cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: పికె గీతాబోధ – అస్త్రసన్యాసం కూడదు

ఎమ్బీయస్: పికె గీతాబోధ – అస్త్రసన్యాసం కూడదు

ఈ ఎన్నికలలో చాలామంది హీరోలున్నారు. లెక్క ప్రకారం చూస్తే 5 రాష్ట్రాలలో బిజెపి 2 గెలిచింది. అసాం, పుదుచ్చేరి. కానీ అవి చిన్న రాష్ట్రాలు. పుదుచ్చేరి జనాభా 9 లక్షలు, అసాంది 3.60 కోట్లు. లెఫ్ట్ ఫ్రంట్ కేరళ గెలిచింది. కానీ దాని జనాభా కూడా అసామంతే – 3.50 కోట్లు. పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు (7.90 కోట్లు), బెంగాల్ (10 కోట్లు) లను బిజెపికి ప్రత్యర్థులైన డిఎంకె, తృణమూల్ గెలుచుకున్నాయి. ఈ రెండిటి విజయం వెనుక రాజకీయ సలహాదారు ప్రశాంత కిశోర్‌ (పికె) వున్నాడు. అతను రాజు కాదు, మంత్రే. అతని మొహం చూసి ఎవరూ ఓటేయలేదు. అతను లేకపోయినా మమత, స్టాలిన్ గెలిచేవారనుకోవచ్చు. అయినా వాళ్ల విజయాల స్కేలును పెంచాడు. అదీ గొప్ప! అంతకంటె గొప్ప ఏమిటంటే, విజయం సిద్ధించాక ‘నాకు బ్రేక్ కావాలి, నేను యీ వృత్తి నుంచి తప్పుకుంటున్నాను’ అన్నాడు.

చాణక్యుడు స్వయంగా యుద్ధం చేయలేదు. చంద్రగుప్తుడి చేత చేయించాడు. అతను రాజయ్యాక ముఖ్యమంత్రి కాలేదు. నందులను మళ్లీ అధికారంలోకి తెద్దామని ప్రయత్నిస్తున్న వాళ్ల మంత్రి రాక్షసామాత్యుణ్ని మేధోబలంతో ఓడించి, ‘పనికిమాలిన, తిరస్కరింపబడిన నందులను ఉద్ధరించాలని చూడడం కంటె కొత్త రాజైన చంద్రగుప్తుడికై నీ సేవలందించి, ప్రజలకు మేలు చేయి’ అని ఉపదేశించి, కక్షలు, కార్పణ్యాలూ వదిలేసి తను వానప్రస్థానానికి వెళ్లిపోయాడు. (చాణక్యుడి గురించి చరిత్రలో నానా రకాలుగా వుంది. ‘‘ముద్రారాక్షసం’’ అనే సంస్కృతనాటకం ప్రకారం కథ యిది) ఇప్పుడు పికె కూడా చేసింది చాలు అనుకుని వెళ్లిపోతున్నాడు. తను చేసే పని ఐ-ప్యాక్ టీము చేస్తుంది అంటున్నాడు. తదుపరి కార్యక్రమం నిర్ణయించుకోలేదు కానీ ప్రస్తుతానికి విరామం అంటున్నాడు.

వెళుతూ, వెళుతూ ఎన్‌డిటివి, ఇండియా టుడే టీవీలకు యిచ్చిన యింటర్వ్యూలు చూశాను. బాగా నచ్చాయి. ముఖ్యంగా అతను చేసిన గీతోపదేశం రాజకీయ పార్టీలకే కాదు, మనుషులందరికీ వర్తిస్తుంది.

ఈ మధ్యే ఓ వాట్సాప్‌లో వచ్చింది. ఎయిడ్స్ ప్రబలిన రోజుల్లో ‘దీన్ని ఎలా ఎదుర్కోవాలి?’ అని ఎవరో అడిగిన ప్రశ్నకు బదులుగా ఆచార్య రజనీశ్ చెప్పిన సందేశమది. కరోనాకు కూడా వర్తిస్తుందంటూ ఎవరో దాన్ని ఉటంకించారు. స్థూలంగా చెప్పినదిది – ‘మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రశ్న కాదు. దానివలన కలిగే మరణభయం ఎలా ఎదుర్కోవాలి అనేదే ప్రశ్న. దాని గురించి విపరీతంగా వినడం వలన, చర్చించడం వలన, ఆలోచించడం వలన మన శరీరాన్ని మనమే దుర్బలం చేసుకుని, మన శరీర రక్షణవ్యవస్థను భ్రష్టు పట్టించుకుని, ఇమ్యూనిటీని నాశనం చేసుకుని, యుద్ధానికి ముందే ఓటమి అంగీకరిస్తాం. చచ్చిపోతామేమోనన్న భయంతో చావు వచ్చేందుకు ముందే ఆత్మహత్య చేసుకుంటాం. ఆ భయంతో యింకోళ్లను చంపుతాం కూడా!’ కరోనా సోకిందని తెలియగానే ఆత్మహత్య చేసుకుని, కుటుంబసభ్యులను చంపినవాళ్ల వార్తలు వింటున్నాం కదా!

నిజానికి మన దేశంలో దాదాపు 2 కోట్ల మందికి సోకితే, 1.1% మంది 2.19 లక్షల మంది మాత్రమే చనిపోయారు. ఇప్పటికే 1.63 కోట్ల మంది సురక్షితంగా బయటపడ్డారు. తక్కినవారికి చికిత్స అందుతోంది. నూటికి 99 మంది బయటపడుతున్నపుడు మనం మాత్రం ఎందుకు బయటపడం? అనే పాజిటివ్ ఆలోచన కలిగే లోపునే మీడియా మనల్ని హడలగొడుతోంది. మహమ్మారి విరుచుకు పడుతోంది. మీకు సోకితే ఆక్సిజన్ అందదు, ఆసుపత్రిలో బెడ్ దొరకదు, శ్మశానంలో చోటు దొరకదు, ఈ సెకండ్ వేవ్ తప్పించుకున్నా, థర్డ్ వేవ్ మిమ్మల్ని చుట్టుముట్టడం ఖాయం అంటూ. ఇవన్నీ వాస్తవాలే కానీ జనాభాలో ఎంతమందికి యిలా జరుగుతోందనే కోణాన్ని విడిచిపెట్టి ప్రమాదం జరిగే అవకాశాలను ఉత్ప్రేక్షిస్తోంది.

‘‘సర్వర్ సుందరం’’ సినిమాలో ఓ డైలాగు నాకు చాలా బాగా నచ్చింది. ‘ఒక రాయిని కంటికి దూరంగా పెట్టి చూస్తే చిన్నగా అనిపిస్తుంది. దగ్గరగా పెట్టి చూస్తే పెద్దగా అనిపిస్తుంది. మరీ దగ్గరగా పెట్టి చూస్తే లోకమంతా అదే ఆక్రమిస్తుంది. అక్కణ్నుంచి తీసేసి, కాలి కింద వేసి నలిపిస్తే మాయమై పోతుంది. ఏ సమస్యైనా యింతే!’ అని. అదే రాయి, అదే కన్ను. ఎంత దగ్గరగా పెట్టుకున్నావనే దానిలోనే వుంది కీలకమంతా. పాలు విరిగిపోయాయనో, పేపరు సమయానికి రాలేదనో అదే పెద్ద సమస్యగా మనం మథన పడిపోతాం. బిజినెస్ మాగ్నెట్‌లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎంతెంత సమస్యలను ఎదుర్కుంటారో ఆలోచించి చూస్తే మనం చేసే హడావుడికి సిగ్గు వేస్తుంది. మీడియా ఏం చేస్తుందంటే రాయిని ఒక కోణంలో నుంచే చూసి సూదిగా వున్న వైపు ఎంచుకుంటుంది.. దాన్ని మన కంట్లో గుచ్చుకునేటంత దగ్గరగా పెడుతుంది. ఇక అక్కణ్నుంచి మనకు గాబరా. దేవుడిచ్చిన వివేకాన్ని వాడడం మానేసి, వాళ్లు సృష్టించిన ఆందోళనా ప్రభంజనంలో గడ్డిపోచలా కొట్టుకుపోతాం. నాకేమీ కాదు, నేను నిలబడతాను, పోరాడతాను అని అనుకోము.

కరోనా పరంగా చెప్పకపోయినా యీ ధోరణి తప్పంటాడు పికె. రాజకీయ ప్రత్యర్థి ఎదురైనప్పుడు నిలిచి పోరాడండి. పోరు ప్రారంభం కాకుండానే, మానసికంగా లొంగిపోయి, భౌతికంగా అస్త్రసన్యాసం చేసేయకండి అని కర్తవ్యబోధ చేస్తున్నాడు. యుద్ధం ముగించి, విజయం సాధించి, అస్త్రసన్యాసం చేశాడు కాబట్టి అలా చెప్పే అర్హత అతనికుంది. కృష్ణుడు కూడా ఏం చెప్పాడు? ‘యుద్ధం చేయడం నీ ధర్మం. నెగ్గుతావా లేదా అన్నది అవతలి మాట. హతోవా ప్రాప్యసి స్వర్గం, జిత్వావా భోక్ష్యసే మహీం – నెగ్గితే నేల నేలుతావు, ఓడితే చచ్చి వీరస్వర్గానికి వెళతావు. ఎటు చూసినా లాభమే. ఫలితం గురించి ఆలోచించకుండా రంగంలోకి దిగు. సకల శక్తియుక్తులు ఉపయోగించి పోరాడు.’ అన్నాడు.

దీన్ని ఏ ప్రవచన కర్తయినా చెప్పవచ్చు. పికె కాబట్టి రాజకీయ పక్షాలకు అన్వయించి చెప్పి మనసులో నాటుకునేట్లు చేశాడు. అతను ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి బలమైన ప్రత్యర్థి అయిన బిజెపిని దృష్టాంతంగా తీసుకున్నాడు. కానీ దీన్ని వేరే ఏ బలమైన పార్టీ పరంగానైనా అన్వయించుకోవచ్చు. ఆంధ్రలో వైసిపి ప్రత్యర్థులు, తెలంగాణలో తెరాస ప్రత్యర్థులు యీ దిశగా ఆలోచించి చూడవచ్చు. అతననేదేమిటంటే ఉన్న పరిస్థితులను ఆమోదించు. ‘బిజెపికి అంగబలం, అర్థబలం వుంది. పోలరైజేషన్‌తో విజయాలు సాధిస్తూ వస్తోంది. కేంద్రసంస్థలను యిష్టం వచ్చినట్లు వాడుకుంటోంది. మోదీ ఉధృతిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని మీడియా కూడా అంటోంది. నిజమే, కానీ దానివలన నేను పోరాడినా ఫలితమేముంది అనుకుని ముందే కాడి పారేయవద్దు. పోరాడు, పోరాడితేనే ఏదో ఒక మేరకు గెలవగలవు’ – అంటాడు పికె.

సంస్కృతంలో మంచి పదం వుంది. జిగీష అని. జయించే యిచ్ఛ అని దాని అర్థం. అది బలంగా వున్నవాడే పోరాడగలడు. పికె ఆ మాట వాడకపోయినా అమరీందర్, కేజ్రీవాల్, జగన్, మమత, స్టాలిన్‌లకు అది బలంగా వుంది కాబట్టే గెలవగలిగారని, తన పాత్ర పరిమితమేననీ చెప్పాడు. ప్రస్తుతం చెప్పలేదు కానీ 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో మోదీకి కూడా జిగీష వుంది కాబట్టే గెలవగలిగాడు. రాహుల్‌కు, కాంగ్రెసు పార్టీకి అది లేదని ధ్వనించాడు. 

ఆ మధ్య లోకేశ్ గురించి రాసినప్పుడు రాశాను, పాదయాత్ర చేయాలంటే వైయస్‌లా, జగన్‌లా బలమైన జిగీష వుండాలని, లోకేశ్‌కు, రాహుల్‌కు అవి లేవని. కాంగ్రెసు పార్టీకి గాని, టిడిపికి గాని ఎన్నో ఏళ్ల చరిత్ర వుంది, పార్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కమిటెడ్ ఓటింగ్ (తిరుపతి ఉపయెన్నికలో సైతం 32% ఓట్లు వచ్చాయి). లేనిదేమిటంటే పోరాడే ఓపిక. పార్టీ వర్కర్లతో గంటల తరబడి వీడియో కాన్ఫరెన్స్ చేసి, ట్వీట్లు వేసి ఏదో కష్టపడిపోతున్నా మనుకుంటే ఎలా? అనుకూల మీడియాలో రిపోర్టులు చూసి ఏదో సాధించేశామనుకుంటే ఎలా? కరోనా కాలంలో జనాల మధ్య తిరగవద్దా? ఎన్నికలలో హుషారుగా పాల్గొనవద్దా?

పికె చెప్పినదానిలో ప్రధానమైన అంశమేమిటంటే – మన పార్టీలో వున్న ప్రధానమైన లోపాలేమిటనేది తెలుసుకోవాలి, వాటిని సరిదిద్దాలి అని. ఆత్మపరిశీలన చేసుకోమని అందరూ అంటారు. కానీ అవన్నీ పైపై మాటలే. చంద్రబాబు ఆర్నెల్ల కోసారి నేను మారాను, మీరూ మారండి అంటూంటారు. పై నెలలో ప్రజల్ని ఉద్దేశించి ‘నన్ను ఓడించి, మీరు తప్పు చేశారు’ అని మందలిస్తారు. కానీ మమత నిజంగా స్వీయలోపాలను తెలుసుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో 42లో 22 సీట్లు తెచ్చుకున్నా ఊరుకోలేదు. లోపాలేమిటో చెప్పు అని 2019 జూన్‌లో పికె టీమును నియమించింది. వాళ్లు పరిశీలించి, ఫలానాఫలానా అని చెప్పారు. సవరించడం కష్టమైన పనే, కానీ అవన్నీ చేపట్టింది. కష్టనష్టాల కోర్చి, పార్టీలోని పాత నాయకులందరూ తిరగబడినా సహించి, భరించి మార్పులు చేసింది.

ఈ కోర్స్ కరక్షన్‌ను బిజెపి, మీడియా, సర్వే సంస్థలు గుర్తించలేదు, అందుకే వారి అంచనాలు తప్పాయి అంటాడు పికె. ‘తృణమూల్‌లో 2019 నాటి పరిస్థితే వుందనుకుని బిజెపి రణనీతి రచించింది. మమత అవినీతిపరులను శిక్షించి బయటకు పంపి పార్టీ ప్రతిష్ఠను కాపాడుకుందని, ‘ద్వారే సర్కార్’ స్కీము ఎంతో బాగా పనిచేసి ప్రజలను తృప్తి పరిచిందనీ మీడియా కూడా గుర్తించలేదు. తృణమూల్ బయట పడేసిన చెత్తను బిజెపి గుండెలకు హత్తుకుని, ఏదో సాధించాననుకుంటే, మీడియా కూడా ఔనౌననుకుని, ప్రజాదరణ ఉన్న నాయకులు వెళ్లిపోతున్నారు, తృణమూల్ మునిగిపోతున్న పడవ అని వ్యాసాలు రాసింది. తీరా చూస్తే ఫిరాయించిన వాళ్లలో చాలామంది ఎన్నికలలో ఓడిపోయారు, వాళ్ల సీటే వాళ్లు గెలవలేనివాళ్లు తక్కిన నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేస్తారని మీడియాలో రాశారు. ఎందుకంటే బిజెపి వారి ఆలోచనావిధానాన్ని ప్రభావితం చేసింది.’ అని దెప్పిపొడిచాడు.

మోదీ ర్యాలీలకు జనం ఘనంగా వస్తున్నారు కాబట్టి బిజెపి గెలుపు తథ్యం అని రాసేముందు, 2019లో మమత ర్యాలీలకు యింతకంటె ఎక్కువ మంది జనం వచ్చినా 22 సీట్లు మాత్రమే గెలవగలిగిందన్న కోణంలో ఎందుకు ఆలోచించలేదని అడిగాడు. ర్యాలీలకు జనం రావడమొకటే సూచిక కాదని, మోదీ అంటే యిష్టమున్నా, స్థానిక బిజెపి అభ్యర్థికి ఓటేస్తారన్న గ్యారంటీ లేదని తెలుసుకోవాలని హితవు పలికాడు. ‘‘అగ్నిసాక్షి’’ సినిమాలో నానా పటేకర్ డైలాగు ఒకటుంది – ‘మీరు గొప్పవారయినంత మాత్రాన నేను చిన్నవాణ్ని అయి తీరాలని ఏమీ లేదు’ అని. పికె అదే తరహాలో చెప్పాడు – ‘మోదీ ప్రజాదరణ గల నాయకుడు. అందులో సందేహమేమీ లేదు. అంత మాత్రాన మమత అన్‌పాప్యులర్ లీడరనుకోకూడదు. ఆమె బలాబలాలను విడిగా చూసి ఎసెస్ చేయాలి. 2019 ఫలితాలను బట్టే ప్రొజెక్షన్స్ చేసేస్తే ఎలా? 22 సీట్లు గెలిచినా సమస్య ఉందని ఆమె గ్రహించారు. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా సమస్యలు పరిష్కరించడానికి చూశారు. ప్రజల అభిమానాన్ని మళ్లీ చూరగొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను గమనించాలి కదా’ అని.

సాధారణంగా జర్నలిస్టులు బద్ధకస్తులు. పైగా కొన్నేళ్లు ఆ వృత్తిలో వున్న తర్వాత తమకు సిక్స్త్ సెన్స్ వుందని, ఫలితాలను ముందే పసిగట్టేయగలమనే భ్రమలో వుంటారు. 1982లో ఎన్టీయార్ ప్రభంజనాన్ని జాతీయ మీడియా పసిగట్టలేక పోయింది. దిల్లీ నుంచి హైదరాబాదు వచ్చి స్థానిక నాయకులను వాకబు చేసేవారు. వాళ్లంతా కాంగ్రెసు వాళ్లే. వేరే పార్టీయే లేదు కదా అప్పుడు. ఎన్టీయార్ కోస్తా జిల్లాలలో ఎక్కడో పల్లెటూళ్లలో పర్యటిస్తున్నారు. తర్వాతి ఫేజుల్లో తెలంగాణ రావాలి. ఎన్నికలు ముందుకు జరపడంతో రాలేకపోయారు. అందువలన తెలంగాణలో పెద్దగా వేడి కనబడలేదు. హైదరాబాదు తెలంగాణలో వుంది కాబట్టి యీ దిల్లీ జర్నలిస్టులు హైదరాబాదు చుట్టుపట్ల నాలుగు పల్లెటూళ్లు తిరిగి, గ్రామీణ ప్రాంతాలను కూడా కవర్ చేసేశాం అని తృప్తి పడి ఎన్టీయార్ హవా ఏమీ లేదు అని రాసేశారు. ఎన్టీయార్ వెంట ఆ సమయంలో ఆ కోస్తా గ్రామాలు వెళ్లి వుంటే తెలిసేది.

ఇండియా టుడే ఆ రోజుల్లో వేసే సర్వేలు సాధారణంగా కరక్టయ్యేవి. కానీ 1983 ఆంధ్ర ఎన్నికల సర్వే పూర్తిగా తన్నేసింది. కారణం యిదే! ఇలాటి రిపోర్టులు చదివి, రాజకీయనాయకులు కూడా తమ పార్టీ పని అయిపోయిందని సెల్ఫ్-హిప్నటైజ్ చేసుకుని పోరుకి ముందే చేతులెత్తేయడం తప్పు అంటాడు పికె. ‘మీరు నాలుగు గోడల మధ్య కూర్చుని రాస్తున్నారు’ అని అంటూంటారు కొందరు పాఠకులు. నేను కాలమిస్టుని. రిపోర్టరుని కాను. 

ఓ రోజు ఆస్ట్రేలియా గురించి, మరో రోజు అంగోలా గురించి రాస్తూ వుంటే ప్రతీ చోటా రిపోర్టర్లను పెట్టుకుని నివేదికలు తెప్పించుకునే సౌకర్యం నాకు లేదు. నేను పత్రికల మీదనే ఆధారపడతాను. అయితే ఒక పత్రికపై మాత్రమే ఆధారపడకుండా, రకరకాల రిపోర్టులు చదివి, యిన్నేళ్ల రాజకీయ పరిజ్ఞానం సహాయంతో, కామన్‌సెన్స్‌తో వాటి సమాచారాన్ని బేరీజు వేసుకుని, వాళ్లు హైలైట్ చేయని అంశాలను కూడా ప్రస్తావిస్తూ పాఠకుడికి పూర్తి అవగాహన కల్పించడానికి చూస్తాను. ఇద్దరు, ముగ్గురు పాఠకులు ఆరోపించినట్లు ఒక వెబ్‌సైట్‌లోంచి కాపీ పేస్టు చేసి పెట్టను. అలా చేసి వుంటే మూలవ్యాసం లింకు యిమ్మనమని వాళ్ల నడిగితే యిప్పటిదాకా కిక్కురుమనలేదు. ఈ ఎన్నికలలో బెంగాల్ గురించి నేనిచ్చినంత విస్తృతమైన సమాచారం మన తెలుగు పత్రికలేవీ యిచ్చినట్లు లేదు. మమత గెలుపుకు కారణమైన పథకాల గురించి, ఔట్‌సైడర్ ఫ్యాక్టర్ కూడా నేను వివరించాను.

అధికారంలో వున్నవాళ్లు, ప్రతిపక్షంలో వున్నవాళ్లు మీడియాను ఎంత సీరియస్‌గా తీసుకోవాలి అనే విషయాన్ని ఆంధ్రరాష్ట్రానికి అన్వయించి చెప్తాను. చంద్రబాబు పాలించే రోజుల్లో టిడిపి అనుకూల మీడియా అయిన ఆంధ్రజ్యోతి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి జన్మభూమి కమిటీలు అవినీతికి పాల్పడుతున్నాయని పదేపదే రాసింది. బాబు దృష్టికి అవి వచ్చే వుంటాయి. కానీ ఆయన మమత లాగ కోర్స్ కరక్షన్ చేయలేదు. చెత్తను బయట పడేయలేదు. అవినీతి డబ్బు వెనక్కి యిచ్చేయండి అని బహిరంగంగా హెచ్చరించలేదు. అది ఒక ఫ్యాక్టర్ కాదన్నట్లు, రాజకీయాలు నడపడం గురించి పత్రికల వాళ్ల దగ్గర నేర్చుకోవాల్సినది ఏదీ లేనట్లు ప్రవర్తించారు. ఈ అవినీతి గురించి రాస్తూనే ఆంధ్రజ్యోతి, ప్రజలంతా జగన్‌ను ఛీకొడుతున్నారని, చంద్రబాబు దార్శనికతను కొనియాడుతున్నారని, దొంగల ముఠాకు నాయకుడైనా ఆయన మాత్రం దొంగ కాదని విశ్వసిస్తున్నారని రాసింది.

అది మాత్రం బాబుకి నచ్చింది, నమ్మారు. నమ్మి కలల్లో తేలారు. ప్రత్యేక హోదా కోసమంటూ బిజెపితో పేచీ పెట్టుకుంటే ప్రజలు నెత్తిమీద పెట్టేసుకుంటా రనుకుని దూకుడుగా వెళ్లిపోయారు. జగన్ పాదయాత్రలకు వస్తున్న జనసందోహాలను చూసి కూడా మేల్కొనలేదు. పాలనలో దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. 2017 అక్టోబరులో పాదయాత్ర ప్రారంభమైనప్పుడే వస్తున్న స్పందన చూసి, గబగబా అమరావతిలో ప్రభుత్వధనంతో నాలుగు భవంతులు కట్టేసి, ప్రయివేటు రియల్టర్లకు ఎడాపెడా అనుమతులు యిచ్చేసి వుంటే 15 నెలల్లో కొన్నిటిలోనైనా యాక్టివిటీ ప్రారంభమై పోయి, చూపించుకోవడానికి కొంత వుండేది. అలాగే పోలవరం విషయంలో కూడా. కానీ బాబు డిజైన్స్, రైతుల సింగపూరు యాత్రలు, పూజలు అంటూ తాత్సారం చేశారు. జగన్ వచ్చి పడిపోతాడేమోనన్న భయమే లేదు. కనీసం 15 ఏళ్లపాటు అతను అరణ్యవాసంలోనే వుంటాడని టిడిపి సలహాదారుల అంచనా. వాళ్లు ‘హనూజ్, దిల్లీ దూర్ ఆస్త్’ అని బాబుకి చెప్తూ వచ్చారు.

‘నందో రాజా భవిష్యతి’ వంటి ఈ సామెత గురించిన కథ మీకు తెలిసి వుంటే యీ పేరా వదిలేయండి. 14వ శతాబ్దంలో దిల్లీని సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్ (మన ‘పిచ్చి’ తుగ్లక్ తండ్రి) పాలించే రోజుల్లో దిల్లీ శివార్లలోని ఘియాసాపూర్‌లో ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా అనే సూఫీ గురువు వుండేవాడు. దిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు యీయన పేరే పెట్టారు. ఆయనను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వెళుతూంటే సుల్తాన్‌కు కన్నుకుట్టేది. సూఫీలు తనకు విశ్వాసపాత్రంగా వుండరని అతని నమ్మకం. ఔలియా నాయకత్వంలో ఎప్పటికైనా తిరగబడతారని భయం. ఔలియా ప్రియశిష్యుడు అమీర్ ఖుస్రోను తన ఆస్థాన సంగీతవిద్వాంసుడిగా పెట్టుకున్నా ఆ భయం పోలేదు. ఓ సారి బెంగాల్ గెలిచి దిల్లీకి తిరిగి వస్తున్నాడు. తను దిల్లీకి తిరిగి వచ్చేలోపున ఔలియా దిల్లీ ఖాళీ చేయాలని ఫర్మాన్ జారీ చేశాడు. అమీర్ ఖుస్రో ఔలియాతో చెప్పి మీకు ప్రాణహాని వుందని భయం వ్యక్తం చేశాడు.

అప్పుడు ఔలియా ‘హనూజ్ దిల్లీ దూర్ ఆస్త్’ అని పర్షియన్ భాషలో అన్నాడు. ‘దిల్లీ యింకా దూరంగానే వుంది’ అని అర్థం. నిజంగానే సుల్తాన్‌కు దిల్లీయే కాదు, లోకమే దూరమై పోయింది. దారి మధ్యలో ఒక విజయోత్సవ సభలో వేదిక మీద వుండగా, హఠాత్తుగా తుపాను వచ్చి, వేదిక కూలి, సుల్తాన్ గాయపడి మరణించాడు. ఈ ఆశావహ దృక్పథాన్ని తప్పుడు సందర్భంలో ప్రయోగించిన ఘట్టం కూడా వుంది. 

1739లో నాదిర్ షా ఇండియాపై దండెత్తడానికి వస్తూన్నపుడు మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా పాలిస్తున్నాడు. వీళ్లంతా ఔరంగజేబు తర్వాతివాళ్లు కాబట్టి పేర్లు గుర్తుండవు. నాదిర్ షా ఘజనీ, కాబూల్, లాహోర్ జయించుకుంటూ వచ్చేస్తూంటే ముహమ్మద్ షా ఆస్థానంలోని వందిమాగధులు ‘నాదిర్ షా యిక్కడిదాకా రాలేడు. హనూజ్, దిల్లీ దూర్ ఆస్త్’ అంటూ చక్రవర్తిని జోకొట్టారు. నాదిర్ షా చివరకు దిల్లీ చేరి చక్రవర్తిని ఓడించాడు. రాజధానిని సర్వనాశనం చేశాడు. బాబు పాలనలో కూడా అనుయాయులు, మీడియా కలిసి ‘నువ్వు జీవించి వుండగా జగన్ అమరావతి గద్దెకి రాలేడు’ అంటూ జోకొట్టారు. కానీ 2019కే జగన్ వచ్చాడు. రాజధానిని నాశనం చేశాడు.

ఎన్నికలు జరుగుతూండగా బిజెపి బలంగా వుంది అని పికె తన మిత్రులతో అన్నది లీక్ అయింది. రెండంకెలకు మించి బిజెపికి సీట్లు రావని అన్న పికెయే అధైర్యపడిపోతున్నాడని ప్రచారం జరిగింది. దాని గురించి అడిగితే అతను ‘బిజెపి బలంగా వుందని నేను ఒప్పుకోకపోతే తప్పు. ఇప్పుడు అధికారంలోకి రాలేకపోయింది కదాని బలహీనం అనుకోకూడదు. ఐదేళ్లలో బిజెపి చాలా ఎదిగింది. ఇప్పటికీ బలీయమైన శక్తిగా వుంది. దాన్ని విస్మరిస్తేనే తప్పు. శత్రువులను తక్కువ అంచనా వేయకూడదు, ఎక్కువగా అంచనా వేసి అధైర్యపడనూ కూడదు. అని కరక్టుగా చెప్పాడు. భారతంలో దృష్టాంతం తీసుకుని చెప్పాలంటే ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు ‘‘వచ్చెడివాడు ఫల్గుణుడు, అవశ్యము గెల్తుమనంగరాదు’ అని కౌరవులను హెచ్చరిస్తాడు. అది కరక్ట్ ఎప్రోచ్. రథసారథ్యం చేసేటప్పుడు శల్యుడిలా ‘వచ్చేవాడు అర్జునుడు, నీ డొక్క చించుతాడు, డోలు కడతాడు’ అంటూ కర్ణుణ్ని హడలగొట్టినట్లు హడలగొట్టకూడదు.

నాయకుడి అనుయాయులు యిది తెలుసుకోవాలి. మీడియా తన మిడిమిడిజ్ఞానంతో అధికారంలో వున్నవాణ్ని, విజేతను అంతకంతకు ఎదిగిపోయే త్రివిక్రముణ్ని చేసేయకూడదు. మోదీకి తిరుగులేదు, కెసియార్‌కు ఎదురులేదు, జగన్‌కు ప్రత్యామ్నాయం లేదు.. వంటి తీర్మానాలు చేసి ప్రతిపక్షాలకు పిరికిమందు పోయకూడదు. ఉదాహరణగా పికె పోలరైజేషన్ గురించి చెప్పాడు. దేశంలోని హిందువులందరినీ బిజెపి పోలరైజ్ చేస్తోంది, అందువలన దాన్ని ఎవరూ ఓడించలేరు అనే మీడియా వాదన తప్పని సోదాహరణంగా చెప్పాడు. 

పోలరైజేషన్‌ ఎంత జరిగినా 55%కు మించి జరగదు అని చెప్పాడు. నూటికి నూరు శాతం జరిగేట్లయితే బిజెపికి 80% ఓట్లు రావాలి. వస్తున్నాయా? ముస్లిము ఓట్లకైనా, కులాల వారీ ఓట్లకైనా, ప్రాంతాల వారీ ఓట్లకైనా యిది వర్తిస్తుంది అని చెప్పాడు. అందువలన ‘జగన్‌కు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు గుత్తగా పడిపోతాయి. వాటికి బిసిలు, కాపులు కూడా చేరుతున్నారు కాబట్టి ఎవరూ ఓడించలేరు’ అని అనకూడదు. అదే నిజమైతే తిరుపతి ఉపయెన్నికలో 56.7% ఓట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? ప్రతిపక్షాల బలహీనత వలన వచ్చే ఓట్ల శాతం తీసేస్తేనే ఏ మేరకు పోలరైజేషన్ జరిగిందో కచ్చితంగా తెలుస్తుంది.

కెసియార్‌కి వెలమలందరూ ఓటేస్తారు, తెలంగాణ వాళ్లందరూ ఓటేసేస్తారు, ఆంధ్రమూలాల వాళ్లు వేయరు యిలా బ్రాడ్ జనరలైజేషన్స్ చేస్తారు. అదే నిజమైతే నాగార్జునసాగర్ ఉపయెన్నికలో తెరాసకు 49% మాత్రమే ఎందుకు వచ్చాయి? అన్ని చోట్లా కాంగ్రెసు చచ్చుబడి వున్నా అక్కడ 39% ఎలా వచ్చాయి? నిజమే, ఏదో ఒక ప్రతిపాదన మీదనే వాదన ప్రారంభమవుతుంది. ఎదురవుతున్న వాస్తవాల బట్టి ఆ ప్రతిపాదనను మార్చుకుంటూ పోవాలి. ముస్లిములెవ్వరూ బిజెపికి ఓటేయరు అనే సిద్ధాంతమూ చాలా చోట్ల తప్పుతోంది. భయం చేతనో, భక్తి చేతనో, అభ్యర్థిని చూసో, ప్రత్యామ్నాయం లేకనో ఏదో ఒక కారణం వుండవచ్చు. అది ప్రతి నియోజకవర్గానికీ మారుతుంది. అంటే ఎంతో లోతుగా అధ్యయనం చేస్తే తప్ప లెక్క తేలదు. దానికి చాలా శ్రమ, ఖర్చు అవుతాయి. మీడియా, సర్వే సంస్థలకు అంత బజెట్ వుండదు కాబట్టి, ఈ నియోజకవర్గంలో ఫలానా కులస్తులు యింతమంది వుండడం చేత.. అంటూ బ్రాడ్‌గా లెక్క కట్టేస్తున్నారు.

చివర్లో పికె ఎనలిస్టు టోపీ పక్కన పెట్టి, పౌరుడి టోపీ ధరించి ఒక విజ్ఞప్తి చేశాడు. మీడియా, ప్రతిపక్షాలు ఎన్నికల కమిషనర్ తీరును ప్రశ్నించాలన్నాడు. బిజెపి అన్ని సంస్థలనూ మేనేజ్ చేస్తోందని అందరికీ తెలుసు. అయితే ప్రత్యేకంగా ఎన్నికల కమిషనర్ బిజెపికి అనుబంధ సంస్థగా పనిచేసిన విషయాన్ని గమనించాలి. 10 కోట్ల జనాభా వున్న రాష్ట్రానికి 8 విడతల్లో 45 రోజుల పాటు ఎన్నికలు నిర్వహించవలసిన అవసరమేమిటో చెప్పగలదా? రేపు 22 కోట్ల జనాభా వున్న యుపిలో మూడు నెలల పాటు 16 విడతల్లో నిర్వహిస్తారా? సెంట్రల్ ఫోర్సెస్ కదలికలు సులభంగా వుండేట్లు తూర్పు ప్రాంతం ఒక విడతలో, పశ్చమి ప్రాంతం మరో విడతలో.. అలా ప్లాన్ చేస్తారెవరైనా. ఒక జిల్లాలో ఎన్నికను నాలుగు విడతలలో నిర్వహించడం యిప్పటిదాకా ఎవరైనా చూశారా అని పికె జర్నలిస్టులను అడిగాడు. కరోనా ఉధృతమై పోయి, ఆఖరి మూడువిడతలు కలిపేయమని ముఖ్యమంత్రి అడిగినా, ససేమిరా కుదరదంది. బిజెపి ఎన్నికల ప్లానుకు అనుగుణంగానే పూర్తిగా నడుచుకుంది.

ఇలా అన్ని వ్యవస్థలను ఎడాపెడా వాడేసుకున్నా బిజెపి బాహుబలి కాదనే విషయం యీ ఎన్నికలు నిరూపించాయి. 5 రాష్ట్రాలలోని మొత్తం 822 అసెంబ్లీ సీట్లలో బిజెపి గెలిచింది 142 మాత్రమే. అంటే 17%. కానీ బిజెపి నాయకులు మేం పొడిచేస్తాం, చితక్కొట్టేస్తాం, మా జగన్నాథ రథం ముందు ఎవరూ నిలవలేరు అని చెప్పుకుంటూన్నారు. తెలిసో, తెలియకో మీడియా వంత పాడుతూ, దాన్ని భూతద్దంలో చూపుతూ ప్రతిపక్ష పార్టీలను హడలగొడుతోంది. బెదిరిపోయిన యీ పార్టీలు ముందే అస్త్రసన్యాసం చేసి చతికిల పడుతున్నాయి. అదే వద్దంటున్నాడు పికె! 

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021) mbsprasad@gmail.com

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×