cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: సైంధవబాధిత

ఎమ్బీయస్ కథ: సైంధవబాధిత

'లోకంలో నీ ప్రథమ శత్రువెవరు?' అని రాణి నెవరైనా అడిగితే 'మా ఆడపడుచు మొగుడు' అని ఠక్కున సమాధాన మిస్తుంది. చిత్రమేమిటంటే ఆర్నెల్ల క్రితం అతను అతి మంచివాడుగా, తనను కష్టాలనుండి కాపాడడానికి వచ్చిన ఆపద్భాంధవుడిగా అనిపించడం. అవును, ఆనాటి పరిస్థితులలాటివి. తను పెళ్ళయి కాపురానికి వచ్చేసరికి ముప్ఫయి ఏళ్ళ ఆడపడుచుకు ఇంకా పెళ్ళి కాలేదు. అత్తగారూ, మామగారూ, తన భర్త ఎంత ప్రయత్నించినా ఏ సంబంధమూ కుదిరేదికాదు. రోజూ ఉదయం తన బెడ్‌రూమ్‌ లోంచి బయటకొస్తూంటే ఆడపడుచు గుచ్చిగుచ్చి చూసేది. ఆవిడ కంటే ఏడేళ్ళు చిన్నదైన తనకి ముందే పెళ్ళయిపోయిందని ఆవిడకి అసూయచేతనే అలా చేస్తోందని అనుకొంది తను. ఆవిడ తన పేరు అనసూయ నుంచి అసూయగా మార్చుకుంటే బాగుండేదని ఫ్రెండ్స్‌తో చెప్పి నవ్వుకొనేది తను.

ఓరోజు ఆవిడే నిజం కక్కింది, “అసలు మా తమ్ముడు నా పెళ్ళయ్యేదాకా వాడు పెళ్ళి చేసుకోనని కూర్చున్నాడు. వచ్చిన సంబంధాలన్నీ తిరక్కొట్టేవాడు. ఇరవై ఎనిమిదేళ్లు వచ్చాయి కదా, పోనీ చేసుకో అని నేనూ అన్నా, వద్దులే అక్కా, ముందు నీ పెళ్ళి కానీ అన్నాడు. అలాంటిది, నిన్ను ఎవరి పెళ్ళిలోనో చూసాట్ట, మీ వాళ్ళు జోరుగా సంబంధాలు చూస్తున్నారనీ, పెళ్ళికి ఆగరనీ విన్నాట్ట. అంతే నా మాట మర్చిపోయి పెళ్ళిపీట లెక్కేసాడు. అంటున్నానని కాదు కానీ, నువ్వేం గొప్ప అందగత్తెవి కావు. నా కంటే కాస్త రంగుంటావు. మొహం నాజూకుగా వుంటుంది. అంతేగా? నాకూ ఇరవై మూడో ఏట అలాగే వుంది. ముప్ఫయి ఏళ్ళు వచ్చాక నువ్వెలా వుంటావో అప్పుడు పోల్చి చూడాలి. అప్పుడు తెలుస్తుంది అసలు రంగు’ అంటూ ఈసడించింది. తనేం చేయగలదు? ఏదో ఒకలా ఈవిడకీ పెళ్ళయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోతే మంచిదని ఆశ పెట్టుకుంది. సంబంధాలు గట్టిగా చూడమని మొగుణ్ణి పోరింది. కావాలంటే తన నగ ఒకటి అమ్మయినా కట్నం ఎక్కువిమ్మని సలహా చెప్పింది. పెళ్ళి కుదరటం మాటలా? ఆడపడుచుకు రూపంలేదు, చదువు పెద్దగా లేదు, ఓ తీరూ, తెన్నూ ఏమీ లేవు. వయసూ మీద పడిపోతోంది.

అందుకే రంగా ఆవిడ్ని పెళ్ళి చేసుకొంటానని అనగానే అతను దేవుళ్ళా కనబడ్డాడు. అతను ఊరికి చివర్లో వున్న ఫ్యాక్టరీలో ఫోర్మన్. అయినా యూనియన్ లీడర్ కాబట్టి పని చెయ్యక్కర్లేదు. వాళ్ళదే అఫీషియల్ యూనియన్. ఎంతసేపూ వర్కర్ల గొడవలు తీరుస్తూ గంటల తరబడి యూనియన్ ఆఫీసులో టీలు తాగుతూ చర్చలు చర్చిస్తూ.. ఇలా గడిపేయడంతో పెళ్ళి విషయం వెనకబడిందట. చివరికి ముసలి తల్లి ముచ్చట తీర్చడానికి, తను ఏ టైముకి వచ్చినా నోరెత్తకుండా పడుండే పిల్లకోసం చూసి చూసి ఈ అమ్మాయిని ఎంచుకున్నాడు.

పెళ్ళయిన నెల్లాళ్లకే ఆడపడుచు కాపురానికి వెళ్ళడం, తామూ ఇల్లు మారడం జరిగింది. తుపాను దెబ్బకి పెరట్లో మామిడి చెట్టు ఇంటి మీదకు ఒరిగింది. భయంవేసి అప్పటికప్పుడు ఈ వాటా ఖాళీగా వుంటే ఇక్కడికి వచ్చిపడ్డారు. తనూ, భర్త, అత్తగారూ, మామగారూ. ఆడపడుచు వారం రోజులకోసారి భర్తతో కలిసి వచ్చి ఓపూట వుండి వెళ్తుండేది. తనమీద ఇదివరకున్న కోపం తగ్గి, కాస్త నవ్వుతూ పలకరిస్తోంది. రంగా దూరంగానే మసిలేవాడు. అతనికంటే తనకి చదువెక్కువన్న కాంప్లెక్సేమో!

సంక్రాంతికి ఆడపడుచూ, మొగుడూ వచ్చినప్పుడు ఓరోజు తను బాత్‌రూమ్‌లో స్నానం చేస్తోంది. కాకి ఎత్తుకెళ్లి పడేసిన నేతి గిన్నె తీసివ్వడానికి రంగా యింటి పైకప్పు ఎక్కాడు, ‘పెంకులు జారతాయి నాయనా, పక్కింటి పిల్లలెవరినైనా ఎక్కించి తీయిస్తాలే’ అని అత్తగారు అంటున్నా వినకుండా! 'మగాడన్నాక ఆ మాత్రం ధైర్యం వుండకపోతే ఎలా?’ అంటూ డబ్బా ఒకటి. ఈయనకి ఇలాంటి పనులంటే భయం. ఆయనమీద విసురన్నమాట!

పైకెళ్ళాక జారితే ఏంచేస్తాడో! స్నానం చేస్తూ తలెత్తి చూసింది. ఇదివరకు బాత్‌రూమ్‌కి పూర్తిగా కప్పు వుండేదిట. తుపాను వచ్చినప్పుడు ఓ రేకు ఎగిరిపోతే యింటాయన మళ్ళీ వేయించలేదు. దానివల్ల బాత్‌రూములో సగం భాగం పైనుంచి కనబడుతుంది. పైకి చూస్తే రంగా కనబడ్డాడు చేతిలో గిన్నెతో. ఎంత జాగ్రత్తగా సిమెంట్ పట్టీ మీద నడుస్తున్నా పెంకులు పటపట మంటున్నాయి. జారిపడతాడేమోననే ఉత్కంఠతో నీళ్ళు పోసుకోవడం మానేసి, చెంబు కింద పెట్టేసి అలాగే చూడసాగింది. రంగా నిలదొక్కుకుని, అనుకోకుండా బాత్‌రూమ్ కేసి చూశాడు. తను తడిచీరతో కనబడడగానే నిశ్చేష్టుడైపోయి అలాగే చూస్తూ వుండిపోయేడు. కింద అత్తగారు ‘ఏమయింది నాయనా, కళ్ళు తిరిగాయా? నిచ్చెన వేయనా?’ అని అరుస్తోంది. తను ఏ స్థితిలో వుందో తనకి తట్టడానికి ఓ నిమిషం పట్టింది. చటుక్కున కప్పు వున్న వైపు లోపలకి పరిగెట్టింది.

అప్పటికే జరగవలసిన ప్రమాదం జరిగిపోయినట్టుంది. రంగాకు తన అందం మతి పోగొట్టినట్టుంది. తన భర్త చెప్పిన ప్రకారం చూస్తే అతను పెళ్ళికి ముందు అప్పుడప్పుడు ఫ్యాక్టరీలో కూలి పని చేసే ఆడవాళ్ళను రప్పించుకునేవాట్ట, ఫ్రీగానే. వాళ్ళు భయం చేతనో, ఏదైనా సాయం చేస్తాడనే భ్రమచేతనో వచ్చేవారు కాబోలు. అయినా ఎండలో పనిచేస్తారు, నలుగురైదుగురు పిల్లల్ని కంటారు, సరైన పోషణ వుండదు. వాళ్లకి తన రంగు, సౌష్టవమూ ఎలా వస్తాయి?

పెళ్ళయ్యేకైనా చూద్దామంటే ఆడపడుచు పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టుంది. మరి రాత్రిళ్ళు కూడా ఆవిడతో గడిపేవాడికి తనలాటి ఒళ్ళు చూస్తూ ఉచ్ఛంనీచం, వావీవరసా మరచిపోకుండా ఉండడం సాధ్యంకాదు, అర్థం చేసుకోవచ్చు. చదువూ, సంస్కారం వున్నవాళ్ళే, ఘరానా మనుషుల్తో మసిలేవాళ్ళే, ఇలాంటి విషయాల్లో కోతుల్లా ప్రవర్తించడం తాను చూసింది. నిత్యం చదువు రాని మొరటు మనుషులతో వ్యవహరించే ఈయన లాంటివాడు వెర్రి వేషాలేస్తే ఆశ్చర్యపడడం ఎందుకు?

ఆవేళ భోజనాల దగ్గర అత్తగారు ఇంకో బూరె వేసుకోమని బలవంత పెడుతూంటే, “రాణి వడ్డిస్తేనే వేసుకొంటాను" అంటూ పట్టుబట్టాడు. “దానికేముంది? అమ్మాయీ, నువ్వే వడ్డించాలిట అతనికి. నీ చేత్తో వేస్తే రుచి ఏమైనా పెరుగుతుందో ఏమిటో!" అని వేళాకోళాలాడుతూ అత్తగారు తనకు వడ్డన వప్పచెప్పింది. అతను చూపుల్తో గుచ్చేస్తూంటే ఒంగి ఒడ్డించడం ప్రాణసంకటంగా వుంది. "భలే సరదా మనిషి, మా అల్లుడు" అంటూ అత్తగారు మురిపెం ఒకటి. చివరికి “మామూలుగా చూస్తే తెలీదుకానీ రాణి మహా అందగత్తె”అని రంగా ఓపెన్‌గా అంటున్నా దానిక్కూడా ఎవరూ తప్పుబట్టకుండా నవ్వుకున్నారు!

మర్నాడు తెల్లవారుఝామున తనూ, అనసూయా సంక్రాంతి ముగ్గులేస్తూంటే బాటరీ లైటు పట్టుకు తయారయ్యేడు రంగా. అతని చూపులు ఎక్కడ తడుముతున్నాయోనన్న బెరుకుతో పైట బాగా దోపి జాగ్రత్తగా పెట్టుకుంది. అతనికి ఏ భంగిమలో ఏ ఏంగిల్‌లో వంపులు కనబడతాయోనని సైడుగా కూచుని ముగ్గులేస్తోంది. అతను 'అనసూయా, రాణి వేసినట్లుగా వెయ్. ఆ 'కర్వ్' చూడు ఎంత బాగుందో అంటూ బాటరీ లైటు వేసి అటూ, ఇటూ తిప్పుతూ వుంటే 'బండాడికి కలాపోసనకూడా వుందే!' అనుకొంది. కానీ కాస్సేపటికే ఆ వ్యాఖ్యలు తన గురించే అని అర్థమై తనను తాను తిట్టుకొని పని వుందంటూ ఏదో గొణిగి లోపలికి వచ్చిపడింది. మొగుడితో చెప్పుకొందామంటే ఆయన్తో ఏకాంతం కుదరలేదు. కొత్త జంట కదాని తమ రూమ్ ఆడపడుచు కిచ్చారు. ఇంకో గదిలో అత్తమామలూ, తామూ పడుకొంటున్నారు. అంత చిన్న ఇంట్లో ఏమూలకి తీసుకెళ్ళి చెబుతుంది?

పండుగ మూడు రోజులూ రంగా చెలరేగిపోయాడు. తెలుగు సినిమాలకు మాటలు రాయగలిగిన ప్రతిభ కనబరిచేడు. అతడు అంటున్నది ఒకే అర్థం.. బూతు అర్థం. 'అబ్బే, అంత ఇదిగా చెల్లెలి వరుస దాంతో అంటాడా!' అని మనంతట మనం మంచి అర్థం వెతుక్కోవాలి. మిగతావాళ్ళకి ఇవన్నీ తెలియవా? ఇంటల్లుడు కదాని ఊరుకుంటున్నారా? తనదేమైనా పొరబాటుందా? ఆవేళ బాత్రూము లోంచి పైకి చూడడం తప్పా? అతను తనకేసి చూడగానే కెవ్వున అరచి గోల చేయాల్సిందా? బయటకు వచ్చాక ఆ విషయం ప్రస్తావించి అతన్ని మందలించాల్సిందా? ఎలా చేయగలుగుతుంది? తనంతట తానే రట్టు చేసుకొన్నట్టవదూ? అతని జోకులకు తను ముఖం మాడ్చుకొంటూంటే, అత్తగారు చివాట్లేసింది కూడా- ‘అతనంత కలుపుగోలుగా వుంటే, నీ టెక్కేమిటి? తుమ్మల్లో పొద్దు కుంకినట్లు ఆ ముఖం ఏమిటి?' అంటూ.

ముక్కనుమనాడు కూడా వాళ్ళ ఫ్యాక్టరీకి సెలవుట. రంగా, అనసూయ వుండిపోయేరు. ఈయన ఆఫీసు కెళ్ళారు. అత్తగారు “పండగ చాలా సరదాగా గడిచి పోయిందోయ్. మీరెక్కడో ఊరికి దూరంగా వుండడం ఎందుకు? పక్కింటి వాళ్ళు ఫస్టుకి ఖాళీ చేస్తారట. మీ రొచ్చేయకూడదూ? పక్క పక్కనే వుంటే, రేప్పొద్దున్న పురిటికీ దానికీ సౌకర్యంగా వుంటుంది” అని. తనను నిత్యం చూడడానికి వచ్చిపడిన ఈ అవకాశం రంగా వదులుకొంటాడా? 'తప్పకుండా. ఇల్లు మారిపోతాం. నాకు ఫ్యాక్టరీ దూరమయినా ఫర్వాలేదు' అనేసేడు. మర్నాడు తను మొగుడి దగ్గర గోల పెట్టింది. అతను ఓపిగ్గా విన్నాడు. 'నువ్వు పొరబాటు పడుతున్నావేమోన'ని ముందు అన్నాడు కానీ, అతని ఎదురుగా జరిగినవన్నీ చెప్పుకొచ్చాక ఒప్పుకొన్నాడు. కానీ “అనసూయకీ, మా అమ్మకీ మహా ఎటాచ్‌మెంట్. పెళ్ళి ఆలస్యమవడంతో చాలా కాలం ఇంట్లో వుండిపోవడం వలన కాబోలు మరీ దగ్గరయ్యేరు వాళ్ళు. అందువల్ల అమ్మ ఎలాగైనా సాధించి వాళ్ళకి పక్కింటికి తెస్తుంది. మనం అడ్డుచెప్పి ప్రయోజనం లేదు. రంగా విషయమంటావా? మన జాగ్రత్తలో మనం వుంటే సరి” అన్నాడు. మొగుడి ద్వారా లాభం లేదని తేల్చుకొన్నాక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పక్కింటివాటా ఖాళీ అవబోతోందనీ, వచ్చి చేరండనీ ఒప్పించబోయింది. కానీ ‘మీ ఇంటాయన్ని అస్సలు నమ్మలేం. ఏడాదిలోపులే ఏదో ఒకటి చెప్పి ఖాళీ చేసేయ మంటాడు'అని ఆ ఫ్రెండ్ దణ్ణం పెట్టేసింది.

ఒకటో తారీక్కు ఇంటిలో చేరగానే రంగా చేసిన పని, రెండు వాటాల మధ్య వున్న తలుపుకి కన్నం వుందన్న విషయం కనిపెట్టడం. “పగలు తీసి వుంచుదాం, హాయిగా వస్తూ, పోతూ వుండచ్చు" అని అత్తగారంటే, “లేదు నాకు యూనియన్‌కి సంబంధించిన రాతకోతలుంటాయి. ఇక్కడ బల్ల, కుర్చీ వేసుకొంటాను" అని చెప్పి కుర్చీలో కూర్చునే తలుపు కన్నంలోంచి తమ బెడ్రూములోకి తొంగిచూసి ఏర్పాటు చేసుకొన్నాడు. తను అది గ్రహించి తలుపుకో మేకు కొట్టి కేలండర్ తగిలించింది, కన్నానికి అడ్డుగా. కానీ రంగా ఊరుకుంటేగా? దర్జాగా తమ వాటాలోకి వచ్చేసి, 'కేలండర్ గోడకి పెడతారోయ్, తలుపుకి కాదు' అంటూ అది అక్కణ్ణుంచి తీసేసాడు. ఈయన ఏమీ మాట్లాడలేదు. ఇంటల్లుడని గౌరవంట! పెళ్ళాం అంటే మాత్రం గౌరవం ఇవ్వక్కర్లేదా?

తలుపు కన్నానికి చింతపండు పెట్టినా ఆ గదిలో బట్టలు కట్టుకోడానికి కూడా జంకు పట్టుకుంది. ఏ క్షణంలోనైనా చీపురు పుల్లతో అది తీసేసి తన ఒళ్ళు చూస్తాడేమోనని బాత్రూములోనే బట్టలు కట్టుకోవడం ముగించుకొని వచ్చేది. కాకి గిన్నె పడేసిందని ఓసారి, తువ్వాలు ఎగిరిపోయిందని మరోసారీ రంగా ఇంటి కప్పేక్కేడు. ఓసారి చేసిన దానికి బుద్ధొచ్చింది కాబట్టి, బాత్రూమ్ లో కప్పున్న భాగానికి ముడుచుకుపోయి స్నానం చేసేది తను. కానీ ఇలా ఎంతకాలం?

అత్తగారికీ, మామగారికీ కూడా వారం రోజుల్లోనే రంగా చేష్టల పరమార్థం అర్థమైపోయింది,. అయినా లేకలేక దొరికిన అల్లుడికి కోపం తెప్పిస్తే కూతుర్ని వదిలేస్తానంటాడన్న భయమో, ఏమో ఎవరూ నోరెత్తేవారు కారు. అనసూయ దగ్గర అన్యాపదేశంగా అనబోతే “షోకులు తగ్గిస్తే సరి, ఎవరూ వెంటబడరు" అంది చురుచురలాడుతూ. ఎటు తిరిగి, తనదే తప్పన్నమాట! ఖర్మ! ఆడదానికి మొగుడింట్లో కూడా రక్షణ లేదన్నమాట! అర్థరాత్రి వీధుల్లో తిరగగలిగే రక్షణ ఎప్పటికి వస్తుందో?

శివరాత్రి నాడు జాగరణ చేయడానికి కాంపౌండులో వాళ్ళంతా హోం థియేటరు తెచ్చి పెద్ద స్క్రీన్ మీద మూడు భక్తి సినిమాలు వేస్తామన్నారు. రాత్రి అన్ని వాటాలవాళ్ళూ పెరట్లో కూచున్నారు. రంగా తన పక్కనే తయారయ్యేడు. తెరమీద ‘‘పాండవ వనవాసం’’లో ద్రౌపదిని సైంధవుడు బలాత్కరించే దృశ్యం వస్తున్నప్పుడు తన తొడమీద రంగా చెయ్యి పడింది. గ్రహించుకొంది. 'ఇక్కడేదో పాకుతున్నట్టుంది, కాస్త లైటు వేయండి' అని అరిచింది. లైటు వేసి చూసి, 'ఏమీలేదు, కంగారు పడకండి'అని ధైర్యం చెప్పి, ‘పోనీ మీ దగ్గర లైటు వేసి వుంచుతాం' అన్నారు ఆర్గనైజర్లు. 'లైటు వేస్తే పురుగులొస్తాయి తీసెయ్యండి' అని రంగా పట్టుబట్టాడు. 'అలా అయితే కాంపౌండంతా లైట్లు వేయండి' అన్నారు కొందరు. వేశారు. అన్ని లైట్ల మధ్య రంగా వేషాలేం వేస్తాడు? కాస్సేపున్నాక 'సిగరెట్టు కాల్చుకొస్తా'నంటూ లేచి బయటకెళ్ళాడు. రెండు నిమిషాల్లో ప్యూజ్ పోయింది. సినిమా కార్యక్రమం ఆగిపోయింది. 'తన మాట నెగ్గలేదన్న కోపంతో రంగాయే షార్ట్ సర్క్యూట్ చేసి వుంటాడు. ఫ్యాక్టరీలో యజమాన్లను ఏడిపించడానికి సాధారణంగా వర్కర్స్ చేసే పనే ఇది' అని ఈయన తన చెవిలో గుసగుసలాడేరు. రంగా ఉద్దేశ్యం అదొక్కటే కాదన్న విషయం ఆయనకు తట్టలేదు.

“పోన్లే వెధవ సినిమా, పోతేపోయింది. మన ఇళ్ళల్లోనే కూర్చుని ఓ నాలుగు కీర్తనలు పాడుకొందాం" అంది అత్తగారు. రంగా మళ్ళీ తన పక్కనే సిద్ధం. ఈసారి నడుంమీద చెయ్యి పాకింది. “నాకు నిద్రవస్తోంది" అని తను లేచి వచ్చేసింది. “ఓ భక్తీ, తాత్పర్యం లేదు. తల్లి ఎలా పెంచిందో చూడు" అంటూ అత్తగారు సణిగింది. మర్నాడు పొద్దున్న మొగుణ్ణి ఝాడించేసింది. “సైంధవుణ్ణి పాండవులు ఎలా శిక్షించారో చూశారా? ఎన్ని తరాలైనా ఆ కథలు మర్చిపోలేక పోవడానికి కారణం అదే. 'కట్టుకున్న దానితో తోబుట్టువు మొగుడు వెకిలి వేషాలేసినా వదిలిపెట్టకూడదు' అనేదే నీతి. మీరూ వున్నారు. నేను పడే బాధ తెలిసికూడా కాణీకి కొరగాని సంస్కారం అడ్డుపెట్టుకొని నన్ను తోడేలుపాలు చేస్తున్నారు. మీ అక్క జీవితం ఎక్కడ పాడైపోతుందో, ఈ కోపం ఆవిడమీద చూపించి కష్టపెట్టేస్తాడేమోనన్న భయమే కానీ, నేనూ ఓ అమ్మ కన్నబిడ్డనే అనీ, ఒకడికి తోబుట్టిన దానిననీ మీకేమైనా గ్రహింపు వుందా?” ‘‘చూడు రాణీ, నాకన్నీ తెలుసు, కానీ ఏమీ చెయ్యలేను. నువ్వు తెగించి ఏదైనా చేసినా నిన్ను సమర్ధిస్తాను. ఆ మాత్రం హామీ యివ్వగలను. నువ్వే ఏదో మార్గం చూడు" అన్నాడు మొగుడు.

తనే ఏదో ఒక మార్గం చూడాలి. పనిమనిషి సీతాలుకి తన బాధలన్నీ తెలుసు. తన దగ్గర రెండు మూడుసార్లు అంది కూడాను. దాని సాయం తీసుకోవాలి.

అత్తగారూ, మామగారూ బంధువులింటికి వెళ్ళిన రోజు మధ్యాహ్నం రాణి ఓసారి రమ్మనడంతో రంగా మహా ఆనందపడ్డాడు. 'నిజానికి ఈ ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి యూనియన్ మీద తన పట్టు తప్పుతోంది. యూనియన్ ఛోటా నాయకులు కొంతమంది 'ఆయన ఎక్కడో దూరంగా వుంటాడు. మీ సమస్యలుంటే మా దగ్గరకే తీసుకురండి' అంటూ వాళ్ళు క్రమంగా ఎదిగిపోతున్నారు. వచ్చేసారి ఎన్నికల్లో తను గెలవకపోతే మళ్ళీ సుత్తి, శానం పట్టకొని మామూలు పనిలో దిగాల్సిందే. అయినా రాణిని ఎలాగైనా లొంగదీసుకోవాలన్న ఆశతోనే వాటన్నింటినీ పణంగా పెట్టి ఇక్కడ వుంటున్నాడు.

ఫ్యాక్టరీ నుండి డైరెక్టుగా తన ఇంటికి రమ్మనమని రాణి ఎందుకు పిలిచిందో? సరేనంటుందా? లేక వదిలి పెట్టేయమని బతిమాలుతుందా? తను కూడా ఇప్పటిదాకా 'నువ్వంటే పడి చస్తున్నాను' అని ‘ఓపెన్'గా చెప్పలేదు. ఆవిడ ఏదైనా చెప్పబోయే ముందు వెళ్ళగానే తనే చెప్పేస్తే సరి!”

అలాగే చెప్పాడు. రాణి పగలబడి నవ్వింది “చాలా బాగుంది. మీ భార్యాభర్తలిద్దరికీ, తక్కిన వాటిల్లో ఎలా వున్నా, ఈ విషయంలో మాత్రం ఒకటే టేస్టులా వుంది. ఇద్దరికీ ఆడాళ్ళంటే పిచ్చి అనుకుంటా!" అంది. రంగా ముఖం జేవురించింది. "నీ ఉద్దేశ్యం ఏమిటి? ఏమిటా వెకిలి మాటలు?' అని నిలదీశాడు. రాణి తీవ్రంగానే జవాబిచ్చింది. "అర్థం కాకపోతే, అదిగో ఆ తలుపు కన్నంలోంచి మీ వాటాలోకి చూడండి. మీకే తెలుస్తుంది” అంది. రంగా చూశాడు. అనసూయ బట్టలు లేకుండా మంచంమీద బోర్లా పడుకొని వుంది. సీతాలు భుజాల నుంచి వీపు దాకా రాస్తోంది. 'ఇంకా కిందకి' అంది అనసూయ. సీతాలు చేతులు కాళ్ళవైపు వెళుతుంటే రంగా మొహం తిప్పేసి రాణితో ఏదో అనబోయేడు.

రాణి ‘ఉష్ నిశ్శబ్దం’ అన్నట్టుగా సైగచేసి 'ఇంకా చూడండి' అని సూచించింది. సీతాలు చేతులు ఇప్పుడు అనసూయ పొట్టకింద వున్నాయి. పక్కటెముకలు రాస్తున్నాయి. 'ఛ, ఛ, ఇలాంటి అసహజమైన పనులేమిటి? తనేం చేస్తోందో అనసూయకి ఒళ్ళూ పై తెలుస్తోందా?' తెలుస్తున్నట్టే వుంది. 'ఉండు, దిండు పొట్టకింద వేస్తే సౌకర్యంగా వుంటుంది' అంటూ దిండు వేసుకొంది. దిండు పెట్టడంవల్ల ఏర్పడిన ‘స్లోప్స్’ దారిలో సీతాలు చేతులు జారుతున్నాయి.

రంగాకు వాంతి వచ్చినంత పనయింది. కళ్ళు మూసుకున్నాడు. “మీరు వెల్లకితలా పడుకొంటే గానీ అదెలా కుదురుతుందమ్మాయిగారూ?"అంటూ సీతాలు గొంతు వినబడింది. తలుపుకు దూరంగా వచ్చేశాడు. "ఏమిటీ దరిద్రప్పని? ఇంత దారుణమా? ఏం చేయడం ఇప్పుడు?" అంటూ రొప్పుతున్నాడు.

రాణి అతి శాంతంగా “ఏం చేస్తారు? వెళ్ళి అడిగితే ఒళ్ళు మాలీసు చేయించు కుంటున్నానంటుంది మీ ఆవిడ. కాదని కేకలేసారనుకోండి, జనం ఎవరూ ఓ పట్టాన నమ్మరు. మొగాడితో తిరిగిందంటే మదం ఎక్కింది ముండకి' అంటారు. కానీ మరో ఆడదానితో కక్కుర్తి పడుతుందంటే 'పాపం మొగుడెలాంటివాడో మరి' అని జాలిపడతారు".

“అంటే నేను అసమర్థుడినని నీ ఉద్దేశ్యమా?"

"నా ఉద్దేశ్యం కాదు! నాకు అనసూయ సంగతి తెలుసు. పెళ్ళి ఆలస్యమవడంతో తాపం భరించలేక ఇలాంటి వాటికి అలవాటు పడింది. కానీ ఊళ్లోవాళ్లకి ఇవన్నీ తెలియవు కదా?"

“అయితే ఇప్పుడేం చేయమంటావ్?"

“తక్షణం ఇల్లు మార్చేసి మీ ఫ్యాక్టరీ దగ్గర ఇల్లు తీసుకోండి. సీతాలు గొడవ వదులుతుంది. మరొకరు మచ్చికవడానికి టైము పడుతుందికదా! ఈ లోపున మీరు క్షణం తీరికలేకుండా ఊదరగొట్టేయండి. ఒక్కరోజు కూడా వదిలిపెట్టవద్దు. కడుపు పండిందంటే పిల్లా, పాప పుట్టుకొచ్చి ఈ ధ్యాస వుండదు. ఈ లోపున ఇరుగూ, పొరుగూ ఎవరితోనూ కలువనీయకండి".

రంగాకు నిర్ణయించుకోవడానికి అయిదు నిమిషాలకంటే పట్టలేదు. యూనియన్ లీడరుగిరీతోబాటు పెళ్ళాన్నీ కాపాడుకోవాలి.

సీతాలుకి చీర కొని పెడుతూ రాణి, అనసూయకి మనస్సులోనే 'థ్యాంక్స్' చెప్పుకుంది. 'ఒళ్ళు నెప్పులు తగ్గాలంటే సీతాలుచేత మర్దనా చేయించుకో, అది చెప్పినట్లు చేస్తే ఒళ్ళు తేలికపడుతుంది' అని తను సలహా ఇచ్చినప్పుడు, ‘ఓఁ అంతకంటేనా' అంటూ నిస్సందేహంగా ఒప్పుకున్నందుకు!

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

[email protected]

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?