Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పవన్‌కళ్యాణ్‌ - ముచ్చటగా మూడోస్సారి

పవన్‌కళ్యాణ్‌ - ముచ్చటగా మూడోస్సారి

ఏదో అనుకోకుండా తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది జనసేన పార్టీ అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి. ముందుగా ఆయన సినీ నటుడిగా, తన అభిమానుల్ని ఉద్దేశించి ఓ మెసేజ్‌ ఇవ్వడానికి ఆ బహిరంగ సభని అప్పటికప్పుడు ప్లాన్‌ చేసుకున్నా, దాన్ని చిత్రంగా పొలిటికల్‌ మీటింగ్‌లా మార్చేశారు. ఆ వేదికపైనుంచే, అతి త్వరలో మరో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించేశారు పవన్‌కళ్యాణ్‌. 

అదే, కాకినాడ బహిరంగ సభ. సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ.. అంటూ ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, కాస్త హంగామా నడుమ ఆ బహిరంగ సభను నిర్వహించిన విషయం విదితమే. 'పాచిపోయిన లడ్డూలు' అంటూ పవన్‌కళ్యాణ్‌ ఆ వేదికపై నుంచి వేసిన సెటైర్లతో ఇటు టీడీపీ, అటు బీజేపీ కిందా మీదా పడ్డాయి. గట్టిగా షాక్‌ తగిలింది మాత్రం బీజేపీకే. 'మాటలే పాచిపోతాయి, నిధులు పాచిపోవు..' అంటూ బీజేపీ ఒకటికి వందసార్లు పవన్‌కళ్యాణ్‌కి కౌంటర్‌ ఇచ్చిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇదిగో, మళ్ళీ ఇప్పుడు ముచ్చటగా మూడో బహిరంగ సభకు రంగం సిద్ధమయ్యింది. వచ్చే నెలలో, అనంతపురం జిల్లాలో పవన్‌కళ్యాణ్‌ బహిరంగ సభ నిర్వహిస్తారు. ప్రత్యేక హోదా కోసమేనట ఈ బహిరంగ సభ కూడా. అదేంటీ, కాకినాడ బహిరంగ సభ కారణంగా ఓ అభిమాని చనిపోవడంతో, 'ఇలాంటి బహిరంగ సభలు ఇకపై పెట్టను..' అని ఇదే పవన్‌కళ్యాణ్‌ తేల్చి చెప్పేశారు కదా.! అనంటారా.? అదంతే, పవన్‌కళ్యాణ్‌ మాట మీద నిలబడడుగాక నిలబడడు. 

సరే, రాజకీయ పార్టీ అన్నాక రకరకాల రాజకీయ వ్యూహాలుంటాయి. కానీ, అసలు జనసేన అనేది రాజకీయ పార్టీయేనా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఓ పక్క 'కాటమరాయుడు' సినిమా పనుల్లో బిజీగా వుంటూ, ఇంకోపక్క ఈ బహిరంగ సభలేంటయ్యా జనసేనానీ.? అంటూ పవన్‌ అభిమానులే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. అసలు పార్టీ సిద్ధాంతమేంటి.? పార్టీ కార్యవర్గమేది.? అన్న ప్రశ్నలకే సమాధానం దొరక్క పవన్‌ అభిమానులు జుట్టుపీక్కుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇదిగో, ఇలాంటి పబ్లిసిటీ ఆర్భాటాలు ఏమిటో, ఆయనకే తెలియాలి. 

ఒక్కటి మాత్రం నిజం. తిరుపతిలో చిన్న మైదానంలోనే జనం పోటెత్తారు. కాకినాడలో అయితే జనసంద్రమే కన్పించింది. అఫ్‌కోర్స్‌, అక్కడికి జనాన్ని తామే తరలించామని బీజేపీ నేతలు చెప్పుకున్నార్లెండి.. అది వేరే విషయం. మరిప్పుడు, కరువు జిల్లా అనంతపురంలో పవన్‌ బహిరంగ సభ ఎలా జరుగుతుంది.? వెనకబడ్డ రాయలసీమలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పవన్‌ తనదైన శైలిలో ముందుకు నడిపించగలరా.? లేదంటే, జగన్‌ ఇంపాక్ట్‌ని తగ్గించడానికి పవన్‌తో చంద్రబాబే, ఇదిగో ఇలా సభ ప్లాన్‌ చేయించారా.? ఏమో, ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?