Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : రాజీవ్‌ హత్య - 60

జులై 23 - ''డెక్కన్‌ హెరాల్డ్‌''లో ఒక వార్త వచ్చింది. ''..రాజీవ్‌ హత్యకేసును యీ సిట్‌ దళాలు భ్రష్టు పట్టించాయి' అని ప్రధానమంత్రి పివి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కాంగ్రెసు పార్టీ కార్యవర్గ సమావేశం విమర్శించింది.'' అని. స్మగ్లర్లతో సంబంధాలు నెరపుతూ షణ్ముగాన్ని విడిపించడానికి ప్రయత్నించిన ఒక  స్థానిక రాజకీయ నాయకుడు ''రాజీవ్‌ గాంధీ హత్యలో నిందితుడు చంపబడ్డాడా?'' అంటూ చేసిన విమర్శలు తమిళ పత్రికలలో వచ్చాయి. ఎల్‌టిటిఇ ఏ సంబంధమూ లేనట్లు, షణ్ముగమే రాజీవ్‌ హంతకుడన్నట్లు, విషయం బయటకు రాకుండా సిట్‌ అతన్ని మట్టుపెట్టిందన్నట్లు కొందరు అర్థాలు తీశారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ''..సిట్‌ దళంలో మార్పులు తథ్యం'' అంటూ వార్త వచ్చింది. అదే రోజు పార్లమెంటులో జరిగిన చర్చలో జెఠ్మలానీ సిట్‌ను సమర్థిస్తూ వాదించారు. సిట్‌ ఊపిరి పీల్చుకుంది.

xxxxxxxxxxxxxxxxxxxxx

రాజీవ్‌ హత్యలో వారి పాత్ర బయటపడ్డాక శ్రీలంకలో ఎల్‌టిటిఇ పరిస్థితి మారిపోసాగింది. ఇన్నాళ్లూ తమిళనాడులో ఎల్‌టిటిఇ పట్ల సానుభూతి వుండేది. కానీ రాజీవ్‌ హత్య తర్వాత భారతీయ తమిళులు ఎల్‌టిటిఇని అసహ్యించుకోసాగారు. జయలలిత ప్రభుత్వం టైగర్లను వెళ్లగొట్టసాగింది. శ్రీలంకలో టైగర్లను వంచడానికి యిదే అదను అనుకుంది శ్రీలంక సైన్యం. 1987లో భారత శాంతిసేన జాఫ్నా పట్టణం నుంచి టైగర్లను పారదోలింది. శాంతి సేన ఉపసంహరణ అనంతరం టైగర్లు మళ్లీ దానిపై అదుపు సాధించారు. మారిన పరిస్థితుల్లో శ్రీలంక సైన్యం జూన్‌ 15 నుంచి 'ఆపరేషన్‌ వన్ని విక్రమ' పేర ఉత్తర, తూర్పు ప్రాంతాలకు సైన్యం వచ్చి టైగర్ల స్థావరాలను పట్టుకోసాగింది. సింహళ తీవ్రవాద సంస్థ జెవిపి (జనతా విముక్తి పెరమున)ను నాశనం చేశాక దక్షిణాన వుంచిన సింహళ సైన్యం ఫ్రీ అయింది. దాన్ని తూర్పువైపుకి మరలించారు. 1987 తర్వాత సైన్యం సంఖ్య 15 వేలు పెరిగింది కూడా. ఇండియాలో ఎదుర్కుంటున్న క్లిష్ట పరిస్థితుల కారణంగా, రాజీవ్‌ హత్య పట్ల అంతర్జాతీయంగా తమ సంస్థపై పెల్లుబికిన ఏహ్యభావం వలన ఎల్‌టిటిఇ యిబ్బందుల్లో పడిందని, అందుకే తన రాజకీయ విభాగం - పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ లిబరేషన్‌ టైగర్స్‌ను మూసివేసిందని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సైన్యం రెట్టించిన ఉత్సాహంతో వావునియా, మన్నార్‌ ప్రాంతంలో మాటు వేసి ప్రధాన సరఫరా మార్గాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంటోంది.

సైన్యం స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి ఎల్‌టిటిఇ ఒక ప్రణాళిక రచించింది. మధ్య శ్రీలంక సురక్షితంగా వున్న భావంతోనే సైన్యాన్ని యిక్కడ మోహరిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ప్రమాదాన్ని సృష్టించి, కొంత సైన్యాన్ని అటు మళ్లించాలి. అంతేకాదు, తమను తక్కువగా అంచనా వేయవద్దు అనే పాఠం చెప్పాలి. దాని కోసం రాజధాని కొలంబోలో ప్రధాని ఆఫీసుకి 100 మీటర్ల దూరంలో నిత్యం సైనికాధికారులతో కిటకిటలాడే జెఓసి (సైన్య, వైమానిక, నౌకా దళాల జాయింట్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌)పై జూన్‌ నెలాఖరులో ఆత్మాహుతి దాడి చేసింది. ఒక వ్యాను నిండా 75 కిలోల ప్లాస్టిక్‌ పేలుడు మందు కూరి ఉదయం ఆఫీసు తెరిచే సమయంలో యిద్దరు టైగర్లు ఆ భవనం గేటును ఢీకొన్నారు. 40 మంది చనిపోయారు. చుట్టూ వున్న 50 యిళ్లు శిథిలమైనాయి. 20 కార్లు నాశనమయ్యాయి. పేలుడు దెబ్బకు పెద్ద గొయ్యి ఏర్పడి భూగర్భజలం ఫౌంటెన్‌లా పైకి చిమ్మసాగింది. రాజీవ్‌ హత్య పరిశోధన చేస్తున్న సిట్‌ బృందానికి తమిళ టైగర్ల గురించి విలువైన సమాచారాన్ని యీ సెంటరే అందించింది. ఎల్‌టిటిఇ ఆగ్రహానికి యిది కూడా ఒక కారణమేమో.

ఈ దాడి జరగగానే సైన్యం కుతకుతలాడిపోయింది. టైగర్లను పూర్తిగా మట్టుపెట్టాలని ఉబలాట పడుతున్నారు. టైగర్లను ఓడించి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తమకిందే వుంచుకోవాలని, అప్పుడే తాము సాధించిన విజయానికి అర్థం వుంటుందని వాళ్లు వాదిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న టి-55 టాంకులను సైన్యం వుపయోగిస్తోంది. వాటిని ఎలా వాడాలో వారు భారతసైన్యం వద్ద తర్ఫీదు పొందారు. కానీ అధ్యకక్షుడు రణసింఘె ప్రేమదాస వాళ్ల చేతులను కట్టివేస్తున్నాడు. ఇండియా సహాయం లేకుండా టైగర్లను స్నేహంతో అదుపులోకి తేగలిగితే అంతర్జాతీయ తన ఖ్యాతి పెరుగుతుందని, దేశంలో తనకు ఎదురు వుండదనీ అతని ఆశ. అతని విధానం తప్పని టైగర్లను ఎప్పుడూ నమ్మకూడదని, వాళ్లు చేసే శాంతి ప్రయత్నాలన్నీ బోగస్‌ అని తమిళ నాయకులే హెచ్చరిస్తున్నారు.

రాజీవ్‌ హత్య తర్వాత ఎల్‌టిటిఇ బలహీనపడింది. 1991 జూన్‌ తర్వాత జాఫ్నా వెలుపల దాడులు బాగా తగ్గిపోయాయి. వారికి నగదు, ఆయుధాల, కార్యకర్తల కొరత ఏర్పడింది. అవన్నీ ఇండియాలో యిరుక్కుపోయాయి. వీటివలన సంస్థలో కీచులాటలు పెరిగాయి. కార్యకర్తలను సమీకరించడం, రాజకీయప్రచారం చేయడం వంటి కీలక బాధ్యతల నుండి గోపాలస్వామి మహేంరాజ, యోగరత్నంలను ప్రభాకరన్‌ తప్పించేసి తన దగ్గరి బంధువు బేబీ సుబ్రమణ్యంకు అప్పగించాడు. ఈ బేబీ పద్మనాభ హత్య కేసులో నిందితుడు. ఇండియా టైగర్లపై పగబట్టిందని, వారి సహకారం లేనిదే ఈలం ఒక కలగా మిగిలిపోతుందని టైగర్ల అధీన ప్రాంతాలలో వున్న తమిళ పౌరులు కూడా అనుకోసాగారు. 

ప్రేమదాస తమిళ టైగర్ల పట్ల ఔదార్యం చూపి రాజకీయంగా లాభపడదామని చూస్తున్నాడు. శ్రీలంకకు ఆర్థిక సహాయం అందించే విదేశీ రాజ్యాలు రాజకీయ సుస్థిరతను కోరుకుంటున్నాయి. తమిళులకు సమాన పౌరహక్కులు యివ్వాలని కోరుతున్నాయి. తమిళ ప్రాంతాలకు సాయపడే ముసుగులో టైగర్లను మచ్చిక చేసుకుని తన ప్రత్యర్థులను దెబ్బ తీయాలని ప్రేమదాస ప్రయత్నం. భారత శాంతిసేన టైగర్లపై పట్టు సాధించడం వలన జాఫ్నా ద్వీపకల్పంలో బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కడ నుంచి ఎస్‌టిడి, ఫాక్స్‌ వెళ్లసాగాయి. అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ప్రేమదాస నిధులు యిస్తున్నాడు. ఎల్‌టిటిఇని బహిష్కరించాలని ఇండియా నుంచి, టైగర్లు కాకుండా యితర తమిళ గ్రూపుల నుంచి ఒత్తిడి వస్తోంది. ప్రభాకరన్‌ను తమకు అప్పగించమని ఇండియా కోరుతోంది. అయితే అతన్ని సజీవంగా పట్టుకోవడం శ్రీలంక సైన్యం తరం కాదు, పైగా ప్రేమదాసకూ యిష్టం లేదు. అందుకే ఈ అభ్యర్థనలపై స్పందించడం లేదు. ఇలా చేస్తే సింహళ ప్రాంతాల్లో తన పలుకుబడి తగ్గుతుందని భయం వుంది కాబట్టి 'తూర్పు, ఉత్తర రాష్ట్రాల విలీనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు' అనే ప్రకటన యిచ్చి సింహళ మద్దతుదారులను ఊరడిస్తున్నాడు. (ప్రేమదాసతో ఆ సమయంలో స్నేహం నెరపి, తనను తాను కాపాడుకున్న ఎల్‌టిటిఇ అదను చూసి 1993 మే నెలలో మానవబాంబు సహాయంతో అప్పటికీ అధ్యకక్షుడిగా వున్న ప్రేమదాసను ఘోరంగా హత్య చేసింది. అంతకు వారం ముందు ప్రతిపక్ష నాయకుడు లలిత్‌ అతులిత మొదలి హత్య కూడా ఎల్‌టిటిఇయే చేసింది. ఈ విధంగా శ్రీలంకలో రాజకీయశూన్యం ఏర్పరచి లాభపడింది. జాఫ్నా వాసి, 23 ఏళ్ల కుమారకులసింగం వీరకుమార్‌ను ప్రేమదాస వ్యక్తిగత సేవకుడు ఇఎంపి మొహియుద్దీన్‌తో స్నేహం చేశాడు. అతని ద్వారా అన్ని వివరాలూ సేకరించి మే డే నాటి ఉత్సవం చూడడానికి అధ్యకక్షుడు తన కారు దిగగానే యితను మోటార్‌సైకిల్‌మీద దూసుకువచ్చి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్సు కమాండోల రక్షణ వలయాలు మూడింటిని ఛేదించి, ప్రేమదాసను ఢీకొన్నాడు. తను చనిపోతూ ప్రేమదాసనూ ఖతం చేశాడు. ఇలాటి చేష్టల వలన ఎల్‌టిటిఇ ఎవరూ నమ్మలేని సంస్థగా పేరుబడింది.) ( సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

mbsprasad@gmail.com

Click Here For Archives

(ఫోటోలు - కూలిన కొలంబో జెఓసి భవంతి, ప్రేమదాస) ఫోటో సౌజన్యం - ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్‌