Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: అజిత్‌ పెళ్లి, శిందే చావుకి వచ్చిందా?

ఎమ్బీయస్‍: అజిత్‌ పెళ్లి, శిందే చావుకి వచ్చిందా?

సవతి పోరు వేగలేక వేరే మొగుణ్ని కట్టుకుంటే, ఆ సవతి యీ మొగుడి సరసనా చేరితే ఆ మహిళ గతేమిటి? మహారాష్ట్ర ముఖ్యమంత్రి శిందే గతే! ఎంవిఏ సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన ముఖ్యమంత్రి ఉన్నా, ఎన్‌సిపి వర్గం దాష్టీకం నచ్చక శిందే బయటకు వచ్చేసి బిజెపి పంచన చేరాడు. హమ్మయ్య అని నిట్టూర్చే లోపునే ఎన్సీపీలో చీలిక వచ్చి అజిత్ పవార్ బిజెపి వైపు వచ్చేశాడు. సుబ్బి పెళ్లి ఎంకి చావుకి వచ్చినట్లు, అజిత్ బిజెపితో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి కావడం శిందే చాప కిందకి నీళ్లు తెచ్చిందా అనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల దాకా శిందేకు ముప్పు లేకపోవచ్చు కానీ తను యిప్పటిదాకా అసహ్యించుకుంటూ వచ్చిన అజిత్‌తోనే కలిసి పని చేయరావలసి వచ్చింది కదా అని శిందే బాధ! పైగా అజిత్‌కు ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ యివ్వాల్సి వచ్చింది. దిలీప్ పటేల్‌కి సహకారం, ఛగన్ భుజ్‌బల్‌కు పౌర సరఫరాలు, ధనంజయ్ ముండేకు వ్యవసాయం.. యిలా అజిత్‌తో పాటు వచ్చిన ఎన్‌సిపి వాళ్లందరికీ కీలక శాఖలు దక్కాయి.

అజిత్‌కు ఆర్థిక శాఖ యివ్వడం శిందే వర్గపు ఎమ్మెల్యేలను హతాశులను చేసింది. ఎంవిఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా అజిత్ తమ నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయకుండా ఎన్సీపీ వాళ్లకే చేసుకున్నాడని కోపగించుకునే, వాళ్లు ఎంవిఏలోంచి బయటకు వచ్చారు. తీరా చూస్తే మళ్లీ యీ ప్రభుత్వంలోనూ అతనే దాపురించాడు. శిందే ప్రభుత్వం ఏర్పడినప్పుడు 40 రోజుల పాటు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తప్ప ఎవరూ లేకుండా పాలించారు. ఆ తర్వాత బిజెపి నుంచి 9 మంది, శిందే వర్గం నుంచి 9 మంది మంత్రులయ్యారు. ఇక అప్పణ్నుంచి కాబినెట్ విస్తరణ అంటూ ఊరిస్తూ 10 నెలలు గడిపేశారు. తీరా చూస్తే మరో 9 మంది ఎన్సీపీ వాళ్లు వచ్చి చేరారు. కాబినెట్‌లో అడుగూబొడుగూ పదవులు ఖాళీగా ఉన్నాయి కానీ అవైనా తమకు దక్కుతుందో లేదో తెలియదు. అదీ వాళ్ల బాధ.

పైగా శిందే వర్గపు ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలని ఉద్ధవ్ వర్గం వేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పీకర్‌కు నోటీసిచ్చింది. స్పీకర్ అజిత్ వర్గానికి చెందినవాడే. శిందే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాడంటే శిందే పని అయిపోయినట్లే! అంతమాత్రాన ఉద్ధవ్ వర్గానికి మేలు జరుగుతుందని అనుకోవడానికి లేదు. చట్టరీత్యా ఏం జరిగినా కానీ ప్రజల దృష్టిలో శిందే వర్గం పలచనైంది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అని వెక్కిరించడానికి అవకాశం చిక్కింది. వెన్నుపోటు దారులకు యిలా కావల్సిందే అని దెప్పడానికి సందిచ్చినట్లయింది. అజిత్ రాజకీయ వ్యూహం గురించి ‘‘శిందే చాప కిందకు నీళ్లు’’ అనే ఏప్రిల్ నాటి వ్యాసంలో రాశాను. తర్వాత కర్ణాటక ఎన్నికలు అయ్యేవరకు ఆగుదామని అనుకున్నారని వార్తలు వచ్చాయి. సెప్టెంబరు నాటికి అజిత్ ముఖ్యమంత్రి అవుతాడని, శిందే దిగిపోతాడని ఉద్ధవ్ శివసేన, కాంగ్రెసు అంటూ వచ్చారు. ఇప్పుడది నిజమయ్యేట్లుంది.

ఇదే జరిగితే అజిత్ తమతో చేతులు కలిపేవరకూ బిజెపి శిందేని పావుగా వాడుకుని వదిలేసిందని అనవచ్చు. ఇది రాజకీయంగా అనైతికం అనడానికి లేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ పత్తిత్తులు కారు. ఎవరి నాటకం వారు ఆడారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన బిజెపి ప్రభుత్వంలో చేరడానికి తటపటాయిస్తున్నపుడు ఎన్సీపీ బయట నుంచి మద్దతు ఆఫర్ చేసింది. కానీ శివసేన మనసు మార్చుకుని ప్రభుత్వంలో చేరింది. కాంగ్రెసు-ముక్త్ భారత్ ప్లానులో భాగంగా బిజెపి-సేన-ఎన్సీపీ కూటమి ఏర్పరుద్దామని బిజెపి ఆలోచించి, సుప్రియా సూలేను కేంద్ర మంత్రిగా చేద్దామనుకుంది. కానీ బిజెపి రాష్ట్ర యూనిట్ దీన్ని వ్యతిరేకించింది. ‘మనం కాంగ్రెసు-ఎన్సీపీ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసి యిన్ని సీట్లు గెలిచాం. ఇప్పుడు ఎన్సీపీని ఎన్డీఏలో కలుపుకుంటే జనం మనను విశ్వసించరు.’ అన్నారు రాష్ట్ర నాయకులు. దాంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది.

2019 ఎన్నికలలో కలిసి పోటీ చేసిన బిజెపి-శివసేనల మధ్య ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి గురించి పొరపొచ్చాలు వచ్చినపుడు ‘మీరు శివసేనను బయటకు తోసేయండి, మేం వచ్చి మద్దతిస్తాం’ అని శరద్ పవార్ ఫడణవీస్‌తో బేరాలాడాడు. ఆ విషయం ఈ జూన్‌లో ఫడణవీస్ మీడియాకు చెప్పేశాడు. దాంతో శరద్ ఔను నిజమే అని ఒప్పుకుంటూనే ‘ఫడణవీస్ అధికారదాహాన్ని బయట పెట్టడానికి అలా చేశాను. నేను వేసిన గుగ్లీకి అతని వికెట్ పడిపోయింది.’ అని చెప్పుకున్నాడు. అతని డబుల్ గేమ్‌తో ఒళ్లు మండిన బిజెపి శరద్‌కు బుద్ధి చెప్పాలని యిన్నాళ్లూ చూస్తూ ఉంది. శరద్ ఇలా అన్న వారానికే బిజెపి శరద్‌పై గుగ్లీ వేసింది. అతని అన్న కొడుకు అజిత్, మరో ఎనిమిది సీనియర్ ఎన్సీపీ నాయకులు బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులై పోయారు. శరద్ రాజీనామా డ్రామా ఆడి, తన కూతురు సుప్రియను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా చేసినప్పుడు అజిత్ యిలాటి ఫిరాయింపుకి పాల్పడతాడని అందరూ అనుకున్నారు. కానీ అజిత్‌తో పాటు ఎన్సీపీలో ఉపాధ్యక్షుడి పదవి దక్కిన ప్రఫుల్ పటేల్ కూడా ఫిరాయించడం ఆశ్చర్యం కలిగించింది.

64 ఏళ్ల అజిత్ 1982 లో బాబాయి శిష్యరికంలో రాజకీయాల్లోకి వచ్చి ఓ సహకార చక్కెర మిల్లు బోర్డు మెంబరయ్యాడు. 1991లో బారామతి లోకసభకు ఎన్నికయ్యాడు. కానీ శరద్‌ జాతీయ రాజకీయాలకు వెళ్లి పివి నరసింహారావు హయాంలో రక్షణ మంత్రి అవుదామనుకోవడంతో అతని కోసం అజిత్ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసి, అదే బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచాడు. 1999లో మంత్రి అయ్యాడు. అక్కణ్నుంచి ఆరుసార్లు గెలిచాడు. 2019లో 1.65 లక్షల మెజారిటీతో గెలిచాడు. ఉప ముఖ్యమంత్రిగా ఆరు సార్లు చేసినా తను ముఖ్యమంత్రి కావలసినవాణ్నని కానీ బాబాయి తనను అణచివేశాడనే ఫీలింగు అతనిలో బలంగా ఉంది.

2019లో తను బిజెపి వైపు వెళితే శరద్ పవార్ విధిలేక తనకు మద్దతు పలుకుతాడని అజిత్ ఆశించి ఉంటాడు. అది జరగలేదు. అవకాశవాదిగా పేరు తెచ్చుకోవడం తప్ప అజిత్ సాధించలేదు. ఎంవిఏ ప్రభుత్వంలో అజిత్ ఉపముఖ్యమంత్రి అయినా అతనికి ఉద్ధవ్ కింద పని చేయడం నచ్చలేదు. ఇతను పొద్దున్న 7 గంటలకే ఆఫీసుకి వెళ్లి కూర్చునేవాడు. ఉద్ధవ్ ఆఫీసుకి రాకుండా, యింట్లోనే కూర్చునేవాడు. వేరేవేరే పార్టీల్లో ఉన్నా ఫడణవీస్‌తో యితనికి దోస్తీ ఉంది. ఏడాది క్రితమే అజిత్‌కు ఉపముఖ్యమంత్రి పదవి పోయినా, అతనికి ఆ పదవిలో ఉండగా ఎలాట్ చేసిన అధికార నివాసం నుంచి అతని తదనంతరం ఆ పదవికి వచ్చిన ఫడణవీస్ ఖాళీ చేయించలేదు. ప్రతిపక్ష నాయకుడికి ఎలాట్ చేసిన నివాసంలో తను ఉంటూ అజిత్‌ను అక్కడే కొనసాగ నిచ్చాడు. ఇప్పుడు అజిత్ మళ్లీ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడనుకోండి.

బిజెపి-శిందే ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భాలు వచ్చినా అజిత్ సాఫ్ట్‌గా ఉన్నాడనే ఆరోపణలున్నాయి. పార్టీలో శరద్ తనకు బదులుగా జయంత్ పాటిల్, మరో యిద్దరికి ఎక్కువ ప్రాధాన్యత యిస్తున్నాడని అజిత్‌కు బాధ ఉంది. ప్రస్తుతం శరద్ వర్గంగా మిగిలిన 21 మందిలో ఆ ముగ్గురూ ఉన్నారు. అజిత్ మేనమామ ఆరెస్సెస్ నాయకుడు, బావ బిజెపి ఎమ్మెల్యే. వాళ్ల ద్వారా అజిత్‌కు బిజెపితో లింకు ఉంది. ఇతను బిజెపి వైపు మళ్లుతాడనే అనుమానంతో శరద్ తను పదవి నుంచి దిగిపోతానని డ్రామా ఆడి, పార్టీపై తన పట్టు నిరూపించుకున్నాడు. శరద్ తప్పుకుంటానని అనగానే అజిత్ అదే మంచిది అని పబ్లిగ్గా అనేశాడు. కానీ పైన చెప్పిన ముగ్గురూ శరదే కొనసాగాలి అని గోల చేశారు. వెంటనే శరద్ సరే అనేసి అజిత్ ఆశలను తుంచేశాడు. నేను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా వదులుకుంటాను, నన్ను జయంత్ పాటిల్ స్థానంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుణ్ని చేయండి అని అజిత్ అడిగినా, శరద్ ఖాతరు చేయలేదు. పైగా కూతురు సుప్రియను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా, మహారాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా చేశాడు. దాంతో యీ చీలిక వచ్చింది.

జూన్ 29న దిల్లీలో శిందే, ఫడణవీస్ తనను కలిసి అజిత్ చేరిక ప్రతిపాదన తెచ్చినపుడు అమిత్ షా అడిగాడట – అంతా పక్కాయేనా, లేక గతంలో లాగ హేండిస్తాడా? అని. ఫడణవీస్ గతంలోలా జరగదని హామీ యిచ్చాడట. అజిత్‌పై, ప్రఫుల్ పటేల్, ఫిరాయించిన ఎన్సీపీ నాయకులపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అజిత్ తమతో చేరేదాకా బిజెపి వాటిపై గొడవ చేస్తూనే ఉంది. సెంట్రల్ ఏజన్సీలు వారిపై విచారణ జరుపుతున్నాయి. ఇప్పుడు బిజెపి క్యాంపులో చేరడం చేత అవన్నీ అటకెక్కుతాయని సులభంగా ఊహించవచ్చు. ఆ ఊరటతో పాటు పదవులు కూడా దక్కుతున్నాయి. మోదీ 2024లో మళ్లీ ప్రధాని ఐతే కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కుతాయి. ఇంకేం కావాలి?

మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 సీట్లున్నాయి. వారిలో 40 మంది అజిత్ వైపు ఉన్నారని ఏప్రిల్‌లో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి 32 మందే వచ్చారు. శరద్ వైపు వారిలో క్రమేపీ కొందరు గోడ దూకవచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలున్నాయి కాబట్టి 145 ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేయవచ్చు. బిజెపికి 105 ఉన్నాయి. స్వతంత్రులు, చిన్న పార్టీలు కలిసి 21 మంది మద్దతిస్తున్నారు. ఇప్పుడు అజితే 32 మందితో వచ్చి చేరాడు. అందువలన 40 మంది ఎమ్మెల్యేలున్న శిందే వర్గం అలిగి వెళ్లిపోయినా ప్రభుత్వానికి ఢోకా లేదు. ఆ 40 మందీ శిందేతో బయటకు వెళ్లిపోతారా, వారిలో కొంతమంది వెనక దిగబడి పోతారో తెలియదు.

మహారాష్ట్ర అనేక విధాలుగా కీలకమైనది. దేశానికి ఆర్థిక రాజధాని కావడంతో పాటు, ఉత్తర ప్రదేశ్ తర్వాత అత్యధికంగా 48 పార్లమెంటు స్థానాలు కల రాష్ట్రం. పారిశ్రామిక వేత్తలందరూ అక్కడే ఉన్నారు. వారిని వంచాలంటే అక్కడ అధికారం చలాయించడం ముఖ్యం. ఇప్పుడు శిందే, అజిత్‌లలో ఎవరో ఒకర్ని వదులుకోవలసి వస్తే బిజెపి ఏం చేస్తుంది అనేది ఆసక్తికరం. అజిత్‌తో పోలిస్తే శిందే చిన్న స్థాయి రాజకీయ నాయకుడు. అతని కింద అజిత్ ఎక్కువకాలం పనిచేయడం జరగదు. పైగా 2024 లోపునే తను ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించుకున్నాడాయె. శిందేకు దగాపడ్డ ఫీలింగు వచ్చి బయటకు వెళతానని బెదిరించవచ్చు. అతని వద్ద అజిత్ కంటె ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నా, బిజెపి అజిత్‌నే ఎంచుకుంటుందని నా ఊహ. ఎందుకంటే శిందే కార్యకర్తల్లోంచి వచ్చినవాడు. అజిత్ వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలున్నవాడు. పైగా శిందే శివసేన ఎమ్మెల్యేలను పట్టుకుని వచ్చాడు కానీ కార్యకర్తల్లో చాలామంది ఉద్ధవ్ తోనే ఉన్నారు. అజిత్ చూడబోతే శరద్‌ను దాదాపు నిర్వీర్యం చేసేట్టున్నాడు.  

అవకాశవాది, ఫిరాయింపుల సర్దారు, నక్కకే జిత్తులు నేర్పగల టక్కరి ఐన శరద్ ఏమవుతాడు, ఏం చేస్తాడు అనేది ఆసక్తికరమైన ప్రశ్న. తక్కిన పార్టీలకు ఏదో ఒక సిద్ధాంతమో, పాడో ఉన్నాయి కానీ ఎన్సీపీకి ఏమీ లేవు. అది సహకార రంగంలో, పారిశ్రామిక రంగంలో, రియల్ ఎస్టేటు రంగంలో ధనికులకు కొమ్ము కాసే పార్టీ. ఎవరితోనైనా కలవగలదు. ఎవరితోనైనా విడిపోగలదు, మళ్లీ కలవగలదు. శరద్ మోదీకి సన్నిహితుడు, అదానీకి మంచి స్నేహితుడు. కానీ అమిత్, ఫడణవీస్‌లకు శరద్ అంటే మంట. 2019లో తమకు జెల్లకాయ కొట్టిన దగ్గర్నుంచి కసి పెంచుకున్నారు. ఎన్సీపీ పొత్తును సాకుగా చూపి, శిందే చేత ఉద్ధవ్ పార్టీని చీల్పించారు, ఇప్పుడు ఎన్సీపీనే చీల్చి, శిందే సరసన కూర్చోబెట్టారు. అజిత్ అట్టడుగు కార్యకర్తలతో నిత్యసంపర్కం ఉన్నవాడు. సుప్రియా విద్యాధికురాలు. నగరవాసి. అజిత్ స్థానాన్ని భర్తీ చేయలేదు. 83 ఏళ్ల శరద్ యీ దశలో పార్టీని నిలబెట్టగలడా అనేది సందేహమే! (ఫోటో- ఫడణవీస్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్, హతాశుడైగి చూస్తున్న ముఖ్యమంత్రి శిందే)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2023)   

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?