అమరావతి మన పాలిట బాణామతి!

అమరావతి ఆంధ్ర ప్రజలపాలిట బాణామతి కాబోతుంది. సస్యశ్యామలమైన కృష్ణా నది దాన్యాగారమైన తుళ్ళూరు ప్రాంతం రాజదానికోసం ఎంచుకోవడం, దానికి 30 వేల ఎకరాలు పూలింగు పద్ధతిన సేకరించి, సింగపూరు ని తలపించే ప్రహసనం మన…

అమరావతి ఆంధ్ర ప్రజలపాలిట బాణామతి కాబోతుంది. సస్యశ్యామలమైన కృష్ణా నది దాన్యాగారమైన తుళ్ళూరు ప్రాంతం రాజదానికోసం ఎంచుకోవడం, దానికి 30 వేల ఎకరాలు పూలింగు పద్ధతిన సేకరించి, సింగపూరు ని తలపించే ప్రహసనం మన పాలిట గుదిబండ అవుతుంది. భూసేకరణ చట్టం లో వున్నరక్షణ, సామాజిక ప్రభావం, అది చేయ కుండా నేను మొనార్కు నంటూ మూర్ఖంగా శివ రామకృష్ణన్ కమిటీ, కోటయ్య కమిటీ దొనకొండ ప్రాంతం అనువు అని, భూమి దొరకడం సులభం, అక్కడ కట్టుకుంటే సామాజిక, ఆర్ధిక దుష్ప్రభావం తక్కువ అని చెప్పినా వినకపోవడం దురుద్దేశమా లేక అహంకారమా? 

ఒక సారి రాజధాని ఏర్పడితే, కనీసం లక్ష ఎకరాలు సాగుబడి నుంచి తగ్గిపోయి, రియల్ ఎస్టేటు లోనికి మార్చబడుతుంది. ఒక ఎకరానికి సంవత్సరానికి అన్ని కలిపితే హీన పక్షం 40 బస్తాలు అనుకొంటే 40 లక్షల బస్తాల ఉత్పాదన తగ్గిపోతుంది. అసలు ప్రాజెక్టు ప్లానింగ్ కి 1200 కోట్లు ఇస్తే, మొత్తం కట్టడానికి మనము ఏమి ఇస్తున్నామో, సింగపూరు వాడికి? అది దేవా రహస్యమా? సమాచార హక్కు కింద అది రాదా? వేల ఎకరాలు అప్పనంగా అప్పగిస్తుంటే, పంచుకొంటుంటే ఇలా చూస్తూ వుండదమేనా? కృత్రిమ సరస్సులు, సెలయేళ్ళు, ఆకాశ హర్మ్యాలు అబ్బా ఒకటేమిటి, భూతల స్వర్గం, దివ్యంద్ర ప్రదేశ్ అని కలలు కనమని కళలు ప్రదర్శిస్తూ వుంటే గాంధీ కలలు కనమన్నాడు కాని, పగటి కలలు కాదు. 

భోగాపురం లో ఎయిర్ పోర్టు 15 వేల ఎకరాలు సేకరించాలంట! దేనికి? విమానాలు ఎగరడానికి వైజాగ్ లో ముందు వున్న ఎయిర్ పోర్టు బాగుపరిస్తే, కనెక్టివిటీ పెంచితే సంతోషం కాని ఎవరిని మభ్య పెట్టడానికి ఇంకో విమానాశ్రయం? దానికి 15 వేల ఎకరాలు కావాలనా? ఏమిటి ఈ ఆర్భాటం?ఈ  ప్రచార కండూతి? సెజ్ లని ఆ రోజు పారిశ్రామిక అవసరాలకోసం సేద్యం అనుకూలంగా లేని భూములు సేకరిస్తే లేళ్ళు సెలయేళ్ళు ఉక్కు పాదాలకింద నలిగిపోతున్నాయి, రింగు రోడ్డులు వంకరలు పోతున్నాయని వంక పెట్టిన మన పత్రికలు ఈ రోజు జరుగుతున్న భూపందేరం గురించి గొంతు విప్పవేమి? మెరుగైన సమాజకోసం పనిచేసే మీడియా ఎక్కడ ? ప్రశ్నిస్తా అని గొంతు చించుకున్న నాయకుల పత్తా ఎక్కడ? ప్రతి విషయాన్ని రచ్చ చేసిన కుహనా మేధావులేరి? పేద రైతు పక్షాన గొంతు పెగలదేమి? 

మేము ఏది చెపితే, ఎలా మేనేజ్ చేస్తే అది న్యూస్ అని బ్రమిస్తే పొరపాటు, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు, వాళ్ళు తిరగబడితే నిలబడిన వాళ్ళు చరిత్రలో లేరు. నేను చెప్పేదే వేదం, మేము చేసేదే అభివృద్ధి అని మూర్ఖంగా ముదుకు వెళితే ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదు. 

–రంగ ​