cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఆశాజీవి అంటే..?

ఎమ్బీయస్‌ : ఆశాజీవి అంటే..?

'కేంద్రం నుంచి పెద్దగా సాయం లభించే పరిస్థితి కనబడటం లేదు. అయినా నేను ఆశాజీవిని. అనుకున్నది సాధిస్తాను' అన్నారు చంద్రబాబు. మర్నాడే వాల్‌మార్ట్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, పెప్సికో, మైక్రోసాఫ్ట్‌, ఫెయిర్‌ఫాక్స్‌ అన్నీ వచ్చి ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేస్తున్నాయని చెప్పారు - ఆశాజీవి అంటే ఆశలు పెట్టుకునే జీవా? ఆశలు పెట్టే జీవా? అని సందేహం కలిగేలా! దావోస్‌లో 35 సదస్సుల్లో పాల్గొనడం, కనబడిన వాళ్లందరినీ పెట్టుబడులు పెట్టమనడం నిజమే కావచ్చు. ఈయన లాటి ముఖ్యమంత్రులు, ఆట్టే మాట్లాడితే అనేక దేశాల ప్రధానమంత్రులు వాళ్లను రోజూ కోరే కోరికే అది! చివరకు వాళ్లు ఎటు మొగ్గుతారో దేవుడికే తెలియాలి. మన పాలకులు ఊరించిన వాటిల్లో పదిశాతం వచ్చినా అదే పదివేలు అనుకునే పరిస్థితిలో వున్నాం మనం. అవైనా వస్తాయా? వచ్చేందుకు యిక్కడ యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పడుతుందా లేదా? దినదినగండంగా గడుపుతున్న రాష్ట్రాన్ని చూసి వారు మురిసి ముక్కలయి పరిగెట్టుకువస్తారా?

ఎన్నికల సమయంలో, ఆ తర్వాతా బాబు, యితర టిడిపి నాయకులు ఏం చెప్పారు? 'కేంద్రం మనది, బిజెపితో మాకు పొత్తు వుంది. మధ్యలో వారధిగా మన వెంకయ్యనాయుడు వున్నారు. ప్రత్యేక హోదా గురించి రాజ్యసభలో ధాటీగా వాదించింది ఆయనే! మన్‌మోహన్‌ ఐదేళ్లంటే మేం వచ్చి పదేళ్లు చేస్తాం అన్నారాయన, ఎన్నికల ప్రచారంలో పదేమిటి, పదిహేను కూడా చేస్తాం అన్నారు. ప్రత్యేక హోదా తథ్యం. అది చూసి హైదరాబాదులో వున్న ఆంధ్ర వ్యాపారస్తులే కాదు, తెలంగాణవారు కూడా మన దగ్గరకే వచ్చేసి పరిశ్రమలు పెడతారు. రాయితీలంటే ఎవరికి చేదు? మనది స్వర్ణాంధ్రప్రదేశ్‌ కావడం ఖాయం' అన్నారు.  మరి యిప్పుడు? 'పాపం కేంద్రానికి దాని యిబ్బందులు దానికి వున్నాయి. వాళ్లే డబ్బు కోసం అవస్థలు పడుతున్నారు. మనం గట్టిగా అడిగే పరిస్థితి లేదు.  మంత్రులెవ్వరూ కేంద్రాన్ని విమర్శించకూడదు. బిజెపిని నిందించకూడదు' అంటున్నారు. 

కేంద్రం కష్టాలు మనకెందుకు? అంత డబ్బు లేకుండా వుంటే స్వచ్ఛభారత్‌ లాటి కొత్త పథకాలు ఎందుకు పెడుతున్నారో మరి! అయినా కొత్త  రాష్ట్రానికి డబ్బు యిచ్చే పరిస్థితి లేకపోతే, అర్జంటుగా విభజన చేయడం దేనికి? డబ్బులొచ్చాకే చేయలేకపోయారా? చేసినది కాంగ్రెసు పార్టీ అని తప్పించుకోలేరు. పార్టీలు మారినా ప్రభుత్వం అదేగా, మనం కట్టిన పన్నులన్నీ అక్కడికే వెళుతున్నాయి కదా. అయినా విభజన కాంగ్రెసు చేతుల మీదుగా జరిగినా దానికి సాయం పట్టినది బిజెపి కాదా? పెద్దమ్మనే కాదు, చిన్నమ్మనూ గుర్తు పెట్టుకోండి అని మురుస్తూ చెప్పిన సుష్మా స్వరాజ్‌ యిప్పుడు కేంద్రంలో భాగం కాదా? ఆనాడు రాజ్యసభలో గంభీరంగా హామీ యిచ్చిన వెంకయ్యనాయుడు గారే యిప్పుడు స్వయంగా చెప్పేశారు - ప్రత్యేక హోదా హుళక్కి. మీకిస్తే తక్కినవాళ్లు గోలపెడతారు, అందువలన చాటుమాటుగా, ఆ పేరు చెప్పకుండా వేరేలా యిచ్చి సరిపెడతాం లెండి అని. మురళీమోహనూ అన్నారు, ప్రత్యేక హోదా కాకుండా పరోక్షంగా సాయం అందిస్తుందిట అని.  ఇదేమైనా బలరాముడి కంట పడకుండా యశోద కృష్ణుడికి వెన్నముద్ద తినిపించినట్టా!? ఏం చేసినా బజెట్‌లో కనబడుతుంది, తక్కినవాళ్లకు తెలుస్తుంది. పేచీ పెట్టేవాళ్లు పెడతారు. వాళ్లకు భయపడి యివ్వాల్సిన ప్యాకేజీ యివ్వకపోతే ఎలా? 

రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ యిస్తామని కేంద్రం చెప్పినా యిప్పుడు 7 జిల్లాలకు కలిపి జిల్లాకు రూ. 10 కోట్లు చొప్పున ఏడాదికి 70 కోట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని బాబే చెప్పారుట. మొత్తం 10 కోట్లు యిస్తానంటే బాబు బేరాలాడి 70 చేయించారట. ఇ”వాళ్టి పేపరు చూస్తే జిల్లాకు 60 కోట్లు వస్తుందని వార్త వచ్చింది. ప్రతీ జిల్లాకు బాబు ప్రకటించిన ప్రాజెక్టులు లిస్టు ఒక్కసారి తిరగేయండి, ఏడాదికి 60 కోట్లయినా ఏ మూలకు సరిపోతాయి? రాష్ట్రం ఏర్పడడమే 15 వేల కోట్ల లోటు బజెట్‌తో! ఆ పైన పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలు. ఇప్పటికి పరిశ్రమలకు యివ్వాల్సిన 1300 కోట్ల బకాయిలు చెల్లించామని బాబు చెప్పారు. ఏ ప్యాకేజీ లేకపోతే పరిశ్రమలు వెనకబడిన ప్రాంతాలకు వస్తాయా? లోటు బజెట్‌ పూడ్చడం మా బాధ్యత అని విభజన చట్టంలో కేంద్రం హామీ యిచ్చింది. ఇప్పటిదాకా దాన్ని పూడ్చే ప్రయత్నమే చేయటం లేదు కేంద్రం. ఇక్కడ రాష్ట్ర ఆదాయానికి, ఖర్చుకి పొంతన లేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర నిధులకు సంబంధించి 80 వేల కోట్ల ఖర్చు బజెట్‌లో చూపించగా జూన్‌ నుంచి డిసెంబరు వరకు 29 వేల కోట్లు మాత్రమే ఖర్చయింది. అనేక కీలక శాఖలకు బజెట్‌లో కేటాయించిన మొత్తంలో 20% కూడా ఖర్చు కాలేదుట. ఇరిగేషన్‌కు 4800 కోట్లు ఎలాట్‌ చేస్తే డిసెంబరు వరకు 164 కోట్లు మాత్రమే ఖర్చయింది. విద్యుత్‌ కోసం 7110 కోట్లు కేటాయిస్తే 1945 కోట్లు మాత్రమే ఖర్చయింది. 

కీలకరంగాల్లో యిలా వుంటే రేపు కొరత వస్తే ఎలా? ఆశించిన రీతిలో పరిశ్రమలు ప్రారంభం కాక మిగులు విద్యుత్‌ కనబడుతోంది కానీ నిజంగా యిండస్ట్రీస్‌ వస్తే కోతలే కదా! ఎమ్‌సెట్‌ నుండి కృష్ణా జలాల దాకా ప్రతీదీ తెలంగాణతో పంచాయితీయే. కేంద్రానికి మొత్తుకుంటే వాళ్లు 'మీ యిద్దరూ కూర్చుని పరిష్కరించుకోండి, ఒక్కోళ్లూ ఒక్కో గణాంకాలు యిస్తున్నారు, మాకేం అర్థం కావటం లేదు' అంటున్నారు. 'ఆయనే వుంటే...' అనే సామెతలా యిద్దరూ రాజీపడితే మధ్యవర్తుల నెందుకు పిలుస్తారు? కేంద్రం తన బాధ్యత పూర్తిగా విస్మరించింది. గవర్నరుగారి వద్ద మొఱ పెట్టుకుంటే ఆయన విని వూరుకుంటాడు. పోనీ కదాని ఓ సలహా పడేస్తే వీళ్లిద్దరూ విని వూరుకుంటారు. ఎవరూ ఎవరి మాటా వినే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీదీ కావాలని వివాదాస్పదం చేస్తోందని సులభంగానే అర్థమవుతుంది. అయినా దాన్ని కట్టడి చేయడానికి గవర్నరుకాని, కేంద్రం కాని ముందుకు రావటం లేదు. అంతా భేషుగ్గా వుంది, నో ప్రాబ్లెమ్స్‌ అంటారు నరసింహన్‌. ఆయనకు రెండు ప్రభుత్వాలూ 'నా' ప్రభుత్వాలే! ఇన్ని కష్టాలతో కొత్తగా పుట్టిన ఆంధ్రరాష్ట్రం ఎలా మనుగడ సాగిస్తుందో ఎవరికీ తెలియటం లేదు. 

ఇలాటి పరిస్థితుల్లో భారీ రాజధాని ఎందుకు ప్లాన్‌ చేయాలో బాబుగారే చెప్పాలి. తక్కిన ఎవర్నీ మాట్లాడవద్దని ఆయన శాసిస్తున్నారు కాబట్టి! రాజధానికి రూ. 2000-3000 కోట్ల దాకా కేంద్రం యిస్తుందని బాబు మంత్రివర్గ సహచరులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. రాజధాని అంటే నాలుగు లక్షల కోట్లు కావాలి అని ఆయన గతంలో చేసిన డిమాండ్‌లో యిది ఎన్నో వంతో మీరే లెక్కవేసుకోండి. డెసిమల్‌ తర్వాత సున్నా యిప్పుడే కనబడుతోంది. చివరకి ఎన్ని సున్నాలు చుడతారో ఏమో! గతంలో విభజన చేసిన రాష్ట్రాల రాజధానులే నిధుల కోసం అలో లక్ష్మణా అని ఏడుస్తున్నాయి. మూలవిరాట్టు ముష్టెత్తుకుంటూ వుంటే ఉత్సవ విగ్రహాలు వచ్చి మా మాటేమిటి అని అడిగాయని సామెత. బిజెపి స్వయంగా విభజించిన రాష్ట్రాల గతే అలా వుంటే, కాంగ్రెసు విభజించిన రాష్ట్రాన్ని ఉద్ధరించే పని బిజెపి పెట్టుకుంటుందా? ఇది అర్థం చేసుకోకుండా రాజధానిపై బాబు అంత దూకుడు ప్రదర్శించడం అవసరమా? ఎప్పుడు కేంద్ర నిధులు వస్తాయో, ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయో తెలియదు. ఈ లోపుగానే అర్జంటుగా రాజధానిగా నోటిఫై చేసిన ప్రాంతాల్లో పంటలు ఆపించేస్తున్నారు. మరి అక్కడి జనాభా ఏం తిని బతకాలి? రైతులు, కౌలుదారులు, రైతు కూలీల జీవనోపాధి ఎలా? వీళ్లందరూ వెంటనే వేరే వృత్తికి మరలగలరా? నెలకు వీళ్లు యిస్తానంటున్న రూ.2500 రూ.లతో కుటుంబం మొత్తం బతకగలదా?

దేశంలో కల్లా అత్యంత సుందరమైన, ప్రణాళికాబద్ధమైన రాజధాని చండీగఢ్‌. మొదటి థలో 9 వేల ఎకరాలు తీసుకుని కట్టారు, రెండో థలో 6 వేల ఎకరాలు తీసుకుని కట్టారు. రెండు ఫేజ్‌లు పూర్తయ్యేసరికి 50 ఏళ్లు పట్టింది. మరి ఆంధ్ర రాజధాని 50 వేల ఎకరాలంటున్నారు. ఎన్నేళ్లు పడుతుందో ఊహించుకుంటే గుండెలదురుతాయి. మీ భూములు యిచ్చేస్తే కమ్మర్షియల్‌ స్పేస్‌ యిస్తాం, దాన్ని అమ్ముకుంటే మీకు డబ్బులే డబ్బులు అంటున్నారు. రాజధాని కట్టగానే జనాభా యిబ్బడిముబ్బడిగా వచ్చి పడిపోయి డిమాండ్‌ పెంచేస్తారా? ఇంత జనాభా ఎక్కణ్నుంచి వస్తారు? 60 ఏళ్ల తర్వాత చండీగఢ్‌ జనాభా 12 లక్షలు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ ప్రస్తుత జనాభా రెండు లక్షల చిల్లర వుంటుంది. అది చేరడానికి 20 ఏళ్లు పట్టింది. అసలు ఏదైనా కట్టాలన్నా, ఆకర్షించి జనాల్ని పోగేయాలన్నా  డబ్బు కావాలి. అదే కొరతగా వుంది. వచ్చే నెలకు జీతాలివ్వడానికి డబ్బు లేదని బాబే చెప్పారు. రిటైర్‌మెంట్‌ వయసు 58 నుంచి 60 కి పెంచినపుడే అన్నారు - యిది ఉద్యోగులపై ప్రేమ కాదు, రిటైర్‌మెంట్‌ చెల్లింపులు మరో రెండేళ్లు వాయిదా వేసేందుకే అని. అది నిజమే అనిపిస్తోంది. 

ఆశావహ దృక్పథం వుండడంలో తప్పేమీ లేదు. చీకట్లో చిరుదీపం పేరే ఆశ అన్నారు. రేపు బాగుంటుందనే ఆశ లేకపోతే జీవించడం కష్టం. కానీ దురాశ పడకూడదు, ఆచరణ సాధ్యం కాని పగటి కలలు కనకూడదు. దురాశ నిరాశకు దారి తీస్తుంది. నిరాశ తట్టుకోవడం రాకపోతే ఎప్పటికీ చీకట్లోనే మగ్గుతాడు. మబ్బులు కమ్మి ఆకాశం కనబడనపుడు వెనక్కాల యింద్రధనుస్సు వుందనుకోవచ్చు. కానీ మబ్బులు వీడుతూంటే వాటి వెనకాల ఏముందో తెలిసి జోరు తగ్గుతుంది. ఆంధ్రప్రజల విషయంలో అదే జరిగింది. రాష్ట్రం విడిపోతే హైదరాబాదు పోయినా, దానిని తలదన్నేలా తమకు రాజధాని అమరుతుందని, వికేంద్రీకరణ జరిగి, కేంద్రపు నిధుల వర్షం కురిసి, ఎక్కడ చూసినా సిరి తాండవిస్తుందని అనుకున్నారు. ఆ ఆశాభావం రియల్‌ఎస్టేటులో ప్రతిఫలించింది. విపరీతంగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రాజధాని యిక్కడ వస్తుందంటే, కాదు యిక్కడ వస్తుందంటూ ప్రతీ చోటా స్థలాలు అమ్మేశారు. కాదు ఫలానా చోటే అనగానే తక్కిన చోట్ల చప్పబడింది. రాజధాని కాకపోయినా ఐఐటి వస్తుంది, పరిశ్రమలు వస్తాయి అంటూ ఆశలు చూపితే ఓ స్థాయిలోనైనా కొనుగోళ్లు జరిగాయి. ప్రత్యేక హోదా హుళక్కి అనడం, కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వుండడం యివి చూశాక క్రయవిక్రయాలు తగ్గుముఖం పట్టాయి. పెరిగిన భూమి రేట్లు బలం కాదు, వాపు అని అందరూ గ్రహించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో రిజిస్ట్రేషన్ల జోరు చూసి ప్రభుత్వం బజెట్‌లో మార్చి నాటికి దానిపై రూ. 3405 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే జనవరి మూడోవారానికి 2129 కోట్లు మాత్రమే వచ్చింది. మిగిలినది రెండు నెలలు మాత్రమే. ప్రజలు ఆశలు నేలమీదే తారాడుతున్నాయి. వారికి లేనిపోని ఆశలు కల్పించడం దుర్మార్గం.

బాబు ప్రయత్నలోపం లేదు. కేంద్రాన్ని వెళ్లి అడుగుతూనే వున్నారు. సంక్రాంతికి హరిదాసులా వెళితే వాళ్లు భాండం నింపలేదు సరికదా  మొండి చెయ్యి చూపించారు. బాబు పరపతి ఢిల్లీలో చెల్లుబాటు కావటం లేదని తెలిస్తే నగుబాటు అనుకుని కాబోలు, సుజనా చౌదరి కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి చేయబోతున్న సాయం యిది అంటూ జాబితా చదివారు. ఆయన సైన్సు, టెక్నాలజీ మంత్రి. ఆయన చదివిన లిస్టు వేరే శాఖలకు సంబంధించినది. ఆయన కాకుండా ఏ బిజెపి ఉత్తరాది కేంద్రమంత్రో ఆ ముక్కలు చెప్పి వుంటే కాస్త నమ్మకం, ధైర్యం కలిగేవి. వెంకయ్యనాయుడి మాటలు ఏ మాత్రం నమ్మకూడదని ప్రత్యేక హోదా విషయంలోనే తెలిసిపోయింది. మోదీ యీయన్ని పట్టించుకుంటున్నట్టు లేదని అఖిలాంధ్రులకు అర్థమైందని సందేహం వచ్చి చౌదరిని దింపి ఆయన చేత చెప్పించి ఆంధ్రప్రజలకు మరిన్ని ఆశలు పెట్టిస్తున్నది బాబే కదా. అందుకే ఆయన విషయంలో ఆశాజీవి అనే మాటకు వేరే అర్థం స్ఫురిస్తోంది.

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015)

[email protected]

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?