Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

యువి-దిల్ రాజు జాగ్రత్త పడాల్సిన టైమ్

యువి-దిల్ రాజు జాగ్రత్త పడాల్సిన టైమ్

రాను రాను సినిమా పంపిణీ అన్నది జూదంగా మారిపోతోంది. ఇంకా చెప్పాలంటే కళ్లకు గంతలు కట్టుకుని ఆడే బ్లయిండ్ ఫోల్డ్ గేమ్ మాదిరిగా మారుతోంది. కేవలం కాంబినేషన్లు చూసి సినిమాలు కొనడం తప్ప, దర్శకులు ఏం తీస్తున్నారు అన్నదానిపై మినిమమ్ సమాచారం బయ్యర్లకు వుండడం లేదు. ఫస్ట్ లుక్ లు, టీజర్లు చూసి కొనేవారు కొందరు. కాంబినేషన్లు చూసి కొనేవారు మరి కొందరు.

టాలీవుడ్ లో ఏషియన్ సునీల్, గీతాసంస్థ, దిల్ రాజు, యువి వంశీ, సురేష్ బాబు, ఎన్వీ ప్రసాద్ లాంటి పెద్ద బయ్యర్లు వున్నారు. వీరుకాక, జిల్లాల వారీ టాప్ పోజిషన్ లో వున్నవారు వున్నారు. సినిమాలు జిల్లాల వారీ కొనడం వేరు. ఓ రేంజ్ రిస్క్ వుంటుంది. కానీ మొత్తం అవుట్ రేట్ గా తెలుగు రాష్ట్రాలకు లేదా ఏకంగా రెండు మూడు జిల్లాలకు కొనడం వేరు. దానివల్ల రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిపోతోంది.

యువి, దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ బాబు లాంటి వాళ్లకు థియేటర్లు వుండడంతో వాటి కోసం కూడా సినిమాలు కొనాల్సి వస్తోంది. అయితె ఈ విషయంలో సురేష్ బాబు చాలా ఆచితూచి వ్యవహారిస్తున్నారు. జిల్లాల వారీగా చిన్న చిన్న స్టేక్ లు పందెం ఒడ్డుతున్నారు తప్ప, భారీ పందాల జోలికి పోవడం లేదు.

ఏషియన్ సునీల్ కూడా ఓ రేంజ్ దాటి రిస్క్ చేయడం లేదు. అయినా కూడా ఆయనా దెబ్బలు తినడం తప్పడం లేదు. దిల్ రాజు, యువి వంశీల స్టయిల్ వేరు. తెగింపుతో ముందుకు దూసుకువెళ్తున్నారు. గత రెండేళ్లుగా దిల్ రాజు ఒకసారి ప్రొడక్షన్ పరంగా, మరోసారి డిస్ట్రిబ్యూషన్ పరంగా గట్టిదెబ్బలు తింటున్నారు. 

అయినా ఇద్దరూ కూడా రిస్క్ లు వదలడం లేదు. రోబో సినిమా విషయంలో ఎన్వీప్రసాద్ తో కలిసి చేసిన రిస్క్ ముగ్గురికి తలా అయిదు కోట్లు నష్టం మిగిల్చింది. యువి వంశీకి జిల్లాల వారీ డిస్ట్రిబ్యూషన్ పరంగా మరో రెండుకోట్ల పైనే నష్టం వచ్చిందని వినికిడి.

యువి వంశీకి ఇటీవల కాలంలో జిల్లాల్లో చాలా సినిమాలు దెబ్బతీసాయి. లేటెస్ట్ గా రామ్ చరణ్ తో మొహమాటానికి పోయి వినయ విధేయరామ సినిమాను 72 కోట్లకు తెలుగు రాష్ట్రాలకు కొన్నారు. ఇప్పుడు ఈ సినిమా గట్టెక్కుతుందో లేదో చూడాలి.

ఒక పక్క సాహో లాంటి వందల కోట్లు బడ్జెట్ సినిమా, మరోపక్క ఇలాంటి భారీ సినిమాల కొనుకోళ్లు. ఇలా అయితే టర్నోవర్ తిరగడం కష్టం అవుతుంది. లాస్ట్ మినిట్ లో ఎవరో ఒకరు సాయం చేయాల్సి వస్తుంది. అది యువికి అయినా, దిల్ రాజుకు అయినా.

యువి సంస్థకు స్వంత సినిమాలు ఎప్పుడూ దెబ్బతీయలేదు. బ్లయిండ్ గా కొనుగోలు చేసిన సినిమాలే కుదేలు చేస్తున్నాయి. ఈ విషయంలో గీతా, సురేష్ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. వాటిని చూసి అయినా యువి తన వర్కింగ్ స్టయిల్ మార్చుకోవాలేమో?

ఇలాంటి దుందుడుకు వ్యవహారాల వల్ల సినిమా రంగంలో చాలామంది బ్యానర్లను, నిర్మాతలను దూరం చేసుకుంది. యువి, దిల్ రాజు లాంటి వాళ్లు ఆచితూచి వ్యవహరించకుంటే అలాగే అవుతుందని, ఆ బ్యానర్లను అభిమానించేవారు ఆందోళన చెందుతున్నారు.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?