Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : నల్లధనం వెల్లడి.. ఏ మేరకు?

ఎమ్బీయస్‌ : నల్లధనం వెల్లడి.. ఏ మేరకు?

నల్లధనం చలామణీ అరికట్టడానికి ప్రభుత్వయంత్రాంగాన్ని ప్రభావవంతంగా ఉపయోగించడం ఉత్తమ పద్ధతి. అది చేతకాని పక్షంలో ఎగవేతదారులనే 'బాబ్బాబూ, ఎంత ఎగ్గొట్టేరో మీరే చెప్పేసి, పన్ను కట్టేయండి, మిమ్మల్నేం చెయ్యం, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం' అని అడగడం మరో పద్ధతి. 1997లో అప్పటి యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం రెండో పద్ధతి అవలంబించి దానికి వాలంటరీ డిస్‌క్లోజర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (విడిఐయస్‌) అని పేరు పెట్టింది. 1997 స్కీము తర్వాత కొందరు ఆడిటర్లు సుప్రీం కోర్టులో కేసు వేశారు - యిలాటి పథకం ద్వారా ఎగవేతదారులను, నిజాయితీగా పన్ను కట్టేవారిని ఒకే గాటన కట్టడం తప్పని, ఇలా అయితే నిజాయితీపరులు కూడా ఎప్పుడో ఒకప్పుడు యిలాటి పథకం వస్తుందని ప్రస్తుతానికి పన్ను కట్టడం మానేస్తారనీ! కోర్టు ఆ వాదనను ఆమోదిస్తూ యిలాటి పథకాలను యికపై చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్నాళ్లూ మరే ప్రభుత్వమూ ఆ జోలికి పోలేదు. ప్రభుత్వాధికారుల చేత సమర్థవంతంగా పని చేయించి విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించి, స్వదేశంలో దాచుకున్న నల్లధనాన్ని వెలికితీస్తారని అనుకున్న నరేంద్ర మోదీకి కూడా రెండో పద్ధతే ఉత్తమంగా తోచడం ఒక వింత. 'న ఖావూంగా, న ఖానే దూంగా' అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన మోదీ ఎగవేతదారులను నల్లధనంలో కొంత మేరకు తినడానికి అవకాశం కల్పిస్తూ,  కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి 'ఇన్‌కమ్‌ డిక్లరేషన్‌ స్కీమ్‌' (ఐడియస్‌), 2016 ప్రవేశపెట్టారు. మధ్యలో 19 ఏళ్లగా ఏ ప్రభుత్వం కల్పించని వెసులుబాటు నల్లధనికులకు కల్పించి వ్రతం చెరుపుకున్నారు. మరి ఫలం దక్కిందా?

పథకం సఫలమైందో లేదో చూడాలంటే 19 ఏళ్ల క్రితం నాటి స్కీము ఫలితాలతో పోల్చి చూడాల్సిందే. అప్పుడు రూ. 33 వేల కోట్లు బయటపడింది. ఇప్పుడు రూ.65,250 కోట్లు బయటపడింది. 19 ఏళ్లలో పెరిగిన ధరల బట్టి చూస్తే రూ.33 వేల కోట్ల ప్రస్తుత విలువ రూ.116 వేల కోట్లట. దానితో పోలిస్తే యీ 65 వేల కోట్ల యీ మొత్తం చాలా తక్కువనే (56% మాత్రమే) ఒప్పుకోవాలి. దానికి కారణం ఏమిటంటే అప్పుడు 4.75 లక్షల మంది తమ నల్లధనాన్ని ప్రకటించారు. యిప్పుడు దానిలో 7వ వంతు మంది సరిగ్గా చెప్పాలంటే 64,275 మంది మాత్రమే డిక్లేర్‌ చేశారు. అంటే అప్పటి కంటె నల్లధనంతో వ్యవహరించేవాళ్లు ఏడో వంతు మంది మాత్రమే వున్నారనుకోవాలా? నాన్సెన్స్‌. నిజానికి అప్పట్లో ధనికుల వద్ద మాత్రమే నల్లధనం వుందనుకుంటే, యిప్పుడు రియల్‌ ఎస్టేటు లావాదేవీల కారణంగా మధ్యతరగతి వారి వద్ద కూడా నల్లధనం వచ్చి చేరుతోంది. మరి యింతమందే వెల్లడించారేం? అంటే ప్రభుత్వం ఏమీ చేయలేదులే అన్న ధీమానా?

పాత స్కీములో రూ.9,584 కోట్లు ప్రభుత్వానికి పన్నుగా లభించింది. పన్ను రేటు కంపెనీలకు 35%, వ్యక్తులకు 30% అన్నారు. ఈ సారి పన్ను 45% (30% పన్ను ప్లస్‌ 7.5% కృషి కల్యాణ్‌ సర్‌చార్జి ప్లస్‌ 7.5% పెనాల్టీ) అన్నారు. దాని వలన ప్రభుత్వానికి పన్నుగా, పెనాల్టీగా లభించేది రూ.31,250 కోట్లు. తమ ఆదాయం వెల్లడించిన వారు పన్నులో కనీసం 25% నవంబరు 30లోగా కట్టాలి. మరో 25% 2017 మార్చిలోగా, తక్కిన 50% 2017 సెప్టెంబరులోగా కట్టాలి. పన్ను, పెనాల్టీ రేట్లు అధికంగా వుండడం చేత కూడా స్పందన అంత బాగా లేదని కొందరు పరిశీలకులు అంటున్నారు. 1997 స్కీములో 1987కు ముందు కొన్న ఆస్తులపై కొన్నప్పటి మార్కెట్‌ వేల్యూని ఆమోదించారు. అంటే స్థిరాస్తుల ప్రస్తుత మార్కెట్‌ విలువ బట్టి కాకుండా అవి కొన్న తేదీ నాటి రేటు బట్టి విలువ కడతారు. రాజకీయ నాయకులు ఎన్నికల కమిషనర్‌ ముందు యిచ్చే అఫిడవిట్‌లు యిలానే వుంటాయి. 'అయితే అప్పటి రేటుకి యిప్పుడు అమ్మేయండి, కొని అక్కడ మా ఆఫీసు పెట్టుకుంటాం' అని యిన్‌కమ్‌టాక్స్‌ డిపార్టుమెంటు వాళ్లు అంటే భలే మజాగా వుంటుంది. బయట చెప్పుకునేటప్పుడు 'అమ్మితే అంత వస్తుంది, యింత వస్తుంది' అని ప్రస్తుత మార్కెటు విలువలో మాట్లాడతారు. అఫిడవిట్‌ యిచ్చేటప్పుడు యిలా పాత రేట్లలో యిస్తారు. ఏది ఏమైతేనేం, 1997 స్కీములో అది అనుమతించారు కాబట్టి స్పందన బాగుందట. ఈ సారి కరక్టుగా ప్రస్తుత మార్కెట్‌ వేల్యూ ప్రకారం అనడంతో నల్లధనికులు నీరసించారు.

ఈ స్కీముకి ముందు కితం ఏడాది మోదీ సర్కారు దాచేసిన ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆదాయాన్ని బయటపెట్టే స్కీము ప్రవేశ పెట్టి మూణ్నెళ్ల గడువిస్తే కేవలం 638 మంది స్పందించారు. రూ. 4,147 కోట్లు డిక్లేర్‌ చేసి 30% పన్నుగా ప్లస్‌ 30% పెనాల్టీగా రూ.2,488 కోట్లు కట్టారు. అందుకని యీ స్కీమునైనా ఎలాగైనా విజయవంతం చేయాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరక్ట్‌ టాక్సెస్‌ అధికారులు విపరీతంగా శ్రమించారు. బిల్లుగిల్లూ వుండని రోడ్డు పక్కన వుండే ధాబాల దగ్గర్నుంచి, ఓ మాదిరి కంపెనీల దాకా అన్ని స్థాయిల వాణిజ్యసంస్థలపై యిన్‌కమ్‌ టాక్సు దాడులు నిర్వహించి, యిప్పటికైనా నల్లధనాన్ని వెల్లడించకపోతే డిపార్టుమెంటు వూరుకోదనే సంకేతాలు పంపారు. పాన్‌ నెంబరు యివ్వకుండా అధిక మొత్తంలో లావాదేవీలు చేసిన 7 లక్షల మందికి నోటీసులు పంపారు. రైళ్లల్లో, ఎయిర్‌పోర్టుల్లో, బస్సుల్లో, పత్రికలలో, రేడియోలో, టీవీలో, బయట హోర్డింగులలో అన్ని చోట్లా స్కీము గురించి ప్రకటనలిచ్చారు. అయినా ఆగస్టు రెండో వారం దాకా రూ.4 వేల కోట్లు మాత్రమే వెల్లడయింది. సాధారణంగా యిలాటి వాటిల్లో ఆఖరి నిమిషం దాకా తటపటాయిస్తూనే వుంటారు కాబట్టి తక్కిన 61 వేల కోట్లు కూడా చేరి సెప్టెంబరు నెలాఖరుకి 65 వేల కోట్లకు చేరింది.

నల్లధనం వెల్లడించిన తర్వాత వారిని ఏమీ చేయమని, వారి పేర్లు బయటపెట్టమని ప్రభుత్వం హామీ యిచ్చి, దాన్ని నిలబెట్టుకోకపోతే యిలాటి స్కీములకు అర్థమే వుండదు. అయినా పేర్లు బయటపెట్టమని ప్రభుత్వాన్ని కోరుతూ జగన్‌ రాశారు. దానికి కారణం పదివేల కోట్ల డిక్లరేషన్‌ చేసినది మీరంటే కాదు, మీ బినామీయే అంటూ బాబు, జగన్‌ చేసుకున్న పరస్పర ఆరోపణలే. ఏ ప్రాంతం నుంచి ఎంత వసూలైందో మాత్రం ప్రభుత్వం ఎందుకు చెప్పిందని, మాట తప్పిందని గొడవ బయలుదేరింది. అది ఎలా బయటకి వచ్చిందో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ''కొత్త పలుకు''లో రాశారు. ఈ స్కీము కింద ఒక వ్యక్తి పదివేల కోట్ల ఒకేసారి డిక్లేర్‌ చేయడంతో కింది అధికారులు యిది నిజమా, కాదా అని కంగారుపడి యిన్‌చార్జిగా వున్న ఉన్నతాధికారికి ఫోన్‌ చేసి ఏం చేయాలని అడిగారట. ఆయన ఏ వూరి నుంచి ఆ ఆఫర్‌ వచ్చింది అని అడిగితే 'హైదరాబాదు' అని చెప్పారట. '25% పన్ను తక్షణం కట్టమని అడగండి. కడితే నిజమే అనుకోవచ్చు' అని వాళ్లతో చెప్పి, ఎదురుగా వున్న విలేకరులు ఏమిటేమిటి అని అడిగితే సంగతి యిదీ అని నోరు జారాడట. అంతే! హైదరాబాదు నుంచి ఒక వ్యక్తి అనగానే అది జగనే అని టిడిపివారు కథలు అల్లేశారు. దానికి జగన్‌ ఓవర్‌ రియాక్ట్‌ అయ్యారు. 

మళ్లీ స్కీము విషయానికి వస్తే - టెక్నాలజీ విపరీతంగా పెరిగి, ప్రభుత్వం ప్రతిదానికి ఆధార్‌, ప్యాన్‌ లింకు చేస్తున్న యీ రోజుల్లో తమ నల్లధనం బయటపడుతుందేమో భీతి లేకుండా తక్కువ మందే యీ సౌకర్యాన్ని వినియోగించుకున్నారంటే దాని అర్థం - యీ ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వం కానీ తమనేమీ చేయదన్న ధీమా! లంచగొండులను, టాక్సు ఎగవేతదారులను అక్కున చేర్చుకుంటూ వాళ్లకు రాయితీలు, క్షమాభిక్షలు, పదవులు కట్టబెడుతున్న బిజెపి తన పాలసీని పునరాలోచించుకోవాల్సిన తరుణం యిది. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?