రాష్ట్రంలో ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా ఉండగా, కేంద్రంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా వుండగా ఎన్టీయార్‌పై రాజకీయప్రేరితమైన ప్యారడీ సినిమాలు తయారయ్యాయని చాలామందికి తెలుసు. సినిమా గ్లామర్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఎన్టీయార్‌ను దింపడానికి సినిమాలే ఆయుధమని కాంగ్రెసు లెక్క వేసింది. కాంగ్రెసు పార్టీ సభ్యుడు, ఎన్టీయార్‌తో కొంతకాలం సఖ్యం, కొంతకాలం వైరం పాటించిన నటుడు, నిర్మాత కృష్ణ ఆ సినిమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వెన్నుదన్నుగా నిలిచారని అంటారు. ''నా పిలుపే ప్రభంజనం'' (1986) అయితే ఆయన బ్యానర్ మీదే పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో తీశారు. తను హీరో, త్రిలింగ రాజ్యాధిపతి అంటూ ఎన్టీయార్‌ను పోలిన కారెక్టరును పెట్టి, కోదండరామయ్య అని పేరు పెట్టి, ఆయన పరిపాలనను దుమ్మెత్తిపోశారు.
రిటైర్‌మెంటు వయసు 58 నుంచి 55కు (సినిమాలో 59 నుంచి 56 అని చూపారు) తగ్గించడం వలన ఓ టీచరు గుండె పగిలి చనిపోవడం, ఇద్దరు అల్లుళ్లు పాలనలో జోక్యం చేసుకోవడం, తక్కినవాళ్లందరూ తనకు ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టాలని పాలకుడు ఆశించడం, మాటిమాటికి తెలుగు, తెలుగు అంటూండడం – వంటి ఘటనలు పెట్టి, ఎన్టీయార్‌పైనే పూర్తిగా అస్త్రాలను సంధించారు. అప్పటిదాకా ఎన్టీయార్ సినిమాల్లో పలు ముఖ్యపాత్రలు ధరించిన సత్యనారాయణ ఎన్టీయార్‌ను అనుకరిస్తూ వేషం వేశారు. సినిమా చివర్లో కృష్ణ యీ నియంతృత్వంపై తిరగబడి విజయం సాధిస్తాడు. కోదండరామయ్య పారిపోగా, చిన్నల్లుడు జైలుకి వెళతాడు.
కథ పెద్దగా లేకపోయినా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఎన్టీయార్ ప్రపంచ అభిమానుల సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వర్ తన సంఘ సభ్యులతో కలిసి సినిమా హాళ్ల యజమానులను బెదిరించారు. దాంతో డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దులిపేశారు. ''వాస్తవాలను వక్రీకరించిన ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్టు యిచ్చి వుండకూడదు. కేంద్రం చేతిలో సెన్సారు ఉంది కాబట్టి ఈ సినిమాకు సర్టిఫికెట్టు వచ్చింది.'' అని టిడిపి నాయకులు ఆరోపించారు. ప్రతిగా బాలకృష్ణ చేత ఒక సినిమా తీయించి విడుదల చేద్దామని టిడిపి ఆలోచిస్తోందని ''ఇండియా టుడే'' తన అక్టోబరు 15, 1986 సంచికలో రాసింది. అయితే అది కృష్ణ వ్యక్తిగత జీవితంపై తీయాలా, కాంగ్రెసు పార్టీ గతంలో రాష్ట్రాన్ని పాలించిన విధానంపై తీయాలా అనేది తేల్చుకోలేక పోతున్నారని రాసింది. అది తేలకే కాబోలు, ఏ సినిమా తీయలేకపోయారు.
ఆ తర్వాతి ఏడాది ''మండలాధీశుడు'' (1987) విడుదలైంది. ఎన్టీయార్ తన సినిమాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించిన ప్రభాకరరెడ్డి కాంగ్రెసులో చేరి, ఎన్టీయార్‌పై పగ బూనినట్లు, అడుగడుగునా ప్యారడీ చేయిస్తూ ఈ సినిమాను డైరక్టు చేశారు. ఎన్టీయార్ పాత్రలో కోట శ్రీనివాసరావు జీవించేశారనాలి. ఎన్టీయార్‌కు ఆప్తులై వుండి, ఆయన సొంత సినిమాల్లో కూడా నటించిన భానుమతి, గుమ్మడి వగైరాలు నటించారు. నా పిలుపే ప్రభంజనం నటుడు సత్యనారాయణపై ఎటాక్ జరగలేదు, ఆయన్ని ఎవరూ బహిష్కరించలేదు కానీ కోటపై మాత్రం విజయవాడ రైల్వే స్టేషన్‌లో భౌతికపరమైన దాడి జరిగింది. నాలుగైదేళ్లపాటు నిర్మాతల బృందమొకటి అవకాశాలు యివ్వలేదు. కృష్ణ ఆదుకోవడంతో కోటకు వేషాలు వచ్చాయి.
కొన్నాళ్లు పోయాక కోట ఎయిర్‌పోర్టులో ఎన్టీయార్ తారసిల్లగా వెళ్లి ఫలానా అని చెప్పుకున్నారు. కాళ్లకు దణ్ణం పెట్టారు. ఎన్టీయార్ 'ఓహో, మీరా, మంచి నటులు! ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి' అని వెళ్లిపోయారు. కోట హమ్మయ్య అనుకున్నారు. 1989 నవంబరులో ఎన్నికలు వచ్చాయి. దానికి సన్నాహంగా అన్నట్లు ఇంకో రెండు సినిమాలు తయారయ్యాయి. ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వుండగానే తెలుగు, హిందీ భాషల్లో ఎన్టీయార్ చారిటీ ట్రస్టు నిర్మాణంలో ''బ్రహ్మర్షి విశ్వామిత్ర'' సినిమా ప్లాను చేసి, షూటింగుల్లో పాల్గొనసాగారు. రాజీవ్ గాంధీ నుంచి విడిపోయి వచ్చేసి, ఆయనకు వ్యతిరేకంగా పార్టీ పెట్టిన విపి సింగ్ వగైరాలను సినిమా ప్రారంభోత్సవానికి పిలిచారు. మీనాక్షి శేషాద్రికి మేనక పాత్ర యిచ్చి ఆమెతో డాన్సు షూట్ చేశారు. ఈ సినిమా నిర్మాణం ప్రజల విమర్శలకు గురైంది. చివరకు 1991లో రిలీజు చేశారు.
ఈ విశ్వామిత్ర థీమ్‌తోనే ఎన్నికలకు ముందు ''1990 కలియుగ విశ్వామిత్ర'' (1989), ''గండిపేట రహస్యం'' (1989), అనే రెండు సినిమాలు రిలీజయ్యాయి. మొదటి దానిలో విజయచందర్ ఎన్టీయార్‌గా, ఆయనకు జోడీగా రమ్యమకృష్ణ వేశారు. తర్వాత విలన్‌గా, కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ శక్తి డైరక్టు చేశారు. గండిపేటలో ఎన్టీయార్‌కు స్టూడియో ఉంది. అక్కడ వున్న కుటీరంలో ఆయన ప్రధాని పదవి కోసం క్షుద్రపూజలు చేస్తున్నాడని, చీర కట్టుకునేవాడని, తన కంటె వయసులో చిన్న అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని.. యిలా చాలా పుకార్లు వుండేవి. వాటిని ఆసరా చేసుకుని ''గండిపేట రహస్యం'' తయారైంది. ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాలన ఎదిరించే యువకుడిగా నరేశ్ నటించారు. విజయనిర్మల కూడా నటించారు. డైరక్షన్ ప్రభాకరరెడ్డి. కృష్ణ సినిమా ఓపెనింగులో కనబడి మాట్లాడతారు. 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ'గా పేరు బడిన కమెడియన్ పృథ్వీ యీ సినిమాతో తెరకు పరిచయమై ఎన్టీయార్‌గా నటించారు. ఈ రెండు సినిమాలూ పెద్దగా ఆడలేదు కానీ ఎన్నికలలో టిడిపి పరాజయం పాలయింది.
కృష్ణ ఏలూరు నుంచి పార్లమెంటు సీటుకి పోటీ చేశారు. తమపై సినిమాలు తీసిన కృష్ణను ఓడించాలన్న పట్టుదలతో ఉన్న టిడిపి బోళ్ల బుల్లిరామయ్య అనే ధనికుణ్ని ప్రత్యర్థిగా నిలిపింది. కృష్ణ పొంగిపొరలే ఆత్మవిశ్వాసంతో ''బుల్లి రామయ్యనే కాదు, యిక్కడకు వస్తే పెద్దరామయ్యనే ఓడిస్తా.'' అని ప్రకటించారు. ఏది ఏమైనా ఆ ఎన్నికలలో టిడిపి చావుదెబ్బ తింది. అసెంబ్లీ ఎన్నికలలో దానికి 128 సీట్లు తగ్గి 74 వచ్చాయి. కాంగ్రెసు 50 సీట్ల నుంచి 181కి ఎగబాకింది. ఇక పార్లమెంటు విషయానికి వస్తే టిడిపి కేవలం రెండంటే రెండే సీట్లు గెలిచింది. ఎన్టీయార్ నెలకొల్పి, అధ్యక్షుడిగా ఉన్న నేషనల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, రెండు సీట్లు మాత్రమే రావడంతో ఆయనకు విలువ పోయింది. వాళ్లు యీయన్ని పూచికపుల్లలా తీసిపారేశారు. మళ్లీ 1994లో గెలిచి వచ్చేదాకా ఎన్టీయార్‌కు అధికారం దూరమైంది. సినిమాలు చేసుకుంటూ, తీసుకుంటూ కాలక్షేపం చేయవలసి వచ్చింది.
ఎన్టీయార్‌కు వ్యతిరేకంగా వెలువడిన సినిమాల గురించి యిదంతా మనకు తెలుసు. తెలియనిదేమిటంటే ఎన్టీయార్ కూడా రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా సినిమా ప్లాను చేశారని! దాని గురించి ముళ్లపూడి వెంకట రమణగారి ఆత్మకథ ''కోతికొమ్మచ్చి''లో సమాచారం దొరుకుతోంది.
సినిమా వాళ్లకు కథ చెప్పడంలో వుండే కష్టాల గురించి రాస్తూ రమణగారు యిలా రాశారు.
'…వీరిని మించిన వీరశిల్పులున్నారు. తెలుగులో తమిళంలో – అన్ని చోట్లా. రచయిత కథ చెప్తుండగా ముఖ్యమైన మలుపు, పాయింట్లు వచ్చాక- ఒకడు 'అరె హరె' అనేవాడు. పక్కవాడు ఆశ్చర్యంగా చూసేవాడు. ''నిన్న సాయంత్రం మనం అనుకున్న లైను ఇదే కదూ'' అంటాడు మొదటివాడు. ''లైనేమిటి-డైలాగులతో కూడా చెప్పేస్తున్నాడీయన'' అని రెండోవాడు. ''అంథా ఇదే – సేమ్ టు సేమ్''. ''సరే- ఆయనకి అడ్డురాకు – సాంతం చెప్పనీ'' అంటారెవరో! అప్పటికే బిక్కచచ్చిపోయిన కవిగారు నీరసంగా మిగతా కథ చెప్పి తలవంచుకునేవాడు. ''ఇదంతా – ఈ కథంతా మేం నిన్న రాత్రి అనుకున్నదే. నోట్సు కూడా రాసుకున్నాం – ఏమీ అనుకోకండి – మీరు చాలా టాలెంటెడ్ – ఇలాటివి ఇంకో వంద చెప్పగలరు'' అని భుజం తట్టి సాగనంపేవారు.
కొత్తగా వస్తున్న కథకులు చాలామందికి ఇలా జరిగింది. ఎవరో ఎందుకు- నాకే ఇది అనుభవం. బాంబే యాక్టర్ రాజ్ బబ్బర్ దగ్గర. ఎన్‌టియార్ సి.ఎం పదవిలో ఉండగా – అప్పుడే పదవిలోకి వచ్చిన రాజీవ్ గాంధీగారి మీద ఒక పారడీ తియ్యాలనుకున్నారు. అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చి ఏ దోషాలూ లేని మంచి మనిషిగా పేరున్న రాజీవ్ గాంధీ అంత క్లీన్ కాదని ప్రచారం చెయ్యడం వారి ఉద్దేశం. దానికి మిస్టర్ క్లీన్ అని పేరు పెట్టారు. నన్ను రాయమన్నారు. నేను స్థూలంగా కథ అనుకుని చెప్పాను. బాగుందని-దాన్నే డెవలప్ చేయమన్నారు. తయారయ్యాక అప్పటి ఎన్.ఎఫ్.డి.సి ఛైర్‌మన్ డి.వి.యస్ రాజుగారి ఇంట్లో (ఫిలింనగర్‌లో) సిట్టింగు పెట్టారు. హిందీకి రాజ్ బబ్బర్‌నీ, తెలుగుకి మోహన్‌బాబు గారినీ ఫిక్స్ చేశారు. వాళ్లనీ పిలిచారు. ఆ మీటింగుకి సి.ఎం. తరఫున చంద్రబాబునాయుడు గారు వచ్చారు.
నేను కథ చెప్పడం మొదలైన అయిదు నిమిషాల తర్వాత 'శబాష్ – క్యా బాత్ హై!' అన్నారు, బాంబే బబ్బర్ గారు. ఇంకో నిముషంలో 'అరే -కమాల్ హై! బహుత్ కమాల్ హై' అని గట్టిగా అన్నారు. ''సేమ్ టు సేమ్ – యెహి కహానీ – యెహి సీనేం – వా – 'కమాల్' అన్నారు.
పొగుడుతున్నారు అనుకుని నేను సంతోషంగా ముందుకు సాగుతున్నాను.
రాజుగారు 'ఆపండి' అన్నారు ధాటీగా! నేను ఆపేశాను. అయోమయంగా చూశాను. నాతో వచ్చిన శ్రీ రమణగారి వంక చూశాను. ఆయనకీ ఏమర్థం కాలేదు.
రాజ్ బబ్బర్, అతని కూజా (అసిస్టెంటు) ఒకరికొకరు షేక్‌హాండ్సి చ్చేసుకుంటున్నారు హోరాహోరీగా.
''ప్లీజ్ – వన్ మినిట్'' అన్నారు రాజు గారు. ''ఏమిటి సంగతి'' అన్నారు కొంచెం ఖచ్చితంగా.
వాళ్ళు చెప్పినదాని సారాంశం…. ఇదే కథ – వాళ్ళు అల్లేసుకున్నారు… బాంబేలో మొదలుపెట్టి విమానం మెడ్రాసు వచ్చేసరికి పూర్తి చేసేశారుట! 'ఈ మెడ్రాసు రైటర్ రమణా సాబ్‌కి ఇదెలా తెలిసింది – ఇదే లైనాఫ్ థాట్ ఎలా వచ్చింది' అని వాళ్ళ ఆశ్చర్యం! ''అంటే – యూ నో.. ద హోల్లీ – కంప్లీట్‌లీ – ఇట్స్ మిరకిల్ – బహుత్ కమాల్ హై – సేమ్ టు సేమ్'' అన్నారు బబ్బర్.
''ఈ కథ సీయం గారూ నేనూ నిన్ననే విన్నాం. నాకు కథంతా తెలుసు- మీరు మిగతాది చెప్పండి – టూకీగా- క్లయిమాక్సు – ఒక్క ముఖ్యమైన ఇన్సిడెంట్'' అన్నారు రాజుగారు.
రాజ్ బబ్బర్, అతని తోడూ నీడా కంగారుపడ్డారు- 'అదీ – అఫ్‌కోర్స్ – ఐ మీన్ – ఉయ్ మీన్'' అని నీళ్ళు నములుతున్నారు. 'మీను'మేషాలు నవుల్తూ.
ఫోను మోగింది. అవసరాన్నిబట్టి మోగే ఫోనులు అలర్ట్‌గా ఉంటాయి. రాజు గారు తీసుకున్నారు. ''ఆ – ఊ – అలాగే'' అని ఫోను పెట్టేశారు.
''అర్జెంట్ మీటింగ్ – కల్ మిలేంగే'' అన్నారు లేచి నించుని.
అందరం లేచాం.
రాజుగారు కదుల్తూండగా రాజ్ బబ్బర్ ఆయనకు ఒక బిల్లు చేతికిచ్చాడు. అది బాంబే టెయిలర్స్ కచ్చిన్స్ కంపెనీ వారు ఇచ్చిన బిల్లు – 32 వేలకి! రాజీవ్‌గాంధీ రూపంలో మిస్టర్ క్లీన్‌గా బబ్బర్ నటించబోయే వేషానికి కాస్ట్యూమ్స్!ట.' – యిదీ రమణగారు రాసినది.
అంటే ఎన్టీయార్ కూడా రాజీవ్‌పై 'చిత్రప్రతీకారం' ప్లాను చేశారన్నమాట కానీ అది వర్కవుట్ కాలేదు. ఏది ఏమైనా 1989లో అటు రాజీవ్, యిటు ఎన్టీయార్ యిద్దరూ ఓడిపోయారు.
తర్వాతి రోజుల్లో రాజకీయ ప్రయోజనాలతో సినిమాలు వచ్చినట్లు లేదు. వర్మ 'లక్ష్మీస్ ఎన్టీయార్'కు వైసిపి మద్దతు ఉంటే అది ఆ క్యాటగిరీలోకి చేరుతుంది.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2019)
[email protected]
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 01 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 02 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 03
ఎమ్బీయస్: ఎన్టీయార్ – 04 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 05 ఎమ్బీయస్: ఎన్టీయార్ – 06