Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: సూడాన్ అంతర్యుద్ధం

ఎమ్బీయస్‍: సూడాన్ అంతర్యుద్ధం

సూడాన్‌లో అంతర్యుద్ధం జరుగుతోందని, అక్కణ్నుంచి భారతీయులను తీసుకు వస్తున్నారని పేపర్లలో చదివే వుంటారు. అక్కడి ఘర్షణకు పూర్వాపరాలు చెప్దామని నా ప్రయత్నం. గతంలో దాని గురించి ఏమీ తెలియదు కాబట్టి, ఎన్నో దశాబ్దాల చరిత్ర ఒక్కసారిగా చెప్పాల్సి వస్తోంది కాబట్టి కాస్త క్లిష్టంగానే ఉండవచ్చు. సూక్ష్మంగా చెప్పాలంటే అక్కడ నడుస్తున్న మిలటరీ ప్రభుత్వంలో నెం.1 ఐన బుర్హాన్‌కి, నెం.2 ఐన హెమెదీ డగాలోకు మధ్య పోరు సాగుతోంది. బుర్హాన్ వెనక్కాల సైన్యం ఉంటే డగాలోకు ఆర్ఎస్ఎఫ్ అనే ప్రయివేటు సైన్యం ఉంది. ఇద్దరూ నాలుగేళ్ల క్రితం దాకా మిలటరీ నియంత బషీర్ కింద కలిసి పని చేసినవారే. అతన్ని దింపేసి, అధికారాన్ని చేజిక్కించుకుని కొంతకాలం అనుభవించాక పోటీ లేకుండా చేసుకోవాలని బద్ధశత్రువుల్లా పోరు సలుపుతున్నారు. ఇద్దరి వెనక్కాల విదేశాలున్నాయి. ఆర్మీని ఎదిరించ గలిగే సత్తా ఉన్న ప్రయివేటు సైన్యం ఎలా ఏర్పడింది అనేది ఆసక్తికరమైన విషయం. దాని సంగతి చెప్పాలంటే సూడాన్ చరిత్ర క్లుప్తంగానైనా చెప్పాలి.

ఇది ఆఫ్రికా ఖండంలోనే పెద్ద దేశం. జనాభా నాలుగు కోట్లకు పైన ఉంటుంది. ఈశాన్య ప్రాంతంలో ఉంది కాబట్టి అరేబియా ప్రభావం ఎక్కువ. జనాభాలో ఆఫ్రికన్, అరబ్బు తెగల మధ్య వైరుధ్యం ఉంది. అధికార భాషలుగా అరబిక్, ఆంగ్లం ఉన్నాయి. సూడాన్‌కి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 1898లో బ్రిటన్ అధీనంలోకి వచ్చింది. 1956లో స్వాతంత్ర్యం వచ్చి ఇస్మాయిల్ అజారీ అనే అతను ప్రధానిగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. దేశంలోని ఉత్తర, దక్షిణ భాగాల మధ్య వైరంతో, ప్రజాస్వామ్య వాదులంతా కీచులాడుకోవడంతో పరిపాలన సరిగ్గా సాగలేదు. 1958లో సైనిక కుట్ర జరిగి ఆరేళ్ల పాటు ఆ పాలన జరిగింది. 1964 అక్టోబరులో ప్రజల్లో తిరుగుబాటు జరిగి మళ్లీ ప్రజాప్రభుత్వం ఏర్పడింది కానీ అదీ సరిగ్గా నడవలేదు. 1969లో కల్నల్ గఫార్ నిమైరీ అనే సైన్యాధిపతి కుట్ర చేసి ప్రధాని అయ్యాడు. పార్లమెంటును రద్దు చేసి రాజకీయ కార్యకలాపాలను నిషేధించాడు.

ఈ ప్రభుత్వానికి 1976 నుంచి అమెరికా అండగా నిలిచి సహాయం చేసింది. బదులుగా సిఐఏ స్థావరాలను పెట్టుకోవడానికి సూడాన్ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. 1985లో ధహాబ్ అనే సైన్యాధికారి నిమైరీని పదవీభ్రష్టుణ్ని చేసి, ఈజిప్టుకి తరిమివేశాడు. 1986లో రెండు పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అది చాలా బలహీనంగా ఉండి, సరిగ్గా నడవక పోవడంతో 1989 జూన్‌లో బషీర్ అనే సైన్యాధికారి కుట్ర చేసి, అధికారంలోకి వచ్చాడు. ప్రస్తుతం కలహిస్తున్న యిద్దరూ యితని అనుయాయులే! ఇతను రాజకీయ కార్యకలాపాలను నిషేధించి, ఇస్లామిక్ సూత్రాల ప్రకారం ప్రభుత్వాన్ని నడుపుతానని ప్రకటించాడు. ఇది దేశాన్ని రెండుగా విడగొట్టింది. ఉత్తర సూడాన్‌లో ముస్లిములు ఎక్కువమంది ఉన్నారు. దక్షిణ సూడాన్‌లో క్రైస్తవులు, అనిమిస్టులు (ప్రకృతిలో కనబడేవాటన్నిటికి ఆత్మ ఉందని నమ్మేవాళ్లు) ఎక్కువ. మొత్తమంతా ఇస్లామీకరణ అనడంతో దక్షిణ సూడాన్‌ వారికి వీరితో విభేదాలు వచ్చాయి. దక్షిణ సూడాన్‌లోని తిరుగుబాటు దారులతో సూడాన్ ప్రభుత్వం 2005లో శాంతి ఒప్పందం చేసుకుంది. అది ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) ద్వారా 2011లో దక్షిణ సూడాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి దోహదపడింది.

ఈలోపుగా చాలా కథే జరిగింది. సైన్యంలో, ప్రజాజీవితంలో, రాజకీయరంగంలో తనకు ప్రత్యర్థులన్న వాళ్లందరినీ బషీర్ మట్టుపెట్టాడు. 1993 అక్టోబరులో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. 1996లో అధ్యక్ష ఎన్నికలన్నాడు. తనొక్కడే అభ్యర్థి నన్నాడు. ఈ ప్రభుత్వం నడుస్తూండగానే స్పీకరుగా ఉన్న తురాబీ అనే అతను బషీర్‌పై పైచేయి సాధించడానికి ఇస్లామిక్ ఛాందసవాదానికి మద్దతిస్తూ ఒసామా బిన్ లాడెన్‌ను దేశానికి ఆతిథ్యమివ్వడంతో అమెరికా మండిపడింది. సూడాన్‌కు ‘స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం’గా ముద్ర కొట్టింది. 2001లో లాడెన్ ట్విన్ టవర్స్‌పై దాడి చేయడంతో అమెరికా సూడాన్‌లో ఓ ఫార్మా కంపెనీపై బాంబు దాడి చేసింది. దాంతో సూడాన్ భయపడి లాడెన్‌ను పంపించి వేసింది. ఈజిప్షియన్ జిహాదీలను బహిష్కరించింది. తురాబీ తనకు రాజకీయ ప్రత్యర్థిగా కూడా మారడంతో బషీర్ అతన్ని జైల్లో పడేశాడు.

2003 ఫిబ్రవరిలో పశ్చిమ సూడాన్‌లో ఉన్న ‌డార్ఫర్ ప్రాంతంలో తీవ్రమైన అలజడి చెలరేగింది. అది చాద్, లిబియాలతో సరిహద్దులతో పంచుకుంటుంది. సూడాన్‌లో అరబ్, అరబేతర జాతుల మధ్య తరతరాలుగా వైరం ఉంది. సూడాన్ ప్రాంతం అరబ్బు ముస్లిములకే ప్రాధాన్యత యిస్తోందన్న ఆరోపణతో అరబేతర అనగా ఆఫ్రికన్ ముస్లిములు ఎక్కువగా ఉన్న డార్ఫర్ ఉద్యమించింది. ప్రస్తుతం ముఖాముఖీ తలపడుతున్న బుర్హాన్, డగాలోలు యిక్కణ్నుంచి పిక్చర్‌లోకి వచ్చారు. సూడాన్‌ను పాలిస్తున్న బషీర్ డార్ఫర్‌లో తిరుగుబాటును అణచడానికి తన సైన్యాన్ని ఉపయోగించకుండా కిరాయి సాయుధ మూకలను నియోగించదలచాడు. అతని దృష్టి ‘జంజవీద్ అరబ్ మిలీషియా’పై పడింది. అరబ్బుల్లో జంజవీద్ అనే తెగ ఉంది. వీళ్లు సాహసానికి, క్రౌర్యానికి పెట్టింది పేరు. ఒంటెల కాపరి ఐన జుమా డగాలో అనే డార్ఫర్‌ నివాసి ‘జంజవీద్ అరబ్ మిలీషియా’ అనే పేర డార్ఫర్‌లో కొందర్ని సమీకరించి పెట్టుకున్నాడు. అతను లిబ్యా పాలకుడు గడ్డాఫీకి గతంలో సేవలందించాడు.

సూడాన్‌కు పశ్చిమాన ఉన్న చాద్ దేశంలో హుస్సేన్ హెబ్రే పాలిస్తున్న రోజుల్లో అతనికి అమెరికా, ఫ్రాన్సు మద్దతిచ్చేవి. ఉమార్ అనే అతను అధ్యక్షుడిగా వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉండేవాడు. చాద్‌కు ఉత్తరాన, సూడాన్‌కు పశ్చిమాన ఉన్న లిబ్యాను గడ్డాఫీ పాలించేవాడు. అమెరికాపై ద్వేషంతో గడ్డాఫీ తిరుగుబాటు నాయకుడు ఉమార్‌కి మద్దతిచ్చేవాడు. అంతర్యుద్ధంలో ఉమార్‌ది కింది చేయి కావడంతో అతనికి బలం సమకూర్చడానికి చాద్‌కు తూర్పు ప్రాంతంలో ఉన్న అరబ్ సంచార జాతులకు ఆయుధాలిచ్చి ప్రోత్సహించాడు. 1987లో చాద్‌లో సంధి కుదిరి యుద్ధం ఆగిపోవడంతో, వాళ్లంతా సరిహద్దు దాటి సూడాన్‌లోకి ప్రవేశించారు.

అదే సమయంలో సూడాన్ ప్రభుత్వం ఆఫ్రికన్లకు వ్యతిరేకంగా అరబ్బు సంచార జాతులను సమీకరిస్తోంది. వీళ్లందరూ కలిసి జంజవీద్ అరబ్ మిలీషియాగా ఏర్పడ్డారు. దీనికి జుమా డగాలో ఎమీర్ (కమాండర్‌)గా ఉండేవాడు. అతని సోదరుడి కొడుకు, 2000 సం.రం. నాటికి 27 ఏళ్ల వాడైన హెమెదీ డగాలో అతనికి సాయంగా ఉండేవాడు. 2000 సం.రం.లో డార్ఫర్ ప్రాంతంలో జస్టిస్ అండ్ ఈక్వాలిటీ మూవ్‌మెంట్ అనే సంస్థ ఉద్భవించి, ఆఫ్రికన్‌ సూడానీయులపై వివక్షతను ప్రశ్నించసాగింది. అనతికాలంలో అక్కడే మూడు జాతులు కలిసి సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్‌గా ఏర్పడి వారితో చేతులు కలిపి సూడాన్ ప్రభుత్వంపై అంతర్యుద్ధానికి దిగాయి.

దాన్ని అణిచే పనిని బషీర్ బోర్డర్ గార్డ్స్‌కి అప్పగించి హెమెదీ డగాలోను దానికి కమాండర్‌గా నియమించాడు. ఈ గార్డ్స్ తిరగబడిన మూడు జాతులపై జాతిహననం (జెనోసైడ్) సాగించారు. 2003 నుంచి 2008 వరకు సాగిన యీ మారణకాండలో మూడు లక్షల మందిని చంపారు, 25 లక్షల మంది నిర్వాసితులయ్యారు. చివరకు 2006 మేలో డార్ఫర్ శాంతి ఒప్పందం జరిగింది. 2008 నాటికి దక్షిణ డార్ఫర్ గవర్నరుకి సలహాదారుగా హెమెదీ డగాలో నియమించ బడ్డాడు. 2013లో బషీర్ జంజవీద్ అరబ్ మిలీషియా పేరు మార్చి, విస్తరించి ఆర్ఎస్ఎఫ్ (రేపిడ్ సపోర్ట్ ఫోర్స్) గా చేసినప్పుడు దానికి యితన్ని కమాండర్‌గా చేశాడు.

బషీర్ ఆర్ఎస్ఎఫ్‌ను ఏర్పరచినది దేశంలోని తిరుగుబాట్లను అణచడానికే కాదు, తనపై సైన్యం కుట్ర చేసి దింపేయకుండా చూసుకోవడానికి కూడా! మొదట్లో దాన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎన్ఐఎస్ఎస్) అజమాయిషీలో పెట్టాడు. కొంతకాలానికి డగాలో పని తీరు, విశ్వాసపాత్రత నచ్చి తన కిందే పని చేసేట్లు చేశాడు. ఆర్ఎస్ఎఫ్ బలం పెరగడం సైన్యానికి నచ్చలేదు. దాన్ని తమలో విలీనం చేయాలని పట్టుబట్టింది. కానీ బషీర్ దాన్ని స్వతంత్ర సంస్థగా ఉంచడానికే యిష్టపడ్డాడు, దాన్ని బాగా విస్తరించి, తన ప్రయివేటు ఆర్మీగా వాడుకున్నాడు. తిరుగుబాట్లు అణచడానికి ఎస్ఏఎఫ్‌తో పాటు పంపించేవాడు. వెళ్లినచోటల్లా ఆర్ఎస్ఎఫ్ అకృత్యాలు, దారుణాలు లెక్కకు మిక్కిలిగా చేసినా పట్టించుకోలేదు. బషీర్ పాలనపై దేశంలో పలుప్రాంతాల్లో నిరసనలు తలెత్తాయి. 2015 ఎన్నికలలో నేను మళ్లీ పోటీ చేయను అని అతను 2013లో ప్రకటించడంతో సద్దు మణిగింది. కానీ అతను మాట తప్పాడు. అభ్యర్థిగా నిలబడతానన్నాడు. ప్రతిపక్షాలు ఎన్నికలు బహిష్కరించాయి. ఇతను మళ్లీ నెగ్గేశాడు.

ఇతని తరహా యిలా ఉన్నా అమెరికా ఆ ప్రాంతంలో తన ప్రయోజనాల కోసం యితన్ని దువ్వింది. 2017లో ఒబామా సూడాన్‌పై గతంలో విధించిన ఆంక్షల్లో చాలా వాటిని ఎత్తివేశాడు. కానీ యివేమీ బషీర్‌కు వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను తగ్గించలేక పోయాయి. 2018 చివరి నాటికి ద్రవ్యోల్బణం 70శాతం కు చేరిన సమయంలో ప్రభుత్వం కొన్ని వస్తువుల ధరలను మూడు రెట్లు పెంచడంతో ప్రజలు తిరగబడ్డారు. అతన్ని గద్దె దిగమన్నారు. 30 ఏళ్లగా పాలిస్తున్న బషీర్ దిగడానికి నిరాకరించి, 800 మంది, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రదర్శనకారుల్ని జైల్లో పెట్టించాడు. వారిలో కనీసం 40 మంది చచ్చిపోయారు.

చివరకు వేలాది ప్రజలు ఎస్ఏఎఫ్ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయింపు సమ్మె చేయడంతో, సైన్యాధికారులందరూ చర్చలు జరిపి, 2019 ఏప్రిల్ 11‌న బషీర్‌ని గద్దె దింపి, జైల్లో పడేసి మూణ్నెళ్ల పాటు ఎమర్జన్సీ ప్రకటించారు. తర్వాతి రోజుల్లో ఎమర్జన్సీని వ్యతిరేకించి నిరసనలకు దిగిన వారిపై కాల్పులు జరపడంతో 100 మంది చచ్చిపోయారు. చివరకు ఆందోళన చేస్తున్న పౌర సమాజాలకు మిలటరీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగి 2019 జులైలో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. హేమ్‌డాక్ అనే అతను ప్రధాని కాగా సైన్యం తరఫున బుర్హాన్ (ప్రస్తుత పోరాటంలో డగాలో ప్రత్యర్థి) చైర్మన్‌గా అయ్యాడు.

ఇప్పుడు బుర్హాన్ గురించి కాస్త తెలుసుకోవాలి. ఇతను ఉత్తర సూడాన్‌లో 1960లో పుట్టాడు. డగాలో కంటె 13 ఏళ్లు పెద్దవాడు. మిలటరీ ఎకాడెమీలో చదువుకుని, సైన్యం (సూడానీస్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ – ఎస్ఎఎఫ్)లో చేరాడు. బషీర్‌కు కుడిభుజంలా మెలగుతూ, రాజధాని ఖార్టూమ్‌లో పని చేశాడు. డార్ఫర్ యుద్ధంలో, దక్షిణ సూడాన్‌లో జరిగిన యుద్దంలో ప్రముఖ పాత్ర వహించాడు. డార్ఫర్‌లో బోర్డర్ గార్డ్ ఫోర్సెస్‌లో పెద్ద పదవి నిర్వహించాడు. అక్కడి మారణకాండలో యితని పాత్రా ఉంది. ఈజిప్టు, జోర్దాన్ వెళ్లి మిలటరీ ట్రైనింగ్ అయి వచ్చాడు. 2018లో ఆర్మీ కమాండర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయ్యాడు. 2019 ఫిబ్రవరిలో బషీర్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినప్పుడు లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్నాడు. అందుకే ట్రాన్సిషనల్ మిలటరీ కౌన్సిల్ అనే ఆపద్ధర్మ ప్రభుత్వానికి చైర్మన్ అయ్యాడు. రాజ్యాంగరచన సాగి, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు రెండేళ్లు మాత్రం ఉంటాను అన్నాడు. డగాలో ప్రభుత్వంలో నెం.2 అయ్యాడు.  

ఇలా బషీర్ అనుయాయులుగా ఎదిగిన బుర్హాన్, డగాలో యిద్దరూ అతనికి వ్యతిరేకంగా పని చేసి, అతని తదనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో ప్రధాన పదవులను చేజిక్కించుకున్నారు. అంతేకాదు, యిద్దరూ కలిసి పౌర ప్రతినిథులను మోసం చేయడానికి, ప్రజాస్వామ్యం కోరుతూ ప్రదర్శనలు చేసిన ఆందోళనకారులను హింసాత్మకంగా అణచివేయడానికి చేతులు కలిపారు. ప్రజాస్వామ్య వాదులు అవినీతి నిరోధక చర్యలు చేపట్టి, బషీర్ హయాంలో విపరీతంగా సంపాదించిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తలపెట్టారు. దాన్ని అడ్డుకోవడానికి డగాలో సహాయంతో 2021 అక్టోబరులో బుర్హాన్ సైనిక కుట్ర చేశాడు. సావరినిటీ కౌన్సిల్‌ను రద్దు చేసి, కొత్త సభ్యులతో నింపాడు. తను చైర్మన్‌గా కొనసాగుతానన్నాడు. 2023 జులైలో ఎన్నికలు నిర్వహించి, సైన్యం రాజకీయాల్లోంచి తప్పుకుంటుంది అన్నాడు. 2022 జనవరిలో ప్రధానిగా పని చేసిన హేమ్‌డాక్ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. బుర్హాన్ చేసిన కుట్రను ప్రతిఘటించిన వారందరిపై దాడులు జరిగాయి.

ఇవన్నీ చేస్తూనే బుర్హాన్ తన డిప్యూటీగా ఉన్న డగాలోను చూసి భయపడ్డాడు. ఎందుకంటే అతని ఆర్ఎస్ఎఫ్ ఒక దశాబ్దకాలంలోనే తన క్యాడర్‌ను 3 వేల నుంచి లక్షకు పెంచుకుంది. దేశంలో నలుమూలలా దానికి మిలటరీ బేస్‌లున్నాయి. డగాలోకి విదేశాలలో మిత్రులున్నారు. గతంలో లిబ్యా తిరుగుబాటు నాయకుడికి ఆర్ఎస్ఎఫ్ సేనలతో మద్దతిచ్చాడు కాబట్టి అతని అండ ఉంది. పొరుగున ఉన్న ఎరిత్రియా దేశాధ్యక్షుడితో స్నేహం ఉంది. 2015లో సౌదీ అరేబియా యెమెన్‌పై దాడి చేసినప్పుడు డగాలో తన ఆర్ఎస్‌ఎఫ్‌ను సౌదీకి సాయంగా పంపాడు కాబట్టి సౌదీకి కూడా అతనిపై అభిమానం ఉంది. దానితో పాటు అతనికి బాగా డబ్బిచ్చింది. దాంతో డగాలో సూడాన్‌లో అత్యంత ధనికుల్లో ఒకడయ్యాడు. సూడాన్‌లో బంగారం నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. రష్యన్ ప్రైవేటు మిలటరీ కంపెనీ వాగ్నర్‌ కొన్ని బంగారు గనులు కలిగి ఉంది. కంపెనీకి రక్షణ కల్పించే బాధ్యత ఆర్ఎస్ఎఫ్ తీసుకోవడం చేత రష్యన్లకు కూడా డగాలో ఆత్మీయుడే. పైగా డగాలో దుబాయికి బంగారం ఎగుమతి చేసి బాగా సంపాదిస్తున్నాడు. యుఎఇ అతనికి మద్దతిస్తోంది.

ఇక బుర్హాన్‌కు మద్దతిస్తున్న విదేశీ ప్రభుత్వం ఈజిప్టు మాత్రమే అయినా దేశంలోని పెద్ద వ్యాపారసంస్థలన్నీ సైన్యం కిందే ఉన్నాయి. బ్యాంకులు, కార్పోరేట్లు, ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసే సంస్థలు, మైనింగ్, ఆగ్రిబిజినెస్ చేసే సంస్థలు – మొత్తం 250టిలో సైన్యం పెట్టుబడులున్నాయి. వీటన్నిటికీ యిన్‌కమ్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంది. వీళ్ల లావాదేవీలు బహిర్గత పరచవలసిన అవసరం లేదు. మిలటరీ ప్రభుత్వం యింత అన్యాయంగా పాలిస్తున్నా అమెరికాకు ఏ బాధ లేకపోయింది. 2020లో ట్రంప్ సూడాన్‌పై మిగిలిన ఆంక్షలను కూడా ఎత్తివేసి, దానిపై టెర్రిరిజాన్ని స్పాన్సర్ చేసే దేశమన్న ముద్ర కూడా తొలగించి వేశాడు. ఎందుకంటే ఇజ్రాయేల్‌ను గుర్తిస్తూ అబ్రహాం ఒప్పందంపై సూడాన్‌ చేత సంతకాలు పెట్టించడానికి, చైనా, రష్యా, ఇరాన్‌ల నుంచి సూడాన్‌ను దూరంగా తీసుకురావడానికి.

డగాలో స్థాయిని తగ్గించడానికై బుర్హాన్ ఒక ఐడియా వేశాడు. తనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న పౌరప్రతినిథులతో 2022 డిసెంబరులో ఒక ఒప్పందానికి వచ్చాడు. దాని ప్రకారం రెండేళ్లలో అధికారం ప్రజాప్రతినిథులకు అప్పగించడం జరుగుతుంది. ఈ లోపున ఆర్ఎస్ఎఫ్ సైన్యంలో విలీనమై పోయి బుర్హాన్ అధీనంలోకి వచ్చేస్తుంది. ఈ ఒప్పందంపై 2023 ఏప్రిల్‌లో సంతకాలు జరుగుతాయని అనుకున్నారు. డగాలో దీన్ని వ్యతిరేకించాడు. ఆర్ఎస్ఎఫ్‌ను సైన్యంలో విలీనం చేయడానికి పదేళ్ల సమయం కావాలని అడిగాడు. కానీ సైన్యం ఒప్పుకోలేదు. దాంతో డగాలో 2023 ఏప్రిల్ 15న తిరగబడ్డాడు. అతనికి అండగా ఆర్ఎస్ఎఫ్ నిలబడింది. 60 లక్షల జనాభా ఉన్న రాజధాని ఖార్టూమ్ వీధుల్లో అంతర్యుద్ధం సాగుతోంది. ‘బుర్హాన్ ఇస్లామిస్టు, నియంత. నేనైతే అతన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాను’ అని డగాలో పౌరప్రతినిథులకు వాగ్దానాలు చేస్తున్నాడు.

సైన్యం వద్ద వాయుసేన, నౌకాసేన ఉండగా, భూమిపై ఆర్ఎస్ఎఫ్‌ది పైచేయిగా ఉంది. ఆర్ఎస్ఎఫ్ స్థావరాలున్నచోట సైన్యం తన విమానాలతో దాడి చేస్తోంది. ఆర్ఎస్ఎఫ్ సైన్యస్థావరాలపై దాడి చేస్తోంది. మధ్యలో పౌరులు నాశనమౌతున్నా యిరుపక్షాలూ పట్టించుకోవటం లేదు. బంగారు గనులు అపారంగా ఉన్న యీ దేశం అత్యంత పేద దేశం. జనాభాలో మూడో వంతు క్షుద్బాధతో అలమటిస్తున్నారు. ఈ అంతర్యుద్ధంతో పొరుగున ఉన్న చాద్‌కు తరలి వెళ్లిపోతున్నారు. ఇద్దరు నరహంతకుల మధ్య ఆధిపత్యం కోసం ఆరువారాలుగా నడుస్తున్న యీ అంతర్యుద్దం ఎంతకాలం నడుస్తుందో తెలియదు. అక్కడ యిరుక్కున్న మన దేశస్తులను ప్రభుత్వం వెనక్కి తీసుకుని రావడం మనకు విదితమే. నెం.1, నెం.2లలో ఎవరిది పైచేయి అయినా సాధారణ సూడాన్ పౌరుడికి ఒరిగేది ఏమీ లేదు. (ఫోటో – బషీర్, సూడాన్ మ్యాప్, బుర్హాన్, డగాలో)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?