టిక్ టాక్ వల్ల ఏర్పడిన దుష్పరిణామాల్ని ఇప్పటికే చాలా చూశాం. ఇండియాలో చాలా చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. టిక్ టాక్ తో లేచిపోయిన జంటలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అంతెందుకు టిక్ టాక్ వీడియోలతో జరిగిన బ్లాక్ మెయిల్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడీ టిక్ టాక్ మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. కేవలం 24 గంటల వ్యవథిలో ఇద్దరి ప్రాణాలు తీసింది.
విజయవాడలోని జక్కంపూడిలో ఈ ఘటన జరిగింది. తరచూ టిక్ టాక్ చేయొద్దని భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. తల్లి మరణాన్ని కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. తల్లి మరణించిన కొన్ని గంటలకే పురుగుల మందు తాగి తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇలా ఒక రోజు వ్యవథిలో తల్లికొడుకులు ఇద్దరు మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అలా టిక్ టాక్ కు రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. మరోవైపు దేశంలో టిక్ టాక్ ను నిషేధించాలంటూ జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేస్తోంది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని మహిళ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ప్రకటించారు. టిక్ టాక్ వల్ల గృహ హింస పెరిగిపోతోందని, మహిళలపై అత్యాచారాలు-దాడులు ఎక్కువైపోతున్నాయని ఆమె ఆరోపించారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా టిక్ టాక్ నిషేధంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. చైనాకు చెందిన యాప్స్ ను అన్-ఇనస్టాల్ చేయండంటూ సోషల్ మీడియాలో రకరకాల మెసేజీలు దర్శనమిస్తున్నాయి.