Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఫిర్యాదు చేయలేదు

ఎమ్బీయస్‍: ఫిర్యాదు చేయలేదు

మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్‌గారు సిఐడి విచారణ ఎదుర్కున్నపుడు, సమాధానాలు చెప్పడంలో ఆవిడా చైర్మన్ మావగారి బాటే పట్టవచ్చు. రామోజీ గారేమన్నారు? ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 4 సంచిక ప్రకారం - ‘చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లోకి మళ్లించడంపై వివరిస్తారా?’ అని సిఐడీ ఎస్పీ ఆయన్ను అడిగితే ఆయన ‘మార్గదర్శిపై యిప్పటివరకూ ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని, లక్షల మంది చందాదారులు, డిపాజిటర్ల నమ్మకం చూరగొన్న సంస్థలో ఎలాంటి తప్పులకు తాము ఆస్కారం యివ్వబోమని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది’. ఇదేదో మాలతీ చందూర్ గారి సమాధానంలా లేదూ? నిధులు మళ్లించారా? లేదా? అని అడిగితే ..చేము, ..లేదు అని చెప్పాలి తప్ప రియల్ ఎస్టేట్ యాడ్స్ ఉపయోగించే ‘నమ్మకం చూరగొన్న..’ లాటి భాష ఉపయోగించడమేమిటి? ఫిర్యాదు చేయలేదనే దానిపైనే వాదన బేస్ చేసుకోవడ మేమిటి?

దీన్నే నేను మెయిన్ పాయింటుగా తీసుకుని రాస్తున్నాను. మార్గదర్శిపై ఆరోపణలు రకరకాలుగా ఉన్నాయి. బాలన్స్‌ షీటులో జరిగిన దగా గురించి యీ వీడియోలో గోపాలకృష్ణ కళానిధి అనే అడ్వకేటు వివరించారు. ఏ అట్టహాసమూ లేకుండా సూటిగా విషయమేమిటో చెప్పారు. చిట్ అంటే ఏమిటో కూడా వివరించడంతో  26 ని.ల వీడియో అయింది. 8.00 ని.ల నుండి 3 ని.ల పాటు, 18.00 ని.ల నుంచి 2 ని.ల పాటు వింటే చాలు, బాలన్స్ షీటులో చేసిన గోల్‌మాల్ ఏమిటో, ఆ అవసరం ఎందుకు పడిందో అర్థమౌతుంది. దీనిలో నిజానిజాలు బహిరంగంగా నిర్ధారించ బడినప్పుడు మనకు స్పష్టమైన రూపం వస్తుంది. ఈలోగా రామోజీ లేదా శైలజ గార్లు వీటి గురించి వివరణ యిస్తే మనకు ఊహాగానాలు చేసే పని ఉండదు. కానీ వాళ్లు యీ విషయం వదిలేసి మామీద ఎవరూ ఫిర్యాదు చేయలేదు అనే పాత పాటే పాడుతున్నారు.

పాత పాట అని ఎందుకంటున్నానంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉండవల్లి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కూడా రామోజీ యిదే పల్లవి అందుకున్నారు. ఆయన చరణధూళితో తరించేవారందరూ చరణాలను మార్గదర్శి అంతటిది, యింతటిది అంటూ పూరించారు. శైలజ గారైతే ఆఫ్టరాల్ ఒక ఎంపీ మాపై ఆరోపణ చేస్తాడా? అంటూ బహిరంగంగా మండిపడ్డారు. ‘‘సంపూర్ణ రామాయణం’’లో అంగదుడు వచ్చినపుడు రావణుడు ఆఫ్టరాల్ కోతి అని యీసడిస్తే ‘కోతియేరా లంకలో కార్చిచ్చు పెట్టినది..’ అనే అర్థంలో పాట పాడతాడు అంగదుడు. అలాగే ఉండవల్లి మార్గదర్శికి నిప్పు పెట్టేసి బూడిద చేసేశారు. మా ఆస్తులతో పోలిస్తే యీ బోడి మార్గదర్శి డిపాజిట్లు ఎంత అని అహంకరించిన శైలజగారు నాలిక కరుచుకునేట్లా ‘‘ఈనాడు’’ షేర్లను అంబానీకి అమ్ముకుని, డబ్బు తెచ్చుకుంటే తప్ప, మార్గదర్శి డిపాజిట్లను వెనక్కి యివ్వలేక పోయారు. ఈనాడు యాజమాన్యం మారింది కదా! ఇప్పుడూ ‘చిట్ డిపాజిటర్ల సొమ్ము కన్నా ఎక్కువ ఆస్తి తమ వద్ద ఉందని’ రామోజీ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఈసారి ఏం అమ్ముతారో?

అప్పుడూ మేమేమీ తప్పు చేయలేదు అనే బుకాయించారు. ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ డిపాజిట్లు సేకరించకూడదని చట్టం ఉంది కదా అని ఉండవల్లి అంటే ఒక సుప్రీం కోర్టు జజ్ సేకరించ వచ్చని మాకు చెవిలో చెప్పారు అని రామోజీ చెప్పుకున్నారు. ఎవరా జజ్ అని అడిగితే ‘పేరు చెప్పడానికి యిష్టపడని జజ్’ కాబట్టి పేరు వెల్లడించం అన్నారు. ఈ ‘పేరు చెప్పడానికి యిష్టపడని’ అనేది ఈనాడు అమితంగా వాడే పదబంధం. ‘పేరు చెప్పడానికి యిష్టపడని కాంగ్రెసు నాయకుడొకరు యీ సారి మాకు తిరుక్షవరమే అని ఈనాడు ప్రతినిథి దగ్గర వాపోయారు’ అంటూ వేలాది సార్లు రాసేవారు. వాపోయినా వీళ్ల దగ్గరెందుకు వాపోతారు? ఎంచక్కా పార్టీ మారిపోతారు తప్ప! కాంగ్రెసు ఓడిపోతోందని ప్రజలకు బ్రెయిన్‌వాష్ చేయడానికి ఈనాడు వాడిన ట్రిక్కది. వాడి, వాడి, చివరకు తమ విషయంలోనూ వాడారు.

కానీ అది పేలలేదు. ఆ జజ్ గారు బయటకు రాలేదు. వీళ్లు డిపాజిట్లు వెనక్కి యివ్వాల్సి వచ్చిందంటేనే తప్పు చేసినట్లేగా! కానీ తప్పు ఒప్పుకోవడానికి అహం అడ్డు వచ్చి కేసుపై రకరకాల స్టేలు తెచ్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు మార్గదర్శి చిట్స్‌లో అక్రమాల గురించి చర్చ మొదలైంది. అప్పట్లో డిపాజిటర్ల పేర్లు చెప్పమంటే చెప్పలేదు. కొన్ని పేర్లలో ఎ, బి, సి.. అన్నట్లు పొడి అక్షరాలు మాత్రం ఉన్నాయట. అంటే బ్లాక్ మనీయో, బినామీ మనీయో అయివుండాలని సులభంగా అర్థమౌతోంది. అది ఎవరిదో వారికే తెలియాలి. ఇప్పుడు కూడా చిట్ వేశారని కంపెనీ వారు యిచ్చిన కొన్ని పేర్లలో వాళ్లని అడిగితే మా పేర చిట్ ఉన్నట్లే తెలియదన్నారట. బ్యాంకింగ్ పరిభాషలో ‘కైట్ ఫ్లయింగ్’ అంటారు, సరుకుల అమ్మకాలు, కొనుగోళ్లు జరగకుండా ఉత్తినే బిల్స్ పుట్టించి, అవి చూపించి, బ్యాంకు దగ్గర డబ్బు పుట్టిస్తారు. అలాటిదేదో జరిగి ఉండవచ్చు యిక్కడా!

మార్గదర్శి వాళ్లు చిట్ వేసినవాళ్ల విషయంలో చాలా పక్కాగా ఉంటారు. నేను మద్రాసులో ఉండగా శ్రీరామ్ చిట్స్‌లో వేశాను. హైదరాబాదు వచ్చాక మార్గదర్శిలో ఓ సారి వేశాను. బుద్ధొచ్చింది. గ్యారంటీ యిచ్చిన వాళ్ల గురించి వాళ్లడిగిన ఆరాలు చూసి, గ్యారంటీ యిమ్మనమని ఆపై నేనెవ్వరినీ అడగలేక పోయాను. మేమూ బ్యాంకు వాళ్లమే. మేమూ గ్యారంటీ యిచ్చినవాళ్ల గురించి అడుగుతాం. కానీ వీళ్లేమిటి, మరీ దారుణం! బ్యాంకు వాళ్లం లోన్లిస్తాం. ఈ చిట్ వాళ్లు మనదే మనకిస్తారు. అది కూడా నేను చివర్లో తీసుకున్నాను. అయినా మా రూల్సండి అంటూ వేపుకు తినేశారు. మళ్లీ మార్గదర్శి జోలికి వెళ్లలేదు. వేరే కంపెనీల్లో వేశాను, వేస్తున్నాను. తమకు రావలసినదాని విషయంలో అంత పక్కాగా ఉన్నపుడు అవతలివాళ్ల విషయంలో కూడా అంత పక్కాగా, స్పష్టంగా ఉండాలిగా! ఈనాడు గ్రూపు సంస్థల విషయంలో మనమేమీ చేయలేం. అంతా వాళ్లిష్టమే. ‘నా మాటే శాసనం’ అని శివగామి మోడల్లో చెప్తారు.

మీకో విషయం చెప్తాను. మేం ‘‘హాసం’’ పత్రిక నడిపే రోజుల్లో డిస్ట్రిబ్యూషన్‌కి ఈనాడు గ్రూపుకి చెందిన మార్గదర్శి మార్కెటింగ్ ప్రై.లి. అనే పంపిణీ సంస్థ ద్వారా చేయిస్తే మంచిదనుకున్నాం. వాళ్లకు విస్తృతమైన వ్యవస్థ ఉంది. పేమెంట్స్‌లో కచ్చితంగా ఉంటారు. స్టాఫ్ సహకరిస్తారు. అన్నీ పక్కాగా ఉంటాయి. ‘‘ఇండియా టుడే’’, ‘‘చందమామ’’ ‘‘కుముదం భక్తి’’ వంటి పెద్ద సంస్థలు వాళ్ల ద్వారానే పంపిణీ చేయించుకునేవి. మేం వెళ్లేసరికి ‘‘ఇండియా టుడే’’ స్థానంలో మరో ప్రముఖ పత్రిక ‘‘ఔట్‌లుక్’’ వచ్చింది. మా బోటి చిన్న పత్రికను పంపిణీ చేయడానికి సాధారణంగా వాళ్లు ఒప్పుకోరు. కానీ నేను మేల్కొటే గారిని, చలసాని ప్రసాదరావు గారిని మెప్పించి ఒప్పించాను. మా పత్రిక ఆ మాత్రమైనా జనంలోకి వెళ్లడం ఎంఎంపిఎల్ కారణంగానే! అన్ని విధాలా సంతృప్తి యిచ్చిన భాగస్వామ్యమది.

అయితే యిక్కడ చెప్పవచ్చేదేమిటంటే, టర్మ్‌స్ గురించి మా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఏమీ లేదు. టర్మ్‌స్ చెప్పి, వాటితో మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి పట్టుకురండి అన్నారు. ఇచ్చాను, తీసుకుని పెట్టుకున్నారు.  అంతే, వాళ్ల వైపు నుంచి ఏ కమిట్‌మెంటూ లేదు, ఏ సంతకమూ లేదు. అదృష్టవశాత్తూ అంతా సవ్యంగా జరిగిపోయింది కానీ, లేకపోతే మేము వాళ్ల మీద కోర్టుకి వెళ్లవలసిన పరిస్థితే వచ్చి ఉంటే మా దగ్గర ఏ డాక్యుమెంటూ లేదు. వాళ్లు మాకు చెక్కుల ద్వారా యిచ్చిన పేమెంట్స్, పుస్తకాలు తీసుకున్నట్లు యిచ్చిన రసీదులు యివన్నీ సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్‌గా చూపించుకోవాలి తప్ప, అసలైన అగ్రిమెంటు మాత్రం చూపించలేము. ఇదీ ఈనాడు గ్రూపు దర్జా. వాళ్లతో ఫెయిర్ డీల్ నడవదు. కానీ వాళ్ల సర్వీసు బాగుంది కాబట్టి మాకు గత్యంతరం లేకపోయింది.

ఇక్కడే యింకో విషయం కూడా చెప్పాలి. మేమిచ్చిన పుస్తకాలు ఏయే ఏజంట్స్‌కు వెళ్లాయి, ఎన్ని అమ్ముడు పోయాయి, ఎన్ని తిరిగి వచ్చాయి, యిలాటి వివరాలన్నీ చక్కగా కంప్యూటర్ షీట్లలో యిచ్చేవారు. 2001 నాటికే అంత కంప్యూటజరైంది ఈనాడు గ్రూపు. దరిమిలా 2006లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలో ఉండవల్లి ప్రశ్నలిడిగినప్పుడు మా దగ్గర వివరాలు లేవు అని వాళ్లంటే నాబోటి వాడు నమ్మలేడు. మేం యివ్వదలచుకోలేదు, యిస్తే మాకు ముప్పు అనే అర్థం తోస్తుంది. వ్యాపారపరంగానే కాదు, ఎడిటోరియల్ పరంగా కూడా వారివి ఏకపక్ష నిర్ణయాలే! కొంతకాలం పాటు నేను ‘‘ఈనాడు’’ ఎడిట్ పేజీలో వ్యంగ్యరచనలు చేసేవాణ్ని. వేరే చోట కూడా రాస్తూంటే వీళ్లు అభ్యంతర పెట్టారు. అక్కడా, యిక్కడా రాస్తే మా పాలసీ ఒప్పుకోదండి అన్నారు.

‘నేను మీ ఉద్యోగిని కాను, ఫ్రీలాన్సర్‌ని, లక్షల సర్క్యులేషన్ ఉన్నా మీరు నాకిచ్చేది 500 రూ.లు మాత్రమే. ఈ నిబంధనలేమిటి?’ అని వాదించేవాణ్ని. ఎంత లాజిక్ మాట్లాడినా ఈనాడు గ్రూపులో నిరంతరం వినబడే మాట – ‘మా పాలసీ ఒప్పుకోదు’. ఆ పాలసీ ఏమిటో అది ఎక్కడా రాసి ఉండదు. రామోజీ గారు యిలా అనుకుంటున్నారు అని వీళ్లనుకుని సహోద్యోగులను, కంట్రిబ్యూటర్స్‌ను, వాళ్లతో వ్యవహరించిన ప్రతివాళ్లనూ నియంత్రించాలని చూస్తారు. ఈనాడులో పని వాతావరణం గురించి దానిలో పని చేసిన అనేకమంది జర్నలిస్టులు యీ మధ్య యూట్యూబుల్లో మాట్లాడుతున్నారు. ‘‘ఉన్నది ఉన్నట్టు..’’ అని గోవిందరాజు చక్రధర్ గారి పుస్తకం కూడా వచ్చింది. గతంలో రామోజీపై వచ్చిన పుస్తకాల తీరు వేరు. ఇవి వేరు. ఎటువంటి అభద్రతాభావంతో వాళ్లు పని చేసేవారో, అంచెలంచెల విధానంలో చైర్మన్ వాళ్లను ఎలా నియంత్రించేవారో వాళ్లందరూ చెపుతున్నారు.

తను కమ్యూనిస్టునని చెప్పుకునే రామోజీరావు గారు కమ్యూనిజంలోని నియంతృత్వాన్ని మాత్రం తీసుకుని, దానికి కాపిటలిజాన్ని కలిపి, మీడియా జార్ అయిపోయారు. ‘మమ్మల్ని అభద్రతాభావంలో ఉంచడమే కాదు, ఆయనలో కూడా అది ఉండేది. ‘‘ఈనాడు’’లో సమ్మె జరిగిన తర్వాత ఉద్యోగులు మళ్లీ సంఘటిత మవుతారేమోనన్న భయంతో ఆయన నిరంతరం వ్యూహాలు రచిస్తూనే ఉండేవారు’ అన్నారొకరు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ‘‘గ్రేట్ డిక్టేటర్’’లో చార్లీ చాప్లిన్‌ను చూడాలి. దీని కారణంగా వాతావరణమంతా ఎప్పుడూ వేడెక్కి ఉండేది. ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటూ ఉండేవాళ్లం అని చెప్పుకున్నారు వాళ్లు. ఇక జీతాల విషయంలో చేసిన అన్యాయాలు కూడా ఉన్నాయి.

పాలేకర్ అవార్డు వచ్చి జర్నలిస్టుల జీతాలు ఎక్కువగా యివ్వవలసి రావడంతో జర్నలిస్టులను ప్రూఫ్ రీడర్లుగా చూపించి మోసం చేసేవారు. సర్క్యులేషన్ ప్రకారం జీతాలివ్వాలనడంతో ఈనాడు పేపరుకై పని చేస్తున్నా ‘‘న్యూస్ టుడే’’ వార్తా సంస్థకు పని చేసినట్లు చూపించేవారు. ఏం చేసినా వీళ్లు భరించారు, సహించారు. ఇచ్చేది తృణమే ఐనా, టైముకి యిస్తున్నారు కదా అని నోర్మూసుకున్నారు. అవకాశం వచ్చినపుడు బయటకు జారుకున్నారు తప్ప, ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే ఏమౌతుందోనన్న నిరంతర భయంతో బతికారు. ఎందుకంటే ప్రత్యర్థులతో రామోజీ ఎలా డీల్ చేస్తారో అందరికీ తెలుసు. అంత లావు ఎన్టీయార్‌ను కూడా చంద్రబాబు సహాయంతో ఎలా గద్దె దింపారో చూశారు.

ఉద్యోగులెవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి, ఈనాడులో వర్కింగ్ కండిషన్స్ అద్భుతంగా ఉన్నాయని అనగలరా? అలాగే మార్గదర్శి చిట్స్ విషయంలో కూడా ఫిర్యాదు లేవీ రాలేదని అందువలన ప్రభుత్వం కలగజేసుకోకూడదని అనగలరా? ఓ స్కూటరిస్టు హెల్మెట్ లేకుండా వెళుతున్నాడు. ఎవరు ఫిర్యాదు చేశారని పోలీసు పట్టుకుని జరిమానా వేస్తున్నాడు? లంచం తీసుకునేవాడు, పుచ్చుకునే వాడు ఎవరూ ఫిర్యాదు చేయరు. అయినా నేరమెందుకు అవుతోంది? లాజ్‌లో ఓ జంట దూరారు. ఎవరికీ అభ్యంతరం లేదు, ఫిర్యాదు లేదు. పోలీసులు వచ్చి పట్టుకోవడం దేనికి? నలుగురు కూర్చుని పేకాడుతున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. పోలీసుల కేం పని? ఎవరు ఫిర్యాదు చేశారని కోళ్లపందాలు ఆపిస్తున్నారు?

చట్టం సరిగ్గా అమలవుతోందా లేదా అని చూడడమే ప్రభుత్వబాధ్యత. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే కదులుతాం అనడం బాధ్యతారాహిత్యం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ గొడవ వచ్చినపుడు ఇప్పటిదాకా ఏ ఒక్కరూ నష్టపోలేదు అని కొందరు వాదించినప్పుడు ఒక ఆర్టికల్ రాశాను. బ్రిజ్ కూలడానికి ముందు క్షణం దాకా అది కూలుతుందని ఎవరికీ తెలియదు. ఎవరూ ఫిర్యాదు చేయరు. అయ్యాకనే కాంట్రాక్టరుది తప్పు, పర్యవేక్షించిన యింజనియర్‌ది తప్పు అని మొదలెడతారు. ఆ దుర్ఘటన జరగడానికి ముందే ఆ లోపాన్ని కనిపెట్టి, సవరించాల్సిన కర్తవ్యం ప్రభుత్వానిది. దాన్ని ఆ పని చేయవద్దని కోర్టుకెళితే ఎలా?

చట్టం అంటూ పెట్టాక దాన్ని అమలు చేయాలి. అమలుకి అందరూ సహకరించాలి. మేం అతీతం అనుకుంటూ, మేము సచ్ఛీలులం అని తమకు తామే సర్టిఫికెట్టు యిచ్చుకుంటే ఎలా? రికార్డులు చూపించి నిరూపించుకోవాలి. ఇప్పుడు మేనేజర్లు ఏం చేశారో మాకు తెలియదంటూ తప్పు వాళ్ల మీదకు తోసేస్తున్నారు. అలా అయితే యిన్నేళ్లగా వాళ్లపై శిక్ష ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు బయటకు వచ్చాక కూడా ఎందుకు తీసుకోవడం లేదు? పైగా వాళ్లను అరెస్టు చేయకూడదంటూ కోర్టు నుంచి ఆదేశాలెందుకు యిప్పిస్తున్నారు? మీ ఆదేశాలను ధిక్కరించి (ఈనాడు గ్రూపులో యిది కలలో కూడా ఊహించలేని విషయం), వాళ్లు అవకతవకలు పాల్పడితే మీరే ఫిర్యాదిచ్చి, వాళ్లను జైలుకి పంపండి. లేకపోతే మీరే చెప్పి యివన్నీ చేయించారని అనుకోవాల్సి వస్తుంది.

బ్రాంచీల్లో ఏ డిపాజిట్లూ లేకుండా హెడాఫీసుకి అన్నీ పంపండి అనే ఆదేశం ఎవరిచ్చారు? బ్రాంచ్ మేనేజర్లకు రూ.500 కి మించి చెక్ పవర్ యివ్వని సంస్థలో వాళ్లే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని వాదిస్తే కుదురుతుందా? బాలన్స్‌షీట్ ఫైనలైజేషన్ మేనేజరు లెవెల్లో జరుగుతుందా? పైన ఉదహరించిన వీడియో ప్రకారం మార్గదర్శిలో డబ్బు లేకపోయినా, ఉన్నట్లు చూపించబోయారు. ‘2022 ఆగస్టులో బ్యాంకులో డిపాజిట్ చేసినా యిప్పటికీ ఎన్‌క్యాష్ కాని చెక్స్ విలువ 76 కోట్లు, మా వద్దే చేతిలో ఉన్న చెక్కుల విలువ 254 కోట్లు, క్యాష్ 36 కోట్లు’ అని బాలన్స్‌షీట్‌లో చెప్పారు కానీ వాటిని చూపించటం లేదు. ఈనాడులో వచ్చిన 400 కోట్ల నష్టం పూడ్చుకోవడానికి నిధులు మళ్లించి, యిక్కడ బాలన్స్‌షీట్‌ను యీ విధంగా విండోడ్రస్ చేశారు అని ఆ లాయరు గారన్నారు. కావచ్చు. ఎవరైనా 254 కోట్ల చెక్కులు, 36 కోట్ల క్యాష్ చేతిలో పెట్టుకుని కూర్చుంటారా? సత్యం రామలింగరాజు చూపించిన దొంగ ఫిక్సెడ్ డిపాజిట్ల వంటిదే కదా యిది! ఆడిటరు కుమ్మక్కయి ఉండవచ్చు కానీ వీళ్లు చెప్పందే అతను చేయడు కదా. అతనికి యిందులో స్వలాభమేముంది?

ఇక చిట్ పాడుకున్న తర్వాత డబ్బు తీసుకెళ్లక పోవడమేమిటి, విచిత్రం కాకపోతే! చిట్ పాడేదే అత్యవసర అవసరాల కోసం! మెచ్యూర్ అయ్యాక మీ దగ్గరే ఉంచండి, 5 శాతం వడ్డీ యివ్వండి చాలు అన్నారట. అదేదో బ్యాంకులోనే పెట్టుకోవచ్చుగా! డిపాజిట్లు ఎలా తీసుకుంటారు, ఆర్‌బిఐ రూల్సు ఒప్పుకోవుగా అని అడిగితే రామోజీ వడ్డీ యిస్తున్నాంగా, అక్రమమేముంది? అని సమాధాన మిచ్చారట. ప్రశ్నకూ, సమాధానానికీ పొంతన ఉందా? ఇక్కడ అతితెలివేమిటంటే డిపాజిట్టు అనే పేరు మీద తీసుకోవడం లేదు. రశీదు యిస్తున్నారట. వడ్డీ యిస్తున్నారు కాబట్టి డిపాజిట్టే అని సిఐడి అంటుంది. డిపాజిట్ అని మొహం మీద రాయలేదు కదా, ఊరికే ఉత్తినే మీ దగ్గర పిడతలో దాచండి అని యిచ్చారు. పోనీ కదాని వడ్డీ యిచ్చాం అని కోర్టులో మార్గదర్శి వాదిస్తుంది. చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో, షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు కదా, అలా చేశారు? అని అడిగితే ‘అది మా కంపెనీ ఆర్థిక ప్రణాళికలో భాగం’ అన్నారట. అంటే చట్టాలు, నియమాలతో సంబంధం లేకుండా వాళ్లు పాలసీ ఏర్పరచుకున్నారా?

రామోజీ అభిమానుల దగ్గర వీటికి సమాధానాలుండవు. పాపం 86 ఏళ్ల పెద్దాయన, ఆయన్ను అలా హింస పెట్టకూడదండి అంటారంతే. పోలీసుల దగ్గరా, కోర్టులోనూ రామోజీ నేను వృద్ధుణ్ని అనే వాదనే వినిపిస్తారు చూడండి. నేరాలు చేసినా సరే వృద్ధులను విచారించ కూడదు, శిక్షించకూడదు అనే రూలుందా? అలా అయితే ఫలానా యింత వయసు తర్వాత వాళ్లు కంపెనీలకు చైర్మన్‌లుగా, ఎండీలుగా ఉండకూడదు అని చట్టం చేయించండి. అనారోగ్యం ఒకటి. ముందు రోజు దాకా నిక్షేపంలా సంస్థ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తారు. విచారణ అనగానే అనారోగ్యం అంటారు. అనారోగ్య మున్నవాళ్లు ముఖ్య పదవులు చేపట్టకూడదు అనే రూలు కూడా పెట్టాలి. రామోజీగార్ని ఫిల్మ్ సిటీ నుంచి గంటన్నర దూరంలో జూబిలీ హిల్స్‌కు ఎవరు రమ్మన్నారు? అంత ఓపికున్నాయన సిఐడి రాగానే అనారోగ్యం వలన విచారణకు సహకరించను అన్నారట. ఆ మేరకు సర్టిఫికెట్టు యివ్వమని వ్యక్తిగత వైద్యుణ్ని పోలీసులు అడిగితే, అప్పుడు రామోజీ మంచం మీద పడుక్కుని సమాధానాలిచ్చారు.

పక్కన ఆక్సిజన్ సరఫరా, సెలైన్ బాటిల్సూ ఏమీ లేవు. మంచిదే. ఆ మేరకు ఆరోగ్యం బాగుంది. అయినా ఆ ఫోటో బయటకు రాగానే ‘పాపం రామోజీ’ అనే నిట్టూర్పులు వినవచ్చాయి. ఆ ఫోటో బయటకు ఎలా వచ్చింది అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. సింపతీ వస్తుందని ఆయన అభిమానులే విడుదల చేశారని వైసిపి వాళ్లంటే, కాదు వైసిపి వాళ్లే పైశాచికానందంతో చేశారని టిడిపి వాళ్లంటున్నారు. భూవివాదాలు వచ్చినపుడు ఈనాడు అప్పట్లోనే హెలికాప్టర్ పెట్టి ఫోటోలు తీయించింది. ఇప్పుడీ సెల్‌ఫోన్ల యుగంలో అందరు పోలీసు వాళ్లు వెళ్లినపుడు ఎవరో ఒకరు తీయలేరా? జగన్‌ను జెడి లక్ష్మీనారాయణగారు విచారించే రోజుల్లో జగన్ కాఫీ తెచ్చినవాడిపై ఎలా చికాకు పడ్డాడు దగ్గర్నుంచి వివరాలు పత్రికల్లో వచ్చేసేవి. జెడి నడిగితే రామోజీ ఫోటో బయటకు ఎలా వచ్చిందో చెప్పగలరేమో1

‘మార్గదర్శిలో అవకతవకలు జరిగి ఉండవచ్చు కానీ పెద్దాయనతో అలా వ్యవహరించడం బాగా లేదండి’ అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఎవరికి పెద్దాయన? దేనిలో పెద్దాయన? పెద్దాయన కదాని ఆయన్ని వదిలేసి, చిన్నావిడ, పెద్దింటి కోడలని శైలజగార్ని వదిలేసి, మేనేజర్లకు మాత్రం ఉరి వేయాలా? మార్గదర్శి చిట్స్ విషయంలో అసలెవరికైనా శిక్ష పడుతుందా? మూడొంతులు పడకపోవచ్చు. ఎక్కడికక్కడ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో రామోజీ ఘనుడు. ఆయన లాయరు ఆలస్యంగా వచ్చి, కోర్టు టైము అయిపోయినా 8 గంటల దాకా కూర్చుని నా వాదన వినాల్సిందే అని జజ్‌ను మొహమాట పెట్టి, మార్గదర్శి ఉద్యోగులకు కూడా రక్షణ కల్పించిన సంగతి, వెంకటేశ్వర స్వామి సైతం రూ. 3 కోట్ల జరిమానా కట్టిన ఉదంతం ఉండవల్లి చెప్పి, పారదర్శకత గురించి నిరంతరం చెప్పే రామోజీ, చిట్‌దారుల గురించి సందేహనివృత్తి చేస్తూ ఓ బుక్‌లెట్ వేస్తో పోతుంది కదా అని సూచించారు.

అంతే, కొందరు ఆడిటర్లు సమావేశమై పోయి, ఉండవల్లిని తిట్టిపోశారు. గతంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలో జయప్రకాశ్ నారాయణ కూడా అక్రమాలు చూసుకోవడానికి ఆర్‌బిఐ ఉండగా ఉండవల్లికేం పని అని ప్రశ్నించారు. వెంటనే శ్రీరమణ ‘పెట్రోలు బంకుల్లో కల్తీ వెరిఫై చేయడానికి సంబంధిత శాఖలుండగా మీ లోకసత్తా వాలంటీర్లకేం పని?’ అని నిలదీశారు. విద్యావంతుల్లో, మేధావుల్లో రామోజీ అభిమానులకు కొదవ లేదు. ఆయనేం చేసినా తప్పు కాదు వారి దృష్టిలో. చట్టం దృష్టిలో ఔనో కాదో మనకు ఎప్పటికీ తెలియకుండా పోతోంది, ఆయన తెచ్చుకునే స్టేల కారణంగా! ఆయనకు అనేక రక్షణ వలయాలున్నాయి. ఇన్నీ తెలిసి, జగన్ ఏ ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు? బిజెపి అభయమిచ్చిందా?

రామోజీ చంద్రబాబుకి, కెసియార్‌కు (వెయ్యినాగళ్లతో ఫిల్మ్ సిటీ దున్నుడు వాగ్దానం ఏమైందో గుర్తుందా?) యిద్దరికీ ఆత్మీయుడు. ప్రస్తుతం బిజెపికి వాళ్లిద్దరూ అయిష్టులు. కెసియార్‌పై కత్తులు నూరుతోంది. ఆంధ్రలో టిడిపిని క్షీణింప చేసి, దాని స్థానంలో ఎదుగుదామని చూస్తోంది. ఎన్నికల సమయంలో టిడిపి, భారాసలకు ‘‘ఈనాడు’’ మద్దతివ్వకుండా రామోజీపై ఒత్తిడి పెట్టిస్తున్నారేమో తెలియదు. రిలయన్స్ వాళ్లు అడ్డుపడరా అంటే ఎందుకు పడతారు? వాళ్ల పెట్టుబడుల్లో ఈనాడులో పెట్టినది లవలేశం మాత్రమే! నిజంగా బిజెపి యిలాటి బేరం పెడితే రామోజీ ఏం చేస్తారు? తప్పకుండా ఒప్పుకోవచ్చు. దాసరి కేంద్రమంత్రి కాగానే దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి, అహాన్ని దిగమింగి, ఫిల్మ్ సిటీకి ఆహ్వానించలేదా? మరి జగన్ ఏం చేస్తాడు? రామోజీని ఏమీ చేయలేకపోయానని వగచుతాడా? టిడిపికి ఆ మేరకు మద్దతు లేకుండా చేశానని సంతోషిస్తాడా? చూదాం, యీ కథ ఎంతకాలం, ఎలా సాగుతుందో!

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా