Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: టైమింగ్‍ తెలిసిన పసివాడు

ఎమ్బీయస్ కథ: టైమింగ్‍ తెలిసిన పసివాడు

‘‘నీ మేనల్లుడి పుట్టినరోజు వస్తోందోయ్‍, బహుమతిగా నువ్వో వెయ్యి రూపాయలివ్వ బోతున్నావ్‍.’’ అన్నాడు రాంపండు హుషారుగా.

‘‘మేనల్లుడా? వాడెవడు?’’ అన్నాడు నాగేంద్ర మొహం చిట్లించి.

‘‘భలేవాడివే ! మా బుజ్జిని అవేళ క్లబ్బుకి తీసుకుని వచ్చినపుడు నువ్వు వాణ్ని ముద్దుచేసి, వేలు విడిచిన మేనమామగా వుండి ఆలనా, పాలనా చూసుకుంటానన్నావ్‍, గుర్తు లేదూ?’’

‘‘నువ్వు మీ అబ్బాయిని తీసుకు వచ్చి, ఏవేవో చెప్పిన గుర్తుంది. నీ సొద భరించలేక, రొద వదిలించు కోవడానికి సరేసరే అన్నాను కాబోలు.. అయినా ఆలనా, పాలనా చూసుకోవడానికి ‘పాపిష్టి ప్రపంచాని’కి సంపాదకుడుగా ఉద్యోగం వెలగబెడుతున్న నువ్వున్నావ్‍. నెలకో నవల రాసి పడేసే మీ ఆవిడ ఊహ వుంది. మధ్యలో ఈ వేలు విడిచిన మేనమామ లెందుకు?’’ అని మండిపడ్డాడు నాగేంద్ర.

నాగేంద్ర కసితో ‘పాపిష్టి ప్రపంచం’ అన్న ఆ బాలల పత్రిక అసలు పేరు ‘పాప ఇష్టప్రపంచం’. మ్యాగజైన్‍ పేరు రిజిస్ట్రేషన్‍ ఢిల్లీలో చేయించినపుడు కలిపి రాయడం, స్పెల్లింగు కాస్త అటూ యిటూ కావడం, అది పబ్లిషరు చూసుకోకపోవడంతో దాని పేరు ‘పాపిష్టి ప్రపంచం’గా నమోదైంది. మొదటి సంచిక అచ్చువేయబోయినప్పుడు గుర్తించారు. అప్పటికే ముహూర్తం పెట్టేసుకోవడంతో గత్యంతరం లేక ఆ పేరు తోనే మాటల మధ్య కాస్త ఖాళీ విడిచి మార్కెట్‍లో రిలీజ్‍ చేశారు. ‘పాపిష్టి ప్రపంచం’ అన్న పేరు చూసి లోకంలోని అకృత్యాలన్నీ దీనిలో నమోదు చేస్తారు కాబోలనుకుని పత్రిక కొన్నవాళ్లు లోపల చిన్నపిల్లల కథలు, గేయాలు చూసి తెల్లబోయారు.

పేరు మార్పిద్దామని పత్రిక పబ్లిషరు కుబేరరావు అనుకున్నాడు కానీ పత్రిక ఏజంట్లు వారించారు. ‘చిన్నపిల్లల పత్రిక అంటే తెలుగువాళ్లేం కొంటారండీ, ఇలాగే వుంచండి. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు మోసపోయి కొంటూంటారు’ అనడంతో అలాగే కొనసాగించాడు. అనేక ఉద్యోగాల్లో ఆరితేరిన రాంపండు (అసలు పేరు రాంవరం పాండురంగం) ఎడిటరు ఉద్యోగానికి తన వద్దకు యింటర్వ్యూకి వచ్చినపుడు అతన్ని అతనిగా కాక కల్పనారాణి అనే కలంపేరుతో రాసే ఊహ భర్తగా గుర్తించి ఉద్యోగం యిచ్చాడు. ఎందుకంటే ఊహ ఆరితేరిన రచయిత్రి. ఉద్యోగం విషయంలో భర్తకు సహాయపడడానికి పిల్లల కథలు రాస్తుందని, తద్వారా పత్రిక అమ్మకాలు పెరుగుతాయని కు‘బేరాల’రావు ఆశపెట్టుకున్నాడు. కానీ త్వరలోనే తెలిసి వచ్చింది - ఊహకి ప్రేమ కథల్లో వున్న ప్రావీణ్యం పిల్లల కథల్లో లేదనీ, ఉన్నా భర్తకోసం తన వృత్తిని అడ్డు వేయదనీ..!

ఇది తెలియగానే కుబేరరావు రాంపండు ఉద్యోగం పీకేద్దామనుకున్నాడు కానీ ఆ పాటికే అతని భార్య దేవి, ఊహ ఫ్రెండ్స్ అయిపోయారు. దేవి కల్పనకి వీర ఫ్యాన్‍. ఇన్‍స్పిరేషన్‍ కోసం ఊహ టూరు వెళ్లినపుడు తనను తోడుగా రమ్మనడం తన అదృష్టంగా, గర్వకారణంగా భావిస్తుంది దేవి. ఊహకు రాంపండుపై ఎంత ప్రేమ వున్నా, అతని తప్పులను ఎంత సహించినా, యిన్‍స్పిరేషన్‍ కోసం వెళ్లే టూర్లలో అతన్ని వెంటపెట్టుకుని వెళ్లదు. వెళితే అతని చేష్టల వలన చికాకు పెరిగిపోయి, వున్న మూడ్‍ పోతుందంటుంది.

ఓ నెల్లాళ్ల క్రితం ఊహ ‘‘మన బుజ్జిగాడు పుట్టి ఏడాదవుతోంది. ఇప్పణ్నుంచీ వాడికోసం డబ్బు దాచిపెడితే పెద్దయ్యాక ఒకేసారి బోల్డు వస్తుంది. వాడి పేర బ్యాంకులో ఎక్కవుంటు తెరిచి నెలకు వెయ్యి రూపాయలు వేస్తాను.’’ అంది. ‘‘బాగుంది, బాగుంది’’ అన్నాడు రాంపండు. ‘‘తమాషా ఏమిటంటే నాకీ ఉద్దేశం వుందని తెలియగానే మా అమ్మ ‘నేనూ వాడిపేర నెలనెలా ఓ వెయ్యి వేస్తాను’ అంది, వెంటనే మా చెల్లి కూడా నేనూ ఓ వెయ్యి అంది...’’ అంది ఊహ. ఆ క్షణంలో రాంపండులో పుత్రోత్సాహం పొంగి పొరలి ఆ మైకంలో ‘‘...అయితే నేనూ ఓ వెయ్యి వేస్తా.. అంటే నెలకు నాలుగువేలవుతాయన్నమాట. వాడు స్కూలుకి వెళ్లే టైముకి సొంతకారులో వెళ్లవచ్చు..’’ అనేశాడు. ఊహకు మొగుడు ఆ క్షణాన ఎంతో ముద్దొచ్చాడు. పెట్టేసుకుంది.

రాంపండు గురించి తెలిసున్నవాళ్లు అక్కడ వుండి వుంటే అలాటి భీష్మప్రతిజ్ఞ చేయకుండా వారించేవారు. రాంపండు ఆదాయానికి వున్న పరిమితులు జూదానికి లేవు. చీటికిమాటికి పందెమే. ఓడిపోతుంటే పంతం కొద్దీ యింకా వేస్తాడు. ఊహ యీ విషయమై ఎన్నోసార్లు దెబ్బలాడి, ఓడింది. రాంపండు సంగతి తెలిసున్నవాళ్లు అక్కడే వుండి వారించినా రాంపండు తన జేబులో ఆ క్షణాన వున్న వెయ్యి రూపాయలు చూపించి వాళ్ల నోరు మూయించేవాడు. కానీ అతని జేబులోని ఆ వెయ్యి మర్నాడు సాయంత్రానికి లేదు.

పోతుటీగల క్లబ్బులో సభ్యుడైన రాంపండు అక్కడికి వెళ్లడం, క్యాంటీన్‍ నాన్‍ ఏ మేరకు సాగుతుందన్న దానిపై పందెం వేయడం, ఆ వెయ్యి పోగొట్టుకోవడం జరిగాయి. పందెం కాయబోయే ముందు జేబులోని వెయ్యిని రెట్టింపు చేసి తండ్రిగా తన ప్రేమను రెట్టింపు పంచుదామనే సదుద్దేశంతోనే రాంపండు పందెం కాయడం జరిగింది. కానీ వేరుగా తలచిన విధి యొక్క విన్యాసాలు అర్థం చేసుకోలేని ఊహ కళ్లకు తనే దోషిగా కనబడతాడన్న భయంతో రాంపండు ఆ వెయ్యి రూపాయలు యితరత్రా పుట్టించడానికి శతథా కష్టపడ్డాడు. ప్రతీ కుర్రాడి వెంట ఓ కుక్క వుండి తీరాలని ఉద్బోధిస్తూ ఓ గేయం రాశాడు. ‘రాసి పారేశాడు’ అనే మాటను యీ రచయిత ఉపయోగించడు. ఎందుకంటే ఆ పదిపంక్తుల గేయం రాయడానికి రాంపండు ఎంత చెమటోడ్చాడో అతనికి తెలుసు. పేజీలకు పేజీలకు రాసే తన భార్య కష్టాన్ని తలచుకుని ఆ సమయంలో రాంపండు ఎంత జాలిపడ్డాడో కూడా అతనికి తెలుసు. మొత్తానికి గేయం పూర్తి చేసి, వేరే ఏ పత్రికకు పంపినా వేసుకోరు కాబట్టి తన పత్రిక లోనే రెండో కవరుపై కలరులో వేసి, దానికి గాను వెయ్యి రూపాయలు పారితోషికం యివ్వాలంటూ కుబేరరావుకి బిల్లు పెట్టాడు. జీతాలు వచ్చినపుడు చూస్తే ఆ అదనంగా ఏదీ రాలేదు. వెంటనే అతని గదికి వెళ్లి ‘‘ ఆ గేయం...’’ అంటూ నసిగాడు.

‘‘ఏ గేయం?’’ అన్నాడు కుబేరరావు అరమోడ్పు కన్నులతో, చెవిలో బాల్‍పెన్‍ మూత తిప్పుకుంటూ..

‘‘..అదే, ‘ఉంచుకో-ప్రేమ పంచుకో’ అనే గేయం.. రెండో కవర్‍లో వేశాం కదా.. నేను రాసినదే..’’ అన్నాడు రాంపండు ముక్కముక్కలుగా సమాచారాన్ని అందిస్తూ.

‘‘..కుక్కల్ని ఉంచుకుంటారా, పెంచుకుంటారా?’’ అన్నాడు కుబేరరావు అరమోడ్పు కన్నులను ఫుల్‍సైజుకి తెచ్చి ఉరిమి చూస్తూ.

రాంపండుకి హఠాత్తుగా వెలిగింది - తను గేయం రాసేటప్పుడు వెతుక్కున్న మాట ‘పెంచుకోవడం’ అని. ‘కీప్‍’ అనే ఇంగ్లీషు మాటే నోట్లో ఆడింది. డిక్షనరీ చూస్తే ‘ఉంచు’ అని అర్థం కనబడింది. దాంతోనే గేయం లాగించేశాడు. కానీ యిప్పుడు వెనక్కి తగ్గి ప్రయోజనం లేదు. ‘‘పెంచుకునేవాళ్లు పెంచుకుంటారండి, పెంచే ఓపిక లేనివారు ఉంచుకుంటారండి’’ అన్నాడు. కుబేరరావు నుదురు బాదుకుని ‘‘అందుకే వాడెవడో మన పత్రిక పేరు ‘పాపిష్టి ప్రపంచం’ అని సరిగ్గా పెట్టాడు’’ అన్నాడు. ‘‘..దాని పారితోషికం మాట..’’ అన్నాడు రాంపండు బాల్‍పెన్‍ మూత మళ్లీ గమ్యస్థానంవైపు దూసుకుపోతూండగా.. మూత ఆగలేదు. జవాబూ ఆగలేదు - ‘‘పత్రికకు నువ్వు ఏం రాసినా, అదంతా జీతంలోనే లెక్క. విడిగా ఏమీ రాదు.’’

ఈ కథంతా చెప్పి రాంపండు నాగేంద్రను శరణుజొచ్చాడు. నాగేంద్ర అంతా విని ‘‘అయితే నీకు వెయ్యి రూపాయలు అర్జంటుగా కావాలి. లేకపోతే మీ ఆవిడ దగ్గర నీ పరువు పోతుంది. ఓకే, నువ్వొక పని చేసి పెడతానంటే అది నేనిస్తా..’’ అన్నాడు. ‘‘దేనిలో దూకమంటావో చెప్పు..’’ అన్నాడు రాంపండు ఆతృతగా. ‘‘సుష్టుగా భోజనం చేస్తే చాలు.. అదీ ఓ అమ్మాయితో.. ప్రస్తుతం మీ ఆవిడా, దేవీ కలిసి టూరుకి వెళ్లారన్నావు కాబట్టి నీకు ఏ అభ్యంతరమూ ఉండకూడదు.’’

నాగేంద్ర ఓ సొట్టబుగ్గల అమ్మాయితో యి మధ్య కాస్త తిరిగాడు. ఆ అమ్మాయి కాస్త తొందరపాటు మనిషి. వ్యవహారాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లబోయింది. అవేళ రాత్రి తాజ్‍లో యివ్వబోయే డిన్నర్‍లో ఏ విషయం తేలిపోవాలంది. దాంతో ఆమెను ఎలా వదుల్చుకోవాలా అని చూస్తున్నాడు. రాంపండు దొరికాడు. ‘‘నా బదులు నువ్వు వెళ్లి డిన్నర్‍ చేయి. నేను అర్జంటు పని మీద బెంగుళూరు వెళ్లానని చెప్పు. నన్ను బాగా తిట్టిపోసేయ్‍. సంగతి గ్రహించుకుంటుంది.’’ అన్నాడు. నాగావళి గ్రహించుకుంది. రాంపండు కంటె ఎక్కువగా నాగేంద్రను తిట్టిపోసింది. తాచుపాము లాటివాడు కాబట్టే ఆ పేరు పెట్టారంది. ‘మీ పేరూ అలాటిదే’ అని రాంపండు గుర్తు చేయలేదు. భోజనం అయ్యాక వెళ్లి వస్తానంటే రాంపండు ‘‘అప్పుడే వెళ్లవద్దు, మన అభిప్రాయాలు యింత బాగా కలిశాక, అంత త్వరగా విడిపోతే ఎలా?’’ అన్నాడు. ‘‘వెళ్లాలి. నాకు తెలిసిన ఓ చోట రహస్యంగా గాంబ్లింగ్‍ సాగుతూ వుంటుంది. పైకి మామూలు యిల్లు లాగే వుంటుంది. లోపల రకరకాల జూదాలు సాగుతాయి.’’ అంది నాగావళి. ‘‘ఎక్కడో చెప్పండి, వీలైతే నేనూ వస్తా’’ అన్నది రాంపండు కాదు, అతని జేబులో నాగేంద్ర యిచ్చిన వెయ్యి రూపాయల నోటు.

నాగావళి చెప్పిన అడ్రసు చూడబోతే అది రాంపండు కాలనీలోనే, అతని ఇంటినుండి మూడో యిల్లు. మధ్యలో ఓ కవి గారి యిల్లుందంతే ! అక్కడి హంగామా చూశాక ‘ఇంత దగ్గరగా ఫస్ట్‌క్లాస్‍ జూదగృహం పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నానేమిటి’ అని రాంపండు తనను తానే నిందించుకున్నాడు. ఇంకో అరగంటలోనే అది ఫస్ట్‌క్లాస్‍ది కాదని థర్డ్ రేట్‍దనీ తేల్చుకున్నాడు. ఎందుకంటే ఆ పాటికి అతని జేబులోని వెయ్యీ హరించుకుపోయాయి. నాగావళికి టాటా చెప్పి బయలుదేర బోతూండగానే పోలీసుల దాడి జరిగింది. అక్కడి ఆనుపానులన్నీ క్షుణ్ణంగా తెలిసివుండడం రాంపండుకి లాభించింది. ఆ యింటి కిటికీలోంచి పక్కింటి కవిగారి తోటలోకి లంఘించడం, మొక్కలు తడపడానికి అక్కడ నిలబెట్టిన పీపాలోకి దూరి కూర్చోవడం నిమిషాల్లో జరిగిపోయింది. కొద్ది నిమిషాల్లోనే నాగావళి అతనితో జట్టు కలిపింది. కానీ ఆమె మూడ్‍ అస్సలు బాగాలేదు.

‘‘ఇలా జరగడం నాలుగోసారో, ఐదో సారో..! ప్రతీసారీ యీ పీపా లోనే దాక్కుంటాను. ఎవరి పని వాళ్లు చేసుకోనీయకుండా అసలు యీ పోలీసులు ఎందుకడ్డంపడతారో నాకు అర్థం కాదు. నేను పదివేలు గెలిచి, సరిగ్గా డబ్బు తీసుకోబోతూండగా ఎక్కణ్నుంచో వూడిపడ్డారు. ఛ.. కాస్త జరుగుతావా..’’ అందామె. కోపంలో ఏకవచన ప్రయోగం వచ్చేసినట్టుంది. రాంపండు జరిగాడు కానీ ఆమెకు తృప్తి కలగలేదు. ‘‘ఏమిటి, బొత్తిగా మీదమీదకు వచ్చేస్తున్నావ్‍? పీపాలో నీళ్లు లేవు కదా, అయినా నిమిషనిమిషానికి అలా ఊరిపోతే ఎలా?’’ అని విసుక్కుంది.

‘‘ఊరిపోలేదు, ఉబ్బి పోలేదు.. ఊపిరి పీలుస్తున్నానంతే..’’ రాంపండు సంజాయిషీ చెప్పుకున్నాడు. ‘‘కాస్సేపు ఆపితే చచ్చిపోతావా? అయినా యీ పీపా నీదా?’’ ‘నీదా, నీ బాబుదా?’ అన్న ధ్వనితో ప్రశ్న వెలువడినా రాంపండు ఓపిగ్గా ‘‘నాది కాదు, మాది పక్కిల్లు. ఈ పీపా ఓ కవి గారిది. పేరు తిక్కన. పేరుప్రభావం వలన కాస్త తిక్కమనిషి. మనిద్దరం వాదించుకుని అతని దృష్టిని ఆకర్షిస్తే యిద్దర్నీ తరిమేయ గలడు.’’ అని నచ్చచెప్పాడు. ఇంకో పది నిమిషాల తర్వాత పరిస్థితులు చక్కబడినట్టు సంకేతాలు వెలువడ్డాక యిద్దరూ బయటపడడం, రాంపండు మరో గెంతుతో సొంత యింటి కాంపౌండులో దూకి ఆ పై మంచం మీదకు వాలడం జరిగాయి.

మర్నాడు పొద్దున్న ఆలస్యంగా లేచి డ్రస్సు వేసుకున్నాక కూడా రాంపండు ఆఫీసుకి వెళదామా వద్దా అన్న ఆలోచనలో ఊగిసలాడుతూండగా ఊహ ఊరి నుంచి వచ్చింది. వస్తూనే ‘‘విన్నావా డియర్‍, ఆ పక్క యింట్లో గాంబ్లింగ్‍ జరుగుతోందట. రాత్రి పోలీసులు వచ్చారట. నానా హంగామా జరిగిందట. కాలనీ అంతా గోలగోల, టాక్సీ దిగుతూండగానే సూర్యకాంతమ్మగారు చెప్పింది...’’ అంది. ‘‘..ఓహో అలాగా, నేను రాత్రంతా మొద్దునిద్ర పోయాను. నాకేం తెలియదు..’’ అనేసి రాంపండు ఆఫీసుకి పరిగెట్టాడు. ఆఫీసుకి వచ్చినా వెయ్యి రూపాయలు మళ్లీ ఎలా సంపాదించాలా అన్న చింత అతన్ని వదిలిపెట్టలేదు. తలకాయనొప్పి అంటూ కుబేరరావు ఆఫీసుకి రాకపోవడం అతనికి లాభించింది. ఎలాగోలా పని ముగించి యింటికి వచ్చిపడ్డాడు.

ఇంటికి రాగానే ఊహ అతన్ని ఎదుర్కొంది. ఆమె ఆయుధం - జస్ట్ ఓ కాగితమ్ముక్క! అక్షరాలతో వ్యాపారం చేసే ఆమె మాటల్ని యీటెలుగా చేసి సూటిగా విసిరింది. ‘‘నిన్న రాత్రి తమరెక్కడున్నారో..?’’ అని. వర్షపు చినుకులను తప్పించుకుంటూ ముందుకు సాగే నకులుణ్ని తలచుకుంటూ రాంపండు ‘‘నిన్న రాత్రి.. అంటే.. నిన్నేగా.. ఇరవై నాలుగు గంటల క్రితం.. అంటే గురువారం రాత్రి.. అంటే తెల్లవారితే శుక్రవారం అనగా..’’

ఈటెలు విసిరేవారికి ఓపిక తక్కువ! ‘‘..నేను గుర్తు చేస్తా పట్టండి. తమరు అర్ధరాత్రి దాటాక పోలీసుల బారి నుండి తప్పించుకుని పారిపోతూన్నారు. అంతకు కొన్ని నిమిషాల క్రితం ఓ గ్యాంబ్లింగ్‍ ప్లేస్‍లో సప్తవ్యసనాల్లో ఒకటైన జూదం ఆడుతున్నారు...’’ ‘‘ఎవరు నేనా!? జూ..ద..మా!?’’ స్వయంగా సంపాదకుడైన రాంపండు మరిన్ని ఆశ్చర్యార్థకాలు వేసినా ఫర్వాలేదనుకున్నాడు. ఓపిక హరించిన ఊహ ఆయుధాన్ని శత్రువుపై విసిరేసింది. రాంపండు ఉత్తరం చదివాడు. అది కవి తిక్కన రాసినది. ‘‘మేడమ్‍, పోలీసుల బారినుండి తప్పించుకోవడానికి మీ ఆయన పడిన అవస్థ చూస్తే జాలిపడుతూనే, ఆయనా, యింకో సొట్ట బుగ్గల అమ్మాయి నా పీపాలో దాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ క్లబ్బు యిక్కణ్నుంచి ఎత్తేసేవరకు నేను పోలీసులకు ఫిర్యాదులు చేస్తూనే వుంటాను. అందువలన వచ్చేసారి మీ ఆయన దాక్కోవాలనుకుంటే మీ కాంపౌండులో పీపాలోనే దాక్కోమనండి...’’

అప్పటిదాకా నిట్రాయిలా వున్న రాంపండు వెన్నెముక చీలిన వెదురుబద్దలా అయిపోయీంది. వంగిపోయి, లొంగిపోతూన్న సమయంలో బుజ్జిగాడి ఆయా మేడమీదనుంచి పరిగెట్టుకుంటూ వచ్చింది. ‘‘అమ్మా, అమ్మా.. బుజ్జి..’’ అంది ఒగరుస్తూ. రాంపండులోని తండ్రి, ఊహలోని తల్లి ఏకముహూర్తంలో మేల్కొన్నారు. ‘‘ఏమైందేమైంది?’’ అన్నారు.

‘‘అ..త్‍..త్త.. అ..త్‍..త్త.. బుజ్జిబాబు ‘అత్త’ అంటున్నాడమ్మా..’’ ఉత్తరక్షణంలో ఊహ మెట్లమీద ఎగురుతూ అదృశ్యమై పోయీంది. పిల్లవాడి తొలిపలుకులు చెవులారా వినాలని ఏ తల్లికి వుండదు?

అ..త్త.. అనే రెండు అక్షరాల్లో ఉరికంబం ఎక్కబోతున్న వ్యక్తిని కాపాడే శక్తి వుందని ఎవరైనా చెప్తే రాంపండు నమ్మేవాడు కాడు. అతని మిత్రుడు అనంత్‍ ఆ రెండు అక్షరాలనూ డబుల్‍బారెల్‍ గన్‍గా వర్ణిస్తాడు కూడా. కానీ ఆ రోజు ఆ రెండు అక్షరాలు రాంపండుకి పునర్జన్మ నిచ్చాయి. ‘ఉంచుకో.. ప్రేమ పంచుకో’ గేయాన్ని రాయడానికి ఉపయోగించిన కల్పనాశక్తిని పునరుజ్జీవింపచేసి లొసుగులు లేని కథను తయారుచేయడానికి అతను ఉపక్రమిస్తుండగానే తలుపు తీసుకుని వచ్చిన ఓ యిద్దరు అతనికి అంతరాయం కలిగించారు. వచ్చినవారు కుబేరరావు, దేవి. కుబేరరావు మొహం బాగా అలిసినట్టుగా, మాడినట్టుగా వుంది. దేవి మొహం చిటపటలతో మొటమొటలాడుతోంది. వస్తూనే ‘‘హలో, రాంపండూ.. మేం యిలా రావడం మీకేం యిబ్బంది కాదు కదా...’’ అన్నాడు రావు. తనకున్న అతి తక్కువ వ్యవధిని హరిస్తున్న జంటపై కోపాన్ని అణుచుకుంటూ ‘‘అబ్బే.. అయినా మీకు తలనొప్పి అన్నారు..’’ అన్నాడు రాంపండు.

‘‘అవునవును. రాత్రి నిద్ర తక్కువ కావడంతో తలనొప్పి పట్టుకుంది. నిన్నరాత్రి మనిద్దరం బాగా పొద్దుపోయేదాకా క్లబ్బులో కూర్చుని డిస్కస్‍ చేశాం కదా. దాంతో నిద్ర సరిపోలేదు. మా ఆవిడకు చెప్తే నమ్మటం లేదు. మీకు రాంపండుతో అంత రాచకార్యాలేముంటాయ్‍ అంటోంది. నువ్వేనా కాస్త చెప్పు...’’ అన్నాడు కుబేరరావు.

నేపథ్యంలో వయోలిన్లు వాయిస్తున్నట్టు, గాలిలో గులాబీ అత్తరు వ్యాపించినట్టు అనిపించింది రాంపండుకి. ‘‘..దీనిలో చెప్పాల్సిందేముంది? మనిద్దరం క్లబ్బులోనే కదా కూర్చున్నాం. పత్రికలో తీసుకురావల్సిన మార్పుల గురించి, ఆఫీసు స్టాఫ్‍ను ఎలా తీర్చిదిద్దాలో చర్చించడానికి అదే అనువైన చోటనుకున్నాం...’’

‘‘...కరక్ట్.. హాట్‍ డిస్కషన్స్‌లో గడియారాలు చూసుకునే అలవాటు యిద్దరికీ లేదు..’’

‘‘..అవునవును. నా గేయానికి యివ్వవలసిన పారితోషికం గురించి కూడా అప్పుడే చర్చించాం...’’ కుబేరాల రావుతో బేరమాడేందుకు యిదే అనువైన సమయం అనుకున్నాడు రాంపండు.

‘‘...దాని గురించి మాట్లాడామా!?’’ ఆశ్చర్యపడ్డాడు రావు.

‘‘...భలేవారే, అలా ఎలా మర్చిపోయారు? దానికి అక్షరలక్షలిచ్చినా ఫర్వాలేదని మీరన్నారు. అబ్బే అంతెందుకు వెయ్యి చాలన్నా...’’

‘‘..అవునవును, అదే పదివేలన్నావు కూడా నువ్వు..’’ ఒప్పుకోక తప్పలేదు రావుకి.

‘‘..నిజం నిజం, యిప్పుడే యిచ్చేస్తే మహాప్రసాదం అనుకుంటాను. వెధవది, మళ్లీ రసీదులూ గోలా ఎందుకు?’’

కుబేరరావు వెయ్యి రూపాయల నోటు రాంపండుకి అందిస్తున్న సమయంలోనే ఊహ మెట్లు దిగి పరుగుపరుగున వచ్చింది. ‘‘హలో మీరా? దేవీ, తెలుసా? బుజ్జిగాడు ‘అత్త’ అంటున్నాడు రా, రా..’’ అంది. తొలిసారి టాకీ సినిమా చూసిన మూకీ సినిమా ప్రేక్షకురాల్లా సంభ్రమాశ్చర్యాలతో నిండి వుందామె. భర్త సంపాదించుకున్న సాక్ష్యంతో ప్రసన్నురాలైన దేవి యి వార్త విని ‘‘నిజంగానా!?’’ అంటూ ఆనందించింది. ‘‘ఒట్టు, రా రా.. నువ్వే విందువుగాని..’’ అంటూ పైకి వెళ్లబోతున్న ఊహను రాంపండు ఆపాడు. ‘‘ఊహా, ఒక్క మాట..’’ ఊహ మెట్టుమీద ఆగి వెనక్కి తిరిగి చూసి ‘‘అబ్బ, త్వరగా చెప్పండి. అయినా మీరూ పైకి రాకుండా కిందేం చేస్తున్నారు? ఓహో, వీళ్లు వచ్చారనా..?’’ అంది.

‘‘.. వస్తున్నా, బై ది వే, నువ్వు పైకి వెళ్లబోయే ముందు ఓ ప్రశ్న అడిగావు గుర్తుందా? నిన్న రాత్రి నేను ఎక్కడున్నానని. ఇదిగో నీ ఎదురుగుండానే వుంది సాక్ష్యం. అడుగు. నేనూ, ఆయనా ఆఫీసు విషయాలు చర్చిస్తూ క్లబ్బులో కూర్చున్నాం. ఇంటికి వచ్చేసరికి లేటయింది. మరి ఆ తిక్కశంకరయ్య ఎవర్ని చూసి ఎవరనుకున్నాడో ఏమో..’’

‘‘అవును ఊహా.., ఇద్దరూ కలిసి పత్రికను ఎలా బాగుచేయాలో తెగ ఆలోచించారట. నేనూ అర్థం చేసుకోక మా ఆయన్ని విసిగించాను..’’ అంది దేవి.

ఊహ రాంపండు కళ్లలోకి గాఢంగా చూసింది. కళ్లల్లో నీళ్లు ఉబికి వస్తూండగా ‘‘సారీ’’ అంటూ అతని చేతిని నొక్కింది. అంతలోనే కోపం తెచ్చుకుని ‘‘ఆ తిక్కన గాడి తిక్క కుదురుస్తా, కేసు పెడతా..’’ అంది.

‘‘వద్దు వద్దు వాడి పాపాన వాణ్ని పోనీ.. బైదివే, బుజ్జిగాడు అత్తా అన్న సందర్భంగా నేను ప్రామిస్‍ చేసిన వెయ్యి యిదిగో. జాగ్రత్తగా బ్యాంకులో వేసేయ్‍..’’ అన్నాడు రాంపండు భార్య బుగ్గ నిమురుతూ.

ఆ డబ్బు తీసుకుని, పులకించిపోతూ ఊహ దేవితో సహా మేడపైకి వెళ్లింది. రాంపండు రావుకేసి చూసి ‘‘అవునూ, నిన్నరాత్రి మీరెక్కడున్నారు సార్‍?’’ అన్నాడు. కుబేరరావు ‘‘నీతోనే వున్నాను కదా, అవునూ, నువ్వెక్కడున్నావ్‍ బాబూ?’’ అన్నాడు వెక్కిరింతగా.

‘‘అదేమిటి, మీతోనే కదా సార్‍. రండి.. మా బుజ్జిగాడి పలుకులు విందాం. టైమింగ్‍ తెలిసున్న నటుడు అంటారు కానీ మా వాడు, గొప్ప చెప్పుకుంటున్నా ననుకోకండి, టైమింగ్‍ తెలిసిన పసివాడండీ... సరైన టైములో సరైన డైలాగు చెప్పి సిట్యుయేషన్‍ పండించాడు..’’ చెప్తూనే వున్నాడు రాంపండు. (పి జి ఉడ్‍హౌస్‍ రాసిన ‘‘ది వర్డ్ ఇన్‍ సీజన్‍’’ కథ ఆధారంగా)

(వచ్చే నెల మూడో బుధవారం మరో హాస్యకథ)

- ఎమ్బీయస్‍ ప్రసాద్‍ (మే 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?