని అడిగారు.

అర్చన ‘‘అప్పటి నా అవస్థ యిలాటి లాజిక్కులు అడిగే పరిస్థితిలో లేదు మేడమ్. ఆ కల.. గగుర్పాటు కలిగించే ఆ పీడకల నన్ను వదిలిపెట్టడానికి ఏం చేయడానికైనా సిద్ధమై పోయాను. నిద్రపోవడానికి భయపడే స్థితికి వచ్చి, ఏ పుట్టలో ఏ పాముందో, ఏ చిట్కా నన్ను గట్టెక్కిస్తుందో అనే మోడ్‌లో ఉన్నానప్పుడు..’’ అంది.

ముఖ్యమంత్రిణి తల పంకించి ‘‘ఓకే, ఐ కెన్ అండర్‌స్టాండ్. ప్రొసీడ్.’’ అన్నారు.

అర్చన కొనసాగించింది. ‘సమాధి తవ్వి బూట్లు అమర్చిన రోజు రాత్రి కలలో బూచాడు రాగానే ‘నీ బూట్లు నీకు వచ్చేశాయి. ఏం చేస్తావో చేసుకో పో’ అన్నాను కలలోనే. అతని మొహం మీద నవ్వు కనబడింది. బతికుండగా అతను నవ్వడం ఎప్పుడూ చూడకపోవడం చేత అది అతనికి అతక లేదనిపించింది. ఏమైతేనేం మళ్లీ కలలోకి రాలేదు.

హమ్మయ్య అనుకుంటూండగానే వారం తిరక్కుండా మళ్లీ వచ్చాడు. ‘‘పిల్లల కోసం ఓ బహుమతి’’ అంటూ చంకలోంచి ఆ వస్తువు తీశాడు. అడుగు ముందుకు వేసి, వెలుతుర్లోకి వచ్చాడు. ఆ వస్తువును చుట్టి ఉన్న తడి న్యూస్‌పేపర్లను ఒలిచేశాడు. దాన్ని తీసి నా కళ్ల ముందు పెట్టాడు. పీటరు తల!

కెవ్వుమంటూ లేచాను. గజగజ వణికాను. భుజం మీద చేయి పడింది. తలెత్తి చూస్తే ప్రతిమ. ‘‘భయపడకు’’ అంది. తాగడానికి నీళ్లందించింది. తాగి, కల గురించి చెప్పాను. ఆమె నా జుట్టు మీద తడుతూ కాస్సేపు నిలబడింది. తర్వాత నిట్టూర్చి ‘‘కథ ముగిసింది.’’ అంది. ‘

‘ఏ కథ?’’

‘‘బూచాడు పీటరు మీద కక్ష తీర్చుకున్నాడు. ఇకపై పిల్లలెవరూ పీటరు బారిన పడకుండా వారిని రక్షించాడు. ఇన్నాళ్లూ ఆ బూట్ల గురించే నిన్ను ప్రాధేయపడ్డాడు. ఇకపై కలలోకి రాడులే.’’ అంది. నా కేమనాలో తోచలేదు. సంభవాసంభవాల మాట ఎలాగున్నా, ప్రతిమ మాట వాస్తవమైతే బాగుండును అనిపించింది.

మర్నాడు మధ్యాహ్నం పోలీసు స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇన్‌స్పెక్టర్ ‘‘మీకో గుడ్‌న్యూస్’’ అన్నాడు.

‘‘పీటర్ శవం దొరికి ఉంటుంది. అంతేనా?’’ అన్నాను అప్రయత్నంగా.

అవతలివైపు కాస్సేపు నిశ్శబ్దం. ‘‘హౌ ద హెల్ డూ యూ నో? నాక్కూడా యిప్పుడే తెలిసింది.’’ అన్నాడతను కాస్త కోపం మిళాయించి.

‘‘అబ్బే, నాకు తెలియదు. పీటర్ దొరికి ఉంటాడు అనుకున్నాను.’’

‘‘అక్కడితో ఆగలేదు మీరు. చచ్చిపోయాడని కూడా చెప్పేశారు. ఎక్కడో దూరంగా వేరే ఊళ్లో జరిగింది కాబట్టి కానీ లేకపోతే మిమ్మల్ని అనుమానించాల్సిన పరిస్థితే!’’

‘‘చంపారు పొండి. నాకేమీ తెలియదు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా పోయాడో మీరే చెప్పండి.’’ అని బతిమాలాను. కానీ అతను వినలేదు. ‘‘అంజనం వేసి మీరే తెలుసుకోండి.’’ అంటూ ఫోన్ పెట్టేశాడు.

ఈ రచనకు ఛార్లెస్ ద లింట్ రాసిన ‘‘డెడ్ మాన్స్ షూస్’’ కథ ఆధారం. ‘అద్భుతరసయామిని’ సీరీస్‌లో మరో కథ వచ్చే నెల రెండో బుధవారం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)

mbsprasad@gmail.com

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను