Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 15

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 15

బెన్నెట్‌ అండ్‌ కోల్‌మన్‌ గ్రూపు ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'' ప్రచురణల సొంతదారు. దానికి చైర్మన్‌ అశోక్‌ జైన్‌ కాగా, వైస్‌ చైర్మన్‌ హోదాలో ఆయన కొడుకు అశోక్‌ చక్రం తిప్పుతున్నాడు. అతనికి ''సండే అబ్జర్వర్‌'', ''ఇండియన్‌ పోస్ట్‌'' పత్రికలు బాగా నచ్చాయి. ''ఇండియన్‌ పోస్ట్‌''ను అమ్మేస్తున్నారన్న వార్తలు రాగానే వినోద్‌ను పిలిచి చర్చలు మొదలుపెట్టాడు. దాని ఓనరైన విజయ్‌ అతని బంధువైనా యిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. ఇండియన్‌ పోస్టులో వినోద్‌తో పాటు పనిచేసిన 70 మంది టీము సభ్యులు రిలయన్సు గ్రూపు వైపు వెళ్లడానికి యిష్టపడక ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా''తో చర్చలు జరపమని వినోద్‌ను కోరారు. అశోక్‌ జైన్‌తో కలిసి వినోద్‌ చర్చలు జరుపుతూండగానే విజయ్‌ ''ఇండియన్‌ పోస్టు''ను ''గుజరాత్‌ సమాచార్‌''కు చెందిన శ్రేయాంస్‌ షాకు అమ్మేశాడని వార్తలు వచ్చాయి. వినోద్‌ తన టీముతో కలిసి ''ఇండిపెండెంట్‌'' అనే పేర ఇంగ్లీషు దినపత్రికను వెలువరించాలని చెప్పి అశోక్‌ 1989 జూన్‌లో  ఒప్పందం చేసుకున్నాడు. బొంబాయిలో తన ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'' లీడింగులో వుండగా తనకు తనే పోటీగా యింకో డైలీ ఎందుకు తెస్తున్నాడన్న సందేహం రావచ్చు. ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'' అన్ని వర్గాల పాఠకులకు చేరుతుంది, అందుచేత దాని యాడ్‌ రేట్లు ఎక్కువగా వుంటాయి. ''ఇండియన్‌ పోస్టు'' ఉన్నతవర్గాలను ఆకర్షించినపుడు వారు వాడే ఉత్పాదనల - కార్లు, సెంట్లు, జ్యూయలరీ, ఏసిలు, సూట్లు వంటి విలాసవస్తువులు, యాడ్స్‌ అటు వెళ్లాయి. సర్క్యులేషన్‌ తక్కువ కాబట్టి యాడ్‌ రేట్లు తక్కువ కూడా! అది గమనించిన అశోక్‌ జైన్‌ రెండు రకాల పత్రికలనూ తనే పెట్టుకుంటే తన ప్రకటనదారులు ఎటూ పోకుండా వుంటారని లెక్క వేశాడు.

అయితే ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'' గ్రూపులో తక్కిన పబ్లికేషన్స్‌లో పనిచేసే స్టాఫ్‌ యీ లాజిక్‌ అర్థం చేసుకోలేదు. ''ఇండియా పోస్టు'' టీమును ''ఇండిపెండెంట్‌'' టీముగా బదలాయించి, ప్రత్యేక సౌకర్యాలు కల్పించి తమ నెత్తిమీద (5 వ ఫ్లోరులో) కూర్చోబెట్టడం వాళ్లు హరాయించుకోలేక పోయారు. కత్తి కట్టారు. యూనియన్‌తో చెప్పి ఇండిపెండెంట్‌ స్టాఫ్‌కు టీ సప్లయి ఆపించారు. ఇలస్ట్రేటెడ్‌ వీక్లీకి ఎడిటరుగా వున్న ప్రీతీశ్‌ నంది, మహారాష్ట్ర టైమ్స్‌కు ఎడిటరుగా వున్న గోవింద్‌ తల్వాల్కర్‌, ఎకనమిక్‌ టైమ్స్‌ ఎడిటరు మను షరాఫ్‌ - ముగ్గురూ కలిసి టైమ్స్‌ మేనేజ్‌మెంట్‌ వద్దకు వెళ్లి తమకు ఫర్నిచర్‌ లేవనీ, టాయిలెట్స్‌ సరిగ్గా లేవనీ, అయినా కష్టపడి పని చేసి టైమ్స్‌కు యీ స్థాయికి తెస్తే, ఇప్పుడు వినోద్‌ ముఠాకు 'ఇండియన్‌ పోస్టు'లో యిచ్చినంత జీతాలిచ్చి తేవలసిన అవసరం ఏముందని నిలదీశారు. అంతే కాదు, జర్నలిస్టులందరూ ఒక రోజు సమ్మె చేసి పేపర్లు బయటకు రాకుండా చేశారు కూడా. ఇలాటి ప్రతికూల వాతావరణం మధ్య 1989 సెప్టెంబరులో ఇండిపెండెంటు మొదటి సంచిక వెలువడింది. ఎప్పటిలాగా మొయినుద్దీన్‌ డిజైను, ఫీచర్లు, వినోద్‌ ముద్ర.. షరా మామూలే.  పేపరుకు పాఠకుల నుండి రెస్పాన్సు బాగా వచ్చింది. మేనేజ్‌మెంటు సంతోషించింది. అయినా నెలన్నర కల్లా వినోద్‌ వుద్యోగం వూడింది. దానికి కారణం అతను నిజమని నమ్మిన వేసిన ఒక వార్త, అతనిపై పగబట్టిన టైమ్స్‌ గ్రూపు ఎడిటర్లు దాన్ని యింతకింత చేసి వివాదం చేయడం!

దానికి ఓ నేపథ్యం వుంది. అమెరికా యింటెలిజెన్సు ఏజన్సీ అయిన సిఐఏ ఇందిరా గాంధీ కాబినెట్‌లోని ఒక ప్రముఖ మంత్రికి ఏటా 20 వేల డాలర్లు లంచం యిస్తూ అతని నుండి భారతదేశం గురించిన కీలకమైన సమాచారం అంతా సేకరిస్తూ వచ్చిందని 1971లో ''న్యూయార్క్‌ టైమ్స్‌'' పత్రిక వేసింది. ఆ యింటిదొంగ పంపిన నివేదికలను బట్టే భారత్‌ పట్ల తమ విధానాన్ని రూపొందిస్తున్నామని నిక్సన్‌ చెప్పినట్లు ''వాషింగ్టన్‌ పోస్టు'' కూడా వేసింది. అతను ఎవరన్న దానిపై విస్తారంగా చర్చ జరిగింది కానీ ఎవరో తేలలేదు. సేమూర్‌ హెర్ష్‌ అనే అమెరికన్‌ యిన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు 1983లో ''ద ప్రైస్‌ ఆఫ్‌ పవర్‌ - కిసింజర్‌ ఇన్‌ ద నిక్సన్‌ వైట్‌హౌస్‌'' అని ఒక పుస్తకం వేశాడు. దానిలో భారత కాబినెట్‌లోని సిబిఐ గూఢచారి మొరార్జీ దేశాయ్‌ అని వెల్లడించాడు. ఆయన అప్పటికే ప్రధానిగా చేసి రాజకీయాల్లోంచి విరమించాడు. మొరార్జీ గూఢచారిగా పనిచేశాడంటే ఎవరూ నమ్మలేకపోయారు. 87 ఏళ్ల మొరార్జీకి ఆగ్రహం వచ్చి, హెర్ష్‌పై 50 మిలియన్‌ డాలర్లకు పరువునష్టం దావా వేద్దామనుకున్నాడు. కానీ కేసు వేయాలంటే అమెరికాలోనే వేయాలి. చాలా ఖర్చవుతుంది. ఇందిరా గాంధీ ప్రభుత్వానికి మొరార్జీకి సాయం చేసే ఉద్దేశం లేదు. చివరకు అమెరికాలోని గుజరాతీ ఎన్నారైల సహాయంతో చికాగోలో కేసు పెట్టారు మొరార్జీ. విచారణ చాలా ఏళ్లే జరిగింది. హెర్ష్‌ మొరార్జీని చాలా ప్రశ్నలే అడిగాడు. అమోఘమైన జ్ఞాపకశక్తితో మొరార్జీ అతని ఆరోపణలను ఖండించాడు. హెర్ష్‌ తను పొరబడి వుండవచ్చని ఒప్పుకున్నాడు. కానీ అతను యిదంతా దురుద్దేశంతో చేసినట్లు నిరూపించలేకపోవడం చేత పరువు నష్టం దావా కొట్టేశారు. ఈ తీర్పు 1989 అక్టోబరు 6న వెలువడింది. 

వెంటనే మొరార్జీ గూఢచారి కాకపోతే మరెవరు అనే ప్రశ్న ముందుకు వచ్చింది. అక్టోబరు 15 ప్రాంతాల్లో ''ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'' ఒక కథనం వేసింది. దాని ప్రకారం - భారత గూఢచారి సంస్థ 'రా'లో వున్న రెస్టోరేషన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే ఫోరం ఆ గూఢచారి మొరార్జీ కాదనీ, మహారాష్ట్రకు చెందిన మరొక మంత్రి అని, బాంబేలో వున్న అందమైన అమెరికన్‌ దౌత్యోద్యోగిని ద్వారా సమాచార సేకరణ జరిగిందని, రా, ఐబి (ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) ఆమెపై నిఘా పెట్టి సేకరించిన సమాచారమిది అని ప్రధానికి లేఖ రాసింది. ఈ వార్త బయటకు రాగానే ''బ్లిట్జ్‌'' సంపాదకుడు రూసీ కరంజియా ''అవునవును, ఆమె నాకూ తెలుసు, ఆ మంత్రి పైకి మర్యాదస్తుడిలా కనబడినా ఆమెతో సంబంధం పెట్టుకుని వుండవచ్చు'' అంటూ తన పత్రికలో రాశాడు. అప్పటికీ, యిప్పటికీ ఏం తోస్తే అది మాట్లాడే సుబ్రమణ్యస్వామి బాంబేలో పత్రికా సమావేశం పెట్టి 'మొరార్జీని అన్యాయంగా యిరికించారు. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా, ఉపప్రధానిగా పనిచేసినాయనే అసలు గూఢచారి.' అని ప్రకటించాడు. 'ఆ పదవుల్లో వున్నది వైబి చవానే కదా, ఆయనే గూఢచారి అంటారా?' అని ఒక పాత్రికేయుడు అడిగితే స్వామి చిరునవ్వు నవ్వి వూరుకున్నాడు. కానీ వైబి చవాన్‌కు మహారాష్ట్రలో వున్న ప్రజాదరణ కారణంగా ఒక హైదరాబాదు పత్రిక తప్ప యింకే పత్రికా యీ ప్రెస్‌ మీట్‌ సంగతి ప్రచురించలేదు.

ఈ వివాదం సంగతేమిటో తేల్చాలని వినోద్‌కు అనిపించింది. ఢిల్లీ బ్యూరోకు ఫోన్‌ చేసి 'రా'లో ఎవరినైనా సంప్రదించి నిజానిజాలు కనుక్కోమన్నాడు. వాళ్లు 'రా' వద్దకు వెళ్లి ఉత్తరం రాసిన మాట నిజమేననీ నిర్ధారించి ఆ లేఖ ప్రతిని కూడా సంపాదించి వినోద్‌కు పంపారు. రా రాసిందంటే అది నిజమే అయుంటుందనే విశ్వాసంతో వినోద్‌ అక్టోబరు 19 నాటి దినపత్రికలో హెడ్‌లైన్సులో 'అమెరికా గూఢచారి, మొరార్జీ కాదు, వైబి చవాన్‌' అనే వార్త వేశాడు.  జీవితంలో తను తీసుకున్న అతి పెద్ద తప్పుడు నిర్ణయం యిదే అని వినోద్‌ చెప్పుకున్నాడు. అప్పటికే చవాన్‌ గురించి అన్యాపదేశంగా చర్చ జరుగుతోంది కాబట్టి  రెండు రోజులు గడిచినా యీ వార్తను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.  'మిడ్‌ డే' యీ వార్తను యథాతథంగా వేసింది కానీ తక్కిన పత్రికలు దీనిపై స్పందించలేదు. అయితే కొత్త పత్రిక తెచ్చి తమ పాప్యులారిటీని దెబ్బ కొట్టినందుకు వినోద్‌పై పగబట్టిన ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'' ఎడిటరు దిలీప్‌ పడ్‌గాంవ్‌కర్‌ యీ అవకాశాన్ని వినియోగించు కోవాలనుకున్నాడు. అతనూ ''మహారాష్ట్ర టైమ్స్‌'' ఎడిటరు గోవింద్‌ తల్వాల్కర్‌ కలిసి అక్టోబరు 21 న సంపాదకీయాల్లో 'వైబి చవాన్‌ వంటి మహారాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అయిన నాయకుడి ప్రతిష్ట దిగజార్చిన' వినోద్‌ను, ఇండిపెండెంట్‌ పత్రికను తూర్పారబట్టి, రేపు వినోద్‌పై ఎవరైనా భౌతికంగా దాడి చేస్తే దాని బాధ్యత వినోద్‌దే తప్ప వేరెవరిదీ కాదు అని ముక్తాయించారు. ఆ తర్వాత వరుస కథనాలతో వినోద్‌కు వ్యతిరేకంగా మరాఠీ ప్రజల్లో హిస్టీరియా కలిగేట్లు చేశారు. తమ గ్రూపుకే చెందిన పత్రికపై యిలా విరుచుకుపడడం ఎన్నడూ చూడం. వైబి చవాన్‌కు శిష్యుణ్నని, వారసుణ్నని చెప్పుకునే శరద్‌ పవార్‌ యిప్పుడు చవాన్‌ గౌరవానికి భంగం కలుగుతూంటే ఏం చేస్తున్నట్లు అని టైమ్స్‌ ప్రశ్నించింది. 

ఇక దానితో శరద్‌ పవార్‌ రంగంలోకి దిగాడు. వీధివీధిలో నిరసన ప్రదర్శనలు చేయించాడు, తన (కాంగ్రెసు) పార్టీకి చెందిన వర్కర్ల యూనియన్‌తో రాష్ట్రమంతా అల్లర్లు జరిపించి టైమ్స్‌ గ్రూపుకు చెందిన వ్యాన్లపై దాడులు చేయించాడు, నిప్పు పెట్టించాడు. టైమ్స్‌ ఆఫీసును ఘొరావ్‌ చేశారు. ''ఇండిపెండెంట్‌'' సిబ్బందిని పట్టుకుని తన్నారు. వినోద్‌ ఆఫీసుకి, యింటికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. మహారాష్ట్రలోని ప్రతి నాయకుడు - ఏ పార్టీకి చెందిన వాడైనా సరే - వినోద్‌కు శిరచ్ఛేదం చేయించాల్సిందేనని ప్రకటించసాగారు. టైమ్స్‌ గ్రూపు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ యీ అల్లర్లన్నీ కొన్ని రోజులకు సద్దు మణుగుతాయని భావించారు. శరద్‌ పవార్‌తో రాజీకై ప్రయత్నించారు. 'రా' అభిప్రాయాన్ని వాస్తవంగా భ్రమించి, పాఠకులను తప్పుదోవ పట్టించినందుకు పాఠకులకు క్షమాపణ చెప్తానన్నాడు వినోద్‌. మీడియా ముందు తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని శరద్‌ పట్టుబట్టాడు. రాజీ చర్చలు సాగుతూండగానే వినోద్‌కు అర్థమై పోయింది - ప్రత్యర్థులకు కావలసినది తన క్షమాపణ కాదనీ, రాజీనామా అనీ. తన కారణంగా టైమ్స్‌ మేనేజ్‌మెంట్‌ నష్టపోవడం భావ్యం కాదనిపించి  రాజీనామా చేస్తానని ఆఫర్‌ చేశాడు. మేనేజ్‌మెంట్‌ కూడా సరేనంది. అక్టోబరు 24 న క్షమాపణను ప్రచురించి మర్నాడే వినోద్‌ రాజీనామా చేశాడు. టైమ్స్‌ గ్రూపు పబ్లికేషన్స్‌లో విజయోత్సాహం వెల్లివిరిసింది. కితంసారి ఉద్యోగం పోగొట్టుకున్నపుడు వినోద్‌పై సానుభూతి కురిపించిన జర్నలిస్టు మిత్రులు యీ సారి విమర్శలు గుప్పించారు. వినోద్‌ మళ్లీ నిరుద్యోగి అయ్యాడు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?