Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : రాజీవ్‌ హత్య - 63

జులై 29 - సిట్‌ అధికారులు చెన్నయ్‌ నుండి హుటాహుటిన బయలుదేరి కోయంబత్తూరు వెళ్లి విక్కీ, రఘులను వాళ్ల అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుండి వివరాలు రాబట్టారు. డిక్సన్‌, గుణ, రఘు, విక్కీలు కోయంబత్తూరులో శంతన్‌ ఆధ్వర్యంలో ఎల్‌టిటిఇ తరఫున ఒక శిబిరం పెట్టారు. డిక్సన్‌ దగ్గరున్న వైర్‌లెస్‌, కోడ్‌షీట్‌ సహాయంతో ఎల్‌టిటిఇ కేంద్రకార్యాలయంతో సంభాషణ జరుపుతూండేవారు. సేలం లోని నిడుంచలై నగర్‌లో వున్న మరో ఎల్‌టిటిఇ శిబిరాన్ని శంతన్‌ యింకో సహాయకుడు శివందన్‌ నడుపుతూంటాడు. శంతన్‌ మామూలుగా తిరుచ్చిలోని రామలింగనగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో తన యింట్లో వుండేవాడు. మధ్యమధ్యలో వీళ్ల దగ్గరకు వచ్చి పర్యవేక్షించేవాడు. గుణ, రఘుల ప్రధాన బాధ్యత కోయంబత్తూరులో గ్రెనేడ్‌ దాడి తట్టుకునే కవచాలను తయారు చేయించడం. పెద్ద సంఖ్యలో వీటిని తయారు చేయించాక, వ్యానుల్లో, మారుతి జిప్సీలలో వేదారణ్యం దాకా తరలించి, అక్కణ్నుంచి బోట్లలో జాఫ్నా పంపేవారు. రవాణా పనులు చూడడం విక్కీ పని. 

తయారుచేయించాక వేదారణ్యం పంపేదాకా ఎక్కడ దాస్తారు? అని సిట్‌ వాళ్లు అడిగితే 'తిరుచ్చిలో ఓ డాక్టరు వున్నాడు. ఆయన ఎల్‌టిటిఇకి భక్తుడు. ఎల్‌టిటిఇ అతనికి సాయం చేసి తిరుచ్చి దగ్గరున్న ముతురాజ నల్లూరులో ఒక యింటిని, ఫామ్‌హౌస్‌ను కొనిపించింది. సేకరించిన గ్రెనేడ్‌ కవచాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వైర్‌లెస్‌ పరికరాలు, పేలుళ్లలో వుపయోగించే యినుపగుళ్లు.. అన్నీ అక్కడ నిలవచేస్తాం.' అని చెప్పారు. ఇంతకీ శివరాజన్‌ ఎక్కడ చెప్పు అని అడిగితే అది నాకు తెలియదు అన్నాడు విక్కీ. (అది అబద్ధం)

'శివరాజన్‌, శుభ, నెహ్రూలను సురేష్‌ మాస్టర్‌ తిరుచ్చి శంతన్‌ వద్దకు తీసుకెళ్లాడని మాకు తెలుసు. శంతనే వాళ్లను ఎక్కడికో తప్పించి వుండాలి. వేరే వూళ్లల్లో అతని శిబిరాలు ఎక్కడున్నాయో చెప్పు' అన్నారు సిట్‌ అధికారులు. 'బెంగుళూరులోని ఇందిరా నగర్‌ ఏరియాలో జాఫ్నా నుంచి గాయపడి వచ్చిన ఎల్‌టిటిఇ కార్యకర్తలకు చికిత్స చేయిస్తూంటారు. రెండు వారాల క్రితం నేను శంతన్‌కు లక్ష రూపాయలు పట్టుకెళ్లి యివ్వడానికి అక్కడకు వెళ్లి వచ్చాను. ఆ యింటి అడ్రసు నోటికి రాదు కానీ, ఎలా వుంటుందో వర్ణించి చెప్పగలను.' అన్నాడు విక్కీ. శివరాజన్‌ బృందం బెంగుళూరులో వుండాలి అని సిట్‌కు నమ్మకం కుదిరింది. శంతన్‌కు వున్న వాహనాలేమిటి అని అడిగితే నీలిరంగు ప్రీమియర్‌ పద్మిని కారు, ఆకుపచ్చ మారుతి జిప్సీ అన్నాడు. 

xxxxxxxxxxxxxxxx

బెంగుళూరులో శంతన్‌ నడిపే ఇందిరా నగర్‌ శిబిరంలో తలదాచుకున్న శివరాజన్‌కు డిక్సన్‌ చనిపోయిన విషయం, విక్కీ, రఘులు పట్టుబడిన విషయం పేపర్లలో రావడంతో భయమేసింది. విక్కీ, రఘు తిరుచ్చి శంతన్‌కు సంబంధించిన శిబిరాలన్నిటి గురించి చెప్పేసి వుంటారు. ఇక ఇక్కడ వుంటే ప్రమాదం, వెళ్లిపోవాలి అని నిశ్చయించి సురేష్‌ మాస్టర్‌కు చెప్పాడు. అతను ఎల్‌టిటిఇ రాజకీయ విభాగం వాడు, చెన్నయ్‌లో వుంటాడు. ఎల్‌టిటిఇ తరఫున జాఫ్నా నుంచి వచ్చే ఎల్‌టిటిఇ క్షతగాత్రులకు చికిత్స కోసం బెంగుళూరులో శిబిరాలు నిర్వహిస్తూంటాడు. అతని సహాయకుడు మూర్తి. వాళ్లు వెంటనే శివరాజన్‌ ముఠాను ఇందిరా నగర్‌కు దగ్గర్లోనే దోమలూరులో శంతన్‌ నడిపే మరో శిబిరానికి తరలించారు.

జులై 30 - డిక్సన్‌ చనిపోయిన విషయం పేపర్లో వచ్చేసింది కాబట్టి శివరాజన్‌ ముఠా జాగ్రత్త పడి వుంటుందని సిట్‌కూ తోచింది. విక్కీ బెంగుళూరు శిబిరం గురించి చెప్పాడా లేదా అన్నది వాళ్లకు తెలియకపోయినా ప్రమాదాన్ని శంకిస్తే వాళ్లు సైనైడ్‌ మింగేయవచ్చు. బెంగుళూరు పోలీసులను పంపిస్తే కోయంబత్తూరు పోలీసుల్లా చేస్తారేమో తెలియదు. అందువలన సిట్‌కు చెందిన చిన్న షాడో దళాన్ని పంపాలి, తొందరపాటుగా ఏమీ చేయకూడదు అని సిట్‌ నిశ్చయించింది. 

xxxxxxxxxxxxxxxxx

విక్కీ నుండి సమాచారం వస్తూండగానే సిట్‌ బృందం ఒక దళాన్ని కోయంబత్తూరులోని గ్రెనేడ్‌ ఫ్యాక్టరీకి, మరో దళాన్ని తిరుచ్చి వద్ద వున్న ముతురాజ నల్లూరుకు పంపింది. అక్కడ వేదారణ్యానికి సిద్ధంగా వున్న వందలాది ఆయుధాల పెట్టెలు, కవచాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక కోయంబత్తూరులో గ్రెనేడ్‌లు తయారుచేస్తున్నది ఒక భారతీయుడి యింట్లో. రెండేళ్ల క్రితం కోయంబత్తూరులో యిలాటి ఫ్యాక్టరీపైన దాడి చేసి నలుగురు ఎల్‌టిటిఇ కార్యకర్తలను పోలీసులు పట్టుకున్నపుడు యిద్దరు పారిపోయారు. వాళ్లు స్థలం మార్చి పాత కార్యక్రమాన్నే కొనసాగిస్తున్నారు. అక్కడికి వెళ్లి వాళ్లనీ పట్టుకున్నారు. ( సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

mbsprasad@gmail.com

Click Here For Archives