'ఆమె జీవితం ఆమె ఇష్టం. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో మనమెలా డిసైడ్ చేస్తాం.? దుస్తుల పేరు చెప్పి జరిగిన అకృత్యాల్ని సమర్థించుకోవడమంటే పిరికిపందలకిందే జమకట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు మన కుటుంబ సభ్యులకే జరిగితే ఇలా చూస్తూ ఊరుకుంటామా.? స్పందించమా.? ఆమె దెస్తుల విషయంలో కలగజేసుకునే హక్కు ఎవరికీ లేదు. అధికారంలో వున్నవారు ఇలాంటి హేయమైన చర్యల్ని సమర్థిస్తూ, ఆమె దుస్తుల గురించి మాట్లాడుతున్నారంటే అంతకన్నా హేయమైన విషయం ఇంకేముంటుంది..' ఇలా సాగింది క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో అతని ఆవేదన.
బెంగళూరులో ఇటీవల జరిగిన 'సామూహిక లైంగిక వేధింపుల పర్వం'పై విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరోపక్క, విరాట్ కోహ్లీతోపాటుగా ఆయన గాళ్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా, ఈ ఘటనపై ఘాటుగా స్పందించింది. దాదాపు విరాట్ కోహ్లీ తరహాలోనే ఆమె కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసింది బెంగళూరు ఘటనపైన.
'గుంపులో వున్న మహిళల్ని కొందరు వేధించడం, దాన్ని చూసి ఇంకొందరు ఊరుకోవడం, మానవత్వం లేని మనుషులు, ఇలాంటి సందర్భాల్లో మహిళల దుస్తుల గురించి మాట్లాడటం దారుణం.. ఆ రోజు అక్కడున్నవారితో సహా, మనమందరం ఆడవారి గౌరవ మర్యాదలు కాపాడటంలో విఫలమయ్యాం..' అంటూ ట్విట్టర్లో అనుష్క కామెంట్స్ చేసింది.
బెంగళూరు ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఈ ఘటనలో సాక్ష్యాధారాలు ఏమీ లేవని పోలీసులు చెప్పడం, మహిళలు అర్థరాత్రి వేళ అరకొర దుస్తులేసుకుని బయటకు వస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని రాజకీయ నాయకులు వ్యాఖ్యానించడం.. వివాదానికి ఆజ్యం పోసినట్లయ్యాయి.