cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : నెరజాణ కథలు – 11

ఎమ్బీయస్ : నెరజాణ కథలు – 11

ఒక పల్లెటూళ్లో లొరెంజో అనే అతను తన యింట్లోనే ఒక భోజనశాల నడిపేవాడు. ఆ వూరి ద్వారా వెళ్లే ప్రయాణీకులకు భోజనాలు, మద్యం సమకూర్చేవాడు. ఒక్కోసారి రాత్రి భోజనమయ్యాక ముందుకు వెళ్లే సాధనం లేకపోతే ఆ యాత్రికులు బస కూడా సమకూర్చమని అడిగేవారు. ఇతని యిల్లు చిన్నది, భోజనశాల వెనక్కాల కుటుంబసభ్యులందరూ పడుక్కోవడానికి ఒక హాలు మాత్రమే వుంది కానీ వచ్చినవాళ్లు తెలిసినవాళ్లయితే సరేననేవాడు. దానికి అదనంగా వసూలు చేసేవాడు. అతని భార్య అందంగా వుంటుంది. వాళ్లకు నికోలాసా అనే పదహారేళ్ల సౌందర్యవతియైన కూతురు, ఏడాది లోపు చంటి పిల్లవాడు ఉన్నారు.

పక్కవూళ్లో నివసించే పినాచియో అనే అందమైన యువకుడు తరచుగా యీ వూరు వచ్చి అన్నపానాదులకై హోటల్‌కు వస్తూండేవాడు. అప్పుడు నికోలాసాను చూసి ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతనంటే యిష్టపడసాగింది. అతనితో పొందుకు సమ్మతించింది కానీ పల్లెటూళ్లో ఎవరి కంటా పడకుండా శృంగారం సాగించడం అసాధ్యం కాబట్టి పినాచియో ఒక ప్లాను వేశాడు.

అడ్రియానో అనే తన స్నేహితుడికి తన ప్రేమ వ్యవహారమంతా చెప్పి తోడు రమ్మన్నాడు. ఇద్దరూ గుఱ్ఱాల మీద సరుకులు వేసుకుని, సాయంత్రం చీకటి పడే వేళకు ఆ పల్లెటూరు చేరారు. లొరెంజో యింట్లో డిన్నర్ చేశాక ‘‘మేం నగరం వెళదామని బయలుదేరాం కానీ, సరుకు ఎక్కువగా వుండడం చేత గుఱ్ఱాలు నెమ్మదిగా నడిచి ఆలస్యమై పోయింది. ఏమీ అనుకోకపోతే మీ యింట్లో బస చేస్తాం.’’ అని అడిగాడు. అతను పూర్వపరిచితుడు కాబట్టి లొరెంజో సరేనన్నాడు.

ఆ చిన్నహాల్లోనే మూడు మంచాలు వేశాడు. ఒక గోడవారగా ఒక మంచం వేసి దాని మీద అతిథులిద్దర్నీ పడుక్కోమన్నాడు. దానికి ఎదురుగా వున్న గోడకాన్చి మరోటి వేసి దానిపై తన కూతుర్ని పడుక్కోమని చెప్పి, మరో గోడకు వారగా వేసిన మంచంపై తనూ, భార్యా పడుక్కున్నారు. చంటిపిల్లవాణ్ని ఒక చెక్క ఉయ్యాలలో వేసి, భార్య తన మంచం పక్కన పెట్టుకుంది. గదంతా చిమ్మచీకటిగా వుంది. కాస్సేపటికి అందరూ నిద్రలోకి ఒరిగారు, ప్రేమికులు తప్ప. పినాచియో పిల్లిలా అడుగులు వేసుకుంటూ, నికోలాసా పక్కలోకి దూరి ఆమెను అనుభవించాడు. తర్వాత అలసటతో యిద్దరూ నిద్రపోయారు.

ఇంతలో వంటింట్లోనో, మరోచోటో పిల్లి ఏదో తోసేయడంతో సద్దు అయింది. లొరెంజో భార్య నిద్ర లేచి శబ్దమేమిటో చూడడానికి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అడ్రియానో బాత్‌రూముకి వెళ్లవలసిన అవసరం పడి నిద్ర లేచాడు. బాత్‌రూము వైపు వెళుతూండగా దారికి ఉయ్యాల అడ్డుపడింది. దాంతో తన మంచం పక్కకు దాన్ని జరిపి, వెళ్లి పని కానిచ్చుకుని వచ్చి మళ్లీ మంచం మీదకు వాలాడు. లొరెంజో భార్య పిల్లి సంగతి చూసుకుని గదికి తిరిగి వచ్చింది. ఉయ్యాల జరిగిన సంగతి గుర్తించక, దాని పక్కనే ఉన్నది తన మంచమని, దానిపై ఒంటరిగా వున్నది తన భర్తే అనుకుని, వెళ్లి పడుక్కుంది.

ఇంకా నిద్రపట్టని అడ్రియానో అనుకోకుండా పట్టిన అదృష్టానికి ఆనందిస్తూ, ఆవిడ తనను వలచి వచ్చిందని భావించి, వెంటనే ఆక్రమించుకున్నాడు. తన భర్తే కదాని ఆమె సహకరించింది. ఇతను తన నేర్పంతా ఉపయోగించి, ఆమెను రకరకాలుగా తృప్తి పరిచాడు. తన భర్తలో యింతకు ముందు కనబడని కౌశలానికి ముగ్ధురాలైన ఆమె అభినందించబోయింది కానీ గదిలో ఉన్న మిగతావారికి మెలకువ వస్తుందన్న భయంతో మౌనంగా వుంది.

కొద్ది సేపటికి పినాచియోకు మెలకువ వచ్చింది. మళ్లీ నిద్ర పట్టేసి  తెల్లవారినా మెలకువ రాకపోతే గుట్టు రట్టవుతుందని భయపడి, తన మంచం దగ్గరకు వెళ్లి పడుక్కున్నాడు. నిజానికి అతను తనదనుకున్నది తనది కాదు, లొరెంజోది. దానిలో ఒకే మనిషి వుండడం, పక్కన ఉయ్యాల లేకపోవడంతో యితను కన్‌ఫ్యూజ్ అయ్యాడు. పడుక్కున్నవాడు పడుక్కోక, అడ్రియానోతో మాట్లాడుతున్నాననుకుని అతని చెవిలో ‘‘నికోలాసాతో సౌఖ్యం గురించి చెప్పనలవి కాదనుకో. మేం ఎన్నిసార్లు స్వర్గం అంచులదాకా వెళ్లామో లెక్క చెప్పడం కష్టం.’’ అన్నాడు.

నికోలాసా పేరు వినబడడంతో లొరెంజోకి చప్పున మెలకువ వచ్చింది. తన పక్కలోకి వచ్చి పడుక్కోవడమే కాక, పినాచియో యిలా పేలుతూండడంతో ఒళ్లు మండిపోయింది. ‘‘ఏం మాట్లాడుతున్నావో ఒళ్లూపై తెలుస్తోందా పినాచియో, తెల్లవారనీ నీ తాట తీస్తా’ అని అరిచాడు. తన స్నేహితుడు యిలా మాట్లాడుతున్నాడేమిటాని ఆశ్చర్యపడుతూ పినాచియో ‘‘తాట తీయడమేమిటి? తెల్లవారితే తప్ప తీయరా?’’ అన్నాడు అయోమయంతో. ‘‘ఏం తిక్కతిక్కగా వుందా?’’ అని అరిచాడు లొరెంజో. ఈ గొడవ విని లొరెంజో భార్య తన పక్కలో వున్న అడ్రియానోతో ‘చూడండి, మన అతిథులిద్దరూ ఎలా పోట్లాడుకుంటున్నారో’ అంది. అడ్రియానో చిరునవ్వు నవ్వి, ‘రాత్రి డిన్నర్‌లో బాగా తాగేసి వుంటారులే’ అన్నాడు.

అతని కంఠస్వరం వినగానే లొరెంజో భార్య గతుక్కుమంది. ఇది తన భర్త గొంతు కాదు, అవతలి మంచం మీద నుంచి వినబడుతున్నది తన భర్తది. అంటే తను పొరపాటున అడ్రియానో మంచానికి వచ్చి చేరిందన్నమాట. ఇందాకా రతికేళి సమయంలోనే మనసులో మెదిలిన సందేహం యిప్పుడు ధ్రువపడింది. సూక్ష్మబుద్ధి కలది కాబట్టి జరిగినది వెంటనే గ్రహించింది. మారు మాట్లాడకుండా ఆ చిమ్మ చీకటిలోనే ఉయ్యాల తోసుకుంటూ కూతురి మంచం దగ్గరకు వెళ్లి, ఆమె పక్కలో పడుక్కుంది. భర్త కేకల వలన మెలకువ వచ్చేసినట్లు నటిస్తూ ‘‘అర్ధరాత్రి మద్దెల చప్పుడన్నట్లు ఏమిటీ గోల? నీ గురకలు భరించలేక, నిద్రపట్టక యిక్కడకి వచ్చి పడుక్కున్నాను. ఇప్పుడిప్పుడే కునుకు పడుతోంది. కాస్సేపైనా నిద్ర పోనివ్వరు కదా!’’ అని చివాట్లేసింది.

భర్త చికాకుగా ‘‘ఈ పినాచియో గాడు నికోలాసాను ఏదేదో చేసేశానంటున్నాడు. అది వింటే నీకు ఎప్పటికీ నిద్రపట్టదు తెలుసా?’’ అని అరిచాడు.

‘‘మీ మగాళ్లంతా యింతే. పీకలమొయ్యా తాగడం, నిద్రపోతూ ఏవేవో ఘనకార్యాలు చేసేసినట్లు కలలు కనడం, పలవరించడం. తీరా చేసేదేమీ వుండదు. గుర్రు పెట్టి తొంగోడం తప్ప! నేను ఎప్పణ్నుంచో అమ్మాయి పక్కలో పడుక్కుని వుంటే వాడెలా రాగలడు? ఏం చేయగలడు? తాగుడు, వాగుడు తప్ప మీ మగాళ్లకు చేతనైనదేముంది?’ అని అందర్నీ కలిపి చాకిరేవు పెట్టేసింది లొరెంజో భార్య.

అడ్రియానోకు సర్వం అర్థమైంది. తెలిసి కూతురు చేసిన తప్పును, తెలియక తను చేసిన తప్పును లొరెంజో భార్య చక్కగా కప్పిపుచ్చుతోందని అర్థమై, లొరెంజో దాన్ని నమ్మేట్లు చేయడానికి ‘‘ఇదిగో పినాచియో, నిద్రలో నడిచే నీ అలవాటుతో గొప్ప చిక్కొచ్చి పడిందయ్యా. కలలో జరిగినవన్నీ నిజంగా జరిగినట్లు భ్రమపడడం మానేయ్. తాగుడు తగ్గిస్తే అన్నీ సర్దుకుంటాయంటే వినవు. రా, వచ్చి నీ మంచంలో తగలడు. అందరూ పడుక్కునేవేళ ఊరికే గోల చేయకు.’’ అని చివాట్లు పెట్టాడు.

తను చేయవలసినదేమిటో పినాచియోకు అర్థమైంది. ఇంకా నిద్రలో పలవరిస్తూన్నట్లే నటిస్తూ ‘‘నా తాట తీశారు, ఆరబెట్టారు.’’ అనసాగాడు. అతని అవస్థ చూసి లొరెంజోకు నవ్వు వచ్చింది. భుజాలు పట్టుకుని కుదిపికుదిపి లేపి, ‘‘బాబూ తెల్లారాక తీద్దాంలే తాట. ప్రస్తుతానికి నీ మంచం దగ్గరకు వెళ్లి పడుక్కో.’’ అన్నాడు. అప్పుడే మెలకువ వచ్చినట్లు నటిస్తూ పినాచియో ‘‘ఏం, ఎందుకు లేపేశారు? తెల్లవారిందా?’’ అని అడిగాడు. దీనికి అడ్రియానో కోపం తెచ్చుకున్నట్లు నటిస్తూ ‘‘ఆ భళ్లున తెల్లారింది. రా, నీ మంచానికి దయచేయరా దరిద్రుడా’’ అన్నాడు. పినాచియో సగం మత్తులో వున్నవాడిలాగానే నటిస్తూ వచ్చి అడ్రియానో పక్కన పడుక్కున్నాడు.

మర్నాడు బ్రేక్‌ఫాస్ట్ టైములో లొరెంజో ‘నువ్వూ నీ స్లీప్ వాకింగ్! కలలు కనడం కాస్త తగ్గించుకో అబ్బాయ్, బాగుపడతావ్’ అంటూ పడిపడి నవ్వాడు. స్నేహితులిద్దరూ మర్నాడు వెళ్లిపోయారు. ఆ రాత్రి సంఘటన కారణంగా ప్రేమికుల సంఖ్య పెరిగింది. లొరెంజో భార్య అడ్రియానో అందించిన సుఖాన్ని మర్చిపోలేకపోయింది. యువతులపై వున్నంత నిఘా మధ్యవయస్కుల మీద వుండదు కాబట్టి, అతనితో రమించడానికి ఆమెకు అనేక అవకాశాలు చిక్కాయి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2020)
mbsprasad@gmail.com