ఇటీవలే తన యావదాస్తీని దాతృత్వానికి కేటాయించి వార్తల్లోకి వచ్చాడు యాపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్. దాదాపు 4,500 కోట్ల రూపాయల ఆస్తులను విరాళాలకు కేటాయించి కళియుగదానకర్ణుడనిపించాడు. మరి అలా అందరి మన్ననలూ అందుకొంటున్న టిమ్ కుక్ ఇప్పుడు చాలా అసంతృప్తిగా ఉన్నాడు.
మరి ఎలాంటి రాగధ్వేషాలూ లేకుండా వేల కోట్ల రూపాయలను దానంగా ఇచ్చిన వ్యక్తికి అసంతృప్తి ఏమిటి? అంటే.. ఇది ఆయన పూర్తిగా వ్యక్తిగత అంశం. తనలాంటి వారి సెక్స్ వల్ ఫీలింగ్స్ ను అణిచేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనను తాను గే గా ప్రకటించుకొన్న వ్యక్తి టిమ్ కుక్. తాజాగా అమెరికాలోని ఇండియాన రాష్ట్రం కొత్త చట్టం చేసింది.
ఆ చట్టం ప్రకారం సమాజంలో గే, లెస్బియన్లుగా ముద్ర పడిన వారికి వ్యాపార సేవలను అందించకూడదు.. అనుకొంటున్న వారిపై ఎలాంటి ఒత్తిడీ చేయకూడదు. వ్యక్తిగతంగా కానీ, మత పరమైన విశ్వాసాల ప్రకారం కానీ.. గే, లెస్బియన్లకు సేవలు చేయడానికి, వారితో వ్యాపార లావాదేవీలను నిర్వహించడానికి వెనుకాడే వారికి పూర్తి స్వేచ్ఛస్వాతంత్రాల ఉంటాయి. ఈ మేరకు ఆ రాష్ట్రం ఒక చట్టాన్ని తెచ్చింది.
దీన్ని కుక్ వ్యతిరేకిస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరమని అంటున్నాడు. ఎల్జీబీటీల పై అధికారికంగా వివక్షను చూపించడానికి ఈ చట్టం అవకాశం ఇస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. బహుశా కుక్ తన పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొనే ఈ ప్రకటన చేశాడనుకోవాలి. మరి కుక్ లాంటి దానకర్ణుడికి ఇలాంటి పరిస్థితి రావడం విశేషమే. కానీ అమెరికాలో గే లుగా, లెస్బియన్లుగా బతికే వాళ్లకు ఎంత స్వతంత్రం ఉంటుందో.. వాళ్లతో మాట్లాడటంకూడా ఇష్టం లేని వారికి కూడా అంతే స్వతంత్రం ఉంటుంది కదా!