Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: వెలుగు చూపవా, వెంకటేశ్వరా!

ఎమ్బీయస్‌: వెలుగు చూపవా, వెంకటేశ్వరా!

తిరుమల వ్యవహారాల గురించి పది రోజులుగా రభస జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. వీటిలో వాస్తవమేమిటో యిప్పటిదాకా బయటకు రాలేదు, యిప్పట్లోనే కాదు, ఎప్పటికీ బయటకు వస్తుందన్న నమ్మకమూ నాకు లేదు. టిటిడిలో అక్రమాలు, అవినీతి గురించి ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. విచారణ చేపట్టామంటారు, చివరకు ఎవర్ని దోషులుగా తేల్చారో, ఎంత రాబట్టారో మళ్లీ ఆ వార్తలేవీ బయటకు రావు. ప్రతీసారీ ఆరోపణ బయటకు రాగానే భక్తుల మనోభావాలు దెబ్బ తీశారు అంటారు, వారి నమ్మకాన్ని సడలించేందుకు జరిగిన కుట్ర అంటారు, హిందూమతాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారంటారు.

ఇన్నేళ్లగా చూస్తున్నాను - స్వామి వారిపై భక్తుల నమ్మకం మాత్రం చెదరటం లేదు. రోజురోజుకి పెరుగుతూనే ఉంది. హుండీ కలక్షన్‌ చూసుకున్నా, యీ ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా రోజుకి మూడు, మూడున్నర కోట్ల ఆదాయం వస్తోంది. అంటే అర్థమేమిటన్నమాట, 'మీరెలాగైనా కొట్టుకు చావండి, ఏదైనా అన్యాయం చేస్తే మీ పాపాన మీరే పోతారు, మా మొక్కులు తీరుతున్నాయి, మా దేవుణ్ని మేం వదిలిపెట్టం' అని భక్తులు చాటి చెప్తున్నారు. ఆ భక్తుల పేరు చెప్పి రాజకీయనాయకులు పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు. 

రమణ దీక్షితులు వైసిపి ఏజంటని, బిజెపి ఏజంటని టిడిపి ఆరోపించింది. అర్చకుల్లోనే ఆయనకి వ్యతిరేకబృందం తయారు చేయాలని 32 మంది అర్చకులను రెగ్యులరైజ్‌ చేసి వారిని చీల్చింది. వారు కొత్తగా ప్రమోషన్‌ వచ్చినవాళ్లతో కలిసి ప్రెస్‌మీట్‌లు పెట్టి దీక్షితులు 12 నామాలు ధరించలేదని ఆరోపించారు. ఆయనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. గురువారం నాడు ఆయన ఆరోపణలకు నిరసనగా అంటూ ఆలయంలోనే నల్ల బ్యాడ్జ్‌లు ధరించి అర్చక విధుల్లో పనిచేశారు. ఆయనకు నిరసన తెలపాలంటే ఆయన యింటి దగ్గర బ్యాడ్జ్‌లతో ప్రదర్శన నిర్వహించాలి.

గుళ్లో చేయడమేమిటి? గుడి నడిపిస్తున్నది ఈఓ ఆధ్వర్యంలోని టిటిడి. అంటే గుడిని దీక్షితులకు వ్యతిరేక శిబిరంగా మార్చే క్రమంలో ఔచిత్యం సైతం మర్చిపోయారన్నమాట. ఇది సరి కాదంటూ జెఇఓ ఒక సర్క్యులర్‌ జారీ చేసి ఊరుకున్నారు తప్ప నిరసనకారులను సంజాయిషీ అడగలేదు. వీళ్లిలా ఉంటే మరో పక్క స్వామి వారి ఆభరణాలు బాబు యింట్లో ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. సీరియస్‌గా కనబడే ఆ అడిటరుగారిలో యింత హాస్యస్ఫోరత ఉందని నా కెన్నడూ తెలియదు.

ఆయన చెప్పిన 12 గంటల్లోపున బాబు యింటికి వెళ్లి చూడాలట. లేకపోతే ఆయన బాధ్యుడు కాడట, రాజీనామా చేయడట! బాబు యీయన కేమైనా మాట యిచ్చారా, పన్నెండు గంటల వరకు మా యింట్లోంచి కదల్చను అని? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన తిరుమల వజ్రాలు యింటికి తెప్పించుకోవచ్చా? అంత బలహీనంగా ఉన్నాయా అక్కడి ఏర్పాట్లు? విజయసాయిది సందట్లో సడేమియా వ్యవహారంలా కనబడినా, వివాదానికి కేంద్రబిందువుగా ఉన్నది దీక్షితులు రిటైర్‌మెంట్‌! దాన్ని టిటిడి, దాని వెనుక ఉన్న టిడిపి ప్రభుత్వం హేండిల్‌ చేస్తున్న విధానం!

ఒకవ్యక్తి రిటైర్‌మెంట్‌పై యింత గోలా? అదీ అర్ధాంతరంగా ఏమీ తీసేయలేదు, 65 ఏళ్లు నిండిన తర్వాతే తీసేశారు. ఎలా, ఎందుకు తీశారు అన్నది పక్కన పెట్టండి, ఉద్యోగిని రిటైర్‌ చేయకూడదా? తక్కినవారికి అవకాశం యివ్వకూడదా? ఎల్లకాలమూ ఒక్కళ్లే ఉండాలా? ఆయన్ను పంపించివేసినంత మాత్రాన దేవుడికి సేవలు ఆగిపోతాయా? ఆయన కాకపోతే మరొకరు సేవిస్తారు. ఆయన స్థానంలో వచ్చిన వారికి మంత్రాలు రావనో, రికార్డు బాగా లేదనో అంటే అది వేరే విషయం. వాళ్ల వంశస్తుడికే యిస్తున్నారు. ఇంకేమిటి బాధ?

రమణ దీక్షితులు ఒక్కరితో తిరుమల నడవలేదు. ఇన్నాళ్లూ ఎన్నో అక్రమాలు జరిగిపోయాయని ఆయన యిప్పుడు ఏకరవు పెడుతున్నాడు. స్వామి వారిని రాత్రి 12.05 కే లేపేసి సుప్రభాత సేవ చేయమంటున్నారట. విఐపీల కోసం స్వామి వేర సేవల్లో కోత విధిస్తున్నారట, అర్ధాంతరంగా ఆపేస్తున్నారట, నైవేద్యాలను తగ్గిస్తున్నారట, అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అవతలివాళ్లు అంటున్నా, చెప్పలేక పోవడానికి సర్వీసు నియమనిబంధనలు అడ్డు వచ్చి ఉండవచ్చు. చెప్పినా చెప్పలేకపోయినా, తను ప్రధాన అర్చక పదవిలో ఉండి కూడా వాటిని ఆపలేకపోయానని ఆయన ఒప్పుకున్నట్లే కదా!

తన కళ్ల ముందే దేవుడికి నైవేద్యం లేకుండా పోయినా ఏమీ చేయలేకపోయాడు కదా! మరి ఆ ఉద్యోగం పట్టుకుని వేళ్లాడడం దేనికి? తానుండి ఉద్ధరించ లేకపోయినప్పుడు తప్పుకుంటే మేలు కదా! ఆ అన్యాయాలన్నీ సవరిస్తేనే నేను ఆ పదవిలో కొనసాగుతాను అనే షరతు పెట్టటం లేదాయన. నా ఉద్యోగం తీసేయకండి అని మాత్రమే పట్టుబడుతున్నాడు, కోర్టుకి వెళుతున్నాడు. 65 ఏళ్ల దాకా ఉద్యోగం చేయనిచ్చాక కూడా యింత పంతమేమిటి? రమణ దీక్షితులపై చాలా వివాదాలు వచ్చాయి.

అన్నదానం విరాళం సొంత ఖాతాకు మళ్లించారని, సాక్ష్యాలతో పట్టుకుని మందలించి వదిలేశారని, బయటకు చెప్తే ఆలయ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని బయట పెట్టలేదని టిటిడి మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి రమణ కుమార్‌ ఐఏఎస్‌ చెపుతున్నారు. ఇవే కాదు, ముకేశ్‌ అంబానీ గెస్ట్‌ హౌస్‌కి వెళ్లి తీర్థం యిచ్చారని... యిలా చాలా ఉన్నాయి. ఆయన వాదన సంతృప్తికరంగా లేనట్లే ఆయన ఉద్యోగం తీసేసిన యాజమాన్యం వాదనా సరిగ్గా లేదు. అసలీ 65 ఏళ్లు ఎక్కణ్నుంచి వచ్చింది? ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసు వర్తింపచేస్తే 60 కావాలి. 60కి పై బడినవాళ్లందరినీ తప్పించేసి ఉండాల్సింది. అలా చేస్తే వారికి కావలసినవారికి ఉద్యోగం రాదేమో!

రిటైర్‌మెంటు వయసు పెంచడం, తుంచడం అంతా ఏకపక్షంగా చేయవచ్చా? ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు నియమనిబంధనలు ఎలా ఉన్నాయి? అన్నిటికంటె ప్రధానమైన ప్రశ్న అర్చకులకు రిటైర్‌మెంటు ఉంటుందా? వయసు చేతనో, అనారోగ్యం చేతనో పళ్లు రాలిపోయి, మంత్రాలు సరిగ్గా పలకలేకపోతే? మతిమరుపు చేత మంత్రాలు ఎగరగొట్టేస్తే...? అర్చకత్వంలో ఉండే విపరీతమైన శారీరక శ్రమ తట్టుకోలేక పోతే..? 65 రాలేదు కదాని అలాగే అట్టేపెడతారా? ఇవన్నీ వ్యక్తి శారీరక దారుఢ్యం, మానసిక సంతులతపై ఆధారపడి ఉంటాయి.

స్వామివారి సమక్షంలోనే అన్యాయాలు జరుగుతున్నాయి, నేను వాటిని ఆపలేకపోతున్నాను అనే క్షోభతో ఉన్న పూజారి ఏకాగ్రతతో అర్చించగలడా? వీటన్నిటినీ వయసులో ముడిపెట్టి చూడగలరా? రమణ దీక్షితులు అలాటివాడు, యిలాటివాడు అని యిప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు అధికారంలో ఉన్నవారే. మరి అలాటివాణ్ని యిన్నాళ్లూ పదవిలో ఎందుకు ఉంచారు? ఆయన మద్రాసు వెళ్లి చంద్రబాబుపై ఆరోపణలు చేసేవరకు ఎందుకు ఊరుకున్నారు? తర్వాతైనా ఆయన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా 65 ఏళ్లు అనే సాంకేతిక కారణం చెప్పి తీసేశారెందుకు? అలా తీసేయడం వలన ఆయనతో బాటు మరో ముగ్గురి ఉద్యోగాలూ పోయాయి.

ఏదైనా సంస్థలో ఉద్యోగి ప్రవర్తన బాగా లేనప్పుడు అతన్ని లిఖితపూర్వకంగా సంజాయిషీ అడుగుతారు తప్ప టీవీల కెక్కి ఆరోపణలు చేయరు. ఈయనకు నోటీసు యివ్వాలని నిశ్చయించారు. ఇచ్చి సమాధానం వచ్చాక చర్య తీసుకోవాల్సింది. ఈ లోపునే 2012 నాటి రూలును గుర్తు చేసుకుని ఉద్యోగం పీకేయడం దేనికి? ఆరేళ్లగా వాడనిది యీనాడు అక్కరకు వచ్చిందా? అప్పణ్నుంచే అమలు చేసి ఉంటే యీపాటికి చాలా మంది కొత్తవాళ్లకు అవకాశాలు వచ్చేవి కదా. ఇప్పుడు కూడా కావాలంటే దీక్షితులను ముందు సస్పెండ్‌ చేసి, విచారణ తర్వాత డిస్మిస్‌ చేసి ఉండాల్సింది.

గుడికి గోశాలలున్నా అన్నీ హెరిటేజి నుంచే తెప్పిస్తున్నారని ఆయన ఆరోపించినప్పుడు, అబద్ధపు ఆరోపణ ఎందుకు చేశావ్‌? అని షోకాజ్‌ నోటీసు యివ్వాల్సింది. హెరిటేజి సంస్థ పరువునష్టం దావా వేయాల్సింది. ఇవేమీ చేయకుండా బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఆనందసూర్యను ఉసిగొల్పారు. అసలిక్కడ బ్రాహ్మణ సమస్య ఎందుకు వచ్చింది? తిరుమల దేవుడు బ్రాహ్మణమఠానికి సంబంధించినవాడు కాదు. యావన్మంది హిందువులకు సంబంధించినవాడు. అక్కడ ఏదైనా అక్రమం జరిగితే హిందువులందరికీ సంజాయిషీ చెప్పవలసిన బాధ్యత పాలకులది.

దీక్షితులు బ్రాహ్మడు కాబట్టి బ్రాహ్మడి చేతే తిట్టించాలనే వ్యూహమా? అదే అయితే హాస్యాస్పదంగా ఉంది. వెంటనే అతనికి జవాబుగా కొన్ని బ్రాహ్మణ సంఘాలు దీక్షితులు పక్షాన నిలబడ్డాయి. ఇది మరీ ఫన్నీగా ఉంది. దీక్షితులు స్థానంలో నియమించబడినవారు కూడా బ్రాహ్మలే కదా. ఆయన ఉద్యోగం తీసేస్తే బ్రాహ్మణులకు అన్యాయం జరిగిపోయినట్లు బిల్డప్‌ దేనికి? ఆనందసూర్య రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. రుణాకర రెడ్డి టిటిడి చైర్మన్‌గా ఉన్నపుడు దీక్షితులు ఆయన్ని ఆశీర్వదించారట. కరుణాకర రెడ్డి ఎంత దుర్మార్గుడో చెప్పి, ఆయన్ను ఆశీర్వదించిన యీయనను దుమ్ము దులిపేశాడు. 

పురోహితుడు ఎవరడిగినా ఆశీర్వదిస్తాడు తప్ప కారెక్టరు సర్టిఫికెట్టు పట్టుకురమ్మన మనడు. రేపు ఆనందసూర్య చైర్మన్‌ అయినా అర్చకులంతా బారులు తీర్చి వాళ్ల యింటికి వస్తారు. టిటిడిలో అక్రమాలు జరిగినట్లు దీక్షితులు ఆధారాలు చూపాలని అడిగిన ఆనందసూర్య కరుణాకర రెడ్డి అక్రమాలకు కూడా ఆధారాలు చూపాలి. అధికార పార్టీతో ఉన్నారు కాబట్టి  కరుణాకర రెడ్డిపై కేసులు పెట్టించాలి. అప్పుడే ఆయన చిత్తశుద్ధి తెలుస్తుంది. లేకపోతే వైసిపి నాయకుణ్ని దీన్లోకి యీడ్చే తాపత్రయమే కనబడుతుంది. టిటిడిపై ఎప్పుడూ ఏదో ఒక నింద వస్తూనే ఉంటుంది.

ప్రధాన అర్చకులు నేను ఈఓకు ఫిర్యాదు చేశాను అంటారు. ఆయనేమో దీక్షితులు చెప్పగానే జెఈఓను, చీఫ్‌ ఇంజనీరును పంపించి పరిశీలన చేయించాను అంటారు. అంటే ఈ నలుగురికి ముందస్తు సమాచారం లేదన్నమాట. వారిని సంప్రదించకుండా స్వామివారి వంటశాలను మూసే అధికారం యింకెవరికి ఉంటుంది? మరమ్మత్తులనేవి ఎలాటివి, ఎన్నాళ్లు చేశారు అనేది రికార్డుల్లో ఉంటుంది కదా. అవి తీసి చూపిస్తే పోతుంది. పోటు మూసేయడం వలన వేరే చోట వండించి తెచ్చారు, అది సవ్యమైన పద్ధతి కాదు, దానివలన స్వామి పస్తు ఉన్నారు అంటారు రమణ దీక్షితులు.

అలా 2001, 2007లో కూడా జరిగాయి, దాని వలన మహాపచారం ఏమీ జరగలేదు అంటారు ఈఓ. పోటులో మరమ్మత్తులు జరుపుతూనే ఓ పక్క వంట వండడానికి వీలుపడలేదా? అందర్నీ ఖాళీ చేయించి, మొత్తమంతా కుళ్లబొడిచేయాలా? ఏ మాత్రం దెబ్బ తినని గ్రానైట్‌ రాళ్లను తీసి మళ్లీ వాటినే పెట్టాలా? (రమణ దీక్షితులు మాటల్లో) అన్న సందేహం వస్తుంది. ఆగమ సలహాదారు సుందరవరదన్‌ సలహాతోనే మరమ్మత్తులు చేశాం అంటున్నారు ఈఓ యిప్పుడు.

ఆగమ సలహామండలి అనుమతులతోనే మరమ్మత్తులు చేయించామని సుందర వరదన్‌ అన్నారు. అంటే ఈఓ, జెఇఓ, చీఫ్‌ ఇంజనీర్‌కు కూడా చెప్పకుండానే యీ మండలి చేపట్టిందా? నేను ఆ మండలిలో సభ్యుణ్ని నాకు చెప్పలేదేం అంటున్నారు దీక్షితులు. పాయింటే కదా!? రెండో విషయం 1945లో మైసూరు మహారాజా బహుమతిగా యిచ్చిన పింక్‌ డైమండ్‌ యిక్కడ మాయమై జెనీవాలో వేలం వేయబడింది అంటారు దీక్షితులు. అది డైమండ్‌ కాదు, కెంపు, ఉత్సవమూర్తికి వేస్తే భక్తులు విసిరిన నాణాల వలన పగిలి ముక్కలైంది అంటూ వాటి ఫోటో చూపిస్తున్నారు ఈఓ.

'2009లో జస్టిస్‌ జగన్నాథరావు కమిటీ పరిశీలించి యిది నిజమేనని తేల్చింది. ప్రభుత్వం జీఓ యిచ్చింది, 2010లో ఐవైఆర్‌ కృష్ణారావు ప్రభుత్వానికి నివేదిక యిచ్చారు కూడా' అంటున్నారాయన. గులాబీ రంగు డైమండ్‌ గురించి నేను ఎన్నో ఏళ్లగా అడుగుతున్నానని దీక్షితులు అంటారు. డైమండ్‌ యిచ్చారో, రూబీ యిచ్చారో మైసూరు సంస్థానం రికార్డుల్లో యిప్పటి మైసూరు మహారాజా వారి వద్ద ఉంటుందట. వారిని అడిగితే వారే చెప్పేస్తారు. ఈ 'వజ్రం' పగిలిపోవడంపై రమణ దీక్షితులు తనకు చెపితే తను నివేదిక యిచ్చానని, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సిబిఐ విచారణ కోరారని టిటిడి మాజీ సెక్యూరిటీ చీఫ్‌ చెపుతున్నారు.

అప్పుడు తాను అడిగిన సిబిఐ ఎంక్వయిరీని యిప్పుడు బాబు తనే సిఫార్సు చేయవచ్చు. 'స్వామి వారిని కొత్త ఆభరణాలతోనే అలంకరిస్తున్నారు, ప్రాచీన ఆభరణాలు ఏమయ్యాయి?' అని మరో ప్రశ్న వేశారు దీక్షితులు. ప్రధాన అర్చకుడు ఆయనే కదా, ఆయన చూడవద్దా అంటారు టిడిపి వారు. 1987 వరకు అర్చకుల అధీనంలోనే నగలు ఉండేవి. తర్వాత టిటిడికి అప్పగించారు. ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి, వాటిలో మునిగి తేలుతూంటారు. అంత పెద్ద ఆర్గనైజేషన్‌లో అన్నీ అందరికీ తెలియాలని లేదు. ఇది ఎడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన విషయం కాబట్టి ఈఓ ఆఫీసు వారే జవాబు చెప్పాలి. 

ఈ వ్యవహారంలో ఈఓ మాట్లాడుతున్నది తక్కువా, టిడిపి వాళ్లు మాట్లాడుతున్నది ఎక్కువా అయిపోయింది. గతంలో అమరావతి కొత్త బిల్డింగు చూరు కారినా వైసిపి హస్తం అనేవారు. ఇప్పుడు బిజెపిని కలుపుతున్నారు. ఆట్టే మాట్లాడితే బిజెపిమీదే పెద్ద బండ వేస్తున్నారు. రమణ దీక్షితులు యింట్లో వైయస్‌ ఫోటో ఉందని, దాన్ని బట్టే ఆయన ఎలాటివాడో తెలిసిందని (స్వామివారు ఆయన చేతనే యిన్నాళ్లూ సేవ చేయించుకున్నారని మనం గ్రహించాలి) అమిత్‌ షాతో ఫోటో దిగాడని, దిల్లీకి వెళ్లి బిజెపితో కలిసి కుట్ర పన్నాడనీ.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా బాబు యిలాటివి మాట్లాడారు.

అమిత్‌ షా వచ్చినపుడు పోటుకి తీసుకెళ్లి తవ్వకాలు చూపించానని, అందుకే తనపై టిడిపి పగబట్టిందని దీక్షితులు అంటారు. అంతేకాదు, టిటిడి నిధులను టిడిపి ప్రభుత్వం దారి మళ్లిస్తోందని అంటూ ఉదాహరణలు యిచ్చారు - తిరుపతిలో సైన్సు కాంగ్రెసు వచ్చినపుడు తిరుపతి సుందరీకరణకు, ఒంటిమిట్ట దేవాలయ ఉద్ధరణకు రూ.100 కోట్లు. తిరుపతిలో కాంక్రీటు రోడ్డు కోసం రూ.10 కోట్లు.. యిలా! రోడ్లు వేయడానికి పన్నులు చెల్లిస్తోంది ప్రజ. హిందూ దేవుడి నిధులే కావలసి వచ్చాయా? దానిపై టిడిపి వారి స్పందన యింకా రాలేదు.

దీక్షితులు వెనక ఏ పార్టీ ఉన్నది అనేది టిడిపికి అవసరమేమో కానీ భక్తులకు అనవసరం. ఆయన చేసిన ఆరోపణల్లో నిజమెంత అనేది తెలిస్తే చాలు. అది చెప్పకుండా రమణ దీక్షితులుపై, ఐవైఆర్‌పై ఆంధ్ర ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు పెట్టబోతామంటూ టిడిపి ఒక లీక్‌ యిచ్చి కూర్చుంది. కెంపు-వజ్రం విషయంలో రమణ దీక్షితులు వాదన నమ్మబుద్ధిగా లేదు కానీ, పోటు తవ్వకాల విషయంలో ఏదో మరుగు పరుస్తున్నారనే తోస్తోంది. అందువలన లీకుకు మించి ప్రభుత్వం అడుగు ముందు వేయకపోయినా ఆశ్చర్యపడవద్దు. 

అసలు కేంద్రం దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్ని పురావస్తు విభాగం ద్వారా లేఖలు పంపిందని చంద్రబాబే ఆరోపించారు. పురావస్తు శాఖ ఉత్తరం పూర్వాపరాల గురించి ఐవైఆర్‌ ఒక వ్యాసం ద్వారా తెలియపరిచారు. అది గమనించకుండా దానిపై యింత రాద్ధాంతం చేయడం విడ్డూరం. ఇప్పుడీ మాజీ సెక్యూరిటీ చీఫ్‌ రమణ కుమార్‌ తనకు తెలిసున్నది చెప్పి, అంతటితో ఆగకుండా రమణ దీక్షితులు వ్యవహారం బిజెపి రాజకీయాలకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్లు ఉంది అని చేర్చారు.

నిజాలు తెలిస్తే చెప్పాలి, ఊహల జోలికి పోవడం ప్రారంభిస్తే యీయన వెనక్కాల టిడిపి ఉంది కాబట్టే యిలా మాట్లాడాడని వేరొకరు ఊహిస్తారు. దేవాలయంలో అవకతవకలకు అంతిమంగా బాధ్యులు ఎవరు? ప్రధాన అర్చకుడు కాదు, డాలర్‌ శేషాద్రి కాదు, మరొకరు కాదు. టిటిడి బోర్డు ! దాన్ని నియమిస్తున్న రాష్ట్రప్రభుత్వం. ఆ బోర్డు ఎంత లక్షణంగా పనిచేస్తోంది అన్నదే ప్రధానాంశం. ఏడాదిగా వాళ్లు సమావేశం కాలేదట. అందుకే అనేక అంశాలన్నీ మేట వేసి, మే 16 నాటి సమావేశంలో ఎజెండాలో 200 అంశాలు పెట్టారట.

వాటిలో 50 అంశాల పైనే చర్చ జరిగిందట. తక్కిన జూన్‌5 న మరో మీటింగులో తేలుద్దాం అన్నారట. ఇదేమైనా పద్ధతిగా ఉందా? తిరుమల యింత వివాదాల్లో చిక్కుకున్నప్పుడైనా వెంటవెంటనే సమావేశమై దిద్దుబాటు చర్యలు తీసుకోవద్దా? దానికి బదులుగా గుడి గురించి మాట్లాడే పని రాజకీయనాయకులకు అప్పగిస్తారా? మీడియా కూడా సొంతంగా పరిశోధనకు పూనుకోవటం లేదు. ఇరువైపుల వారినీ కూర్చోబెట్టి ఆరోపణలు చేయించి, చేతులు దులుపుకుంటోంది.

ఫలానా కమిటీ నివేదిక యిదిగో, దీనిలో యీ పేజీలో యిలా వుంది అని చూపటం లేదు. దానిపై వారు యిలా అన్నారు, అలా అన్నారు అని రిపోర్టింగు మాత్రమే చేస్తోంది. అందువలన మనందరినీ అజ్ఞానాంధకారం ఆవరించింది. వెలుగు చూపి వాస్తవాలు చెప్పగలిగినవాడు వెంకటేశ్వరుడు మాత్రమే. ఎవరి ద్వారా వెలుగులు పంచుతాడో వేచి చూద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?