cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 09

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 09

ఎన్టీయార్‌ అనేక పౌరాణిక, చారిత్రాత్మక సినిమాల స్క్రిప్టులు సముద్రాల, పింగళిల చేత రాయించుకుని దగ్గర పెట్టుకుని దశాబ్దాల తర్వాత తీశారని, అవి అనుకున్నంత విజయం సాధించలేదని అందరికీ తెలుసు. అయితే ఒక సినిమా తాజాగా తన కోసం రాయించుకుని కూడా తీయలేకపోయిన వైనం డివి నరసరాజుగారు 'తెర వెనుక కథలు'లో గ్రంథస్తం చేశారు. 1980/81లో ఎన్టీయార్‌కు షూటింగులో చిన్న యాక్సిడెంటు జరిగి చెయ్యి ఫ్రాక్చరైంది. అలా ఫోర్స్‌డ్‌ రెస్టు దొరకడంతో కబుర్లు చెప్పుకుందాం రమ్మనమని నరసరాజుగార్ని పిలిచారు. ఈయన భార్య పోయి అప్పటికే ఏడాది కావడంతో కుటుంబం, భార్యబిడ్డల అనుబంధం గురించి కబుర్లు చెప్పుకున్నారు. 'యవ్వనంలో, మధ్యవయసులో భార్యాభర్తలు ఎదుటి వాళ్ల నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు, 60 ఏళ్లు దాటాకే అవతలివాళ్లకు నేను ఏం చేయగలను అని ఆలోచిస్తారు.' అంటూ నరసరాజు పిల్లలు, పెళ్లిళ్లు, బంధువులు, కోడళ్లు, అల్లుళ్లు గురించి జనరల్‌గా మాట్లాడారు. ఎన్టీయార్‌ శ్రద్ధగా వింటూ తన అనుభవాలు కూడా చెప్పారు.

ఓ గంట పోయాక 'మీరిప్పుడు చెప్పినవి ఏదైనా సినిమాలో రాశారా?' అని ఎన్టీయార్‌ అడిగారు. 'సినిమాలో పెట్టలేదు కానీ 'బస్తీలో బహుకుటుంబీకుడు' పేర రేడియోకి 8 వారాల సీరియల్‌ నాటకంగా రాశాను' అన్నారీయన. మ్యానుస్క్రిప్ట్‌ ఉంటే రేపు పట్టుకుని వచ్చి చదివి వినిపించండి' అన్నారు ఎన్టీయార్‌. మర్నాడు చదవడం ప్రారంభిస్తూ ఉంటే బసవతారకం గారు కాఫీ తెచ్చి యిచ్చి వెళ్లిపోయారు. 'ఆవిణ్నీ పిలవండి, వింటారు' అన్నారు నరసరాజు. ఎన్టీయార్‌ మెల్లగా 'వద్దు లెండి, మీరు నిన్న చెప్పిన విషయాలని బట్టి చూస్తే యిందులో మనకి ఎదురు దెబ్బలు తగిలేట్టున్నాయి' అన్నారు నవ్వుతూ.

నరసరాజు కూడా నవ్వి, చదివి వినిపించారు. ఎన్టీయార్‌కు విపరీతంగా నచ్చేసింది. 'ఇప్పుడు నాకు పదిపన్నెండు లక్షలిచ్చి నాచేత యీ ముసలివేషం ఏ ప్రొడ్యూసర్‌ వేయిస్తాడు? మనమే తీద్దాం. దీన్ని సినిమాకి ఎడాప్ట్‌ చేయండి. మధ్యవయసులో ఉన్న దశలో ఏమైనా మంచి సంఘటనలు ఫ్లాష్‌బ్యాక్‌లో పెట్టండి. 'పుణ్యదంపతులు' అని పేరు పెడదాం' అన్నారు. రెండు మూడు వారాల్లో మొత్తం స్క్రిప్టు పూర్తయింది. 1982 జనవరిలో నరసరాజుగారి స్క్రిప్టు ఫైనలైజ్‌ చేసేశారు కూడా. అది జరిగిన రెండు నెలలకే రాజకీయప్రవేశం గురించి ప్రకటన చేయడం జరిగింది. దాంతో సినిమా పెండింగులో పడింది. తర్వాత చాలా వేదికల మీద ''శ్రీనాథ'', ''పుణ్యదంపతులు'' సినిమాలు తీయాలి అంటూ వచ్చారు. ఫైనల్‌గా శ్రీనాథ తీశారు కానీ, పుణ్యదంపతులు తీయలేదు.

అదే పుస్తకంలో నరసరాజుగారు రాశారు - తను రాసిన ''యమగోల'' (1977) సినిమాలో హీరో పాత్ర బాలకృష్ణ వేయాలని, యముడి పాత్ర ఎన్టీయార్‌ వేయాలని తన ప్రతిపాదన అని. 1977లో కెమెరామన్‌ వెంకటరత్నం గారు నరసరాజుగారి వద్దకు వచ్చి ''ఈ తరం మనిషి'' సినిమా తీసి నష్టపోయాను. పరువు కోసం మరో సినిమా తీయాలి, మీరు రాసి పెట్టాలి. కథ చెప్పండి'' అన్నారు. ''దేవాంతకుడు'' సినిమా బాగుంటుంది కానీ, దానికి ముందూ వెనకా కథ కలిపి రాసుకుంటే బాగుంటుంది. కానీ కథ కొంతైనా కలుస్తుంది కాబట్టి ''దేవాంతకుడు'' (1960) సినిమా హక్కులున్నవాళ్లు గోల పెట్టకుండా నువ్వు కొనేసుకో'' అన్నారు. కానీ అప్పటికే దాని హక్కులు జిల్లాల వారీగా, తాలూకాల వారీగా ఎవరెవరో కొనేసుకున్నారు. అందరి ఆరాలూ తీయలేక, అంతగా కేసు వస్తే అప్పుడే చూసుకుందాం అనుకున్నారు.

''యమగోల' అనే టైటిల్‌ సి.పుల్లయ్యగారు రిజిస్టరు చేయిస్తే ఫైనల్‌గా రామానాయుడుగారు కొనుకున్నారు. దానికి తగ్గ కథ దొరక్క వాడుకోవడం లేదు. నువ్వు అది కనుక్కో, మన కథకు పనికి వస్తుంది' అని నరసరాజు చెపితే వెంకటరత్నం 5 వేలకు కొనుక్కున్నారు. 15-20 రోజుల్లో కథ ఒక తృప్తికరమైన రూపానికి వచ్చింది. దేవాంతకుడులో ఎన్టీయార్‌ హీరోగా వేయగా, అతని ధాటికి తట్టుకోలేక విలవిల్లాడిన యముడిగా ఎస్వీయార్‌ వేశారు. అప్పటికే ''కర్ణ'' సినిమా విడుదలై అభిమన్యుడిగా వేసిన బాలకృష్ణకు పేరు వచ్చింది. ఎన్టీయార్‌ యముడిగా వేస్తే, అతను హీరోగా వేసి నిజజీవితంలో తండ్రిని ఎదిరిస్తూ డైలాగులు చెపితే ప్రేక్షకులు కిక్కు నిస్తుందని నరసరాజు అనుకున్నారు. అయితే బాలకృష్ణ, ఎన్టీయార్‌లతో సినిమా అంటే ఫ్లాప్‌ సినిమా తీసిన వెంకటరత్నంకు పైనాన్సు పుడుతుందా అని నరసరాజుకి అనుమానం వచ్చింది. 'కావాలంటే రామారావు గారికి నేను కథ చెప్తాను. ఆయనకు కథ నచ్చితే బాలకృష్ణ ఉంటాడు కాబట్టి ఆయన కూడా పెట్టుబడి పెట్టవచ్చు.' అని ఐడియా యిచ్చారు నరసరాజు.

సందేహిస్తూనే వెంకటరత్నం ఎన్టీయార్‌ను అడిగితే ఆయన కథ వింటాను అన్నారు. నెలాఖరుకు కథ విని, నరసరాజుతో ''బాలయ్యను నా సొంత సినిమాలకు తప్ప యితరులకు యివ్వను, అతని చదువు దెబ్బ తింటుంది.  పైగా యీ హీరో వేషం బాలయ్య మొయ్యలేడు. నేనే వేయవలసినంత యింపార్టెన్స్‌ ఉంది. యముడు సత్యనారాయణ చేత వేయిద్దాం.'' అన్నారు. డైలాగులన్నీ నరసరాజు చేత చదివి వినిపించుకున్నారు. యమలోకం సీన్ల షూటింగు జరిగేటప్పుడు ఆయన్ని దగ్గరుండమని కోరారు. సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. డైలాగులు గ్రామఫోన్‌ రికార్డులుగా వచ్చాయి. ఎన్టీయార్‌కు కెవి రెడ్డి గారంటే గురుభావం. ఆయన సినిమాలు వరుసగా ఫెయిల్‌ కావడంతో చివరి దశలో కష్టాలు అనుభవించారు. విజయా నిర్మాతలు నాగిరెడ్డి- చక్రపాణిలకు కెవి రెడ్డి లవ్‌-హేట్‌ బంధం ఉండేది. ''షావుకారు'' సినిమా వైఫల్యం తర్వాత కెవి తీసిన ''పాతాళభైరవి''తోనే విజయా నిలబడింది.

కానీ తర్వాతి సినిమా వాహినీకి తీస్తానని కెవి అనడంతో నాగిరెడ్డి-చక్రపాణి అహం దెబ్బ తింది. అతి కష్టం మీద ''మాయాబజార్‌'' తయారైంది. దాని హిట్‌ తర్వాత కెవి నిర్మాతలకు టెర్మ్‌స్‌ డిక్టేట్‌ చేశారు. ''జగదేకవీరుని కథ''కు మీ పేర్లు లేకుండా దర్శకనిర్మాతగా నా పేరు వేయాలి' అన్నారు. వాళ్లు ఒప్పుకున్నారు. కానీ దాని తర్వాత అదే టెర్మ్‌స్‌ మీద ''సత్య హరిశ్చంద్ర'', ''ఉమా చండీ గౌరీశంకరుల కథ'' (1968) ఫ్లాప్‌ కావడంతో యిక ఆయనపై పగ తీర్చుకున్నారు. స్టాఫ్‌ మొత్తాన్ని తీసేసి, ఎక్కవుంట్లు సెటిల్‌ చేసి యింటికి పంపేశారు. నెల జీతాల మీద వున్న పింగళి, గోఖలే, కళాధర్‌, వగైరాలు అందరికీ ఉద్వాసన చెప్పారు. కెవి రెడ్డిగారికి యిచ్చిన కారుని కూడా వెనక్కి తెప్పించేసుకున్నారు.

ఇది విని ఇండస్ట్రీలో అందరూ బాధపడ్డారు. ఎన్టీయార్‌ మాత్రం చొరవ తీసుకుని కెవి యింటికి వెళ్లి ''నా సొంతానికి ఒక సినిమా తీసిపెట్టండి. మీ రచయిత పింగళి రాసిన స్క్రిప్టులు రెండు నా దగ్గరున్నాయి. ఒకటి ''చాణక్య-చంద్రగుప్త'', మరొకటి ''శ్రీకృష్ణ సత్య'' ఈ రెంటిలో మీ యిష్టం వచ్చింది తీసి పెట్టండి.'' అని అడిగారు. అప్పటికే సొంతంగా డైరక్టరు అయిన ఎన్టీయార్‌ తన మీద అభిమానంతో యీ ఆఫర్‌ యిస్తున్నాడని గ్రహించిన కెవి ''శ్రీకృష్ణ సత్య తీస్తాను రామారావ్‌'' అన్నారు. నరసరాజుగారితో ''రామారావు నాకు కొండంత బలమూ ధైర్యమూ యిచ్చాడు. ఒక మంచి చిత్రం తీసి తృప్తిగా రిటైరై మా సొంతూరు తాడిపత్రి వెళ్లిపోతాను'' అన్నారు కెవి.

1971 డిసెంబరులో విడుదలైన ''శ్రీకృష్ణ సత్య'' కళాత్మకంగా రూపొందింది. బాగానే ఆడింది. నిజానికి సినిమా డైరక్షనంతా ఎన్టీయార్‌ చేసి, కెవి చేత ప్రతి షాట్‌ ఓకే చేయించుకునేవారట. 1972 సెప్టెంబరులో 60 సం.ల వయసులో తృప్తిగా కన్నుమూశారు.

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 02  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 03

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 04 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 05  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 06

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 07 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 08

కమల్ తో కలిసి నటించాలని వుంది

సాయం చేయడం నా తల్లి నుంచే నేర్చుకున్నా

 


×