Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: నిరాహార దీక్ష

ఎమ్బీయస్‍ కథ: నిరాహార దీక్ష

(ఇది ఇటాలియన్ రచయిత జొవాన్ని గుఅరెస్కీ (1908-68) రాసిన ‘‘హంగర్ స్ట్రయిక్’’ అనే కథకు అనువాదం. ఈయనే రాసిన ‘‘డాన్ కామిలో డైలమా’’ అనే కథను అనువదించి 2020 మార్చిలో అందించాను. దీనిలో ప్రధాన పాత్రలు డాన్ కామిలో అనే చర్చి పూజారి, అదే పల్లెటూళ్లో మేయరుగా ఉన్న పెపోన్ అనే కమ్యూనిస్టు. ఇద్దరివీ వేర్వేరు దృక్పథాలు. కానీ ఇటలీని ఫాసిస్టులు, నాజీలు ఏలినపుడు భుజంభుజం కలిపి పోరాడారు. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ తరహాలో పోట్లాడుకుంటారు, అప్పుడప్పుడు సహకరించుకుంటూ ఉంటారు. ఏసుక్రీస్తుతో మాటామంతీ ఆడుతూనే ఉంటారు. రచయిత ఏ పక్షమూ వహించకుండా యిద్దర్నీ ఆటపట్టిస్తూనే ఉంటాడు.)

కమ్యూనిస్టు మేయరైన పెపోన్ అనుచరుడు స్మిల్జోకు ఆర్నెల్ల క్రితం కొడుకు పుట్టడంతో అతని యింట్లో ఒకపాటి యుద్ధం ప్రారంభమైంది. అతని తల్లికి కాళ్లు చచ్చుబడి గత ఐదారేళ్లగా కుర్చీకే అతుక్కుపోయినా చుట్టూ ఏం జరుగుతోందో ఆవిడకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఆమె ఎదుట స్మిల్జో, అతని భార్య రాజకీయాలు చర్చించరు. ఎందుకంటే వాళ్లిద్దరూ కమ్యూనిస్టులు. దైవచింతన లేనివాళ్లు. కానీ పాతకాలం క్రైస్తవురాలు. కమ్యూనిజమంటే తగని మంట. వాళ్లేమీ మాట్లాడకపోయినా ముసలావిడ అన్నీ వినేయగలదు. ఓ రోజు ఆవిడ ఒక హఠాత్ ప్రకటనతో దుమారం లేపింది.

‘‘పిల్లవాణ్ని బాప్టయిజ్ చేసే టైమైంది.’’

స్మిల్జో ఉలిక్కిపడ్డాడు. తన కమ్యూనిస్టు భావాల కారణంగా చర్చి తనను వెలి వేసింది. తనూ చర్చిని దూరంగా పెట్టాడు. ఇప్పుడు కొడుక్కి బాప్టిజమంటూ వెళితే ఎవడొప్పుకుంటాడు? పైగా తనకే యిష్టం లేదు. కానీ యివన్నీ చెప్తే శాంతంగా వినే రకం కాదు తల్లి. అందువలన ఏం చెప్దామా అని ఆలోచిస్తూండగా లౌక్యురాలైన అతని భార్య ‘‘కాస్త ఆగండి, యీ శీతాకాలం వెళ్లనీయండి. ఈ ఏడాది చలి మరీ ఉపద్రవంగా ఉంది.’’ అంది.

ముసలావిడ ఊరుకుంది – రెండు రోజులు! రెండు రోజుల తర్వాత ‘‘ఇంతకీ వాడికి బాప్టిజం చేయించేది ఉందా? లేదా?’’ అని అడిగింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆవిడ అసహనం పెరిగింది. చివరకు స్మిల్జో ధైర్యం తెచ్చుకుని ‘‘రోజులు మారాయి. ఇవి పాతరోజులు కావు. నువ్వు బాప్టిజం గోల వదిలిపెడితే మంచిది.’’ అన్నాడు. ‘‘ఏసుక్రీస్తు యీ బాప్టిజం వ్యవహారం మొదలుపెట్టాక చాలా రోజులు మారాయి. రకరకాల మార్పులు వచ్చాయి. అయినా పుట్టిన పిల్లలకు బాప్టిజం చేయడం మారలేదు.’’ అందావిడ. అతను ‘పార్టీ అన్నాక కొన్ని కట్టుబాట్లుంటాయి.’ అంటూ సణిగాడు. అతను సణగడానికి ముందే ఆమె అది వినేసి, ‘‘అప్పుడే పుట్టిన పిల్లలు ఏ పార్టీ సభ్యులూ కారు. అందుచేత వాళ్లకు పార్టీ నియమాలు వర్తించవు. బాప్టిజం జరగాల్సిందే!’ అంది కరాఖండీగా.

‘ఇవన్నీ నీకర్థం కావులే’ అని అతను విసుక్కున్నాడు. ముసలావిడ తల విదిలించింది. ‘కుర్రకుంకవి, నీకేం తెలుసు? పాలిటిక్స్ విషయంలో మీ నాన్న నీ కన్నా జగమొండి. కానీ నేను పట్టుబట్టి నీకు బాప్టిజం చేయించాను.’’ అంది.

‘‘అయినా అప్పటి రోజులు వేరు లెండి. కమ్యూనిజం అప్పటికి యింత యిదిగా నాటుకోలేదు.’’ అంది కోడలు. ‘‘అప్పటి భార్యలు కూడా వేరేలే!’’ అని అంటించింది అత్త. ‘‘అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేను మీలా యాగీ చేసి మొగుణ్ని విసిగించలేదనా?’’ అంది కోడలు. ‘‘పెళ్లమన్నాక దేవుడంటే భక్తీభయం, సంప్రదాయం మీద కాస్త గౌరవం ఏడ్చి మొగుడికి నచ్చచెప్పాలి. వాడితో పాటు థెయ్యిమని గెంతడం కాదు.’’ అంది అత్త.

కోడలికి రోషం వచ్చింది. ‘‘అయితే యిప్పుడే చెప్తున్నాను. మీ కొడుకు విషయంలో మీ పంతం ఎలా చెల్లించుకున్నారో నా కొడుకు విషయంలో నేనూ అంతే పట్టుబడతాను. వాడికి బాప్టిజం చేయించనంతే. పెరిగి పెద్దవాడయ్యాక దాని సంగతీసందర్భం తెలుసుకుని, వాడు చేసుకుంటానంటే అది వాడి యిష్టం. అప్పటిదాకా ఆ ఊసు యింట్లో రావలసిన అవసరం లేదు.’’ అని ప్రకటించింది.

నువ్వేమంటావ్ అన్నట్లు తల్లి తనకేసి చూడగానే అతను ‘‘బాప్టిజం పూర్వాపరాలేమిటో తెలియని వయసులో చిన్నపిల్లల నెత్తి మీద దాన్ని రుద్దడం అన్యాయం.’’ అని ప్రకటించాడు.

ముసలావిడ కోపం నసాళానికి అంటింది. ‘‘అలా అయితే నా మాటా విను. ఇప్పణ్నుంచి నేను తిండి మానేస్తాను. వాడికి బాప్టిజం అయ్యాకనే ముద్ద నోట్లో పెట్టేది.’’ అని ఘోరప్రతిజ్ఞ చేసింది.  ‘‘అలా అయితే కొన్నేళ్ల పాటు యీ ఇంట్లో యిద్దరికే వంట అన్నమాట!’’ అని కోడలు వెక్కిరించింది. ఇద్దరి మూర్ఖత్వమూ చూసి అతనికి కోపం వచ్చింది. గుప్పిటితో దగ్గరున్న బల్ల మీద గుద్ది బయటకు వెళ్లిపోయాడు.

మర్నాడు పొద్దున్న ముసలావిడ పాలు తాగలేదు, బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. కొడుకూ, కోడలూ భోజనం చేస్తూంటే మౌనంగా చూస్తూ కూర్చుంది. రాత్రి భోజనం వేళా అలాగే చేయడంతో అతనికి సహనం నశించింది. ‘‘చిన్న పిల్లలా మంకుపట్టు పట్టకు. నాకు కోపం తెప్పించకు. వెళ్లి భోజనం చెయ్.’’ అని అరిచాడు. ‘‘మీరెందుకు అంత యిదౌవుతారు? ఆకలేసినప్పుడు ఆవిడే తింటుంది.’’ అంది భార్య. కానీ మర్నాడు కూడా యిదే కథ పునరావృతమయ్యేసరికి ఆమెకు కంగారు పుట్టింది. ‘‘డాక్టర్ని పిలిచి సంగతి చెప్పి తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేయమనండి. ఇలాగే చేసి, ఆవిడ గుటుక్కుమంటే తిండి పెట్టక చంపేశామని జనం మనల్ని ఆడిపోసుకుంటారు. మన పరువు తీయడానికే యీ నాటకమంతా!’’ అంది, అత్తగారి ఎదుటే!

ముసలావిడ నోరు విప్పింది – ‘‘ఓ పెన్ను, పేపరు నా మొహన తగలేయండి. నేను స్వచ్ఛందమరణాన్ని కోరుకున్నానని రాసిస్తాను. ఇక మీ పరువుకు వచ్చే నష్టమేమీ లేదు. నా మనవడి ఆత్మను రక్షించాలనే నా తాపత్రయమంతా!’’ అంది. కోడలు వెక్కివెక్కి రాగాలు పెట్టి, ‘‘నన్ను బజార్న పడేయడానికే యీవిడ కుట్రంతా! ఇక మీద పిల్లాడికి పాలివ్వనంతే!’’ అని తన వంతు ప్రతిజ్ఞ చేసింది. దానికి సమాధానంగా ‘‘పాముపాలు పిల్లాడికి హాని చేస్తాయి తప్ప మేలు చేయవు.’’ అని ముసలావిడ జనాంతిక ప్రకటన చేసింది. ఈ వాగ్యుద్ధాన్ని భరించలేక అతను బయటకు నడిచాడు. నిజానికి అది అనవసరం. ఎందుకంటే ఆ ప్రకటన తర్వాత ముసలావిడ నోరు విప్పడం మానేసింది.

మూడో రోజు మాత్రం పక్క మీద నుంచి లేవకుండా, కొడుకుని పిలిచి ‘‘నాకు మరణసమయం ఆసన్నమైంది. పూజారిని పిలిపించండి.’’ అంది. ‘‘ఇది కుట్ర. ఆత్మహత్య చేసుకుని ఆ భారాన్ని మనమీద నెడతామనే కుయుక్తి.’’ అని ఆక్రోశించింది కోడలు. దాంతో బాటు ఆవిడ కేసి తిరిగి ‘‘ఆత్మహత్య మహాపాపం. మీరు నరకానికి వెళ్లడం ఖాయం.’’ అంది. ముసలావిడ జంకలేదు. ‘‘అవును ఆ నరకానికి దారి వేసింది నువ్వు. పిల్లవాడికి బాప్టిజం చేయనని మూర్ఖించింది నువ్వు.’’ అని డిక్లేర్ చేసి కన్నుమూయడానికి రిహార్సల్‌గా కళ్లు మూసుకుంది.

ఇంక చేసేదేమీ లేక అతనూ, భార్యా బయటకు నడిచారు. ‘‘ఏదో ఒకటి చేయాలి’’ అన్నాడతను. ‘‘కొంపదీసి నువ్వెళ్లి పూజారిని తీసుకువస్తావేమిటి? చర్చి మీద తిరుగుబాటు చేసి, యిప్పుడెళ్లి నా కొడుకుని బాప్టయిజ్ చేయండి అని కాళ్ల మీద పడితే మొహం తగలేస్తారు. వాళ్లే కాదు, ఊళ్లో జనం కూడా! ఇన్నాళ్లు మతం మత్తుపదార్థమంటూ మాకు ఉపన్యాసాలిచ్చి, యిప్పుడిదేమిటి? అని పేడనీళ్లు చల్లుతారు.’’ అంది భార్య. ‘‘ఏడిశావులే, ప్రతీ అపాయానికీ ఉపాయం ఉంది. నేను పెపోన్ దగ్గరకు వెళుతున్నా, తలుపేసుకో.’’ అంటూ అతను బయటకు నడిచాడు.

ఇతను వెళ్లేసరికి మేయరు పెపోన్ తన వర్క్‌షాప్‌లో ఉన్నాడు. ‘‘కామ్రేడ్, నువ్వు నాకు సాయం చెప్పక తప్పదు’’ అంటూ యితను యావత్తు కథా వినిపించాడు. ‘‘నేను పార్టీ సిద్ధాంతాలకు ద్రోహం చేయదలచుకోలేదు. అలా అని మా అమ్మ చచ్చిపోతూ ఉంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండలేను. అందుకని నా ప్లానేమిటంటే నేను మా అమ్మతో పిల్లవాణ్ని బాప్టయిజ్ చేస్తున్నానని, మీరు గాడ్‌ఫాదర్ (దైవపిత, దగ్గరుండి బాప్టిజం చేయించి పిల్లవాడికి మతపరమైన విద్య నేర్పించే బాధ్యత స్వీకరించే వ్యక్తి) గా ఉండడానికి ఒప్పుకున్నారని చెప్తాను. మీరు ఆ తరహా డ్రస్ వేసుకుని కారులో మా యింటికి రండి. నేను మావాడికి మంచి బట్టలు వేసి రెడీ చేస్తాను. మా అమ్మకు చూపించాక, మనిద్దరం కలిసి కారెక్కి మన పార్టీ ఆఫీసుకి వెళదాం. చక్కగా ఓ ఫుల్ బాటిల్ వైన్ ఖాళీ చేశాక, నేను యింటికి తీసుకెళ్లి మా అమ్మతో ‘ఇదిగో బాప్టిజం పూర్తి చేసుకున్న నీ మనవడు’ అని చూపిస్తాను. ఆవిడ భోజనం చేస్తుంది. బతుకుతుంది. నాకు యిక ఏ చింతా ఉండదు.’ అన్నాడు.

‘‘నాకే అభ్యంతరమూ లేదు.’’ అన్నాడు మేయరు, ‘‘కానీ తర్వాతైనా ఆవిడకు విషయం తెలిసిందంటే నీతో పాటు నాకూ చాకిరేవు పెట్టేయగలదు. అంతటి అసాధ్యురాలు మీ అమ్మ.’’ అని చేర్చాడు. ‘‘తనకెవ్వరూ చెప్పరు. అయినా ముందు తను బతుకుతుంది కదా, తర్వాతి సంగతి తర్వాత చూసుకోవచ్చు.’’ అన్నాడతను.

స్మిల్జో యిచ్చిన డ్రస్సు వేసుకుని మేయరు ఊరికి దూరంగా ఉన్న విసిరేసినట్లుగా ఉన్న అతని యింటికి బయలుదేరాడు. శీతాకాలపు దట్టమైన పొగమంచు అంతటా కప్పేసి ఉంది. వీళ్లు వెళ్లి తలుపు తట్టగానే స్మిల్జో భార్య తలుపు తీసింది. వీళ్లను చూస్తూనే లోపలకి పరుగున ముసలావిడ దగ్గరకు వెళ్లి ‘‘పిల్లాడి గాడ్‌ఫాదర్‌గా ఉండడానికి సాక్షాత్తూ మేయరుగారే వచ్చారు. మా పరువు కాపాడాలన్న యింగితం ఏ ఏ కోశాన ఉన్నా లేచి కూచోండి.’’ అంది. ‘‘గాడ్‌ఫాదరా?’’ అంటూ తెల్లబోతూనే, లేచి ఒంటి మీద శాలువా కప్పుకుని ‘‘పిల్లాడు ఎలా ఉన్నాడో ఏమిటో చూదాం, పట్రా’’ అంది.

అంతలోనే స్మిల్జో కొడుకుని భుజాన వేసుకుని తెచ్చాడు. వెనక్కాల ఆడంబరమైన డ్రస్సులో చెట్టంత మనిషి మేయరు ‘‘మీరెలా ఉన్నారమ్మా?’’ అని పలకరిస్తున్నాడు. కానీ ముసలావిడ చూపు తెల్ల బట్టల్లో మిసమిసలాడి పోతున్న మనవడి మీదే ఉంది. దేవదూత ప్రత్యక్షమైతే అరచేతులు చాచి నిలిచే దీనురాలి తరహాలో తన మనవడి వైపు కాస్సేపు చూపు నిలిపి, తర్వాత కొడుకు నుంచి తీసుకుని వాడి డ్రస్సు ముడతలు సరిదిద్ది, నెత్తి మీద టోపీని సరి చేసి, అప్పుడు మేయరు కేసి చూసి ‘‘మీ అంతటివారు స్వయంగా గాడ్‌ఫాదర్‌గా రావడం మా భాగ్యం.’’ అంది. ‘‘దానికేముందమ్మా’’ అన్నాడు మేయరు.

ముసలావిడ పిల్లాణ్ని కొడుకు చేతికి భద్రంగా అప్పగించి, మేయరు చేతిని గట్టిగా పట్టుకుని, ‘‘అలా అనకండి, మీరు నచ్చచెప్పడం బట్టే మా అబ్బాయికి మంచీచెడూ తెలిశాయి.’’ అంది. ‘‘భలేవారే, స్మిల్జోకి ఎవరూ ఏమీ చెప్పనక్కరలేదు. మంచి వివేకం, విచక్షణాజ్ఞానం ఉన్నవాడు. పిల్లవాడికి దైవపితగా ఉండడం నా అదృష్టం. ఇంతకీ మీరెలా ఉన్నారో చెప్పారు కారు.’’ అన్నాడు మేయరు. ముసలావిడ అతని చేయి వదిలిపెట్టి, శాలువా సర్దుకుంటూ ‘‘చలి తీవ్రంగా ఉంది కదా, జ్వరం వచ్చి ఓ రెండు రోజులు ఎంగిలి పడలేదంతే. ఇక సర్దుకుంటుంది లెండి.’’ అంది. ‘‘మంచిదే, మేం బయలుదేరతాం, ఆలస్యమౌతోంది.’’ అని మేయరు అనగానే స్మిల్జో అతని వెంట బయలుదేరబోయాడు.

‘ఆగాగు’ అంటూ ముసలావిడ మళ్లీ మనవడి కేసి తృప్తిగా చూసుకుంది. చూపుడువేలితో వాడి నుదుటి మీద రాసింది. ‘‘వాడు నవ్వుతున్నాడు, మీరెవరో తెలిసిపోయినట్లుంది’’ అని చమత్కరించాడు మేయరు. ముసలావిడ ముసిముసి నవ్వులు నవ్వుతూండగానే పిల్లాడు చటుక్కున వాడి చిట్టి చేతులతో ఆవిడ వేలు పట్టుకున్నాడు. విదిలించుకున్నా వదిలిపెట్టడం లేదు. ‘‘నన్ను కూడా రమ్మంటున్నాడు మా బుజ్జి నాన్న.’’ అని మేయరుకి చెప్పి పిల్లవాడితో ‘‘వచ్చేందుకు వీలు లేకుండా కుర్చీకి అంకింతం చేసేశాడురా దేవుడు! నీకు బాప్టిజం జరిగేటప్పుడు చర్చిలో గంటలు కొడతారుగా, అప్పుడు విని ఆశీర్వదిస్తానులే నాన్నా..’’ అంది. దెబ్బకి తక్కినవారందరి గుండెలూ గతుక్కుమన్నాయి. ‘‘చుట్టూ దట్టమైన పొగమంచు. కత్తితో కోస్తే తప్ప ముందుకెళ్లలేమన్నట్లుంది. చర్చెక్కడో దూరంగా ఉంది. గంటలేం వినబడతాయ్?’’ అంది కోడలు. ‘‘నా చెవులు పాముచెవులు. పైగా కిటికీ తలుపు తీసిపెడతానుగా’’ అంది ముసలావిడ. 

పార్టీ ఆఫీసులో అక్కడి గుమాస్తా తప్ప వేరెవరూ లేరు. మేయరు, స్మిల్జో ఓ పసివాడితో సహా రావడం చూసి గుమాస్తా తెల్లబోయాడు. ‘‘కిటికీ తలుపులు దగ్గరగా వేసి, వెళ్లి వైట్ వైన్ ఓ బాటిలు తీసుకు రా’’ అన్నాడు మేయరు. అతను బాటిలు, మూడు గ్లాసులు తెస్తే స్మిల్జో ‘‘మరి మా బుడ్డాడికో? శ్రామిక బాప్టిజం పేర వాడికీ ఓ చుక్క తగిలిద్దాం.’’ అంటూ నవ్వాడు. ‘ఈ మధుపాత్రే మన బాప్టిజం పాత్ర’ అంటూ తన గ్లాసులో ఓ వేలు ముంచి, వాడి నోట్లో పెట్టి ‘‘వెల్కమ్ టు న్యూ కామ్రేడ్’’ అని స్లోగన్ యిచ్చాడు. తక్కిన యిద్దరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత మద్యపాన కార్యక్రమం సాగింది. కాస్సేపటికి స్మిల్జో ‘‘ఔనూ, మా అమ్మ చర్చి గంటలు వినబడాలంది.’’ అని గుర్తు చేసుకున్నాడు.

దైవం అతని ఘోష విన్నట్లున్నాడు. సరిగ్గా అప్పుడే చర్చి గంటలు మోగాయి. గుమాస్తా ‘‘ఇవేళ మందులషాపతని కొడుకు బాప్టిజం జరుగుతోంది.’’ అని సమాచారం అందించాడు. స్మిల్జోకి పట్టరాని సంతోషం కలిగింది. ‘‘ఇది కదా అదృష్టమంటే!’’ అని అరిచాడు.

ఆ కేకకు ఉలిక్కిపడ్డాడేమో, పొత్తిళ్లలో పిల్లవాడు కదిలాడు. వెంటనే మేయరు లేచి వాడి దగ్గరకు వెళ్లి, రూళ్లకర్ర లాటి తన పెద్ద వేలితో పసివాడి నుదుటి మీద రాశాడు. అంతే! వాడు ఆ వేలు పట్టేసుకుని వదిలిపెట్టలేదు. కాస్సేపటి క్రితం తన నాయనమ్మ వేలు పట్టుకుని వదలనట్లే, దీన్నీ వదలటం లేదు. మేయరు పసివాడి కేసి దీర్ఘంగా చూశాడు. ‘ముసలావిడైతే వీడి రక్తబంధువు. మరి నేనెవణ్నని యిలా పట్టుకున్నాడు? నేను దైవపితనని వీడు నిజంగా నమ్మాడా? నాకూ వీడికీ ఏదైనా బంధం ఉందా? జన్మాంతర సంబంధం అంటారు, అది యిదేనా? నేను ఉత్తుత్తి దైవపితనని పాపం వీడికి తెలియదా?’ అనే ఆలోచనలో పడ్డాడు.

ఈలోగా స్మిల్జో మూడో గ్లాసు పూర్తి చేశాడు. చప్పుడు చేస్తూ ఖాళీ గ్లాసుని టేబుల్ మీద పెట్టి ‘‘ఇక కదులుదాం, నాటకానికి తెర పడింది. కథ కంచికి, మనం యింటికి.’’ అంటూ లేచి మేయరు దగ్గరకు వచ్చి పిల్లాణ్ని ఎత్తుకోబోయాడు. వాడింకా మేయరు వేలిని వదలలేదు. మేయరు వాడి కేసి చూస్తూనే ఉన్నాడు ‘ఇది నాటకంగానే ఎందుకు మిగలాలి? నేను నిజంగా దైవపితగా ఎందుకుండకూడదు వీడికి?’ అనుకున్నాడు. రెండో చేత్తో స్మిల్జోని వెనక్కి తోసి, గుమాస్తాను పిలిచి ‘‘నువ్వు చర్చికి వెళ్లి, మరో బాప్టిజం ఉందని డాన్ కామిలోకి చెప్పి ఏర్పాట్లు చూడమను. మేం యింకో పది నిమిషాల్లో వస్తున్నాం.’’ అన్నాడు.

‘‘సంగతేమిటి?’’ అన్నాడు డాన్ కామిలో బాప్టిజం పాత్రను శుభ్రం చేస్తూ.

‘‘మా అబ్బాయికి బాప్టిజం చేయాలి.’’ అన్నాడు స్మిల్జో.

కామిలో పసివాడి కేసి చూస్తూ ‘‘ఇతని కంటె మంచి నాన్న దొరకలేదురా నీకు?’’ అంటూ పిల్లవాడి కళ్ల ముందు వేళ్లు ఆడించాడు. అంతే, పసివాడు లటుక్కున కామిలో మధ్య వేలు పట్టుకున్నాడు. ‘‘హోరినీ! మీ కమ్యూనిస్టు నాన్న లాగానే నువ్వూ పక్కవాడి సొత్తు కొట్టేయాలని చూస్తున్నావే! కాస్త ఆగరా బాబూ, పెద్దాడివయ్యాక మొదలెడుదువు గానిలే’’ అంటూ చమత్కరిస్తూ చూపు సారించాడు. గాడ్‌ఫాదర్ డ్రస్సులో ఉన్న పెపోన్‌ను చూసి ‘‘నిజాయితీ గల కమ్యూనిస్టెవడూ దైవపిత కానేరడు. ఓ పెపోనూ, నీవు నిజాయితీ గల కమ్యూనిస్టువా?’’ అని అడిగాడు.

పెపోను విరక్తిగా నవ్వి, ‘‘ ఆ విషయం దేవుడికే తెలియాలి.’’ అన్నాడు.

‘‘తెలిసినా, తీర్పుల దినం నాడు తప్ప ముందుగా నీకు చెప్పడులే’’ అంటూ బాప్టిజం కార్యక్రమం మొదలుపెట్టాడు కామిలో.

తంతు పూర్తయ్యాక పెపోన్, గుమాస్తా కారులో వెళ్లిపోయారు. పిల్లాణ్ని ఎత్తుకుని అక్కడే నిలబడిన స్మిల్జోను చూసి కామిలో ‘‘ఇంకేం కావాలి?’’ అని అడిగాడు. ‘‘మీ దక్షిణ ఎంతో చెపితే...’’ అన్నాడు స్మిల్జో. ‘‘నాకేం యివ్వనక్కర్లేదులే. పెపోన్ తోక పట్టుకుని తిరుగుతావుగా, తీర్పుల దినం నాడు నీ ఖాతా లెక్క కూడా దేవుడే తేలుస్తాడు.’’ అన్నాడు కామిలో దురుసుగా. ‘‘ఇలా డిస్కౌంట్ యిస్తే పుట్టబోయేవాళ్లని కూడా బాప్టయిజ్ చేయిస్తా ననుకుంటున్నావేమో, ఆ పప్పులేం ఉడకవ్’’ అన్నాడు స్మిల్జో ఉక్రోషంతో.

‘‘ఇంకో మాట మాట్లాడేవంటే యీ పాత్ర నీ చేత తోమిస్తా జాగ్రత్త’’ అంటూ ఉరిమాడు కామిలో! (ఇంకో సరదా కథ, వచ్చే నెల మూడో బుధవారం.)

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?