Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: YM: ఎకానమీ డ్రైవ్‌ - 4/1

ఈ కథ ప్రభుత్వం తలపెట్టదలచిన పొదుపు చర్యల గురించి. ఇది కూడా మన వ్యవస్థలో తరచు వినబడే అంశమే. ''డెయిలీ మెయిల్‌'' డిసెంబరు 7 నాటి సంచికలో ప్రభుత్వ సిబ్బంది చాల ఎక్కువగా వున్నారని, ఉదాహరణకు నేవీలో వున్న సైనికుల కంటె రెవెన్యూ శాఖలో ఎక్కువమంది వున్నారని, అవసరానికి మించి వున్నవారిని గుర్తించి తొలగించవలసిన శాఖ ఎడ్మినిస్ట్రేషన్‌ వ్యవహారాల శాఖది కాబట్టి దాని మంత్రి జిమ్‌ హాకరే దానికి బాధ్యుడని, అతన్ని తీసేస్తే కాని పరిస్థితి మెరుగుపడదని ఒక వ్యాసం ప్రకటించింది. ఇది రాజకీయంగా కూడా చాలా చెఱుపు చేస్తుంది కాబట్టి తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని జిమ్‌ రాజకీయ సలహాదారు ఫ్రాంక్‌ పట్టుబట్టాడు. జిమ్‌ పట్టుబట్టి అతనికి తన డిపార్టుమెంటులోనే ఒక గది కేటాయింప చేసుకున్నాడు.  అతను మాటిమాటికి వచ్చి 'జిమ్‌, నువ్వు మీ ఆఫీసర్లకు వంతపాడుతున్నావు. నిన్ను వాళ్లు హౌస్‌ ట్రైన్‌ చేసేశారు. వాళ్ల కళ్లతోనే ప్రతి విషయాన్ని చూస్తున్నావు. అందుకే గతంలో ప్రతిపక్షంలో వుండగా నీకు తప్పులుగా కనబడ్డవి యిప్పుడు ఒప్పులుగా కనబడుతున్నాయి' అని హెచ్చరిస్తూన్నాడు. అతనికి లౌక్యం తక్కువ కాబట్టి ఉన్నదున్నట్టు చెప్పడంతో అతన్ని చూస్తే జిమ్‌కు యీ మధ్య చికాకు వేస్తోంది. ఇప్పుడు యీ వ్యాసంపై అతను చేసే హంగామా చూసి జిమ్‌ ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాడు. 

హంఫ్రీని పిలిచి ''మన ఆఫీసుతో క్షాళన మొదలుపెడదాం. అసలు మన శాఖలో ఎంతమంది పనిచేస్తున్నారు?'' అని అడిగాడు.

హంఫ్రీ జవాబు దాటవేస్తూ ''అబ్బే, ఎక్కువమంది లేరు, మనది చిన్న శాఖ..'' అన్నాడు.

''అదే, ఎంతమంది అని.. రెండు వేలా, మూడు వేలా?''

''రమారమి 23 వేల మంది..''

జిమ్‌ తెల్లబోయాడు. ఇతర శాఖల పనితీరును పర్యవేక్షించవలసిన యీ శాఖలో యింతమందా? ''మనం ఒక అధ్యయనం చేసి ఎంతమంది అక్కరలేదో తేల్చాలి.''

''గత ఏడాది అలాటి అధ్యయనం చేశాం. ఇంకో ఐదు వందల మంది కావాలని తేలింది. మీరు తగ్గించాలని గట్టిగా అనుకుంటే మీరు కొత్తగా ప్రారంభించిన బ్యూరోక్రాటిక్‌ వాచ్‌డాగ్‌ డిపార్టుమెంటు మూసేయచ్చు. దానిలో నాలుగు వందలమంది వున్నారు.'' అన్నాడు హంఫ్రీ.

జిమ్‌ ఎన్నికలలో చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఆ డిపార్టుమెంటు ప్రారంభించాడు. ప్రభుత్వపు పనితీరుపై, అధికారుల వ్యవహారసరళిపై , ప్రభుత్వం చేస్తున్న వృథా వ్యయంపై ఫిర్యాదులు చేద్దామనుకుంటే ఆ శాఖకు చెప్పుకోవచ్చు. వారు సదరు అధికారిని పిలిచి నిజానిజాలు నిగ్గతీస్తారు. దానిలో సిబ్బంది ప్రభుత్వోద్యోగులే అయినా నడిపేది ప్రజల తరఫున విద్యాధికులు, సమాజసేవకులు. దానికి ప్రజల నుంచి మెప్పు వచ్చింది కానీ అధికారగణం నుంచి వ్యతిరేకత వచ్చింది. హంఫ్రీ దానిపై పగబట్టి వున్నాడు. కానీ జిమ్‌ ఆ సూచన ఒప్పుకోలేదు. తను వచ్చిన దగ్గర్నుంచి చేసినదేమైనా వుందా అంటే అదొక్కటే. మూసేస్తే తక్కినవారి మాట ఎలా వున్నా ఫ్రాంక్‌ విరుచుకుపడతాడు - నువ్వు బ్యూరోక్రాట్ల మాయలో పడిపోయావు అంటాడు.

హంఫ్రీ దీర్ఘాలోచనలో పడినట్లు నటించి ''టీ సప్లయి చేసే అమ్మాయిలిద్దర్ని తీసేయవచ్చు.'' అన్నాడు. 

జిమ్‌కు ఒళ్లు మండిపోయింది. ''అసలిక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు? వాళ్లేం చేస్తున్నారు? మన అజమాయిషీలో వున్న ఆఫీసులు ఏ యే బిల్డింగుల్లో వున్నాయి? అక్కడ ఎంతమంది వున్నారు, ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు నాకు సమాధానాలు కావాలి. మన యిల్లు చక్కబెట్టుకున్నాక యితర శాఖలపై పడదాం.'' అని చెప్పాడు. వస్తున్న కోపాన్ని అణచుకుంటూ హంఫ్రీ చెప్పాడు - ''పార్లమెంటు చట్టాలు చేస్తూన్నంతకాలం దాన్ని అమలు చేయడానికి అధికారులు, సిబ్బంది వుండాలి. వాళ్లను చట్టాలు చేయడం ఆపేయమనండి. మనమూ సిబ్బంది తగ్గించేయవచ్చు.'' అని. జిమ్‌ వినదలచుకోలేదు. ''జరగని పనుల గురించి మాట్లాడవద్దు. పాత అధ్యయనం మనకు పనికి రాదు. కొత్తగా మళ్లీ చేపట్టండి. నేనడిగిన సమాచారం తీసుకురండి. అప్పుడు పరిష్కారమేమిటో నేనే చెప్తాను.'' అన్నాడు.

అతను వెళ్లిపోయాక ఫ్రాంక్‌ జిమ్‌తో ''నీకు తెలుసా? వాయువ్య ప్రాంతపు కంట్రోలర్‌ వాళ్ల రీజియన్‌కు కేటాయించిన బజెట్‌లో గత ఏడాది కంటె యీ ఏడాది 32 మిలియన్‌ పౌండ్ల ఖర్చు తగ్గించాడు. ఆ విషయం బయటకు వస్తే తమ ప్రాంతాల్లో కూడా పొదుపు చేయమని అని మంత్రులు అంటారని సివిల్‌ సర్వీసెస్‌ వారు ఆ సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.'' అని చెప్పాడు. హంఫ్రీని అడిగితే అస్సలు చెప్పడని బెర్నార్డ్‌ని పిలిచి అడిగాడు జిమ్‌. బెర్నార్డ్‌ 'ఈ మాట నేను నిర్ఘాంతపోతున్నాను. ఎవరినైనా వాకబు చేసి అవునో కాదో చెప్తాను' అన్నాడు.

రెండు రోజులు పోయాక అతను హంఫ్రీ దగ్గరకు వెళ్లి అడిగాడు. హంఫ్రీ 'నేనూ నిర్ఘాంతపోతున్నాను - యీ విషయం బయటకి ఎలా పొక్కిందాని' అన్నాడు. తర్వాత బెర్నార్డ్‌కు హితోపదేశం చేశాడు. 'అసలు ఆ నార్త్‌వెస్ట్‌ కంట్రోలరును పొదుపు చేయమని ఎవడడిగాడు? ఇక అందరూ యిదే మొదలుపెడితే? స్టాఫ్‌ను తగ్గించేస్తారు. అసలు ఏదైనా శాఖ ముఖ్యమైనది కాదు అనడానికి కొలబద్ద ఏమిటి? వ్యాపారసంస్థ పెద్దదో చిన్నదో తెలుసుకోవాలంటే దాని టర్నోవరు చూడాలి. శాఖ విషయంలో అయితే ఎంతమంది స్టాఫ్‌ వున్నారన్నదాని బట్టి దాని విలువ తెలుస్తుంది. మనం పనిచేసే శాఖలో సిబ్బంది తగ్గిపోతే మనకు పరువేమైనా మిగుల్తుందా? పొదుపు చేసి మన పరపతిని మనమే పాతిపెడతామా?' అని.

'మంత్రిగారు పొదుపు చేయాలని మహా పట్టుదలతో వున్నాడే' అన్నాడు బెర్నార్డ్‌.

'చూడు ఏదైనా శాఖలో మంత్రి వుండే సమయం సగటున పదకొండు నెలలు. బాగా పనిచేస్తే యింకో పెద్ద శాఖకు వెళతాడు, చేయకపోతే చిన్న శాఖకు వెళతాడు, ఒకే చోట పాతుకుపోడు. మనమైతే శాఖను అంటిపెట్టుకుని వుంటాం. నాలుగురోజులుండి పోయే మంత్రి ప్రతిదానికి కంగారు పడి ఏమేమో అంటాడు. అతను కంగారు పడకుండా ఎప్పటిలాగ బండి నడుపుకుని పోవాలి. రాజకీయనాయకుడు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూన్నట్లు కనబడాలి. చురుగ్గా వుండడమే విజయం సాధించడం అనే భ్రమలో వుంటారు వాళ్లు. అందువలన వాళ్ల చేత ముందుకీ వెనక్కీ నాలుగు అడుగులు వేయించి, గుండ్రంగా తిప్పి ఎక్కడున్నారో అక్కడికే మళ్లీ తీసుకురావాలి. ఏదో ఒకటి చేసిన తృప్తి వాళ్లకు దక్కుతుంది.'

'మరి అవతలివాళ్లు పొదుపు ఎలా చేశారని మంత్రి అడిగితే ఏం చెప్పమంటారు?'

'వాళ్లు ఎక్కవుంటింగ్‌ సిస్టమ్‌ మార్చేశారని చెప్పు, లేదా ఆ ప్రాంతపు సరిహద్దులు గత ఏడాదికి, యీ ఏడాదికి మారిపోయాయని అందువలన గత ఏడాది అంకెలతో పోల్చడం కుదరదని చెప్పు, లేదా గత ఏడాది రావలసిన బాకీలు యీ ఏడాది వచ్చాయని చెప్పు, లేదా యీ ఏడాది చెల్లింపులను వచ్చే ఏడాదికి వాయిదా వేశారని చెప్పు, లేదా కేటాయించిన పెద్ద ప్రాజెక్టు కాన్సిల్‌ కావడం వలన దానికై వుంచిన నిధులు మిగిలిపోయాయని చెప్పు..' అంటూ పలు మార్గాలు సూచించి పంపేశాడు.

అతను వెళ్లిపోయిన తర్వాత హంఫ్రీ ఆలోచనలో పడ్డాడు. జిమ్‌కు యీ సమాచారం ఫ్రాంక్‌ ద్వారానే అంది వుంటుందని, అతని మీద కన్నేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకని అతనికి అఫీషియల్‌ కారు కేటాయించాడు. తమకు నచ్చనివారి గురించి సమాచారం సేకరించడానికి కారు డ్రైవరు చాలా వుపయోగపడతాడు. ఎందుకంటే బ్యాక్‌సీటులో కూర్చుని వాదోపవాదాలు చేసుకునేవారు ముందు సీటులో వున్న డ్రైవరు ఒక మనిషని, అతనికి చెవులుంటాయని మర్చిపోతారు. ముఖ్యమైన ఫైళ్లు కార్లో మర్చిపోతూ వుంటారు. అవన్నీ డ్రైవరు వీళ్లకు చెపుతూ వుంటాడు. పైగా అవతలివాడు ఎక్కడెక్కడికి వెళ్లాడో పూస గుచ్చినట్లు రాసి యిస్తాడు, పెట్రోలుకి లెక్క చెప్పాలి కాబట్టి! కారు ఎలాట్‌ చేసినందుకు ఫ్రాంక్‌ సంతోషించాడు.

జిమ్‌ చేస్తున్న హడావుడి ఫారిన్‌ అండ్‌ కామన్‌వెల్త్‌ ఆఫీసులో పర్మనెంట్‌ సెక్రటరీగా వున్న ఫ్రెడరిక్‌ స్టీవార్ట్‌ చెవికి చేరింది. 'ఏమిటి హంఫ్రీ, మీ మంత్రిగారు పొదుపుపొదుపు అంటూ ఏదో సందడి చేస్తున్నాడట, మీరంతా ఏం చేస్తున్నారు?' అని ఓ మెమో పంపాడు. ఇవి అఫీషియల్‌వి కావు, వ్యక్తిగతమైనవి. 'ఇప్పటిదాకా తలపెట్టిన పొదుపు కార్యక్రమాల్లాగానే యిదీ నడుస్తుందని అనుకుంటున్నాను. త్వరలోనే పరిస్థితి కుదుటబడవచ్చు' అని హంఫ్రీ  జవాబిచ్చాడు. 'పరిస్థితులు వాటంతట అవే చక్కబడవు. స్వయంగా అమలు చేసి చూపమంటే మార్గం సుగమమౌతుంది' అని ఫ్రెడరిక్‌ సలహా యిచ్చాడు. మంత్రిగారికి బుద్ధి వచ్చేట్లా ఎలా చేయాలో హంఫ్రీకి బోధపడింది. (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టంబర్  2016) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?