cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: కొత్త సంవత్సరం – కొన్ని సలహాలు

ఎమ్బీయస్‍: కొత్త సంవత్సరం – కొన్ని సలహాలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ ఆర్టికల్స్ రాసే అలవాటు లేదు నాకు. కానీ 2022 విషయంలో మాత్రం యీ సంవత్సరంలోకి అడుగు పెట్టగలిగినందుకు అభినందనలు అని చెప్పవలసి వస్తోంది. కరోనా కారణంగా 2020, 2021 ఎంత భయపెట్టాయంటే అసలు 2022 కాలండర్ చూస్తామా అనిపించింది. ఈ రెండేళ్లలో నా ఆత్మీయులు 15మందిని పోగొట్టుకున్నాను. అనేకమంది చికిత్సకై లక్షలులక్షలు పోగొట్టుకున్నారు. మీకు తెలిసినవారూ యిలా బాధపడి వుండవచ్చు. మొదటి వేవ్‌లో 60 దాటినవాళ్లు పోతే, రెండో వేవ్‌లో 40కు చేరనివాళ్లు కూడా పోయారు. గుండె కలచివేసింది. మూడో తరంగం కాచుకుని వుందని అన్నారు, యింకా అంటూనే వున్నారు, మా దగ్గర వచ్చేసిందని కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు అంటున్నాయి. దాని ప్రతాపం ఎంతో ఈ ఏడాది చివరకు కానీ తెలియదు.

ఈ ఏడాది కరోనా ప్రభావం ఎలా వుంటుందో రకరకాల ఊహాగానాలున్నాయి. ఒమైక్రాన్ అనేది అందరికీ సోకేసి, శరీరంలో యాంటీబాడీలు పుట్టేట్లు చేసి డెల్టా వేరియంటుతో సహా అన్ని వేరియంట్లకు వాక్సిన్‌లా పనిచేస్తుంది అని కొందరంటున్నారు. తక్కిన దశల మాట ఎలా వున్నా, సోకడం మాత్రం విపరీతంగా జరుగుతోంది. అయితే మరణభయం లేదంటున్నారు. ఆసుపత్రిపాలు కావడం కూడా ఉండదంటున్నారు. కానీ అమెరికాలో చిన్నపిల్లలకు సోకుతోందని, వాళ్లు ఆసుపత్రిపాలు కావడం గత వారంలో 48శాతం పెరిగిందని చదివాను. ఈ గణాంకాలన్నిటిలో శాంపుల్ సైజు ఎంత అనేది ముఖ్యం. పైగా ఆ గణాంకాలు ఒక్కో దేశంలో ఒక్కోలా వుంటున్నాయి. యుఎస్, యూరోప్‌లు బాగా ప్రభావితం అయ్యాయి. ఇండియాలో తీవ్రత ఏ మేరకో తెలియటం లేదు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు కేంద్ర ప్రభుత్వం ఫర్వాలేదని అంటూనే వుంటుంది. కొన్ని రాష్ట్రాలు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ప్రజల వ్యవహారశైలి చూస్తూంటే, కరోనా అనేది మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ఉచితంగా టీకాలు యిస్తున్నా వేయించుకోవటం లేదు. టీకా ప్రభావం ఆర్నెల్లే వుంటుందని కొందరంటూంటే, అబ్బే మూణ్నెళ్లే అని మరి కొందరంటున్నారు. మరి యీ పాటికి మన యిమ్యూనిటీ ఏ మేరకు వుందో తెలియదు. బూస్టర్ డోస్‌కు ప్రభుత్వం పరిమితంగా అనుమతి యిచ్చిందని సణుగుతున్నారు కానీ అందరికీ వేస్తామని అన్నా ఎంతమంది ముందుకు వస్తారో తెలియదు. మన ఇండియన్స్‌ను కరోనా ఏమీ చేయదులే అనే ధీమాయే ఎల్లెడలా కనబడుతూ అత్యధికులు సాధారణ జీవితం గడిపేస్తున్నారు. దీనివలన జరుగుతున్న మేలేమిటంటే జనాలకు ఉపాధి దొరుకుతోంది. కరోనా వచ్చినా, చికిత్సకై కావలసిన డబ్బు సంపాదించుకునే మార్గం కనబడుతోంది. దేశ ఆర్థికపరిస్థితి మెరుగుపడడానికి అవకాశం ఏర్పడుతోంది.

కొత్త ఏడాది వస్తోందంటే సంతోషమే కానీ మన వయసు మరో ఏడాది పెరుగుతోందని, అంతిమ దినానికి, మనకు దూరం తగ్గుతోందనీ కూడా తెలుసుకోవాలి. వయసు పెరగడం గురించి భయమేమీ లేదు. మనం యింకా ఉన్నామనీ, ఆరోగ్యంగా వున్నామనీ అనే మంచి ఫ్యాక్టర్లు కూడా గుర్తించాలి. కొంతమంది పాఠకులు నా వయసు గురించి చింతిస్తూంటారు. కొంతమంది ‘మీ వయసు చూసి ఊరుకుంటున్నాం’ అనో, ‘ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదా’ అనో, మరో కొందరు ‘మీ వయసుకి యిస్తున్న గౌరవాన్ని నిలుపుకోండి’ అనో అంటారు. కొందరు ‘పాపం, పెద్దాయన ఆయన్ని అలా అంటారేమిటి?’ అని యితరులను మందలిస్తారు. నన్నడిగితే యివన్నీ అనవసరం. ఇక్కడ నేను రచయితను, మీరు పాఠకులు. చర్చించవలసినది ఆలోచనల్ని మాత్రమే. ఏకీభవిస్తున్నారా? విభేదిస్తున్నారా? విభేదించిన సందర్భాల్లో సంస్కారవంతంగా వున్నారా, లేదా? దట్సాల్.

అంగీకారానంగీకారాలకు, సంస్కారప్రదర్శనకు వయసుతో పని లేదు. నా కంటె పెద్దవాళ్ల స్టేటుమెంట్లతో, చర్యలతో నేను విభేదించటం లేదా? పెద్దవాళ్లు కదాని తలిదండ్రులు చెప్పిన ప్రతి మాటకూ తలూపుతున్నామా? ఎట్ ద సేమ్ టైమ్, ముసలివాళ్లని చెప్పి తృణీకరించ వలసిన అవసరమూ లేదు. ముసలితనం ఆషామాషీ కాదు. రాసిపెట్టి వుంటే తప్ప అది అందరికీ దక్కదు. మొన్న సెకండ్ వేవ్‌లో ఎంతోమంది ఆ దశ రాకుండానే పోయారు. మా నాన్నా అంతే, 42వ ఏట పోయాడు. పిల్లల ఏ అచ్చటా, ముచ్చటా చూడలేక పోయాడు. అది ఆయనకూ, మాకూ ఎంత భయానకమో నాకు తెలుసు. అందుకనే, నన్ను ముసలివాడని తిట్టినవాళ్లకు కూడా ముసలితనం సంప్రాప్తించాలనే కోరుకుంటాను తప్ప మరోలా కోరను. బతికి వుంటే బహువింతలు చూడవచ్చన్నారు. ఎన్నో ఆధునిక విషయాలు నేర్చుకోవచ్చు. పర్వతాలెక్కకపోయినా, మేధోపరమైన పనులెన్నో చేయవచ్చు.

బతికి వుండడం అంటే ఏదో యీసురోమని వుండడం కాదు, తగినంత ఆరోగ్యంగా వుండాలి. ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనేదానిపై తెల్లవారి లేస్తే పత్రికల్లో, టీవీల్లో చదువుతూనే వుంటాం, చూస్తూనే వుంటాం. కానీ పట్టించుకోం కాబోసు. గత రెండేళ్లలో పోయినవారిలో కరోనాతో పాటు ఉన్న కోమార్బిడిటీస్  కారణంగా చాలామంది పోయారన్నారు. వారిలో చాలామందికి ఆ ఇతర రోగాలున్నట్లే తెలియదు. అంటే దాని అర్థం వాళ్లు రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవటం లేదు అనేగా. శరీరమే ఒక ఆసుపత్రి. దానంతట అదే అనేక రోగాలను నయం చేసుకుంటుంది. ఆ ప్రాసెస్‌లో వుండగా సంకేతాలు యిస్తూ వుంటుంది. రిపేరు చేసుకుంటున్నాను, నన్ను యిబ్బంది పెట్టవద్దు అని చెప్పడానికి సాధారణ జ్వరం కలగజేస్తుంది. నా వల్ల కావటం లేదు అన్నపుడు గట్టి సంకేతాలే యిస్తుంది.

కానీ మనం ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తాం. ఆ సంకేతానికి కారణం యిదేమో, అదేమో అనుకుంటూ కాలక్షేపం చేస్తాం తప్ప డయాగ్నస్టిక్స్‌కి వెళ్లం. వెళితే, ఏదైనా బయటపడుతుందేమో, మన అలవాట్లు మార్చుకోవలసి వస్తుందేమోనని జంకు. వాహనాన్ని ఆర్నెల్లకోసారైనా సర్వీసింగుకి యిస్తాం. శరీరాన్ని ఏడాదికి ఓ సారైనా టెస్ట్ చేయించుకోం. నేను గమనించిన దేమిటంటే మనలో చాలామంది 35 సం.ల వయసు వరకు ఆరోగ్యంగానే వుంటాం. అది తలితండ్రులు మనకిచ్చిన జీన్స్ ఫలితం అనుకోవాలి. ఆ బాలన్స్‌ను అప్పటివరకు ఎలా వాడుకుంటూ వచ్చామన్నదానిపై తక్కిన జీవితం ఆధారపడి వుంటుంది. 40 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి ప్రతీ ఏడూ జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిదని స్వానుభవం. రిపోర్టులు వచ్చాక, కొన్ని హద్దు మీరి వుంటే లైఫ్‌స్టయిల్‌లో కాస్త కరక్షన్స్ చేసుకుంటూ బండి నడిపించవచ్చు.

50ల్లోకి వచ్చాక బిపి, సుగర్‌లు పలకరించవచ్చు. నన్ను అలాగే పలకరించాయి. కానీ వాటి గురించి మరీ హడిలిపోనక్కరలేదు. మరీ హైరాన పడకుండానే మేనేజ్ చేయవచ్చు. దేని రేంజ్ ఎంత వుండాలి అన్నదానిపై గతంలో కంటె అంకెలు తగ్గించడం వలన భయం పెరుగుతోంది. ‘మీరెలాగూ అజాగ్రత్తగా వుంటారనే లెక్కతో పరిణామాలను కాస్త ఎక్కువ చేసి చెప్పి భయపెడుతున్నాం’ అంటారు డాక్టర్లు. వారం రోజుల పాటు మందులు మర్చిపోయాం అనేవాళ్లూ వాళ్లకు తారసిల్లుతున్నారు మరి. అలా ఎలా మర్చిపోతారో నాకర్థం కాదు. మందు, ఆహారం, వ్యాయామం యీ మూడూ ముఖ్యమే. నిరంతరం గమనించుకోవలసివే.

ఎంత మంచి అలవాట్లున్నా రోగాలు, ఆపరేషన్లు రాకమానవు. ఎందుకంటే పుట్టినప్పుడు మనం ఎలాటి లోపాలతో పుట్టామో తెలియదు కదా. రోగాలతో, చెడు అలవాట్లతో జీవితం నెట్టుకుంటూ పోవచ్చు. కానీ పరిస్థితి ఆపరేషన్‌ దాకా వచ్చినప్పుడు డయాగ్నస్టిక్స్ ఉపయోగం, మంచి అలవాట్ల ప్రయోజనం తెలుస్తుంది. ఆపరేషన్‌కు ముందు, జరిగేటప్పుడు, తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా వుంటాయి. ఇవన్నీ స్వానుభవంతో చెప్తున్నాను. 2019లో నాకు ఏ హార్ట్ ఎటాకూ రాకపోయినా, మామూలుగా తిరుగుతూ, పై నెలలో చైనా టూరుకు ప్లాన్ చేసుకున్నా, జనరల్ చెకప్‌కు వెళ్లినపుడు బ్లడ్‌ఫ్లో 40శాతం మాత్రమే వుందని తెలిసింది. ఏంజియోలో మూడు బ్లాకులు తేలాయి. బైపాస్ చేసినప్పుడు మైట్రల్ వాల్వ్ మార్చవలసిన అవసరం బయటపడింది. నేను చెక్ చేయించుకుని వుండకపోతే చైనాలో వుండగా ఏ ఎటాకో వచ్చి వుంటే, చాలా కాంప్లికేట్ అయివుండేది. రోగం ముదరబెట్టుకుని వుంటే, 2020లో ఆపరేషన్ అవసరం పడి వుంటే ఆసుపత్రిలో కరోనా సోకే ప్రమాదం వుండేది. ముందుగా మేలుకోవడం మంచిదైందని చెప్తున్నాను.

ఇవన్నీ జనరల్ టర్మ్‌స్‌లో మాట్లాడుతున్నవని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. డాక్టర్ల పరిభాషలో చెప్పాలంటే - ప్రతీ వ్యక్తి డిఫరెంట్. ఒకే బ్రాండ్ తాగుతున్నా ఆ రోగం వాడికి రాలేదు, నాకు వచ్చిందేం? ఒకే తిండి తింటున్నా మా ఆవిడకు వచ్చింది, నాకు రాలేదేం? వంటి ప్రశ్నలడక్కండి. ఆహారం గురించి చెప్పాలంటే శాకాహారమే మంచిది వంటి భావాలు నాకు లేవు. ఏదైనా తినవచ్చు, అరిగించుకోగలిగితే! మన తిండి కులాన్ని బట్టి కాదు, వృత్తిని బట్టి వుండాలి. కుర్చీలో కూర్చునే ఉద్యోగమైతే అరిగేందుకు అవకాశాలు తక్కువ కాబట్టి లైట్‌గా తినాలి. మా తాత ఫుల్ చికెన్ లాగించేసేవాడు కాబట్టి నేనూ.. అంటే కుదరదు. ఆయన మైళ్లకు మైళ్లు నడుచుకుంటూ వెళ్లేవాడు, ఎండలో పొలంలో పనిచేసేవాడు. నువ్వు రోజంతా ఎసి రూములో, కుషన్ కుర్చీలో కూర్చుంటున్నావు. వేళకు తినడం అతి ముఖ్యం. డిన్నర్లు సాధ్యమైనంత త్వరగా, తేలిగ్గా చేయడం అంతకంటె ముఖ్యం. ఈ కాలంలో సకల రోగాలూ కడుపునే ఆశ్రయించుకుని వున్నాయి. ఎటు చూసినా ఎసిడిటీ బాధితులే!

ఇక వ్యాయామం. జిమ్‌లో చేరేవాళ్లు, డ్రస్సూ, గిస్సూ కొనేవాళ్లు కనబడతారు తప్ప రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లు కనబడరు. బాడీబిల్డింగుకైతే జిమ్ అవసరమే కానీ, సాధారణ ఆరోగ్యానికైతే నడక సరిపోతుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే అంతకంటె కావలసినది లేదు. చాలామంది రెగ్యులర్‌గా చేయడం పెద్ద బోరుగా ఫీలవుతారు. క్రాష్ కోర్సులో చేరి ఓ నెల్లాళ్లపాటు మొలకెత్తిన గింజలు తిని, విపరీతంగా కసరత్తులు చేసి, సన్నబడి, యిక మనందరికీ ఆరోగ్యం గురించి లెక్చర్లు దంచుతారు. మూణ్నెళ్లు పోయేసరికి యీ ముచ్చట తీరిపోతుంది. యథాస్థితికి వచ్చేస్తారు. పాతకాలం వాళ్లలా దగ్గర దూరాలకు నడిచి వెళ్లే అలవాటు చేసుకుంటే, ప్రత్యేకంగా వాకింగ్‌కు అంటూ వెళ్లనక్కరలేదు కూడా.

డయట్ విషయంలో కూడా కొత్తకొత్త ప్రయోగాలు చేయడంలో రిస్కు వుంది. ఏళ్ల తరబడి తింటున్నదానిలో డ్రాస్టిక్‌గా మార్పులు చేయడం అభిలషణీయం కాదు. శరీరం గందరగోళ పడుతుంది. ఒక పూట కొత్త రకంది అలవాటు చేస్తూ, మరో పూట ఎప్పుడూ తింటున్నది కంటిన్యూ చేయడం మేలు. ఒక్కటే సూత్రం గుర్తుంచుకోండి. అతి సర్వత్ర వర్జయేత్. వ్యాయామమైనా సరే, మితిమీరి చేయకూడదు. ఎంతమంచిదైనా సరే, పరిమితంగానే తినాలి. ఏ అలవాటైనా మన కంట్రోలులో వుండాలి. మానేద్దామనుకుంటే మానేయగలగాలి. అప్పుడప్పుడు అనుకోవాలి కూడా. లేకపోతే మన గురించి మనకే తెలియకుండా పోతుంది.

ఇక మందులంటారా, ఏ వైద్యవిధానాన్నయినా నమ్ముకోండి, కానీ చెప్పిన మందులు చెప్పినప్రకారం వేసుకోండి. వాటివలన జరుగుతున్న పరిణామాలను గమనించి, అవాంఛనీయమైనవి వుంటే డాక్టరుకి చెప్పండి. వాళ్లు ముందే హెచ్చరించరు. ఎందుకంటే అందరికీ అవి రావాలని లేదు. మనమే జాగ్రత్తగా వుండాలి. మందులు మంచి క్వాలిటీవే, నెక్స్‌ట్ జనరేషన్‌వే – ఖరీదైనా సరే - వాడండి. దీర్ఘకాలిక సత్ఫలితాలుంటాయి. హెల్త్ యీజ్ వెల్త్ అన్నారు. రోగం వచ్చేవరకూ యిది కరక్టు. ఆ తర్వాత వెల్త్ యీజ్ హెల్త్. డబ్బుంటేనే మంచి చికిత్స, ఆరోగ్యం దక్కుతాయి. డబ్బు సంపాదించాలంటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా వుండి తీరాలి. అందువలన మందు క్వాలిటీ మీద, తిండి క్వాలిటీ మీద కక్కుర్తి పడకండి. ఖరీదు తక్కువనో, రుచిగా వుందనో రోడ్డు సైడ్ తిళ్లు తినకండి. దాని తడాఖా అప్పటికప్పుడు కనబడదు. ఏ పదేళ్ల తర్వాతో చూపిస్తుంది.

నేను చెప్పిన యీ మాటలన్నీ ఒక లేమ్యాన్‌గా చెప్పాను తప్ప వైద్యప్రవీణుడిగా చెప్పలేదని మీ అందరికీ తెలుసు. పాతరోగి సగం వైద్యుడన్న తెలుగు సామెత యిచ్చిన ధీమాతో తోచినవి చెప్పాను. దైవికమైన ఘటనలేవీ జరగకపోవడం వలన ఇప్పటికే 70 ఏళ్లు జీవించానంటే, ఆర్జించగలుగుతున్నానంటే, తెలియని విషయాలు చదివి, అర్థం చేసుకుని, నా భావాలు వ్యక్తీకరిస్తూన్నానంటే నా ఫిజికల్, మెంటల్ ఫ్యాకల్టీస్ యింకా పని చేస్తున్నట్లేగా! దాన్ని బట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వున్నట్లే అనుకోవచ్చు. రేపు ఎలా వుంటుందో తెలియదు. ఇప్పటివరకు జరిగినదాని గురించే మాట్లాడాను. నచ్చితే యీ సూచనలు అమలు చేయండి. ఆరోగ్యంగా వుండండి, ఆనందంగా వుండండి. మొదట్లో అశ్రద్ధగా వుండి, అనారోగ్యం రాగానే కృంగిపోయి, రోగాన్ని పెద్దది చేసుకోకండి. మనోస్థయిర్యమే కీలకం. క్రమబద్ధమైన జీవితాన్ని అవలంబించాలని కొత్త సంవత్సరపు తీర్మానం చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు