Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌ : శంకర్‌ జైకిషన్‌లతో ఆరుద్ర

దర్శకనిర్మాతగా ఆర్‌ కె బ్యానర్‌ పెట్టి రాజ్‌ కపూర్‌ తీసిన తొలి సినిమా ''ఆగ్‌'' (1948) ప్రేమ కథ. ఓ మాదిరిగా ఆడలేదు. తర్వాత తీసిన రెండు జంటల ప్రేమకథ ''బర్సాత్‌'' (1948) చాలా బాగా హిట్‌ అయింది. ఆ తర్వాత తీసిన ''ఆవారా'' (1951) సామాజిక అంశాలతో తీసినది. అది యింకా బాగా హిట్‌ అయింది. అప్పుడు మళ్లీ ప్రేమకథ తీద్దామనుకుని దేవదాసు ఛాయల్లో తన అసిస్టెంటు రాజా నవాథే దర్శకత్వంలో ''ఆహ్‌'' (1953) తీశాడు. అప్పటికే తన పేరు భారతదేశమంతా పాప్యులర్‌ కావడంతో ఆ సినిమాను అప్పటికే ప్రధాన సినీరంగాలైన తెలుగులో ''ప్రేమలేఖలు''గా తమిళంలో ''అవన్‌''గా తీద్దామనుకున్నాడు. అయితే యివి డబ్బింగులు కావు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాటలు ఏకకాలంలో విడివిడిగా రికార్డు చేశారు. రాజ్‌ కపూర్‌, నర్గీస్‌, ప్రాణ్‌ ప్రధాన పాత్రలు ధరించారు. వాళ్లు హిందీలో డైలాగులు చెప్పాక వాళ్ల డైలాగులను వేరేవారి చేత చెప్పించి ట్రాక్‌ మార్పిడి చేయించారు. సౌండ్‌ విభాగంలో అప్పటికి వచ్చిన అధునాతన పద్ధతుల్ని ఉపయోగించుకున్న నూతన ప్రయోగం. 

ఆర్‌ కె బ్యానర్‌ శంకర్‌-జైకిషన్‌ల గొప్ప సంగీతానికి పెట్టినది పేరు. శంకర్‌ పూర్తి పేరు శంకర్‌ రఘువంశీ. పంజాబీ కుటుంబానికి చెందిన అతను 1922లో మధ్యప్రదేశ్‌లో పుట్టాడు. హైదరాబాదులో పెరిగాడు. అందుచేత తెలుగు కూడా వచ్చు. చదువు పెద్దగా సాగలేదు. నాటకాల్లో నటుడిగా వెళదామనుకుని కథక్‌ డాన్సు నేర్చుకున్నాడు. దానితో బాటే సరదాగా తబలా కూడా నేర్చాడు. బొంబాయికి వెళ్లి ముందు ఓ చిన్న నాటకాల కంపెనీలో చేరి, తర్వాత రాజ్‌ కపూర్‌ తండ్రి, సినీనటుడు ఐన పృథ్వీరాజ్‌ కపూర్‌ నడిపే పృథ్వీ థియేటర్స్‌లో చేరాడు. అక్కడ చిన్నచిన్న వేషాలు వేస్తూనే, ఆర్కెస్ట్రాలో తబలా వాయించేవాడు. ఓ సారి హార్మోనియం వాయించేవాడు కావాలని మేనేజరు చెపితే వెతికి వెతికి జైకిషన్‌ను పట్టుకుని వచ్చాడు. జైకిషన్‌ అతని కంటె పదేళ్లు చిన్నవాడు. గుజరాత్‌లోని వల్సాడ్‌లో పుట్టాడు. ఎకార్డియన్‌ చాలా బాగా వాయించేవాడు. అతనూ బొంబాయి వచ్చి నాటకాలకు సంగీతం యిచ్చే బృందంలో వుండేవాడు. శంకర్‌ జైకిషన్‌ కలిసి పృథ్వీ థియేటర్సులో ఒక టీముగా ఏర్పడ్డారు. స్వభావరీత్యా యిద్దరికీ తేడా వుంది. అయినా యిద్దరి మధ్య చక్కని అవగాహన వుంది. అందుకే 18 ఏళ్ల పాటు వాళ్లు సినీసంగీతాన్ని ఏలారు. 150 సినిమాలకు సంగీతాన్ని అందించారు. వాటిలో చాలా భాగం మ్యూజికల్‌గానే కాక విడిగా కూడా హిట్సే. 

రాజ్‌ కపూర్‌ తన మొదటి సినిమా తీద్దామనుకున్నపుడు పృథ్వీ థియేటర్స్‌లోని నాటకాలకు సంగీతం యిచ్చే రామ్‌ గంగూలీని ఎంచుకున్నాడు. అతనికి అసిస్టెంట్లుగా శంకర్‌ జైకిషన్లను పెట్టాడు. ఆ సినిమా గ్రామఫోన్‌ రికార్డులపై మ్యూజిక్‌ బై రామ్‌ గంగూపీల, ట్యూన్‌ బై.. అని  శంకర్‌ పేరు కొన్నిటిలో జైకిషన్‌ పేరు మరి కొన్నిటిలో కనబడుతుంది. ఒక్కో ట్యూన్‌కు వాళ్లకు రూ.150 చొ||న ముట్టింది. తర్వాత ''బర్సాత్‌''కి కూడా రామ్‌ గంగూలీనే పెట్టుకున్నాడు. అతను రెండు పాటలు ట్యూన్‌ చేశాడు కూడా. కానీ తను అనుకుంటున్న మ్యూజికల్‌కు యితను చాలడని రాజ్‌కు అనిపించింది. మెహబూబ్‌ ఖాన్‌ ''అందాజ్‌'' అని మ్యూజికల్‌ యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ సినిమా తీస్తున్నాడు. దానిలో సంగీత దర్శకుడు నౌషాద్‌ లతా అనే కొత్తమ్మాయి చేత బ్రహ్మాండంగా పాడిస్తున్నాడు. ఆ సినిమాలో దిలీప్‌, నర్గీస్‌లతో బాటు తను కూడా నటిస్తున్నాడు కాబట్టి దాని గురించి బాగా తెలుసు. తన సినిమా కూడా దానికి తూగేట్టు వుండాలంటే కొత్తరకం సంగీతం కావాలనుకుని శంకర్‌-జైకిషన్లను ఆ బాధ్యత అప్పగిద్దామనుకున్నాడు. రామ్‌ గంగూలీని తీసేయడానికి ఏదో సాకు కావల్సి వచ్చింది. బర్సాత్‌లో తను కట్టిన ట్యూన్లను అటూయిటూ మార్చి వేరే నిర్మాతలకు యిస్తున్నాడని ఆరోపించి వీళ్లను తెచ్చాడు. శంకర్‌ జైకిషన్ల రాజ్‌ కపూర్‌ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. లతాను గొప్ప గాయనిగా తీర్చిదిద్దారు. వారిద్దరిది ఫిలాసఫీ ఒకటే. వాళ్లు శాస్త్రీయ సంగీతాన్ని పండితుల వద్ద అభ్యసించలేదు. పాట అనేది చెవి కింపుగా, అతి సామాన్యుడికి సైతం బోధపడేలా వుండాలని వారి సిద్ధాంతం. క్లిష్టమైన రాగాలను కూడా సులువుగా మార్చి జనం పాడుకునేట్లు మలచాలి తప్ప తమ ప్రజ్ఞ చూపడానికి సినిమా రంగాన్ని వాడుకోకూడదని అనుకునేవారు. ప్రతీ పాటలో నవ్యత్వం చూపాలని తపించేవారు. తాళాన్నో, స్థాయినో మార్చి ప్రయోగాలు చేసి, కొత్త తరహాలో అందించేవారు. హిందీ రాని ప్రాంతాల్లో కూడా వారి పాటలు ప్రజాదరణ పొందాయనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.  

తెలుగులో కూడా తనకు మార్కెట్‌ ఏర్పడిందని తెలిసే రాజ్‌ కపూర్‌ ''ప్రేమలేఖలు'' తలపెట్టాడు. తెలుగులో పాటలు ఎవరిచేత రాయించాలని తనకు తెలిసున్న తెలుగు డైరక్టర్లు ఎల్‌ వి ప్రసాద్‌ను సంప్రదించాడు. ఆయనతో బాటు భానుమతి భర్త, నిర్మాత, దర్శకుడు అయిన భరణీ పిక్చర్స్‌ రామకృష్ణగారిని కూడా అడిగాడు. వాళ్లు ఆరుద్ర పేరు సూచించారు. రాజ్‌ కపూర్‌ ఆరుద్రను బొంబాయికి రప్పించి స్క్రిప్ట్‌ చేతికి యిచ్చాడు. ఆరుద్ర మొత్తమంతా చదివి, వారం రోజుల్లో డైలాగులు రాసి యిచ్చేశారు. ఇక పాటలు రాయాలి. చాలానే వున్నాయి. మ్యూజిక్‌ సమకూర్చే శంకర్‌ జైకిషన్లు చాలా బిజీగా వుంటారు కాబట్టి అన్ని పాటలూ ఒకే షెడ్యూలులో పూర్తి కాలేదు. మూడు విడతల్లో సాగింది. మొత్తం ఆరేడు నెలలు పట్టింది. ఆరుద్రతో బాటు తమిళ పాటలు రాసే కణ్ణదాసన్‌ కూడా వెళ్లేవారు. శంకర్‌ జైకిషన్ల మ్యూజిక్‌ రూములో రోజూ పొద్దున్న పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శంకర్‌, జైకిషన్‌, పాటల రచయితలు శైలేంద్ర, హస్రత్‌ జయపురి, ఆరుద్ర, కణ్ణదాసన్లు కూర్చునేవారు. మొదట హిందీ ట్యూను, సాహిత్యం మీద కూర్చునేవారు. అవి ఒక రూపానికి వచ్చాక రాజ్‌ వచ్చి వాటిని ఓకే చేసేవాడు. ఆ తర్వాత తెలుగు వెర్షన్‌ ఆరుద్ర, కణ్ణదాసన్‌ తమిళ వెర్షన్‌ వారి వారి భాషల్లో రాసేవారు. ఒకరి తర్వాత మరొకరు చదివి వినిపిస్తే జైకిషన్‌ గుజరాతీ లిపిలో వాటిని రాసుకుని తను పాడి వినిపించేవాడు. శంకర్‌కు ఎలాగూ తెలుగు వచ్చు. అప్పుడు రాజ్‌ కపూర్‌ మళ్లీ వచ్చి వాటిని విని ఓకే చేశాక రికార్డింగుకి సిద్ధమయ్యేవి.

హిందీ లిరిక్‌ను తెలుగు చేయడంలో ఆరుద్ర చాలా స్వతంత్రంగా వ్యవహరించారు. ''రాజాకీ ఆయేగీ బారాత్‌'' అని హీరోయిన్‌ పాట వుంది. పెళ్లికై వరుడు గుఱ్ఱమెక్కి వచ్చే బారాత్‌  సంప్రదాయం ఉత్తరాదిన వుంది కానీ తెలుగునాట లేదు. అందుకని ఆరుద్ర ''పందింట్లో పెళ్లవుతున్నాది..'' అని మార్చేశారు. ''ఏ శామ్‌కీ తన్‌హాయియాఁ'' తెలుగులో '''ఏకాంతమూ, సాయంతమూ, మది నీకే వేచేనులే..'' అయింది. అలాగే ''రాత్‌ అంధేరీ, దూర్‌ సవేరా'' అనే పల్లవిని ''విధి రాకాసి, కత్తులు దూసి'' అని మార్చారు. చీకటి రాత్రి అని ఒరిజినల్‌లో వుంటే విధిని తీసుకుని వచ్చి దాని చేత కత్తులు దూయించారు. ''ఛోటీసీ ఏ జిందగానీ, చార్‌ దిన్‌కీ కహానీ'' పాటను ''పాడు జీవితమూ యవ్వనమూ, మూడు నాళ్ల ముచ్చట..''గా ఆరుద్ర మార్చారు. భావాన్ని మాత్రం గ్రహించి తెలుగుతనం, సొంత కవిత్వం జోడించారు.  

హిందీ సినిమాలో పాటలు ముకేష్‌, లతా పాడారు. వాళ్లే తెలుగు, తమిళాల్లో పాడితే బాగుండునని యూనిట్‌ అంతా అనుకున్నారు. రెండు తెలుగు పాటలు, రెండు తమిళ పాటలు రికార్డు చేశారు. ముకేష్‌కు తెలుగు ఉచ్చారణ నేర్పడం ఆరుద్రకు కొంచెం కష్టమైంది కానీ లతా విషయంలో ఏ యిబ్బందీ లేదు. తెలుగులో వున్న అక్షరాలన్నీ మరాఠీలోనూ వున్నాయి కాబట్టి ఆమె అవలీలగా, చక్కగా పాడింది. రాజ్‌కు వ్యాపార దృక్కోణం కూడా బాగా వుంది. తమకు పరిచయం లేని ముకేశ్‌, లతాల కంఠాలను దక్షిణాది ప్రేక్షకులు అంగీకరిస్తారా లేదాన్న సందేహం వచ్చింది. అప్పట్లో అతని ఫ్యామిలీ డాక్టరు డా|| గంటి అనే తెలుగాయన. ఆయన ద్వారా, యితరత్రా తెలిసున్న తెలుగు, తమిళ కుటుంబాలలోని వ్యక్తులను ఓ రోజు రికార్డింగు థియేటరుకు పిలిపించి పాటలు వినిపించాడు. ఎలా వున్నాయన్నాడు. తెలుగువారంతా 'పాటలు చక్కగా వున్నాయి, ఉచ్చారణ దోషాల్లేవు' అని తీర్పు చెప్పారు. కానీ తమిళులు మాత్రం వంకలు పెట్టారు. లతా, ముకేశ్‌లు తమిళాన్ని సరిగ్గా ఉచ్చరించలేదని ఫిర్యాదు చేశారు. రాజ్‌ గందరగోళ పడ్డాడు. వరుసగా హిట్‌లు కొడుతూ వస్తున్న తను తొలిసారి దక్షిణాది భాషల్లో సినిమా తీస్తూ లోపాలతో తీస్తే ఎలా అనుకుని 'సరే తెలుగు, తమిళ పాటలను దక్షిణాది గాయనీగాయకులతోనే పాడిస్తాను' అనుకుని ఎవరైతే బాగుంటుందని మళ్లీ మద్రాసులోని తన సినీమిత్రులను అడిగాడు. హీరోయిన్‌కు ఎం.ఎల్‌.వసంతకుమారి అయితే బాగుంటుంది అన్నారు వారు. 

మీ ఉద్దేశం ఏమిటి అని రాజ్‌ ఆరుద్ర నడిగితే ''ఆవిడ గొప్ప శాస్త్రీయసంగీత గాయని. సినిమా పాటలు కూడా బాగా పాడతారు. అయినా హీరోయిన్‌ గొంతుకలో నాజూకుతనం, ముగ్ధత్వం ధ్వనించాలి. ఆవిడది పరిణతి చెందిన వాయిస్‌. జిక్కీ అని యిప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న గాయని వుంది. వయసులో చిన్నామె. ఆవిడ అయితే బాగుంటుంది.'' అన్నారు. రాజ్‌కు ఆయన వాదన నచ్చింది. జిక్కికి తమిళం కూడా వచ్చు కాబట్టి రెండు వెర్షన్లకు ఆవిణ్నే సెలక్టు చేసేశారు. ఇక హీరోకి ఎవరు పాడాలి? ఘంటసాల గారికి ఆరోగ్యం బాగా లేదు. పైగా ఆయనదీ గంభీరమైన వాయిస్‌. ఈ సినిమాలో హీరో కూడా నాజూకు వ్యక్తే. (రాజ్‌ కపూర్‌ అప్పట్లో సన్నగా వుండేవాడు) లేతగా వుండే వాయిస్‌ ఎవరిదా అని ఆలోచిస్తే ఆరుద్రకు ఎఎం రాజా గుర్తుకు వచ్చాడు. అతను పచ్చయప్పాస్‌ కాలేజీలో చదివే రోజుల్లో తెలుగు విద్యార్థి విజ్ఞాన సమితి సభల్లో భావయుక్తంగా, మృదువుగా పాడడం యీయనకు తెలుసు. రాజ్‌ కపూర్‌ ఆయన్నీ ఓకే చేశాడు. రాజాకూ తమిళం వచ్చు కాబట్టి రెండు వెర్షన్లలో పాడడానికి రాజాను సెలక్టు చేశారు. జిక్కీ, రాజాలు యిద్దరూ బొంబాయి వచ్చి పాటలు నేర్చుకుని రికార్డు చేశారు.

''ఆహ్‌'' సినిమా హిందీలో ఫెయిలయింది కానీ దాని తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ బాగా ఆడాయి. పాటలన్నీ తెలుగు శ్రోతలను చాలా ఏళ్లు అలరించాయి. అయినా రాజ్‌ కపూర్‌ మళ్లీ తెలుగులో తీసే సాహసం చేయలేదు. ఈ సినిమా ధర్మమాని ఆరుద్ర, జిక్కి, రాజాలకు మంచి మార్కెట్‌ ఏర్పడింది. కొద్ది కాలానికి జిక్కీ, రాజా భార్యాభర్తలయ్యారు. ''ప్రేమలేఖలు'' గురించి తన ''సినీమినీ కబుర్లు''లో రాసిన ఆరుద్ర ఓ విషయం చెప్పారు. తన పాటలను జిక్కీ చేత పాడించినందుకు లతా చిన్నతనం ఫీలైందట. ''నా గొంతుక మీ భాషకు పనికి రాకపోయిందా?'' అని ఆరుద్రతో నిష్ఠూరం వేసిందట. ''తెలుగుకి సంబంధించినంత వరకు నీకు మా వాళ్లంతా నూటికి నూరు మార్కులు వేశారు.   తెలుగు పాటలు వసంతకుమారి చేత పాడిస్తానని రాజ్‌ అన్నపుడు నువ్వు పాడితే చాలని నేను చెప్పాను. కావాలంటే ఆయన్ను అడుగు'' అన్నారట. అప్పుడు లతాకు తమిళులపై కోపం మరలింది. ''చూస్తూ వుండండి. మద్రాసులోనే తమిళ ప్రేక్షకుల ముందు నేను త్యాగరాజ కీర్తన చేసి ఓహో అనిపిస్తాను. అది తెలుగేగా. పైగా తమిళ పాటలు కూడా పాడతాను.'' అని శపథం పట్టిందట. తర్వాతి రోజుల్లో లతా తెలుగు, తమిళ సినిమాల్లో సినిమా పాటలు పాడింది కానీ త్యాగరాజ కీర్తన పాడేటంత తీరిక దొరకలేదు.

(ఫోటో - ఆర్‌ మ్యూజికల్‌ టీము - ముందు వరుసలో రాజ్‌, జైకిషన్‌, శంకర్‌, వెనుక వరుసలో శైలేంద్ర, ముకేష్‌, హస్రత్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?