cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

క‌మ్మ వాళ్ల చివ‌రి అస్త్రం!

క‌మ్మ వాళ్ల చివ‌రి అస్త్రం!

ఒక ప్రాంతీయ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి హోదాలోని వ్య‌క్తి త‌న‌యుడు తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోవ‌డం అంటే.. అంత‌కు మించి రాజ‌కీయ ప‌త‌నావ‌స్థ మ‌రోటి లేదు. స‌ద‌రు ముఖ్య‌నేత మెజారిటీ కూడా చాలా వ‌ర‌కూ త‌గ్గిపోయిందంటే.. ఆ పార్టీ ప‌దోవంతు స్థాయి సీట్ల‌ను నెగ్గ‌డానికి క‌ష్ట‌ప‌డిందంటే.. ఆ నేత‌ను ప్ర‌జ‌లు తీవ్రంగా తిర‌స్క‌రించేశారు అన‌డానికి మ‌రో సాక్ష్యం అక్క‌ర్లేదు!

ప‌చ్చ‌క‌ళ్ల‌ద్దాలు పెట్టుకున్న వాళ్ల ఒప్పుగోలుతో అవ‌స‌రం లేదు కానీ చంద్ర‌బాబు నాయుడును, ఆయ‌న త‌న‌యుడిని ఏపీ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించేశారు! ఇక ఎన్న‌టికీ వ‌ద్ద‌నేంత స్థాయిలో ఉంది ఆ తిర‌స్కారం. పైకి తెలుగుదేశం వీరాభిమానులు ఈ విష‌యం ఒప్పుకోరు, అయితే అంత‌ర్లీనంగా వారికీ ఇది తెలుసు!

ఇక చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న నాయ‌క‌త్వం విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడేం చేస్తున్న‌ట్టు? ఏడాదిలో తెలుగుదేశం పార్టీ బ‌లోపేతం చేయ‌డం సంగ‌తెలా ఉన్నా.. మోడీ కాళ్లూ, గ‌డ్డాలు ప‌ట్టుకోవ‌డానికే వారి శ‌క్తంతా స‌రిపోతూ ఉంది. మోడీని చెడామ‌డా తిట్టి, మోడీ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల గురించి కూడా నోటికొచ్చిన‌ట్టుగా మాట్లాడి, ఇప్పుడు మళ్లీ మోడీ చెంత‌కే చేరాల‌ని చూస్తున్న చంద్ర‌బాబు నాయుడి తీరుతో.. తెలుగుదేశం పార్టీని, ఆయ‌న రాజ‌కీయాన్ని ప్ర‌జ‌లు మ‌రింత‌గా అస‌హ్యించుకుంటున్నారు. ఏతావాతా... గ‌త ఏడాదిలో తెలుగుదేశం పార్టీ మ‌రింత ప‌త‌నావ‌స్థ‌కు చేర‌డ‌మే త‌ప్ప‌, ఎదుగూబొదుగూ లేదు!

ఒక్క మాట‌లో చెప్పాలంటే.. చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ జీవితం ఇక దాదాపు ముగిసిన‌ట్టే అని స్ప‌ష్టం అవుతోంది. నిజాలు చేదుగానే ఉంటాయి. ఇప్పుడు మ‌ళ్లీ మోడీ కాళ్ల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం క‌న్నా.. చంద్ర‌బాబు నాయుడు హుందాగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డం ఆయ‌న‌కు ఎంతో కొంత విలువ‌ను ద‌క్కిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కూ మోడీని తిట్ట‌ని తిట్టంటూ లేదు, ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న భ‌జ‌న! త‌న వ‌య‌సుకు అయినా చంద్ర‌బాబు నాయుడు కొంత గౌర‌వాన్ని నిలుపుకోవాలి. చంద్ర‌బాబు ఆ ప‌నే చేసేవారేమో! లోకేష్ క‌నీసం ఎమ్మెల్యేగా నెగ్గి ఉంటే.. ఈ పాటికే ఆయ‌న‌కు టీడీఎల్పీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఇచ్చి చంద్ర‌బాబు నాయుడు సైడ‌య్యేవారేమో! అయితే.. చంద్ర‌బాబు ఛ‌రిష్మా త‌న‌యుడిని క‌నీసం ఎమ్మెల్యేగా గెలిపించ‌లేక‌పోయింది.

చంద్ర‌బాబు ఇప్పుడు ఎలాంటి రాజ‌కీయ అడుగులు వేసినా.. ఛీత్కారాలే త‌ప్ప‌, స్వాగ‌త సుమాంజ‌లులు ఎదుర‌య్యే ప‌రిస్థితి లేదు! ఇక లోకేష్ గురించి మాట్లాడుకోవ‌డం కూడా వ్యర్థం! సొంత కులానికే ఆయ‌న కామెడీ అయిపోయారు మ‌రి! ఎన్టీఆర్ ను దించిన చంద్ర‌బాబును అయినా వాళ్లు అభిమానించారు, చంద్ర‌బాబు ఎంత కుటిల రాజ‌కీయం చేసినా.. త‌మ‌ను ఒడ్డున ప‌డేస్తాడ‌ని క‌మ్మ‌లాబీ గ‌ట్టిగా న‌మ్మింది! స్వ‌యంగా ఎన్టీఆరే త‌న అల్లుడు చంద్ర‌బాబును అన‌రాని మాట‌ల‌న్నా క‌మ్మ‌లాబీ మాత్రం చంద్ర‌బాబు త‌ప్ప‌నిస‌రిగా అభిమానించింది. అయితే లోకేష్ మాత్రం ఆ వ‌ర్గంలో ఎలాంటి న‌మ్మకాన్నీ క‌లిగించ‌లేక‌పోతున్నాడు. ఇక క‌లిగిస్తాడ‌నే న‌మ్మ‌కాలు కూడా లేవు!

వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే భ‌రోసా అయ్యాడు జ‌గ‌న్. కుల‌, మ‌త ర‌హిత అతీతంగా.. కాంగ్రెస్ అనే శ‌తాబ్దంపై చ‌రిత్ర‌ను పూర్తిగా చెరిపేసి, ఆ ఓటు బ్యాంకును వంద‌కు వంద‌శాతం త‌న వైపుకు తిప్పుకున్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయి ఉండొచ్చు, అప్పుడు టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఓటు బ్యాంకు మూడూ క‌లిసినా జ‌గ‌న్ క‌న్నా ఐదు ల‌క్ష‌లే ఎక్కువ‌! ఆ ఎన్నిక‌లతో జ‌గ‌న్ ఒక న‌మ్మ‌కాన్ని ఏర్ప‌రుచుకున్నారు. దాన్నే విజ‌యంగా మార్చుకున్నారు.

అదే తెలుగుదేశం విష‌యానికి వ‌స్తే..ఇవే ప‌రిణామాలు ఏదైనా జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ‌లో జ‌రిగి ఉంటే? ఈ పాటికి స‌ద‌రు నేత‌ను సాగ‌నంపే వారా కాదా? ఆ లాజిక్ చాలు, చంద్ర‌బాబు నాయుడు త‌ప్పుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని చెప్ప‌డానికి. మ‌ళ్లీ పార్టీ పుంజుకోవాలంటే.. మార్పు రావాలి, ఆ మార్పు చంద్ర‌బాబులో కాదు, తెలుగుదేశం నాయ‌క‌త్వంలో!

2024కు చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ సీఎం అభ్య‌ర్థి అన్నా, లోకేష్ ను ఆ స్థానం కోసం ప్రొజెక్ట్ చేసినా అంతే సంగ‌తులు!  ముందు లోకేష్ ఎమ్మెల్యేగా నెగ్గగ‌లిగితే త‌ర్వాతి సంగ‌తి త‌ర్వాత ఉండొచ్చు. ఈ ప‌రిణామాలేమీ క‌మ్మ‌లాబీకి తెలియ‌నివి కావు! అవ‌స‌రం లేద‌నుకున్న‌ప్పుడు సీనియ‌ర్ ఎన్టీఆర్ నే ప‌క్క‌న పెట్టిన వాళ్ల‌కు, ఇప్పుడు చంద్ర‌బాబును ప‌క్క‌న పెట్ట‌డం ఏ మాత్రం క‌ష్టం కాదు. వారి అండ, ఆశ ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ మీదే క‌నిపిస్తూ ఉంది.

అయితే ఇది ఆరంభం మాత్ర‌మే. ఎన్నిక‌ల‌యిపోయిన తొలి ఏడాది పెద్ద‌గా రాజ‌కీయ మార్పులుండ‌వు.. త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే స్థితిలో క‌నిపిస్తూ ఉంది. టీడీపీలో చంద్ర‌బాబు కౌంట్ డౌన్ మొద‌ల‌య్యింది, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీకి స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న‌ట్టుగా ఉంది!

ఎన్టీఆర్ - విధికి అదృష్టానికి మధ్య....

ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ అదృష్టవంతుడితో పెట్టుకోకూడదు..ఆ మధ్య వచ్చిన భీష్మ సినిమాలో డైలాగు ఇది. అవును. అదృష్టం ఎన్టీఆర్ వైపు వుంది. లేదా డెస్టినీ  అతనితో దోబూచులాడుతూ వస్తోంది. లేకుంటే అంత మంది సంతానానికి రానిది, ఆ సంతానంలో ఓ కొడుకు చేసుకున్న రెండో పెళ్లి సంతానానికి పుణికిపుచ్చుకున్నట్లు నందమూరి తారకరాముడి అందచందాలు రావడం అంటే అదృష్టం కాక మరేమిటి? ఏదో పేరు పెడితే, తాత పిలిచి మరీ పేరు మార్చి తన పేరే అందివ్వడమేమిటి? చదువు, పెంకితనం తో పాటు బలమైన స్నేహబృందాన్ని కూడా సంపాదించుకోవడం ఏమిటి? ఆ బృందమే సదా అండగా నిలవడం ఏమిటి?

సినిమాల ప్రారంభంలో  వరుసగా హిట్ సినిమాలు ఆపై వరుసగా పరాజయాలు... వయసుకు మించిన లావు.. మరోపక్క పోటీగా మరోవారసుడిని ఒకే రోజు తొమ్మిది సినిమాలతో ఓపెనింగ్ చేయించి, పోటీకి దింపిన వైనం. ..మళ్లీ అదృష్టం పలకరించింది. యమదొంగ సినిమాతో తన శరీరాన్ని తన చెప్పు చేతల్లో వుంచుకోవడం ప్రారంభించాడు. అందం మరింత పెంచుకున్నాడు.   రాజకీయ ప్రసంగాలు ప్రచారాలు సాగించాడు. అచ్చం తాతలాగే వున్నాడు. తాతలాగే మాట్లాడుతున్నాడు అనిపించుకున్నాడు. అంతలోనే ఘోర ప్రమాదం. కానీ అదృష్టం వెన్నెంటే వుంది. తృటిలో మరణాన్ని దూరంగా నెట్టేయగలిగాడు.

ఆపై మళ్లీ వరుస పరాజయాలు. రాజకీయంగా తమది అనుకున్న పార్టీ దూరం పెట్టింది. తమ వాళ్లు అనుకుని ప్రచారం చేసిన వాళ్లు దూరం పెట్టారు. అయిపోయింది అనుకున్న టైమ్ లో మళ్లీ అదృష్టం అక్కున చేర్చుకుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జైలవకుశ, అరవింద సమేత ఇలా వరుసగా మంచి మంచి సినిమాలు. బిగ్ బాస్ షో విజయం కలిసివచ్చింది. ఎన్టీఆర్ అంటే ఇదీ అనేంత చరిష్మా స్వంతమైంది. అదే సమయంలో తనను దూరం పెట్టిన వాళ్లను పరాజయం పలకరించింది. అయిదేళ్ల పాటు తమంతవారు లేమందురు అనుకున్నవాళ్ల ముందు ఇప్పుడు ఎన్టీఆర్ శిఖరసమానుడిలా కనిపిస్తున్నాడు. పుట్టిన రోజున పూనికుని ప్రతి ఒక్కరు జేజేలు పలికినంత పని చేసారు. దాదాపు పార్టీ కీలక నాయకులంతా అభినందనలు తెలిపారు. ఎవరైతే పక్కన పెడదామని ప్రయత్నించారో వాళ్లే స్వయంగా అభినందనలు తెలిపారు.

ఇదంతా అదృష్టం కాక మరేమిటి? లేక దీన్నే డెస్టినీ అంటారా? అంత మాత్రం చేత ఎన్టీఆర్ కృషి ఏమీ లేదా...అంతా అయాచితమేనా? అనాయాస విజయమేనా? అలా తీసిపారేయలేం.  తనను తాను మలుచుకున్నాడు. తన ఫిజిక్ ను మలుచుకున్నాడు. నటనను మెరుగుపర్చుకున్నాడు. తన వాచకం, తన నటనతో తెలుగులో ఈ తరహా సత్తా వున్న ఏకైక అగ్రహీరో అనిపించుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ జీవితంలో అదృష్టం పోషించిన పాత్రను కొట్టిపారేయడానికి కూడా లేదు.

ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాస్తా ఎన్టీఆర్ గా మారిపోయాడు. ఇది జరిగి అప్పుడే కొన్నేళ్లు అవుతోంది. జూనియర్, బుడ్డోడు..ఇలా రకరకాలుగా వినిపించిన పిలుపులు అన్నీ ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరకు చేరి అందులో కలిసిపోయాయి. తన నటనే సమాధానం. తన సినిమాలే జవాబు అన్నట్లుగా మరింకేమీ పట్టించుకోకుండా గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ముందుకు సాగుతున్నాడు. సినిమా సినిమాకు మెట్టు ఎక్కుతూ వచ్చాడు. టాలీవుడ్ టాప్ లీగ్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. అన్నింటికి మించి అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీతో అనుబంధాలు వున్న ప్రతి ఒక్కరివాడిని అనిపించుకున్నాడు. ఒకప్పుడు ఒంటరిని చేసిన  వాళ్లు కూడా దగ్గరకు తీసుకోవాల్సిందే తప్పదు అనుకునేలా చేసుకున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే ఈసారి కచ్చితంగా మరింత ఊపు తెచ్చింది. సినిమా ఇండస్ట్రీ అంతా దాదాపు నూటికి నూరు శాతం మంది టాప్ సెలబ్రిటీలు అంతా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరిద్దరు మిడ్ రేంజ్ జనాలు తప్ప అందరూ అభినందనలు తెలిపారు. అభిమానులు అయితే ట్విట్టర్ ను షేక్ చేసారు. టాలీవుడ్ హీరోలకు ఈవిధంగా వున్న గత రికార్డులు అన్నింటినీ తుడిచిపెట్టారు.

2014 నుంచి 2019 మధ్యలో ఎన్టీఆర్ ఎక్కడున్నాడో కూడా ఏ తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడికీ కనిపించలేదు. బాబు పాలనలో, చినబాబు అధికార ఏలుబడిలో ఎన్టీఆర్ పేరు స్మరించడానికి కూడా తెలుగుదేశం నాయకులు దాదాపుగా భయపడ్డారనే చెప్పాలి. ఒక దశలో ఎన్టీఆర్ ను కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. మహానాడుకు అత్తెసరు పిలుపులు అందించడం, ఇక్కడ అంతా సమానమే అంటూ లోకేష్ సన్నాయి నొక్కులు నొక్కడం లాంటివి జరిగాయి. అన్నింటికీ మించి, ఎన్టీఆర్ తో డిస్కస్ చేయకుండానే, అతని సోదరిని కూకట్ పల్లి బరిలోకి దింపేసారు. ఎన్టీఆర్ అన్నీ భరించాడు. అన్నీ సహించాడు.

కాలం మారింది తెలుగుదేశం ఓడ కాస్తా బండి అయిపోయింది. పార్టీ నానాటికీ కుదేలు అవుతోంది. కేంద్రంలో భాజపాతో సున్నం పెట్టుకున్నారు. ఎంత భజన చేస్తున్నా, ఆ పార్టీ దగ్గరకు రానిచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన వారి రాయబారాలు అంతగా పనిచేస్తున్న దాఖలాల కనిపించడం లేదు. మరోపక్క తెలంగాణలో పార్టీ లేకుండా పోయింది. 2024 నాటికి పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది అంతు పట్డడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ బర్త్ డే వచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన లోకేష్, పరిటాల శ్రీరామ్, బుచ్చయ్య చౌదరి ఇలాంటి వాళ్లంతా కూడా ట్వీట్లతో అభినందనలు తెలిపారు. లోకేష్ ఇలా అభినందించడం తొలిసారి. ఇది చూసి తెలుగుదేశం పార్టీ అభిమానులు అంతా, ఇది కదా కావాల్సింది అంటూ కామెంట్లు మొదలుపెట్టారు. ఒక దశలో చంద్రబాబు  నుంచి కూడా ట్వీటు వస్తుందని టాక్ వినిపించింది కానీ రాలేదు.

ఇదంతా ఏం చెబుతున్నట్లు?

మొత్తం మీద తెలుగుదేశం అభిమాన వర్గాలు అన్నీ ఆ పార్టీకి ఎన్టీఆర్ అండ చాలా అవసరం అని మరోసారి గుర్తించినట్లు కనిపిస్తోంది. భవిష్యత్ లో పార్టీని అధికారం దిశగా నడిపించాలంటే ఎన్టీఆర్ మద్దతు పార్టీకి వుండాలని వారంతా గుర్తించినట్లు కనిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ సమీప భవిష్యత్ లో కాదు. 2024 లో కూడా రాజకీయాల వైపు అడుగు పెట్టకపోవచ్చు.

చంద్రబాబు, లోకేష్ ఆధిపత్యంలో తెలుగుదేశం పార్టీ వున్నంతకాలం ఎన్టీఆర్ రాజకీయపరమైన స్టాండ్ తీసుకుంటారా? అన్నది అనుమానమే. 2024 నాటికి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్ సినిమాలతో పాటు మరో సినిమా కూడా ఫినిష్ చేస్తారు. ఈ సినిమాలు అన్నీ ఎన్టీఆర్ చరిష్మాను మరింత పెంచేవే. పైగా ఆ నాటికి ఎన్టీఆర్ అవసరం మరింత పెరుగుతుంది తెలుగుదేశం పార్టీకి.

మరోపక్క చంద్రబాబు అనంతరం లోకేష్ పార్టీని నడిపించగలరు అన్న నమ్మకం నానాటికీ ఆ పార్టీ నాయకుల్లో, అభిమానుల్లో సన్నగిల్లిపోతోంది. కరోనా టైమ్ లో నారా లోకేష్ పూర్తిగా ట్విట్టర్ కు పరిమితమైపోయారు. అధికారం పోయిన తరువాత ముదిమి వయసులో కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి కిందా మీదా పడుతున్నారు తప్ప, లోకేష్ చేస్తున్నది ఏమీ కనిపించడం లేదు. కనీసం ఎమ్మెల్యేగా అయినా లోకేష్ గెలిచి వుంటే పరిస్థితి వేరుగా వుండేదేమో? ఆయనే ఓడిపోయి, గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా శాసించగలరు?

తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న సామాజిక వర్గం ఇప్పుడు కిం కర్తవ్యం అన్నట్లు వుంది. పార్టీ మనుగడ కోసం ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నే పక్కన పెట్టి బాబును తలకెత్తుకున్న చరిత్ర వుంది ఆ వర్గానికి. అలాంటిది అవసరం అయితే మళ్లీ బాబును పక్కన పెట్టి ఈ ఎన్టీఆర్ ను తలకెత్తుకోదు అని సందేహపడాల్సిన పని లేదు.

ఎందుకుంటే తమ వర్గానికి, తమ వర్గ ప్రయోజనాలు కాపాడడానికి ఉపయోగపడే పార్టీ కీలకం కానీ నాయకత్వం కాదు. అది ఎన్టీఆర్ ను దింపేసినపుడే వెల్లడయిపోయింది. ఒక్కసారి కనుక ఆ పార్టీకి కీలక మద్దతు ఇచ్చే మీడియా టైకూన్లు కనుక డెసిషన్ తీసుకుంటే రాత్రికి రాత్రి అంతా మారిపోతుంది. అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగిపోయేది కాదు, పార్టీని విజయ పథంలో నడిపించడం బాబు వల్ల కాదు అన్న అభిప్రాయం పార్టీ నాయకులకు ముఖ్యంగా పార్టీకి వెన్నుదన్నుగా వుండే సామాజిక వర్గానికి కలగాల్సి వుంది. మళ్లీ నందమూరి కుటుంబం చేతికి పగ్గాలు ఇస్తే, ఆ లెక్క వేరుగా వుంటుందన్న ఆలోచన రావాలి.

ఇప్పటికీ చంద్రబాబు మౌనంగానే వున్నారు. ఆయన కు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు ఎంత కీలకమో, కొడుకు లోకేష్ నాయుడు కు అధికారవారసత్వ పగ్గాలు అప్పగించడం కూడా అంతే కీలకం. ఎన్టీఆర్ ఎప్పటికైనా లోకేష్ కు పోటీనే. తాత పార్టీగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పటికైనా ఆహ్వానం ఎన్టీఆర్ కు అందుతుంది. లేదా ఆపద్భాంధవుడి మాదిరిగా పార్టీని ఆదుకోమని ఆహ్వానం అందే అవకాశమూ వుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా ఎన్టీఆర్ ముందు లోకేష్ నాయుడు కనిపించడం కష్టం.

ఇదే సమయంలో తండ్రి హరికృష్ణకు తెలుగుదేశం పార్టీ నుంచి జరిగిన అన్యాయం ఎన్టీఆర్ మరిచిపోయి వుంటారని అనుకోవడానికి లేదు. అంతే కాదు, పిల్లను కోడలిని చేసుకుని, బావమరిది చేతులు కట్టి కూర్చోపెట్టిన సంగతి కూడా నందమూరి కుటుంబానికి తెలియంది కాదు. అందరూ అవకాశం కోసమే చూస్తున్నారు అనుకోవాలి. అది రావాలి అంటే 2024 రావాల్సిందే. అప్పటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుంటే ఫరవాలేదు. లేదూ అంటే ఆ పార్టీ ని నమ్ముకున్న సామాజిక వర్గం తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశమూ వుంది. అలాంటి నిర్ణయం అంటూ తీసుకుంటే రాజకీయ యవనిక మీదకు ఎన్టీఆర్ రావాల్సి వుంటుంది.

అయితే 2024 అన్నది సినిమా హీరోగా ఎన్టీఆర్ కు చాలా తక్కువ సమయం. ఈ లోగా ఆయన చేయగలిగేవి మహా అయితే మూడు లేదా నాలుగు సినిమాలు. కానీ ఎన్టీఆర్ అనే హీరో చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా దూరం వుంది. ఆ ప్రయాణం అలా అలుపులేకుండా సాగాలి అంటే రాజకీయపు పక్క చూపులు పనికి రావు. ఈ విషయం ఎన్టీఆర్ కు తెలియంది కాదు. కానీ ఎన్టీఆర్ నిర్ణయాలు ఎన్టీఆర్ చేతుల్లో వుండకపోవచ్చు. . ఆయనను ఆయన ఇప్పటి వరకు డెస్టినీ లేదా అదృష్టమే నడిపిస్తోంది. అది ఎటు అన్నది కాలమే చెప్పాలి.

చాణక్య
writerchanakya@gmail.com

 


×