cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: సత్యజిత్ రాయ్ ‘ప్రతిద్వంద్వి’

ఎమ్బీయస్‍: సత్యజిత్ రాయ్ ‘ప్రతిద్వంద్వి’

సత్యజిత్ రాయ్ ‘‘ప్రతిద్వంద్వి’’ నేపథ్యం తర్వాతి భాగమిది. వాచీ షాపు నుంచి వెళ్లి హీరో ఓ చోట కూర్చుంటే కొందరు విదేశీ హిప్పీలు తగిలారు. హిప్పీల ఆవిర్భావం కూడా అదే కాలంలో జరిగింది. ధనికుల పిల్లలు కొందరు వ్యవస్థతో విసిగిపోయి, హిప్పీలుగా మారి గంజాయి మత్తులో మునిగి ఆధ్యాత్మికత, ఆత్మవిముక్తి అంటూ ఏమేమో మాట్లాడేవారు. వారిలో చాలామంది ఇండియా కూడా వచ్చేవారు. హీరోకు విసుగుపుట్టి తన పాత క్లాస్‌మేట్ రూముకి వెళ్లాడు. వాడి రూమ్మేటు వీడి పుస్తకాలు తీసుకెళ్లి అమ్మేసుకున్నాట్ట, అవి మళ్లీ కొనుక్కోవడానికై రెడ్‌క్రాసు విరాళాల డబ్బాకి కన్నం పెట్టి దానిలో డబ్బు కాజేస్తున్నాడు. ఇదేం పనిరా అని వాణ్ని తిట్టి, అక్కడున్న ప్లేబోయ్ మ్యాగజైన్ చూసి, పట్టుకెళ్లనా అని అడిగాడు హీరో. ‘దానికి రీసేల్ వేల్యూ వుంది తెలుసా?’ అన్నాడు వాడు. అప్పట్లో నగ్నచిత్రాలు కనబడడం అరుదు. చిత్రకారుల మోడలింగు చేసే అమ్మాయిల న్యూడ్ ఫోటోల పుస్తకాలు 20, 30 పేజీలుంటే వాటిని రోజుకి 5-6 రూ.లకు అద్దె కిచ్చేవారు. ఓ పదిమంది చందాలేసుకుని రోజు అద్దెకి తీసుకునేవారు.

ఇక పోర్నో సినిమాలంటే చూసే అవకాశమే వుండేది కాదు. ఎక్కడైనా ఏ గొడౌన్‌లోనైనా షో వేస్తే, పోలీసులు వచ్చి పట్టుకుంటారనే భయం వుండేది. అప్పట్లో మన భారతీయ సినిమాలో ముద్దులుండేవి కావు. సెన్సార్ చేయని విదేశీ చిత్రాలను చూసే అవకాశం ఫిల్మ్ క్లబ్బుల్లో మాత్రమే వుండేది. వాటిలో ముద్దులు, అప్పుడప్పుడు న్యూడ్ సీనులు కనబడేవి. హీరో ఆ గదిలో వుండగానే యింకో ఫ్రెండు వచ్చి ‘మా ఫిల్మ్ క్లబ్బులో సెన్సారు చేయని స్వీడిష్ సినిమా వేస్తున్నారు. వస్తావా?’ అంటే హీరో సరేనన్నాడు. తీరా చూస్తే అది పరమ బోరుగా వుంది, ఆశించిన దృశ్యాలేవీ లేవు. ఇలా లిబిడోతో సహా ఒక యువకుడి సర్వావస్థలను డీల్ చేస్తూ నడుస్తుందీ సినిమా. రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి వక్షాన్ని చూడగానే అతనికి తన మెడికల్ కాలేజీలో వక్షోజ కణనిర్మాణాన్ని వివరించిన రోజులు గుర్తుకు వస్తుంది. మర్నాడు తన ఫ్రెండు ఒక వేశ్య దగ్గరకు తీసుకెళితే హీరో చీదరించుకుని వచ్చేశాడు. సగటు మధ్యతరగతి విలువలు యిక్కడ స్పష్టంగా తెలుస్తాయి. కుతూహలం వుంటుంది కానీ గీత దాటడానికి మనసు ఒప్పుకోదు.

హీరో యిల్లు చేరేసరికి చెల్లెలు యజమాని భార్య వచ్చి, తల్లి దగ్గర మొత్తుకుంటోంది. ‘నీ కూతురి నా కాపురంలో చిచ్చు పెడుతోంది. ఇలా చేస్తే నేనూరుకోను జాగ్రత్త.’ అని బెదిరించింది కూడా. రాత్రి 10 గంటలకు యింటికి వచ్చిన చెల్లెల్ని హీరో నిలదీయబోతే ఆమె పట్టించుకోలేదు. ‘ఆవిడ అదో రకం పిచ్చిది. పట్టించుకోకు. నాకు మా బాస్ వచ్చే నెల నుంచి 200 రూ.ల జీతం పెంచబోతున్నాడు తెలుసా’ అని కొట్టిపారేసింది. ఇంట్లో సంపాదిస్తున్నది ఆమె ఒక్కతే కావడంతో గట్టిగా ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి. నక్సలైట్ తమ్ముడు ఏదో హింసాత్మక ఘటనలో గాయాలు తగిలించుకుని వచ్చాడు. రెండు రోజుల తర్వాత యిల్లు విడిచి వెళ్లాడు కూడా. ఎక్కడికిరా అంటే చెప్పను కూడా చెప్పడు. నువ్వు వట్టి పిరికివాడివి, నీకేం కావాలో నీకే తెలియదు అని అన్నగారికి చెప్పేసి మరీ వెళ్లాడు. హీరో తన ఫ్రెండుతో అంటాడు కూడా – ‘పరిస్థితి మారాలంటే మా తమ్ముడు చెప్పినట్లు విప్లవం రావాలి, నేను ప్రారంభించననుకో, ఎవరైనా ప్రారంభిస్తే వెళ్లి చేరతా’ అంటాడు. మనలో చాలామంది యిలాగే ఆలోచిస్తారు.

చెల్లెలు బాస్ మీద హీరోకి విపరీతమైన కోపం. చంపేద్దామన్న కసి. వాళ్లింటికి వెళ్లి ‘మా చెల్లెలు ఉద్యోగం మానేస్తుంది’ అని చెప్పాడు. ఆయన నవ్వి, ‘ఆ మాట తను చెప్పాలి, అయినా నీకుద్యోగం లేదటగా, కావాలంటే సిఫార్సు రాసిస్తా’ అన్నాడు. అతని సాయం తీసుకోవడానికి యితనికి నామోషీ, అసహ్యం. లేచి వచ్చేశాడు. చివరికి ఫ్రెండు చెప్పిన మందుల కంపెనీ అతని దగ్గరకు వెళితే అతను మెడికల్ రిప్రజంటేటివ్ ఉద్యోగాలు లేవు. మెడికల్ సేల్స్‌మన్ ఉద్యోగముంది, పల్లెటూళ్లో వుండాలి, రోజూ 70-80 కి.మీ.లు తిరగాల్సి వుంటుంది అన్నాడు. హీరో తటపటాయిస్తే ఏ విషయం పది రోజుల్లో చెప్పు అన్నాడతను. ఇలా ప్రతి విషయంలో గుంజాటన పడేవాడికి, ఎవరూ తన మాట వినక, తానూ ఏమీ చేయలేక తిరిగేవాడికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా వుంటుంది. లోకంపై కసిని తీర్చుకోవడానికి అవకాశం దొరక్క, ఒక్కోప్పుడు ఏ అమాయకుడిపైనో తీర్చుకుంటారు, అదీ గుంపులో వుండగానే.

తక్కిన సిటీలలో కంటె కలకత్తాలో యీ జాడ్యం ఎక్కువగా చూశాను. పనీపాటా లేని యువకులు వీధిమొగల్లో గోడల మీద కూర్చుని, సిగరెట్లు ఊదేస్తూ (యీ సినిమాలో కూడా దేనికీ డబ్బు లేని హీరో సిగరెట్లు తెగ కాలుస్తాడు), జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై, ఫేవరేట్ ఫుట్‌బాల్ టీములపై ఆవేశంగా చర్చించుకుంటూ, పేకాట, కారంబోర్డులతో టైము వేస్టు చేస్తూంటారు. రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంటో, దొంగతనమో జరిగితే ప్రతాపం చూపిస్తారు. యాక్సిడెంటు జరిగితే బాధితుడి గురించి పట్టించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లు ఒకళ్లో, యిద్దరో. తక్కినవాళ్లందరూ యాక్సిడెంటు చేసినవాణ్ని చావగొట్టడంలోనే తమ శక్తియుక్తులు ప్రదర్శిస్తారు. వీళ్లు విడిగా వున్నపుడు యీ క్రౌర్యం కనబడదు కానీ మాబ్‌గా వున్నపుడు దారుణంగా బయటకు వస్తుంది. పిల్లల్ని ఎత్తుకుని పోయి బలి యిస్తున్నారనే సందేహాలతో ఆనందమార్గీయులను సజీవదహనాలు చేసిన రికార్డు బెంగాలీ ప్రజలకే వుంది.

నేను కలకత్తాలో వుండే రోజుల్లో దక్షిణ కలకత్తాలోని లేక్ గార్డెన్స్‌లో వుండేవాణ్ని. మా బాంక్ కలకత్తా మెయిన్ ఏరియాలోని బ్రేబర్న్ రోడ్‌లో వుండేది. నేను కాళీఘాట్ ద్వారా స్కూటర్ మీద వెళ్లేవాణ్ని. ఓ రోజు పని వుండి ఆఫీసుకి వెళ్లకపోవడంతో బతికిపోయాను. ఆ రోజు ఓ మినీ బస్ (వీటికి చాలా చెడ్డపేరుండేది) కాళీఘాట్‌లో రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్న ఓ చిన్నపిల్లాడి మీదుగా వెళ్లడంతో అతను చచ్చిపోయాడు. అంతే, యిక అక్కడి ప్రజలు పోగడి, ఆ రోజు ఆ రోడ్డు మీద వెళ్లే ప్రతీ మోటారు వాహనాన్ని ధ్వంసం చేసి, డ్రైవర్లను చితక్కొట్టారు. మినీ బస్సుల్ని మాత్రమే కొడితే అదో లెక్క. అబ్బే, బస్సు, కారు స్కూటరు, మోపెడ్.. ఏది కనబడినా ఆపడం, కర్రలతో బాదడం, నడిపేవాణ్ని కొట్టడం. ఇది లెక్క కాదు, బెంగాలీల తిక్క. ఇది జరిగింది 1983. ఇప్పటికి ఏమైనా మారేరేమో తెలియదు. ఈ సినిమా తీసేటప్పుడు అదే పరిస్థితి కాబట్టి, హీరో యిలాటి మాబ్ వయొలెన్స్‌లో పాల్గొన్నట్లు ఓ దృశ్యం పెట్టారు.  

ఇలా దిక్కుతోచకుండా బతుకుతున్న హీరో జీవితంలో ప్రేమ ప్రవేశించింది, కేయా ముఖర్జీ అనే 20 ఏళ్ల అమ్మాయి రూపంలో! ఆమె దిల్లీలో వుండేది. తండ్రి బదిలీపై కలకత్తా వస్తే వచ్చింది. రోడ్డుమీద దిగులుగా వెళ్లే యితన్ని రోజూ చూస్తూండేది. ఒక రోజు యింట్లో కరంటు పోతే, ఎవరూ లేకపోతే యితన్ని పిలిచి ఫ్యూజు వేయమంది. మాటలు కలిశాయి. రెస్టారెంటుకి వెళ్లారు. ఆమెకు ఏడేళ్ల వయసులో తల్లి పోయింది. తండ్రి యిప్పుడు పిన్నిని చేసుకుందా మనుకుంటున్నాడు. అది యీమెకు యిష్టం లేదు. స్వల్పపరిచయంతోనే యితను నచ్చాడు. కలకత్తాలో యితనికి ఉద్యోగం వస్తే యిక్కడే వుండి ప్రేమ కొనసాగిద్దామనుకుంటోంది. లేకపోతే దిల్లీకి తిరిగివెళ్లిపోయి, ఉత్తరాలతో పరిచయాన్ని కొనసాగిద్దా మనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో హీరో అవేళ వెళ్లిన యింటర్వ్యూ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగం వస్తే కలకత్తా, కేయా రెండు దక్కుతాయి. లేకపోతే యీసురోమంటూ పల్లెపట్టుకి వెళ్లడమే!

అవేళ యింటర్వ్యూకి వెళ్లాడు. ఉన్నవి నాలుగు పోస్టులు. 75 మందిని పిలిచారు. పది, పదిహేను కుర్చీలు మాత్రమే వేశారు. తక్కినవాళ్లు కారిడార్లో నిలబడాల్సి వచ్చింది. అసలే ఉక్క. ఉన్న ఫ్యాన్లలో ఒకటి తిరగటం లేదు. ఇంటర్వ్యూలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఒకతనికి ఓపిక చచ్చి, కళ్లు తిరిగి కిందపడ్డాడు. హీరో చూస్తూ వుండలేకపోయాడు. ఓ నలుగుర్ని వెంటేసుకుని, గదిలోకి వెళ్లి కుర్చీలైనా ఏర్పాటు చేయండి అని రిక్వెస్టు చేశాడు. 75 కుర్చీలు వేయించడం, యిప్పటికిప్పుడు ఫ్యాన్ రిపేరు చేయించడం మా వల్ల కాదు అన్నారు వాళ్లు. కళ్లు తిరిగిపడేటంత బలహీనులు మాకెలాగూ వద్దు. ఈ ఉద్యోగంలో చాలా చాకిరీ చేయాల్సి వస్తుంది అన్నారు. హీరో యింకా ప్రశ్నలు వేయబోతే ‘నీ పేరేమిటి?’ అంటూ లిస్టు వెతకబోయారు. దాంతో భయపడి, అతని వెనక్కాల వచ్చినవాళ్లు బయటకు వెళ్లిపోయారు. చేసేదేమీ లేక హీరో బయటకు వచ్చి నీరసంగా స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు. మొదటి వ్యాసానికి యిచ్చిన ఫోటో యీ ఘట్టందే!

ఇంతలో లంచ్‌టైమ్ అయింది. అరగంట గ్యాప్ అన్నారు. దాంతో హీరోకి ఆవేశం వచ్చింది. ఈసారి ఒంటరిగానే లోపలికి వెళ్లి ‘మొదలుపెట్టడమే ఆలస్యం, మధ్యలో యీ బ్రేక్, యిక్కడ నిలబడడానికి కూడా చోటు లేదు. మేం మనుష్యుల మనుకున్నారా? జంతువుల్లా కనబడుతున్నామా?’ అని అరిచాడు. కంపెనీవాళ్లు బయటకు నెట్టించేయాలని చూస్తే అక్కడి ఫర్నిచర్ పగలకొట్టి బయటకు వచ్చేశాడు. తర్వాతి షాట్‌లో సేల్స్‌మన్ ఉద్యోగిగా చిన్న ఊళ్లో లాజ్‌లో దిగుతూ కనబడ్డాడు. అక్కడకు రాగానే అతనికి ఓ పిట్ట కూత వినబడింది. బాల్యస్మృతుల్లో నిరంతరం కొట్టుకునే హీరో ఆ పిట్ట కోసం కలకత్తా అంతా గాలించాడు. ఆ కూత కోసం పరితపించాడు. అది యిక్కడ వినబడడంతో సంతోషం కలిగింది. కేయాకు ఉత్తరం రాశాడు, కలకత్తాలో ఉద్యోగం దొరకగానే వచ్చేస్తా, పెళ్లి చేసుకుందాం అంటూ. కానీ అతనికీ తెలుసు, అదేమీ జరిగేది కాదని. అతని ఆశలన్నీ అంతమయ్యాయని చెప్పడానికి సూచనగా సినిమా చివర్లో ఓ శవయాత్రను చూపించాడు సత్యజిత్. సినిమా మొదలు కూడా హీరో తండ్రి మరణంతో ప్రారంభమవుతుంది.

సినిమాలో మలుపులు, ఆకస్మిక ఘటనలు, ఎమోషనల్ సీన్స్, మనసుకు హత్తుకునే డైలాగ్స్ ఏమీ వుండవు కాబట్టి డాక్యుమెంటరీ లుక్ వుంటుంది. కానీ ఆలోచింపచేస్తుంది. సినిమాకు చాలా జాతీయ, అవార్డులు, అంతర్జాతీయంగా నామినేషన్స్ వచ్చాయి. ధృతిమాన్‌ చటర్జీకి తొలిసినిమా అయినా చాలా పేరు వచ్చింది.ఈ సినిమాలో హీరోగా వేసేనాటికి అతను 25 ఏళ్ల వాడు, విద్యావంతుడు, దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివాడు. ఎడ్వర్టయిజింగ్ రంగంలో పనిచేస్తాడు. డాక్యుమెంటరీలు తీశాడు. ఇంగ్లీషు డ్రామాల్లో, సినిమాల్లో కూడా వేస్తాడు. చాలా స్టయిలిష్‌గా నటిస్తాడు. బెంగాలీ పారలెల్ సినిమాల్లోనే పేరు తెచ్చుకున్నాడు. హిందీ సినిమాల్లో చాలా తక్కువ. ‘‘కహానీ’’ (2012)లో విలన్ అయిన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, ‘‘పింక్’’ (2016)లో జజ్‌గా కనబడ్డాడు. అతను వేసిన వాటిల్లో చెప్పుకోదగ్గ యితర సినిమాలు – మృణాల్ సేన్ తీసిన ‘‘పదాతిక్’’ (1973), ‘‘అకాలేర్ సంధానే’’ (1980) అపర్ణా సేన్ తీసిన ‘’36 చౌరంఘీ లేన్’’ (1981),  సత్యజిత్ తీసిన ‘‘గణశత్రు’’ (1989), ‘‘ఆగంతక్’’ (1991).

ఇప్పటి యువతలో కూడా ఆందోళన వుంది, గందరగోళం వుంది. మంచిచెడుల మధ్య సంఘర్షణ వుంది. వాటిని కేప్చర్ చేస్తూ యిలాటి సినిమా వస్తే బాగుంటుంది. కానీ ప్రస్తుతం తెలుగులో వస్తున్న సినిమాలన్నీ ఎస్కేపిస్ట్ ఫార్సులే. హీరోల్లో చాలామంది వయసు మీరినవారే కాబట్టి, వీటిల్లో యిమడరు. అందుకని ఏవేవో కథాంశాలతో, ఫైట్స్, డాన్సులు, కామెడీలతో సినిమా తీయిస్తున్నారు. యువహీరోలు కూడా వారిని అనుకరిస్తూ ప్రయోజనం లేని కాలక్షేపం సినిమాలనే ఎంచుకుంటున్నారు. హీరోని చవటలా చూపించమని ఎవరూ అనరు. కానీ చుట్టూ వున్న సంఘాన్ని కూడా ప్రతిబింబించినప్పుడు ఆ సినిమాలకు యూనివర్శల్ ఎపీల్ వుంటుందని ‘‘ఆవారా’’ సినిమా దగ్గర్నుంచి నిరూపితమౌతూనే వుంది. కరోనా కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న భారత నిరుద్యోగి కథ తీసినా, ప్రపంచమంతా దానికి ప్రతిస్పందిస్తుంది. (సమాప్తం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

mbsprasad@gmail.com

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?