cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రక్షకుడో? తక్షకుడో? - 1/2

ఎమ్బీయస్‌: రక్షకుడో? తక్షకుడో? - 1/2

అభిమన్యుడి మనుమడు జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. తన తండ్రి పరీక్షిత్తును మోసపూరితంగా కాటేసి చంపిన తక్షకుణ్ని, అతని నాగవంశాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా ప్రజ్ఞాశాలురైన ఋత్వికులను పెట్టుకుని యాగం మొదలుపెట్టాడు. వారి మంత్రాల ప్రభావానికి ఒక్కొక్క పాము వచ్చి యజ్ఞాగ్నికీలల్లో పడి మండి మసైపోతోంది. తక్షకుడు మొదట్లో ధీమాగానే ఉన్నాడు కానీ తర్వాత తర్వాత భయపడసాగాడు. తన నిర్మూలనం వరకు జనమేజయుడు ఆగడని తెలుసు కాబట్టి గజగజ వణికాడు. ముప్పు తప్పించమని స్వర్గానికి వెళ్లి ఇంద్రుణ్ని బతిమాలాడు. ఇంద్రుడు అభయం యిచ్చాడు. నా సింహాసనానికి చుట్టుకుని, నీ తలను నా ఉత్తరీయంలో దాచుకో అన్నాడు. తక్షకుడు హమ్మయ్య అనుకున్నాడు.

ఇవతల యాగశాలలో తక్షకుణ్ని ఉద్దేశించి ఎంత శక్తివంతమైన మంత్రాలు చదివినా అతడు వచ్చి మంటల్లో పడటం లేదు. ఏమైందని అడిగాడు జనమేజయుడు. ఋత్వికులు చెప్పారు - 'ఇంద్రుడి శరణులో, అతన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. అతన్ని కదల్చాలంటే ఇంద్రుణ్ని కూడా కదల్చాల్సిందే మరి' అన్నారు. జనమేజయుడు ఒక్క క్షణం ఆలోచించి ''అయితే ఇంద్రుడితో సహా తక్షకుణ్ని రప్పించండి'' అన్నాడు. వెంటనే ఋత్వికులు 'సహేంద్ర (సహ ప్లస్‌ ఇంద్ర) తక్షకాయ స్వాహా' అనే మంత్రం పఠించారు. అంటే ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చి అగ్నికి ఆహుతై పోవాలి అని అర్థం. వెంటనే తక్షకుడు, ఇంద్రసింహాసనం, ఇంద్రుడు అన్నీ కదిలి ఆకాశమార్గంలో యాగశాలవైపు దూసుకు రాసాగాయి. తక్షకుడితో చేతులు కలిపినందుకు ఇంద్రుడికి కూడా ముప్పు వచ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మహాభారతంలో ఆదిపర్వం చదవాలి. కానీ పరులను చేరదీసి తనకే ముప్పు తెచ్చుకునే యిలాటి సందర్భాల్లో 'సహేంద్ర తక్షకాయ స్వాహా' అనే సామెత వాడకంలోకి వచ్చింది.

సర్వేలన్నీ తనకు ప్రతికూలంగా ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ను దువ్వుతున్నారు. ఆయన ఆశ నెరవేర్చి ఆయన సింహాసనానికి రక్షకుడిగా పవన్‌ నిలుస్తారా? లేదా తన కారణంగా చంద్రబాబు గద్దెకు, ఆయనకూ కూడా ముప్పు తెచ్చిపెట్టి ప్రజాగ్రహ అగ్నికుండంవైపు లాక్కు వెళ్లే తక్షకుడిగా తేలతారా? అనేది త్వరలోనే తెలుస్తుంది కానీ యీ లోపున కాస్త ఊహించి చూడడంలో తప్పు లేదు. 

****

టిడిపితో తన అనుబంధం గురించి పవన్‌ పైకి మాట్లాడడం లేదు కానీ సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆయన బియస్పీతో పొత్తు పెట్టుకోవడానికి మాయావతిని కలవడానికి వెళ్లినపుడు కూడా మోదీ, జగన్‌లను కట్టడి చేయవలసిన అవసరం గురించే ఉద్ఘాటించారు తప్ప ఆంధ్రలో పరిపాలన బాగా లేదు కాబట్టి తను ప్రత్యామ్నాయంగా వస్తున్నానని చెప్పుకోలేదు. టిడిపితో పొత్తుందా అని ప్రశ్నలు వచ్చినపుడు ఆయన చాలా తెలివిగా టిడిపి వాళ్లు తనకు వైసిపితో ఉందనీ, వైసిపి వాళ్లు తనకు టిడిపితో ఉందనీ అంటున్నారనీ జవాబిచ్చారు తప్ప టిడిపితో లేదని స్పష్టంగా చెప్పలేదు. వైసిపితో పవన్‌ను టిడిపి ముడిపెట్టడమనేది గతం. పవన్‌ లోకేశ్‌ను, బాబును అవినీతిపరులని నిందించినపుడు అప్పుడు లోకేశ్‌ - 'బిజెపి అంటే బిజెపి, జగన్‌, పవన్‌' అని నిర్వచనం యిచ్చారు. ముగ్గురూ కలిసి ఆంధ్ర ప్రయోజనాలకు అడ్డుగా నిలుస్తున్నారని వాపోయారు. బాబు నుంచి కింది స్థాయి టిడిపి వాళ్లందరూ అదే పాట పాడారు.

సెట్టులో ముక్కలు మారాయి - తర్వాతి రోజుల్లో పవన్‌ తమ అవినీతి గురించి మాట్లాడడం మానేశాక పేకాట సెట్టులో ఓ ముక్కని మార్చేశారు. పవన్‌ ముక్క కింద పడేసి, దాని స్థానంలో కెసియార్‌ కార్డు పెట్టారు. మోదీ, జగన్‌, కెసియార్‌ కలిసి తనపై కుట్ర పన్నుతున్నారని అనసాగారు. వాళ్లు చెప్పకపోయినా అది స్పష్టంగా కనబడుతూనే ఉంది. బాబు ఎన్‌డిఏలో ఉండగానే మోదీ ఆయనకు నెలల తరబడి ఎపాయింట్‌మెంటు యివ్వకుండా, వైసిపి నాయకులకు యివ్వడంతోనే వాళ్ల స్నేహబంధం లోకానికి తెలిసిపోయింది. తెలంగాణ ఎన్నికల తర్వాత తెరాస నాయకులు జగన్‌ మా మిత్రుడు అని బాహాటంగా చెప్తున్నారు. ఆచరణలో ఏ మేరకు సాయపడతారనేది ముందుముందు మరింత స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రస్థాయిలో అయితే తెరాస పోటీ చేయడం లేదు, వైసిపి, బిజెపితో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల తదనంతరం కేంద్రస్థాయిలో బిజెపికి అవసరం పడితే వైసిపి సాయపడవచ్చు. మద్దతుకి, ప్రత్యేక హోదాకు ముడిపెట్టాం కాబట్టి, అది యివ్వాలని లాంఛనంగా అడగవచ్చు. బిజెపి యిస్తుందో లేదో, యివ్వకపోతే అప్పుడు వైసిపి ఏం చేస్తుందో తెర మీద చూడాల్సిందే!

లోకేశ్‌పై ఆరోపణల సంగతి తేల్చలేదు - వైసిపి వాళ్లు జనసేన, టిడిపి కలిసి పని చేస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే చాలాకాలం పాటు కాల్‌షీటు ఆర్టిస్టుగా, టిడిపి తరఫున సన్నాయినొక్కుల కళాకారుడిగా పని చేస్తూ వచ్చిన పవన్‌ ఒక్కసారి టిడిపి అవినీతి గురించి గట్టిగా మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ తర్వాతి రోజుల్లో దాని గురించి మాట్లాడడం మానేశారు. అంటే అప్పుడు తను చేసినవి తప్పుడు ఆరోపణలా? తనకు ఎవరో అబద్ధపు సమాచారం యిచ్చారని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆ ఆరోపణలపై సిట్‌ కానీ, సిబిఐ కానీ విచారణ చేపట్టాలని డిమాండు చేయలేదు. బాబు దుష్పరిపాలన, ఉద్దానం కిడ్నీ బాధితులు, అమరావతి భూబాధితులు వీళ్లందరి విషయంలో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీయడం మానేశారు. ఏమైనా మాట్లాడితే 'జనం జోలికి వస్తే, జనాలకు అన్యాయం చేస్తే, తాట తీస్తా' అంటూంటారు. అది ఎవర్ని ఉద్దేశించి అన్నారో ఆయనకే తెలియాలి. తను అధికారంలోకి వస్తే బ్రహ్మాండం బద్దలు కొడతానని చెపుతున్నారు తప్ప, ఈ ఐదేళ్లలో ఆంధ్రలో పెద్దగా ఏమీ జరగలేదన్న సంగతి ఎత్తి చూపటం లేదు.

నిజానికి జనాలకు న్యాయం చేయాలన్నా, అన్యాయం చేయాలన్నా అధికారంలో ఉన్నవారికే తగును. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టకుండా తమ రాజకీయ అవసరాల కోసం బిజెపితో మూడున్నరేళ్లు అంటకాగి, హోదా పేరెత్తితే జైల్లో పెడతానని ప్రజలను బెదిరించిన టిడిపిని జనసేన నిలదీయాలి. మరి పవన్‌ ఎప్పుడు చూసినా ప్రతిపక్షంలో ఉన్న వైసిపి మీదనే విరుచుకు పడుతున్నారు. టిడిపికి, బిజెపికి చెడిన దగ్గర్నుంచి బిజెపిపై కూడా సన్నసన్నగా విమర్శలు చేస్తున్నారు. గతంలో కెసియార్‌ను ఓహో అన్నారు. బాబుతో బద్ధవైరం ఏర్పడ్డాక యిప్పుడు కెసియార్‌కు కూడా ఇటువైపు రాకండి అని హెచ్చరికలు చేశారు. బాబు తెలంగాణవైపు వెళ్లినపుడు యిలాటివి చేయలేదు మరి. ప్రస్తుతానికి టిడిపికి ఎవరైతే శత్రువులో, జనసేనకు వాళ్లే శత్రువులు.

టిజిపై కోపప్రదర్శన దేనికి? - మరి యిలాటి పరిస్థితుల్లో పవన్‌ కళ్యాణ్‌ టిజి వెంకటేశ్‌పై అంతలా ఎందుకు నోరు పారేసుకున్నారు? నిజానికి టిజికి 'ఫుట్‌ యిన్‌ ద మౌత్‌ సిౖండ్రోమ్‌' ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి అసందర్భంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అప్పుడు మాత్రం పద్ధతిగానే 'మా మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉంది, నాయకులు మాట్లాడుకుంటారు, ఏ మార్చి నాటికో తేలుతుంది' అన్నారు. అబ్బే సయోధ్య కచ్చితంగా ఉండదు అని పవన్‌ ఖండించలేదు. టిజి ఎవడు, నేను అక్కర్లేదని వదిలేసిన రాజ్యసభ సీటు తీసుకున్నవాడు.. అంటూ ఆయన గురించి మాట్లాడారు తప్ప, ఆయన లేవనెత్తిన పాయింటు గురించి మాట్లాడలేదు. ఎందుకై ఉంటుంది? తనకు, టిడిపికి మధ్య  ఉన్న అవగాహన గురించి టిజి తొందరపడి తెలివితక్కువగా బయటకు చెప్పేశారన్న ఉక్రోషమా?

ఎందుకంటే అప్పటికి యింకా జనసేన బలం గురించి తనకే స్పష్టత వచ్చి ఉండదు. పొత్తు బహిరంగంగా పెట్టుకుంటే లాభమా? లోపాయికారీగా పెట్టుకుంటే లాభమా? అనేదానిపై ఒక అంచనా చిక్కి వుండదు. ఉన్న గుప్పెడు మంది సలహాదారుల్లో టిడిపితో చేతులు కలిపితే మంచిదని కొందరు, కలపకపోతే మంచిదని మరి కొందరు చెప్పి వుండవచ్చు. అన్నీ వింటూ కాలక్షేపం చేసి, తన బలాబలాలు చూసుకుని ప్రస్తుత ఏర్పాటుకి వచ్చి ఉండవచ్చు. ఇది తేలేలోగా తన పార్టీలో ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఆయన చూసుకున్నాడు. కానీ ఎదుటి పార్టీలో టిజి మాత్రం లౌక్యరహితంగా వ్యవహరించాడని కోపం కావచ్చు. జనసేన పార్టీ పెట్టాక చాలా రోజులు పవన్‌ రికామీగానే ఉన్నారు. మధ్యమధ్యలో ప్రజల్లోకి వెళ్లి ఆవేశపూరితంగా మాట్లాడి, ఆ తర్వాత ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి చల్లబడి, 'ఆయన సమస్యలు తీరుస్తానని మాట యిచ్చారు, నాకు ఆయన మీద విశ్వాసం ఉంది' అని చెప్పే విశ్వాసపాత్రుడిగానే ఉంటూ వచ్చారు. ఈయన సీరియస్‌ పాలిటిక్స్‌ చేయడని, ఎన్నికల సమయంలో ప్రచారానికి మాత్రమే వస్తాడనీ అనుకోసాగారు.

కుమారస్వామి కలిగించిన ఆశ - అలాటిది కొన్ని నెలలుగా చురుగ్గా ఉన్నాడు. సినిమాలు మానేసి జనం మధ్య కాలికి బలపం కట్టుకుని తిరగసాగాడు. కర్ణాటకలో జెడిఎస్‌ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఆయనలో ఆశలు రేకెత్తించినట్లుంది. జెడిఎస్‌ ఎన్నికల సమయంలో బిజెపితో లోపాయికారీ పొత్తు పెట్టుకుందని అనుకున్నారు, ఎదుటివాళ్లు అలాగే ఆరోపించారు కూడా. అయితే ఫలితాలు వచ్చేసరికి బిజెపి, కాంగ్రెసు  రెండిటికి బలం చాలలేదు. జెడిఎస్‌ ఎవరికి మద్దతిస్తే వాళ్లకే అధికారం అన్నట్లు తయారైంది పరిస్థితి. ముఖ్యమంత్రి పదవికి బేరం పెట్టింది జెడిఎస్‌. వేలం పాటలో కాంగ్రెసు గెలిచింది. 37 మంది ఎమ్మేల్యేలు మాత్రమే ఉన్న జెడిఎస్‌కు చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన పార్టీకి చెందిన 9 మందికి మంత్రి పదవులు దక్కాయి.

అలాటిది ఆంధ్రలో రిపీట్‌ అయ్యే అవకాశాలున్నట్లు పవన్‌కు తోచింది. ఇక్కడా ఓట్ల శాతంలో టిడిపి, వైసిపి యించుమించు సమానబలంతో ఉన్నాయి. సర్వేలు పార్లమెంటు సీట్లలో వైసిపికే గెలుపని చెప్పవచ్చు గాక, ఎన్నికల వ్యూహరచనలో బాబు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేము. కోర్టుల్లో కానీ, మీడియాలో కానీ, వ్యాపారవర్గాల్లో కానీ ఆయన మనుషులు పాతుకుపోయి ఉన్నారు. ఆ రాజకీయ కౌటిల్యం జగన్‌కు లేదు కాబట్టి ఏదో ఒక ఠస్సా వేసి, ఆఖరి క్షణంలో బాబు టేబుల్స్‌ తిప్పేస్తారని, గతంలో లాగే 1-2% ఓట్ల తేడాతో అధికారానికి దగ్గరగా వచ్చేస్తారనీ కొందరు గట్టిగా నమ్ముతున్నారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా బలంగా ఉంది కాబట్టి, జగన్‌ నాయకత్వ లోపాలెన్ని ఉన్నా యీ సారి బాబుకి ఓటమి తప్పదని మరి కొందరు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ యిద్దరి భావాలను లెక్కలోకి తీసుకుంటే, రెండు పార్టీలూ చెరో 75-80 తెచ్చుకుని అధికారం అంచుల్లో ఆగిపోయాయనుకోండి. అప్పుడు 15-20 సీట్లు తెచ్చుకున్న పార్టీ నాయకుడు వీరిలో ఒకరితో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి కావచ్చు.

కర్ణాటకతో పోలిక కుదురుతుందా? - ఈ థియరీ అనుకోవడానికి బాగుంది కానీ ఆచరణలో ఏమౌతుందో డౌటు. ఎందుకంటే కర్ణాటకలో జెడిఎస్‌కు పీఠం వదిలేయడానికి కాంగ్రెసు సిద్ధపడిందంటే దానికి కారణం, జాతీయస్థాయిలో కాంగ్రెసుకున్న  అవసరాలు. రాహుల్‌ గాంధీకి తను ప్రధాని కావాలి, దానికి జెడిఎస్‌ ఎంపీల మద్దతు కావాలి. అందువలన సిద్ధరామయ్యని బలిపెట్టడానికి జంకలేదు. మరి ఆంధ్రలో అలాటి బలిపశువు కావడానికి బాబు ఒప్పుకుంటారా? జగన్‌ ఒప్పుకుంటారా? వీళ్లవి ప్రాంతీయ పార్టీలు. రాష్ట్రం దాటితే వాళ్ల ప్రయోజనాలు శూన్యం. పవన్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి, తన కొడుకును లోకేశ్‌కు ఉపముఖ్యమంత్రిని చేసి, తను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని బాబు అనుకున్నా, ఆ చక్రంలో ఆకులు ఉంటాయో, మోదీ ధాటికి రాలిపోతాయో ఎవరూ చెప్పలేరు. ఇక అయిదేళ్ల పోరాటం తర్వాత పవన్‌ వంటి యువనాయకుణ్ని ముఖ్యమంత్రి చేసి, తను ఉపముఖ్యమంత్రి కావడానికి జగన్‌ ససేమిరా అంటారు. ఇప్పుడు వదులుకుంటే అధికారం మళ్లీ ఎన్నేళ్లకు చిక్కుతుందో తెలియదు కాబట్టి, టిడిపి, వైసిపి రెండూ అలాటి పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు చేసి, మళ్లీ ఎన్నికలకు వెళదామంటాయి తప్ప పవన్‌ను ముఖ్యమంత్రి చేయడానికి ఒప్పుకోవు.

ఈ విషయం పవన్‌ కూడా ఊహించి ఉంటారు. అందువలన సొంతంగా 15-20 సీట్లు గెలవడం కూడా అంత సులభం కాదని గ్రహించి ఉంటారు. ఎందుకంటే నెలల తరబడి బహిరంగ సభల్లో పాల్గొన్నా, పెద్ద తలకాయలేవీ పార్టీలో చేరలేదు. ధనిక పారిశ్రామికవేత్తలెవరూ నిధులందిస్తానని ముందుకు రాలేదు. మీడియాలో కూడా పట్టు చిక్కలేదు. ఆంధ్రప్రభ, 99 టీవీలు మద్దతుగా నిలిచినా వాటికి రీచ్‌ పెద్దగా లేదు. పార్టీనిర్మాణం జరగలేదు. విధివిధానాల నిర్ణయంలో విపరీతంగా జాప్యమవుతోంది. ఏ పార్టీని ఏ విషయంలో విమర్శించాలనే అంశాల విషయంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేకపోవడం చేత, పార్టీలో చురుకుదనం కొరవడింది. నిర్మొహమాటంగా చెప్పాలంటే 'ఆల్సో రేన్‌' పార్టీగా తయారైంది తప్ప సీరియస్‌ ప్లేయర్‌గా రూపుదిద్దుకోలేదు. ప్రజారాజ్యం నాటి ఊపు కూడా రాలేదు. చివరకు స్పాయిలర్‌గా మాత్రమే (ఓట్లు చీల్చి, యితరుల గెలుపు అవకాశాలు చెడగొట్టే పార్టీ) మిగులుతుందన్న భయం వేసింది. ఇలాటి పరిస్థితుల్లో సొంతబలంతో 15-20 సీట్లు గెలవడం కష్టమని పవన్‌కు అర్థమై ఉంటుంది.

(సశేషం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: రక్షకుడో? తక్షకుడో? - 2/2

 


×