Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: సౌదీలో ఎదుగుతున్న యువనేత

సౌదీ అరేబియా ప్రస్తుత రాజు సల్మాన్‌ అబ్దులజీజ్‌ కుమారుడు 31 ఏళ్ల మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఇప్పుడా దేశంలో అతి వేగంగా ఎదుగుతున్న యువతార. రాజుగారి సోదరులు, వారి కుమారులు అందరూ యువరాజులే (ప్రిన్స్‌), అయితే వారిలో ఒకరిని మాత్రం కిరీటధారి యువరాజు (క్రౌన్‌ ప్రిన్స్‌) అంటారు. మొన్నటిదాకా సల్మాన్‌ కజిన్‌ కిరీటధారిగా వుంటే అతన్ని పదవిలోంచి తప్పించి, గృహనిర్బంధంలో పెట్టి యితన్ని కిరీటధారిని చేసేశారు.

రాజుకు 81 ఏళ్లు. ఆయన కేమైనా అయితే యితను రాజు కూడా అయిపోవచ్చు. ఇతనెవరు, యితని ఆలోచనావిధానం ఎలాటిది అని తెలుసుకోవడం ఆసక్తికరం. దానికి ముందు సౌదీ రాజులు గురించి కాస్త తెలుసుకుంటే వారసత్వపు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అర్థమౌతుంది. 

తన 56వ యేట 1932లో సౌదీ రాజ్యాన్ని స్థాపించినది అబ్దులజీజ్‌ సౌద్‌. 1953 వరకు పాలించాడు. ఆయనకు పదిమంది కొడుకులు. సౌద్‌ చనిపోగానే అతని పెద్ద కొడుకు సౌద్‌ (ఇద్దరిదీ ఒకటే పేరు) గద్దె కెక్కి 11 ఏళ్లు పాలించాడు. కుటుంబమే కుట్ర చేసి అతన్ని దింపేసింది. రెండో కొడుకు ఫైసల్‌ 1964లో అధికారానికి వచ్చి 11 ఏళ్ల పాటు పాలించాడు. ఇతని పరిపాలనా కాలంలోనే యిప్పటి సౌదీ రూపు దిద్దుకుంది.

అతను హత్యకు గురయ్యాడు. 1975 నుంచి ఏడేళ్ల పాటు మూడో కొడుకు ఖాలెద్‌ పాలించాడు. ఇతను మతఛాందసులకు ఎక్కువ విలువ నిచ్చాడు. 1982లో అతను పోయాక నాలుగో కొడుకు ఫహద్‌ రాజ్యానికి వచ్చి 23 ఏళ్ల పాటు పాలించాడు. ఇతని హయాంలో అమెరికాతో సంబంధాలు బాగా గట్టిపడ్డాయి. 2005లో అతను పోయాక ఐదో కొడుకు అబ్దుల్లా అధికారంలోకి వచ్చాక పదేళ్లు పాలించాడు. చాలా సంస్కరణలు చేపట్టాడు, ఆర్థికస్థితిని మెరుగు పరిచాడు. 

2015 జనవరిలో అతను పోయేనాటికి ఆరవ, ఏడవ కొడుకులు కూడా చనిపోయి వుండడంతో 8వ కొడుకు సల్మాన్‌ అబ్దులజీజ్‌ తన 79వ యేట రాజ్యానికి వచ్చాడు. ప్రస్తుత రాజు యితనే. 76 ఏళ్ల 9 వ కొడుకు అహ్మద్‌, 72 ఏళ్ల 10 వ కొడుకు ముక్రిన్‌లు జీవించే వున్నారు. అబ్దుల్లా బతికి వుండగా 2014లోనే తన తర్వాత సల్మాన్‌ అబ్దులజీజ్‌ అధికారంలోకి రావాలని, అప్పుడు ముక్రిన్‌ కిరీటధారి యువరాజు కావాలని ఆదేశాలిచ్చాడు.

సల్మాన్‌ అబ్దులజీజ్‌ రాజు కాగానే ముక్రిన్‌ను మూణ్నెళ్లపాటు కిరీటధారిగా వుంచి, తర్వాత అతన్ని తీసేసి, అతని స్థానంలో తన అన్నగారు, సౌద్‌ 7 వ కుమారుడు ఐన నయీఫ్‌ కొడుకైన మొహమ్మద్‌ నయీఫ్‌ను కిరీటధారిగా చేశాడు. 2014 నుంచి మంత్రిగా వున్న తన సొంత కొడుకు మొహమ్మద్‌ సల్మాన్‌ను అతని డిప్యూటీగా వేశాడు. రెండేళ్లు తిరిగేసరికి నయీఫ్‌ను తీసేసి అతని స్థానంలో సల్మాన్‌ను తెచ్చేశాడు. రక్షణ మంత్రిగా కూడా నియమించాడు. 27 నెలల పాటు కిరీటధారిగా వున్న నయీఫ్‌ జూన్‌ 21 నుంచి సొంత యింట్లోనే బందీగా వున్నాడు.

సల్మాన్‌కు ఎందుకీ ప్రాధాన్యత? రాజుగారికి వేరే కొడుకుల్లేరా, వారు ప్రతిభావంతులు కారా అనుకోనక్కరలేదు. ఆయన రెండో కొడుకు సుల్తాన్‌ వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌). 30 ఏళ్ల క్రితమే స్పేస్‌ షటిల్‌ డిస్కవరీలో ఒక అమెరికన్‌ మహిళతో బాటు కాబిన్‌లో ప్రయాణించాడు. ఆయన ఐదో కొడుకు ఫైసల్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో డాక్టరేటు తీసుకున్నాడు. మొహమ్మద్‌ అనే మరో కొడుకు రక్షణమంత్రిగా పనిచేశాడు. మన సల్మాన్‌ మాత్రం స్థానికంగానే చదువుకున్నాడు.

తాతగారి పేర పెట్టిన యూనివర్శిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. అయితే అతనికి చిక్కిన అవకాశమేమిటంటే అతని తల్లి ఫహీదా రాజుగారి ముద్దుల మూడో భార్య. రాజు ఆ యింట్లోనే వుండడం చేత సల్మాన్‌ రాజు వద్దే పెరిగి ప్రేమ చూరగొన్నాడు. తక్కిన కొడుకులకు ఆ భాగ్యం దక్కలేదు. సల్మాన్‌ ఏం తలచుకుంటే అది చేయగలిగాడు. రెండేళ్ల క్రితం అతను దక్షిణ ఫ్రాన్సులో ఓ సముద్రపు రిసార్ట్‌కి వెళ్లాడు. అక్కడ సిరీన్‌ అనే ఓ లగ్జరీ యుట్‌ (విహారనౌక) చూసి అతను ముచ్చటపడ్డాడు.

దాన్ని ఒక ఇటాలియన్‌ కంపెనీ తయారుచేయగా యూరీ షెఫ్లర్‌ అనే రష్యన్‌ మద్యం వ్యాపారి 2011లో 330 మిలియన్‌ డాలర్లు పెట్టి కొన్నాడు. ''నాకు నచ్చింది, ధర ఎంతో చెప్పు. ఇప్పటికిప్పుడే ఫైసల్‌ చేస్తా'' అన్నాడు సల్మాన్‌. నాలుగేళ్ల క్రితం ధరకు దాదాపు 70% చేర్చి 550 మిలియన్‌ డాలర్ల రేటు చెప్పాడు షెఫ్లర్‌. ఓఖే అన్నాడు సల్మాన్‌. ఆరోజే డీల్‌ ఫైనల్‌. అదీ సల్మాన్‌ తడాఖా! తొమ్మిదేళ్ల క్రితం అతనికి పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. 

అతన్ని ఎలాగైనా ప్రమోట్‌ చేయాలని తండ్రి పట్టుదల. అతి ముఖ్యమైన, అత్యంత భాగ్యవంతమైన, ప్రపంచంలోనే అతి పెద్దదైన జాతీయ పెట్రోలియం సంస్థ ఆరామ్‌కో నిర్వహణాభారాన్ని అప్పగించాడు. బరాక్‌ ఒబామాను కలియడానికి అమెరికాకు వెళ్లినపుడు యితన్ని వెంటపెట్టుకుని వెళ్లాడు. చైనాలో గత ఏడాది జి-20 శిఖరాగ్ర సమావేశం జరిగినపుడు తమ దేశం తరఫున యితన్ని ప్రతినిథిగా పంపాడు.

అప్పుడే ''ద న్యూయార్క్‌ టైమ్స్‌'' 'ఇతని వరస చూస్తే తన కజిన్‌ నయీఫ్‌ను పక్కకు నెట్టేసి, కిరీటధారి అయిపోయి, ఆ తర్వాత రాజు కూడా అయిపోదామనుకుంటున్నాడని తోస్తోంది' అని రాసింది. ఈ మార్చిలో సల్మాన్‌ సౌదీ తరఫున అమెరికాకు వెళ్లి ట్రంప్‌ని కలిశాడు. తన తొలి విదేశీ పర్యటన సౌదీకేనని ట్రంప్‌ దగ్గర మాట తీసుకున్నాడు. ట్రంప్‌ యితనికి స్టేట్‌ డైనింగ్‌ రూములో లంచ్‌ యిచ్చాడు.

అతని కూతురు ఇవాంకా, అల్లుడు జారేద్‌ కుష్నర్‌ వాళ్లింట్లో డిన్నర్‌ యిచ్చారు. ట్రంప్‌ మేలో సౌదీ వచ్చినపుడు కూతురు, అల్లుడికి సల్మాన్‌ తన ప్యాలస్‌లో డిన్నర్‌ యిచ్చాడు. నయీఫ్‌ ఒబామాకు ఫేవరేట్‌. ఇప్పుడు కాలం మారింది కాబట్టి అమెరికాలోని కొత్త ప్రభుత్వాన్ని సౌదీకి అనుకూలంగా మా అబ్బాయి మార్చాడు అని రాజు మురుస్తున్నాడు.  నయీఫ్‌ స్థానంలో సల్మాన్‌ కిరీటధారి అయినపుడు అభినందించినవారిలో ట్రంప్‌ ముందు వరుసలో వున్నాడు. 

సౌదీ జనాభాలో 70% మంది యువతీయువకులే. వాళ్లకు నచ్చేట్లు సల్మాన్‌ ''విజన్‌ 2030'' అని ఒక ప్రతిపాదన చేశాడు. సౌదీ ఆర్థిక వ్యవస్థ పెట్రోలుపై ఆధారపడి వుంటోంది. గత మూడేళ్లలో ధరలు సగానికి పడిపోయాయి. అందువలన పెట్రోలుపై ఆధారపడకుండా సౌదీని వ్యాపార, సాంకేతిక రంగాలకు కేంద్రంగా చేద్దామని ఆలోచిస్తున్నాడు. దానికి నిధులు కావాలి.

ఆ నిధుల కోసం 2 ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఆరామ్‌కో కంపెనీలోని 5% వాటాను వచ్చే ఏడాదికల్లా అమ్మేసి సౌదీ పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లో జమ చేయాలని సూచిస్తున్నాడు. ఈ ఫండ్‌ యిటీవలే ఊబర్‌లో 3.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. సల్మాన్‌ మే నెలలో రష్యా వెళ్లి పుతిన్‌ను కలిసినప్పుడు అక్కడి ఆయిల్‌ దిగ్గజం రోస్‌నెఫ్ట్‌ అధినేత ఇగోర్‌ సెచిన్‌ను కూడా కలిసి సంప్రదింపులు జరిపాడు. 'మనిద్దరం చేతులు కలిపితే ప్రపంచంలోని ఆయిల్‌ వ్యాపారం రూపురేఖలు మార్చేయవచ్చు' అన్నాడు. ఇవన్నీ సౌదీ యువతలో అతని పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇటీవల అమెరికాకు వెళ్లినపుడు అతను ఫేస్‌బుక్‌ హెడాఫీసుకి వెళ్లి మార్క్‌ జుకర్‌బెర్గ్‌ను కలవడం వారిని ఉత్సాహపరిచింది. సల్మాన్‌ ఆధునిక పోకడలు కలవాడు. మతఛాందసులు విధించిన విపరీతమైన కట్టుబాట్లను సడలించాలంటాడు. మహిళలను కారు డ్రైవ్‌ చేయనివ్వాలని వాదిస్తాడు. మతపరమైన విషయాలు ఉల్లంఘించినందుకు యిన్నాళ్లూ పోలీసులకు అక్కడికక్కడ అరెస్టు చేసే హక్కు వుండేది.

అది యితను తీసేశాడు. హజ్‌ సమయంలో మాత్రమే టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు. హజ్‌తో సంబంధం లేకుండా కూడా ఏడాది పొడుగునా టూరిస్టులు వచ్చేట్లుగా దేశాన్ని తీర్చిదిద్దాలని, ఎంటర్‌టైన్‌మెంట్‌ అథారిటీ అని నెలకొల్పి దాని ఆధ్వర్యంలో సంగీత కచ్చేరీలు, నాటకాలు, కామెడీ షోలు, సినిమాలు నిర్వహించాలని అతని ఐడియా. దుబాయి ఇవన్నీ అమలు చేసి ఆర్థిక ప్రగతి సాధించిందని అతనికి తెలుసు. 

అయితే ఇది అంత సులభంగా జరిగే పని కాదు. సల్మాన్‌ యుద్ధోన్మాది. ఇరాన్‌, యెమెన్‌, కతార్‌లపై చేస్తున్న యుద్ధాలు కొనసాగి తీరాలంటాడు. వాటికీ డబ్బు కావాలి. అది దొరకటం లేదు. ఎందుకంటే ఇన్నాళ్లూ సౌదీ ప్రభుత్వం తన ప్రజలకు తాయిలాలు యిస్తూ వూరడిస్తోంది. ఉయ్యాల నుంచి వల్లకాడుదాకా అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరిస్తోంది. ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టనవసరం లేదు. కానీ యిటీవలి కాలంలో ఆర్థిక విధానాల వైఫల్యం వలన, తైలం ధరలు తగ్గడం వలన ఆదాయం తగ్గి ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టవలసి వచ్చింది.

గత డిసెంబరులో కరంటు, నీటి చార్జీలపై సబ్సిడీ తగ్గించడంతో వాటి ధరలు 30% పెరిగాయి. 2018 జనవరి నుంచి వ్యాట్‌ పెట్టబోతున్నారు కాబట్టి అన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. ఐఎంఎఫ్‌ (ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌) సౌదీ పన్నులింకా పెంచాలని ఒత్తిడి చేస్తోంది. పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులకు జీతభత్యాలలో కోత విధించారు. దాంతో కొన్ని కంపెనీలు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. దాంతో భయపడి మళ్లీ కొన్ని సౌకర్యాలు కల్పించవలసి వచ్చింది. 

స్థానికులకు ఉద్యోగాలు కల్పించడానికై విదేశీ ఉద్యోగులపై పడ్డాడు సల్మాన్‌. వారిపై కుటుంబ పన్ను (ఎక్స్‌పాట్‌ లెవీ) విధించాడు. జులై 2017 నుంచి ప్రతి ఉద్యోగి తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులకై నెలకు తలా 100 సౌదీ రియాల్స్‌ (రియాల్‌ అంటే సుమారు రూ.17 రూ.లు) కట్టాలి. ఇకామా (నివాస అనుమతి పత్రం)కై అప్లయి చేసినపుడు ఏడాది ఫీజంతా ముందే కట్టేయాలి.

అంటే భార్య, యిద్దరు పిల్లలు వున్న విదేశీ ఉద్యోగి వాళ్లను తనతో వుంచుకోవాలంటే తలకు 1200 చొ||న ఆ ముగ్గురికీ 3600 రియాళ్లు (దాదాపు రూ.62 వేలు) కట్టాలి. 2018 జులై నాటికి ఫీజు 200 రియాళ్లు అవుతుంది. అంటే 7200 రియాళ్లు. 2019 జులై నాటికి 300 రియాళ్ల చొ||న 10,800, 2020 జులై నాటికి 400 రియాళ్ల చొ||న 14,400 రియాళ్లు కట్టాలి. తమ యజమానులు యీ ఫీజు కట్టడంలో సాయపడతారని విదేశీ ఉద్యోగులు అనుకోవడం లేదు. ఎందుకంటే విదేశీ ఉద్యోగులను నియమించుకున్నందుకు వాళ్లపై యిప్పటికే మరో పన్ను వేస్తున్నారు. 

ఏ సంస్థలోనైనా సౌదీ పనివారి కంటె విదేశీ పనివారు ఎక్కువగా వుంటే ప్రతి విదేశీ ఉద్యోగి పేర తలా 200 రియాళ్లు ప్రతి నెలా కట్టాలి. ఇది 2018 జనవరి నుంచి 400 అవుతుంది. 2019 నుంచి 600, 2020 నుంచి 800 అవుతుంది. ఇంత భారం మోయాల్సిన కంపెనీలు కుటుంబపన్నులు మోయడం కల్ల. జీతాలు పెంచుతారో లేదో అదీ అనుమానమే. ఇప్పటికే జీతాలు ఆలస్యంగా యిస్తున్నారు, ఇంక్రిమెంట్లు ఆపేశారు.

సౌదీ బిన్‌లాడిన్‌ గ్రూపు అనే మల్టీనేషనల్‌ కనస్ట్రక్షన్‌ కంపెనీ 70 వేల మంది విదేశీ పనివారిని తీసేసింది. ఆయిల్‌ రిఫైనరీలు, బ్యాంకులు, షిప్పింగు సంస్థలు కూడా అదే బాట పట్టబోతున్నాయట. జీతాలు సరిగ్గా యివ్వనందుకు ఓగెర్‌ అనే కంపెనీ ప్రభుత్వం విధించిన జరిమానా భరించవలసి వచ్చింది. సౌదీ జనాభా 2.70 కోట్లయితే అందులో మూడోవంతు మంది విదేశీ కార్మికులే. వారిలో 40 లక్షల మంది భారతీయ ప్రవాసులున్నారు. వారందరూ యీ మార్పులు చూసి అడలిపోతున్నారు.

పన్ను భారం భరించలేక వారు తమ కుటుంబాలను వెనక్కి పంపించేస్తూన్నారు. గత ఆగస్టులోనే 10 వేల మంది భారతీయులు ఉద్యోగాలు పోగొట్టుకుని రోజుల పాటు మలమల మాడారు. సౌదీలో వున్న 5 లక్షల మంది మలయాళీలలో చాలామంది వెనక్కి వచ్చేస్తే, కేరళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అతలాకుతలమవుతుంది. డబ్బు సంపాదిస్తూ అక్కడే ఖఱ్చు పెడుతున్న విదేశీయులు వెనక్కి వెళ్లిపోతే సౌదీలో వ్యాపారసంస్థలపై ఎటువంటి ప్రభావం పడుతుందోనన్న ఆందోళనా వుంది. 

ఈ సల్మాన్‌ ట్రంప్‌కు ఆత్మీయుడే కాదు, విదేశీ ఉద్యోగుల పట్ల విధానంలో అతన్ని అనుకరిస్తున్నట్లు కూడా కనబడుతోంది. దేశాన్ని ఎటు తీసుకెళతాడో వేచి చూడాలి.  
(ఫోటో - మార్క్‌ జుకర్‌బర్గ్‌తో సల్మాన్‌ సమావేశం, ఇన్‌సెట్‌లో సౌదీ సంప్రదాయ దుస్తుల్లో సల్మాన్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
-mbsprasad@gmail.com