Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: 'నీవు నేర్పిన విద్యయే, మమతమ్మా'

'పరిశ్రమల కోసమేనా సరే, పంటభూములు తీసుకోకూడదు' అని వాదించి, ఉద్యమించి మమతా బెనర్జీ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చింది. అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం 'మేమేదైనా విలాస భవనాలకో, ప్రభుత్వ కార్యాలయాలకో అడుగుతున్నామా? పరిశ్రమలు రాకపోతే నిరుద్యోగం ఎలా పోతుంది?' అని ఎంత మొత్తుకున్నా ఆమె వినలేదు, ప్రజలను రెచ్చగొట్టడం మానలేదు. ఈ రోజు అలాటి పరిస్థితి ఆమెకు ఎదురైతే వెనక్కాల ఎవరో మావోయిస్టులు వుండి రెచ్చగొడుతున్నారు అని చెప్పుకుంటోంది. కానీ రుజువులు చూపించలేకపోతోంది. పవర్‌ ప్రాజెక్టు కోసం పంటభూములు సేకరించిన దక్షిణ 24 పరగణాల జిల్లాలో భంగార్‌ గ్రామంలో 2016 నుంచి నవంబరు ఆందోళన జరుగుతోంది. జనవరి మూడోవారంలో పోలీసు కాల్పులు జరిగి యిద్దరు చనిపోయారు. వాళ్లెందుకు చచ్చిపోయారో కానీ పోలీసులు కాల్పులు జరపనేలేదు అంటోంది మమతా. 

పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు భంగార్‌లోని కాశీపూర్‌ ప్రాంతంలో ఒక పెద్ద పవర్‌ గ్రిడ్‌ కడదామనుకున్నారు. అది సాగర్‌దిఘీ థర్మల్‌ పవర్‌ ప్లాంటు నుంచి ఫరకా యూనిట్‌ నుంచి విద్యుత్‌ తీసుకుని హై టెన్షన్‌ వైర్ల ద్వారా కలకత్తాకు, ఈశాన్య రాష్ట్రాలకు, బిహార్‌లోని పూర్ణియా జిల్లాకు విద్యుత్‌ సరఫరా చేయాలని ప్లాను. దానికై 23 ఎకరాల భూమి సేకరించారు. గ్రామస్తులకు యీ ప్లాంట్‌ గురించి పూర్తి వివరాలు చెప్పలేదట. నిర్మాణం మొదలయ్యాక 'మీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా మెరుగు పరచడానికి కడుతున్నామని చెపితే ఏదో ఎలక్ట్రిక్‌ సబ్‌-స్టేషన్‌ వస్తుందనుకున్నాం. ఇప్పుడు యింత పెద్ద ప్రాజెక్టు అంటే హై టెన్షన్‌ వైర్లు అవీ మా ప్రాంతాల మీదుగా వెళతాయి. దాని వలన మా ప్రాణాలకు, భూములకు, పశువులకు, వాతావరణానికి ఎలాటి హాని జరుగుతుందో, ఏయే అపాయాలు వుంటాయో పూర్తి అధ్యయనం చేసేదాకా యిది కట్టడానికి వీల్లేదు.' అనసాగారు గ్రామస్తులు. 

20 వేల మంది జమీ(న్‌), జీవికా, పరివేశ్‌ ఓ వస్తుతంత్ర (పర్యావరణం) రక్షా కమిటీ పేర ఒక సమితిలా ఏర్పడి ఉద్యమించసాగారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా ముందుకు సాగడంతో ఒళ్లు మండి పవర్‌ కార్పోరేషన్‌ ఉద్యోగులను ప్రాజెక్టు స్థలాన్నుంచి తరిమివేసి రోడ్డుకు అడ్డంగా అవరోధాలు పెట్టారు. (ఫోటో చూడండి)  దాంతో పోలీసులు ఉద్యమనాయకుడైన కాలూ షేఖ్‌ను అరెస్టు చేశారు. అది వారిని మరింతగా మండించింది. పోలీసులపై రాళ్లు రువ్వారు. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం జరిగాయి. పోలీసులు, జనం యిద్దరూ గాయపడ్డారు. కాల్పుల్లో యిద్దరు మరణించడంతో మమతా బెనర్జీ మేల్కొని తన విద్యుత్‌ మంత్రి శోభన్‌దేవ్‌ చట్టోపాధ్యాయను పవర్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌తో మాట్లాడి పని ఆపించమని చెప్పింది.

గ్రామీణులు స్వచ్ఛందంగా భూమి యిచ్చారని కానీ సిపిఎంఎల్‌ (రెడ్‌ స్టార్‌) అనే మావోయిస్టు సంస్థ అక్కడ చురుగ్గా వ్యవహరిస్తూ ఏడాదిగా కార్యకర్తలను సమీకరిస్తూ రైతులని రెచ్చగొడుతోందని పోలీసులు అంటున్నారు. రెడ్‌స్టార్‌ కేరళలో వుంది తప్ప బెంగాల్‌లో దానికి ఉనికే లేదు. 2014 లోకసభ ఎన్నికలలో దాని తరఫున శిక్షా సేన్‌రాయ్‌ అనే ఆమె దమ్‌దమ్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో నిలబడితే 1544 ఓట్లు వచ్చాయి. మరి వాళ్లు యింత చేయగలరా? అని అడిగితే రెండున్నరేళ్లలో వాళ్లు చాలా పుంజుకున్నారు. అంటున్నారు పోలీసులు, ఆ మేరకు యింటెలిజెన్సు రిపోర్టులున్నాయా అంటే తెల్లమొహం వేస్తున్నారు. నిజానికి యిదంతా తృణమూల్‌లో అంతఃకలహాల వలననే జరుగుతోందని కొందరంటున్నారు. 

ఆ గ్రామంలో ముస్లిం జనాభా ఎక్కువ. అక్కడ నుంచి కమ్యూనిస్టు పార్టీ తరఫున అబ్దుర్‌ రజాక్‌ మొల్లా అనే నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చాడు. అతను తృణమూల్‌ పార్టీలో గత ఏడాదే చేరాడు. అతనికి నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థిగా అరబుల్‌ ఇస్లామ్‌ వున్నాడు. అతను మొదటి నుంచీ తృణమూల్‌ పార్టీ నాయకుడు. 2014లో తన ప్రత్యర్థిని హత్య చేసినందుకు పార్టీ అతన్ని బహ్కిరించింది. 2015లో అరెస్టు చేయించింది. 2016 జనవరిలో మళ్లీ పార్టీలో చేర్చుకుంది. ఈ రకంగా అరబుల్‌, రజాక్‌ యిద్దరూ తృణమూల్‌లోనే తేలారు. అవతలి వారి కారణంగా తాము ఎదగలేకపోతున్నామని యిద్దరికీ బాధ వుంది. రజాక్‌ కమ్యూనిస్టు పార్టీలో మంత్రిగా వున్నపుడే పంటభూములను సేకరించడాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు కూడా అదే పంథాలో వున్నాడు. అరబుల్‌ రైతుల నుండి తక్కువ ధరలకు బలవంతంగా భూమి సేకరించాడని అంటారు. ఇప్పుడు వాళ్లు తిరగబడుతున్నారు. రజాక్‌ ఒక్కణ్నీ చర్చల్లో దింపితే రైతుల పక్షాన మాట్లాడతాడని, అరబుల్‌ యిమేజికి దెబ్బ వస్తుందని భయపడి మమతా బెనర్జీ అతనా నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా ముకుల్‌ రాయ్‌ అనే మరో మంత్రితో కలిపి మరీ పంపింది. మర్నాటి కల్లా అతని స్థానంలో అరబుల్‌, ముకుల్‌ రాయ్‌ వెంట తిరగసాగాడు. అదేమంటే రజాక్‌ ఉద్యమకారుల గురించి ఏదో వ్యాఖ్యలు చేశాడు అందుకని తప్పించాం అంటున్నారు. ఇది చివరకు ఎటు తిరుగుతుందో చూడాలి.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2017)