డేరా సచ్చా సౌదా అధిపతి, బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి అత్యాచారం కేసులో ఏకంగా ఇరవయ్యేళ్ళ శిక్ష పడింది. రెండు కేసుల్లో చెరో పదేళ్ళు.. మొత్తంగా ఇరవయ్యేళ్ళ జైలు శిక్ష అననగానే, గుర్మీత్‌సింగ్ కోర్టు హాల్లోనే కుప్పకూలిపోయాడు. తన జీవితం ఇక జైలుకే అంకితమని ఆయన అంతలా 'ఆవేదన' చెందాడన్నమాట. తొలుత, శిక్ష పదేళ్ళని ప్రచారం జరిగినా, ఆ పదేళ్ళు ఓ కేసులోనేననీ, ఇంకో కేసులో మరో పదేళ్ళు జైలు శిక్ష అనీ అసలు విషయం కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇద్దరిపై గుర్మీత్ సింగ్ లైంగిక దాడులకు పాల్పడినట్లు నేరం నిరూపణ అయ్యింది సరే, గుర్మీత్ ఈ కేసులో దోషిగా తేలడంతో హర్యానా, పంజాబ్‌లలో జరిగిన మారణహోమం మాటేమిటి.? అదంతే.! 31 మంది ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయారంటే అదేమంత చిన్న విషయం కానే కాదు. ఆ మారణహోమానికీ గుర్మీత్సింగ్నే బాద్యుడిగా చేయాల్సి వుంటుందేమో.!
గుర్మీత్ సింగ్ వ్యవహారాన్ని పక్కన పెడదాం. మన తెలుగునాట, అదీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతంలో ఒకప్పుడు (అప్పట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రం వుండేది లెండి..) అయేషా మీరా అనే విద్యార్థినిపై పాశవికంగా లైంగిక దాడి జరిగింది. ఆమెను అంతే పాశవికంగా హత్య చేశారు కూడా. అదెవరు.? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఈ కేసులో సత్యంబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, దోషిగా తేల్చి.. కొన్నాళ్ళు జైల్లో కూడా వుంచడం చూశాం. చివరికి, సత్యంబాబు దోషి కాదని న్యాయస్థానం తేల్చడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.
చెప్పుకుంటూ పోతే, దేశంలో ఇలాంటి కేసులు చాలానే కన్పిస్తాయి. గుర్మీత్ సింగ్ కేసునే తీసుకుంటే పదిహేనేళ్ళపాటు విచారణ జరిగింది. ఇలా సుదీర్ఘంగా కేసుల విచారణ జరగడంతో ఒక్కోసారి అమాయకులకు శిక్ష పడ్తోంది. చాలా సందర్భాల్లో అసలు నేరస్థులు తప్పించుకుంటూనే వున్నారు. గుర్మీత్ నేరం చేశాడు, శిక్ష అనుభవిస్తాడేమో.!
ఇక్కడ ఏమో.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, పై కోర్టును ఆశ్రయించేందుకు గుర్మీత్ తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ మీద నమోదైన హత్య, కృష్ణ జింకల వేట కేసులు ఏమయ్యాయి.? ఓ న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చితే, ఇంకో న్యాయస్థానం నిర్దోషిగా డిక్లేర్ చేసింది. ఏది న్యాయం.? ఏది అన్యాయం.? అదంతే.. అడక్కూడదంతే.