సినిమా రంగంలో ఎంతోమంది ప్రతిభావంతులున్నా కొందరికే పల్లకీలో ఊరేగే అవకాశం కలుగుతుంది. దానికి తగిన కారణాలు తెలియవుగానీ ప్రస్తుతానికి అదృష్టం అని సరిపెట్టుకుంటున్నారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సత్తా చూపించిన స్టయిలిష్ నటుడు శరత్‌బాబు ఇప్పుడు దాదాపు తెలుగు సినిమాల్లో కనిపించడమే లేదు.
దీనికి కారణం ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడని కాదు. ఆయన్ని మనవాళ్ళు పిలవకపోవడమే ప్రధాన కారణం. ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా కనిపించే అచ్చతెలుగు నటుడు శరత్‌బాబు. తొలినాళ్ళలో పంతులమ్మ, మరోచరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, సీతాకోక చిలుక లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.
ముఖ్యంగా కె.బాలచందర్, భారతీరాజా లాంటి గొప్ప డైరెక్టర్స్ రూపొందించిన సినిమాలు చేశాడు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పుట్టిన శరత్‌బాబు విద్యాధికుడు. తమిళంలో మొదటిసారి హీరోగా నటించిన శరత్‌బాబు ఇప్పటికి రెండొందల సినిమాల్లో వివిధ పాత్రల్లో కనిపించాడు. వాటిల్లో తమిళ, కన్నడ సినిమాలే అధికం.
తెలుగులో నటించిన ప్రతి సినిమాలోనూ ఎంతో గొప్ప నటన కనబరిచిన ఆయన్ని ఇప్పుడు మనవాళ్ళెవ్వరూ పిలిచి ప్రోత్సహించకపోవడం వల్ల వచ్చిన గ్యాప్ తప్పితే ఆయన నటించలేక కాదట. మంచి అవకాశాలు వస్తే నటించడానికి ఎవరికి మాత్రం అభ్యంతరం వుంటుంది.? అని ప్రశ్నిస్తున్న శరత్‌బాబు ప్రస్తుతం చెన్నయ్‌లోనే స్థిరపడ్డాడు. డిగ్నిఫైడ్ నటనకు పెట్టింది పేరు శరత్‌బాబు.