cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఋణమాఫీ జరిగేనా?

ఎమ్బీయస్‌ : ఋణమాఫీ జరిగేనా?

జరిగితీరుతుందని టిడిపి నాయకులు, సిద్ధాంతకర్తలు బల్లగుద్ది చెపుతున్నారు. ఎలా? అని విశ్లేషకులు ప్రశ్నలు సంధిస్తున్నకొద్దీ 'అధ్యయనం చేసే హామీ యిచ్చాం, మీరేం సందేహించడనక్కరలేదు' అంటున్నారు. కానీ ఆ హామీ అమలు గురించి టిడిపి వారి కంటె యితరులకే ఎక్కువ బెంగగా వుంది. ఎందుకంటే బాబుగారి ట్రాక్‌ రికార్డు అలాటిది. మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి, చేయలేదు. రెండు రూపాయలకు కిలో బియ్యం సరఫరా చేస్తామని చెప్పి మూడున్నరకు పెంచేశారు. బెల్టు షాపులు తీసేయిస్తామని చెపుతూనే వాటిని ప్రోత్సహించారు. తను ఏం చేసినా ప్రజలకు నచ్చచెప్పడానికి ''ఈనాడు'' వుందనే ధైర్యంతో గతంలో బాబుగారి పాలన నడిచింది. విద్యుత్‌ సంస్కరణలు చేపట్టడం వరకు ఓకే కానీ, ఆ పేరుతో మాటిమాటికీ విద్యుత్‌ చార్జీలు పెంచేయడం అన్యాయం అని ప్రతిపక్షాలు గోల పెడితే 'నేను విజన్‌తో అలా ముందుకు వెళుతూంటే ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు' అంటూ వాపోయారు. ప్రజలు అవన్నీ మర్చిపోయి వుంటారన్న ధీమాతో యీ ఎన్నికలకు ముందు వచ్చిన 'ఆయన వస్తున్నారు' యాడ్‌ లో 'ఆయన పాలనలో కరంటు కోతలే వుండేవి కావు' అని చెప్పించారు. అదే ఒక కోత! కరంటు కోతలతో పరిశ్రమలు మూతపడిన కాలమది. 

అప్పుడున్నది ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు బాబు చేతికి వచ్చినది - ముక్కలైన రాష్ట్రం, ముష్టికోసం బయలుదేరవలసిన లోటు బజెట్‌ రాష్ట్రం. ఇలాటి రాష్ట్రంలో ఋణమాఫీ వంటిది చేపట్టగలరా? అనే అందరి బెంగా. బాబు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 'నేను హామీ యిచ్చిననాటి పరిస్థితి యిప్పుడు లేదు. రాష్ట్ర ఆర్థికపరిస్థితి నేననుకున్నదాని కంటె ఘోరంగా వుంది. ఎంతో అనుభవం వున్న నాకే మతిపోతోంది, ఏం చేయాలో పాలుపోవటం లేదు.' అని. ఇదీ పరిస్థితి అని కిరణ్‌కుమార్‌ రెడ్డి పాపం గణాంకాలు వల్లిస్తూనే వున్నాడు. ప్రజలు వినలేదు సరే, యీయనలాటి నాయకులైనా పట్టించుకోకపోతే ఎలా? టిడిపి మానిఫెస్టో రచయిత, ఆర్థిక నిపుణుడు కుటుంబరావుగారు మొన్న చర్చలో చెపుతున్నారు - 'బాబుగారు హామీ యిచ్చినపుడు ఉమ్మడి రాష్ట్రంగా వుంది, యిప్పుడు విభజన జరిగి పరిస్థితి మారిపోయింది' అని. విభజన టెక్నికల్‌గా జూన్‌ 2 న జరగవచ్చు కానీ, జరుగుతుందని మానిఫెస్టో రాసేనాటికే తెలుసు.   

వీళ్లంతా బాంకులు సహకరించాలంటారు. బాంకులు అన్నదాన సత్రాలు కావు. వాళ్ల దగ్గరున్నది విరాళాల సొమ్ము కాదు. నాబోటి, మీబోటి కస్టమర్ల డబ్బు. వాళ్లు దానికి జవాబుదారీ వహించాలి. అప్పులు మాఫీ చేయండి అంటే వాళ్లకు నష్టం రాదా? అయినా యిలాటి సామాజిక బాధ్యతలన్నీ జాతీయ బ్యాంకుల నెత్తిమీదే ఎందుకు పెట్టాలి? ప్రపంచబ్యాంకుకి చెప్పి ప్రయివేటు బ్యాంకులకు పంచవచ్చుగా? ఇప్పుడిలా చేసి జాతీయ బ్యాంకులు నష్టాల్లో మునిగితే అప్పుడు వాటిని నిలబెట్టడానికంటూ ప్రయివేటీకరణ మొదలుపెడతారు. రిలయన్సు వారికి అప్పగిస్తారు. హామీలు రాజకీయపార్టీలవి. అమలు చేయవలసిన బాధ్యత బ్యాంకులది, అనగా కష్టార్జితం బాంకుల్లో దాచుకున్న కస్టమర్లదన్నమాట. ఈ నష్టాలు పూడ్చుకోవడానికి వాళ్లు ఋణాలపై వడ్డీ పెంచితే మళ్లీ మనపైనే భారం. ఋణాలు ఎగ్గొట్టేవాళ్లకు యీ చింత ఏమీ లేదు. బాగా డబ్బున్నవాళ్లూ అప్పులు ఎగ్గొడుతున్నారు. పేదవాళ్ల చేత, వ్యవసాయం పేర చిన్నా, పెద్దా రైతులచేత ప్రభుత్వం ఎగ్గొట్టిస్తోంది. దాని వలన కలిగే కష్టనష్టాలు మనలాటి మధ్యతరగతి డిపాజిటర్ల్లకు. 

ఆంధ్రరాష్ట్రానికి కావలసిన నిధులు ఎన్ని అనేది తేలితే రాష్ట్రప్రభుత్వం యీ ఋణభారం తన నెత్తిమీదే వేసుకుంటుందో లేదో చెప్పవచ్చు. విభజన ప్రకటన రాగానే చంద్రబాబు రాజధానికై నాలుగైదు లక్షల కోట్లు కావాలన్నారు. దానిపై అంతా ఎద్దేవా చేస్తే టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌గారికి ఉక్రోషం వచ్చింది - బాబుగారు అన్నీ లెక్కలు వేసుకునే చెప్పారని వాదించారు. నాలుగుకి, ఐదుకి మధ్య ఒక - లక్షకోట్లు తేడా వుంది. రాజధాని ఎక్కడో ఏమిటో తెలియకుండానే అక్కడి స్థలం రేటు తేలకుండానే అంత ఉరామరిగా ఆయన చెపితే యీయన మాత్రం కచ్చితంగా లెక్క కట్టి చెప్పారని వాదించారు. తనకు ప్రతికూలంగా వుండే కాంగ్రెసు కేంద్రంలో అధికారంలో వుండగా చెప్పిన లెక్క అది. అనుకూలమైన బిజెపి వచ్చాక యిప్పుడు ఆ అంకె చెప్పడం మానేశారు. నిధులిచ్చి ఆదుకోవాలి అని అస్పష్టంగా మాట్లాడుతున్నారు. 

సీమాంధ్రను సింగపూరు చేసే నినాదం బాబుగారిది. సింగపూరు నిర్మించడానికి ఎంత ఖర్చయిందో తెలుస్తే బాగుండును. దాని జనాభా 52 లక్షలు. దానికి 9 రెట్లు ఎక్కువ జనాభా వున్న ఆంధ్రరాష్ట్రానికి ఆ ఖర్చుకి 9 రెట్లు ఎక్కువ అవుతుందన్నమాట. ఉద్యోగుల జీతాలకే డబ్బు లేని పరిస్థితిలోకి నెడుతున్నారు అని ఓ పక్క విమర్శిస్తూనే యింత భారీ హామీ యిచ్చేశారు బాబు. తెలంగాణ ఉద్యోగులు మాత్రమే తెలంగాణలో పని చేయాలి అనే నినాదంతో కెసియార్‌ గొడవ చేసి నియమాలతో సంబంధం లేకుండా వాళ్లు ఆంధ్రావాళ్లు అనుకున్న వాళ్లందరినీ పంపించేయబోతున్నారు. వారి కోసం ఆంధ్రరాష్ట్రంలో సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించవలసి వస్తుంది. ఉన్నవాళ్లకే సర్దలేక ఛస్తూ వుంటే బాబు కొత్త ఉద్యోగాలు ఎలా సృష్టించగలరు? నిరుద్యోగులకు యిచ్చిన హామీలు ఎలా నెరవేర్చగలరు? వీటికి తోడు డ్వాక్రా ఋణాల రద్దు, మరోటీ యిలాటి వాటికి పోగా ఏం మిగులుతుంది?

అసలు రాజధాని కట్టడానికే ఆంధ్రులకు డబ్బు లేదు, డబ్బిచ్చి ఆదుకోండి అని విరాళాల సేకరణ మొదలుపెట్టారు. ఇటువంటిది ఎక్కడా కనలేదు, వినలేదు. రాజధాని కట్టడానికి ప్రభుత్వానికి డబ్బే లేకపోతే రాష్ట్రం విడగొట్టమని ఎవడేడ్చాడు? ప్రజలు పన్నులు సరిగ్గా కడితే చాలు, ప్రభుత్వాలకు యిలా బిచ్చం పడేయనక్కరలేదు. ఈ డ్రామాకు నాయకత్వం వహిస్తున్నది ఆంధ్రజ్యోతి! ప్రత్యేక తెలంగాణ ఆందోళనను భుజాన మోసి, విభజన జరిగేదాకా నిద్రపోకుండా హంగామా చేసిన ఆంధ్రజ్యోతి యిప్పుడు ఆంధ్ర రాజధానికి నిధులు సమకూర్చమంటూ ఉద్యమించడమా? అంటే కాళ్లు విరక్కొట్టి ఆ పైన చంకకర్రలకు డబ్బు సేకరించి యిచ్చినట్టా? రేపు తెలంగాణ పునర్మిర్మాణానికి కూడా డబ్బులు వసూలు చేస్తారా? ఇలా డబ్బులు యిచ్చే ప్రజలకు ఆ డబ్బులు ఎలా వినియోగం అవుతాయో అవగాహన వుందా? మామూలుగా  కొత్త మంత్రి రాగానే వాస్తు తనకు నప్పలేదంటూ తన అధికారిక నివాసానికి కనీసం పది, పదిహేను లక్షలు ఖర్చు పెట్టి మార్పుచేర్పులు చేయిస్తారు. ఆఫీసుకి యింకో పది! ఓ ఆర్నెల్లకు అతను దిగిపోయాక కొత్తగా వచ్చినవాడు మళ్లీ ఖర్చు చేయిస్తాడు. కొత్త కార్లు కొంటారు. పాతవాడు యిల్లు ఖాళీ చేయకపోతే వీళ్లు కొత్తది కొనిపిస్తారు. ఇప్పుడు యీ దాతలు పంపే డబ్బు యిలాటి విలాసాలకు ఖర్చవదని ఎవడైనా హామీ యివ్వగలడా? ఆడంబరంగా వుండము అని ఆంధ్రమంత్రులు  రాసి యిచ్చారా? గుడారాల్లోనైనా వుంటాం, హైదరాబాదు ఖాళీ చేసి పోతాం అని అన్న బాబు వారం తిరక్కుండా యింకో ఏడాది దాకా హైదరాబాదులో వుంటాం అన్నారు. గుడారాలు, గుడిసెల్లో వుంటాం, ఆదివారాలు  కూడా వచ్చి నిద్రాహారాలు మానేసి పనిచేస్తాం అని నాయకులు, ఉద్యోగులు అంటూంటే విని నవ్వుకోవాలి కానీ నమ్మేయకూడదు. వేళకు ఆఫీసుకి వస్తే చాలు, సామెత చెప్పినట్లు... గుళ్లో దీపం పెట్టినంత పుణ్యం. ప్రకాశం గారి రోజుల్లో కర్నూలులో గుడారాల్లో లేరా? అంటే ఆ నాటి నాయకుల పద్ధతే వేరు. 

ఈ విరాళదాతలకు ఆంధ్రరాష్ట్రంపై అంత మమకారమే వుంటే శ్రమదానం చేయవచ్చు, శారీరకంగా శ్రమ పడే ఓపిక లేకపోతే శ్రమదానం చేసేవారికి తిండితిప్పలకో, బట్టలకో  వస్తురూపేణా సహాయం చేయవచ్చు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వర్క్‌ ఫోర్స్‌ పెరగబోతోంది. తెలంగాణలో ప్రభుత్వోద్యోగుల్లో స్థానికత వివాదం చెలరేగడం చూస్తున్నాం. క్రమేపీ యిది ప్రయివేటు సంస్థలకు కూడా వ్యాపిస్తుంది. కెసియార్‌ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా పర్మనెంటు చేస్తామంటున్నారు. నిరుద్యోగులకు యిప్పట్లో ఉద్యోగాలు రావు. అందువలన ప్రయివేటు సంస్థల్లో కూడా స్థానికులకే యివ్వాలన్న ఉద్యమం లేవనెత్తి ఆంధ్రులను పంపించివేయడం ప్రారంభమవుతుంది. ఈ బ్లూ కాలర్‌ నిరుద్యోగ యువతకు ఆంధ్రలో ఉపాధి కల్పించాలంటే ఐటీ కంపెనీలు పెడతామంటే చాలదు. అక్కడ నిర్మాణాలు చేపట్టాలి. ప్రభుత్వం వద్ద నిధులు లేవు. మోదీ ఆంధ్రరాష్ట్రం నిర్మాణానికి, ఋణమాఫీకి, మరో సంక్షేమపథకానికీ నిధుల వర్షం కురిపించేస్తాడని ఆశ పెట్టుకోవద్దు. ఆయనది సంక్షేమవిధానం కాదు. గుజరాత్‌లో చౌకగా ఏదీ లభించదు. ఆంధ్రకు డెవలప్‌మెంట్‌ కావాలంటే మోదీ ఎవరైనా పెట్టుబడిదారులకు చెప్పి, పెట్టుబడులు పెట్టించవచ్చు, వారు పర్యావరణం గురించి, కార్మిక సంక్షేమం గురించి అనేక నియమాలు ఉల్లంఘించినా కళ్లు మూసుకోమనవచ్చు. గుజరాత్‌లో అదే జరిగింది. ఏదో ఒకలా ఎకనమిక్‌ యాక్టివిటీ జరిగితే అదే పదివేలు అనే పరిస్థితిలో వుంది ఆంధ్ర. ప్రాజెక్టుల వ్యయం తగ్గించాలంటే ప్రజలు శ్రమదానం చేయాల్సి వుంటుంది. అలా చేసేవారికి కూడూ, గుడ్డా ఏర్పాటు చేసేందుకు ఈ దాతలు తమ విరాళాలను అలాటి కార్యాలకు ఉపయోగిస్తే మంచిదని నా భావన. 

ఇదేమీ అక్కరలేదు, మోదీ డబ్బు యిస్తాడనుకుంటే మాత్రం దెబ్బ తింటారు. డెవలప్‌మెంట్‌కీ, ప్రజాకర్షక పథకాలకూ, సంక్షేమపథకాలకూ అన్నిటికీ కేంద్రమే ఎందుకు భరిస్తుంది? అలా యిస్తే తక్కిన రాష్ట్రాలు వూరుకుంటాయా? ప్రత్యేక రాష్ట్ర హోదాయే డౌట్‌లో వుంది. ఋణమాఫీ వంటి ప్రజాకర్షక పథకానికి బిజెపి ఆధ్వర్యంలోని కేంద్రం నిధులిస్తే వాళ్లకు రాజకీయ లబ్ధి కూడా వుండదు కదా. ఎంత చేసినా టిడిపికి పేరు వస్తుంది. అసలు బిజెపిని రాష్ట్రంలో బాబు ఎదగనిస్తారో లేదో గతానుభవాల దృష్ట్యా బిజెపికి సందేహాలుండవచ్చు. అందుకే మోదీ ఎందుకైనా మంచిదని జగన్‌కు ఎపాయింట్‌మెంట్‌ యిచ్చాడు. అవసరమైతే బాబుకి చెక్‌ పెట్టడానికి కూడా మోదీ సందేహించడని అర్థమవుతోంది. మోదీ నిధులు కురిపిస్తానని తిరుపతి సభలో కూడా చెప్పలేదు. తూర్పుతీరాన సముద్రం వుంది, కష్టపడండి, పైకి రండి అని ఉపదేశమిచ్చాడంతే. బాబు ఢిల్లీ వెళ్లినపుడు మోదీని ఋణమాఫీ విషయంలో ఆయన చేయబోయే సహాయం ఎంతో కనుక్కుని వచ్చి వుంటారు. రేపు ప్రమాణస్వీకారం చేసేటప్పుడు విశ్వసనీయతకోసమేనా ఆ ఫైలుపై తొలి సంతకం పెడతారు. అయితే దానిలో ఎన్ని రైడర్స్‌ వుంటాయో, ఎన్ని చిక్కుముళ్లు వేస్తారో మీడియా హోరు తగ్గాక కానీ స్పష్టం కాదు. ఆ నిర్ణయం ఎంత సబబో ''ఈనాడు'' మనకు ఎలాగూ నచ్చచెపుతుంది. విందాం.  అంతవరకు బెంగ వీడుదాం. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2014)

[email protected]

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?