cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సావిత్రి ఆత్మాభిమానం

ఎమ్బీయస్‌: సావిత్రి ఆత్మాభిమానం

కారెక్టరు యాక్టర్‌ పదానికి నిర్వచనంగా రాణించిన గుమ్మడి గారు ''తీపి గురుతులు, చేదు జ్ఞాపకాలు'' అనే పేర తన ఆత్మకథను గ్రంథస్తం చేశారు. దానిలో తన గురించి, సహనటీనటుల గురించి నిర్మొగమాటంగా అనేక విషయాలు రాశారు. పుస్తకాలు బాగా చదువుతూ, దేశవిదేశాల సినిమాలు కూడా విస్తారంగా చూసే ఆయన దేన్నయినా, ఎవరినైనా లోతుగా విమర్శనాదృష్టితో పరిశీలించగలరు.

అనేక సినిమాల్లో తన కూతురిగా, సోదరిగా, కోడలిగా నటించిన సావిత్రి గురించి ఆయన రాసిన కొన్ని వాక్యాలు మనసుకు హత్తుకుపోతాయి. 'మన నటీమణుల్లో సహజ నటనకు ఆద్యురాలు జి.వరలక్ష్మి అయితే, ఆ సహజత్వాన్ని యింకా అందంగా, ఆత్మీయంగా ప్రదర్శించిన నటి సావిత్రి. ఆమె తెరమీద కనిపిస్తే ఒక దగ్గరతనం ఫీలై అనుబంధాన్ని పెంచుకుంటాం. ఆమె కంఠస్వరంలో ఉన్న మంత్రశక్తియేమో గానీ ఆమె ఏ మాట పలికినా అది సూటిగా మన గుండెలకు హత్తుకునేలా వుంటుంది.' అని రాశారాయన. అవి అక్షరసత్యాలు. 

ఇక వ్యక్తిగా ఆవిడ గురించి చెపుతూ 'పరిశ్రమలో ఎంతో ఉన్నతస్థానంలో ఉన్నపుడు కూడా ఎటువంటి భేషజాలు లేకుండా అందరితో ఆప్యాయంగా, కలుపుగోలుగా ఉండేది. ఆమె వల్ల యే నిర్మాతా యెప్పుడూ నష్టపడలేదు, యిబ్బంది పడలేదు.' అన్నారు. ఆవిడ ఆత్మాభిమానం గురించి చెపుతూ ఒక సంఘటన గురించి రాశారు.

స్టార్‌ వేల్యూ తగ్గి సహాయపాత్రలు వేసే రోజుల్లో లంచ్‌ టైములో ఆవిడకు యింటి నుంచి క్యారేజీ ఏదీ రాకపోవడం, నిర్మాత కూడా ఏమీ పట్టించుకోకపోవడం గమనించారు, ఆమెతో పాటు నటిస్తున్న గుమ్మడి. భోజనం చేస్తూ వెళ్లి అడిగితే 'ఆకలిగా లేదు' అని మొహమాట పడింది సావిత్రి. చివరకు యీయన ఎంతో బలవంతం చేస్తే వచ్చి తింది. అనేకమందిని ఆపదల్లో ఆదుకుని దానధర్మాలు చేసిన వ్యక్తి యీ స్థితికి రావడం ఆయనకు కన్నీళ్లు తెప్పించింది. 

ఓ సారి గుమ్మడిగారికి జ్వరం వచ్చి అయిదారు రోజులు మంచం మీద ఉండాల్సి వచ్చింది. సావిత్రి చూడడానికి వచ్చి, కాస్సేపు మాట్లాడి వెళ్లిపోయింది. వెళ్లిపోయేటప్పుడు తన తలగడ పక్కకు ఏదో కదిలినట్లు అనిపించింది ఇంజక్షన్‌ మగతలో ఉన్న గుమ్మడిగారికి. తర్వాత తీసి చూస్తే రెండు వేల రూపాయలు కనిపించాయి. కోలుకున్నాక ఆయన ఫోన్‌ చేసి అడిగితే ''చాలా రోజుల క్రితం మీ దగ్గర ఆ మొత్తం తీసుకున్నాను. మీరు మర్చిపోయి వుండవచ్చు. నేను పోయేలోగా ఒక దమ్మిడీ కూడా ఎవరికీ బాకీ వుండకూడదనుకున్నాను. ఈ రోజే ఓ ప్రొడ్యూసర్‌ వచ్చి అయిదువేలు అడ్వాన్సు యిచ్చాడు. దానిలోంచి మీ బాకీ తీర్చేశాను.'' అందావిడ.

అటువంటి ఆత్మాభిమాని ఆపదలో ఆదుకుంటుందని యెప్పుడో ఆత్మీయుల దగ్గర దాచుకున్న డైమండ్‌ నెక్లెస్‌ కోసం వారి దగ్గరకి వెళితే ఏమీ తెలియనట్లు ప్రవర్తించారని, దానితో ఆమె విపరీతమైన షాక్‌కు గురి కావటం, దానిలోంచి కోమా లోకి వెళ్లడం జరిగిందని ఆయన రాశారు. (ఫోటో - తండ్రి బలరాముడిగా గుమ్మడి, శశిరేఖగా సావిత్రి  నటించిన ''మాయాబజార్‌''లో ఓ దృశ్యం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com