అమెరికా అందించే స్నేహహస్తమేపాటిది.?

అగ్ర రాజ్యం అమెరికాతో ఏ దేశమూ శతృత్వం కోరుకోదు. అలాగే అగ్ర రాజ్యం అమెరికా కూడా అన్ని దేశాలతోనూ స్నేహం కోరుకోదు. అలాగని అందరితోనూ గొడవలు పెట్టుకోవాలని కూడా ఆలోచించదు అగ్రరాజ్యం. భారత్ లాంటి…

అగ్ర రాజ్యం అమెరికాతో ఏ దేశమూ శతృత్వం కోరుకోదు. అలాగే అగ్ర రాజ్యం అమెరికా కూడా అన్ని దేశాలతోనూ స్నేహం కోరుకోదు. అలాగని అందరితోనూ గొడవలు పెట్టుకోవాలని కూడా ఆలోచించదు అగ్రరాజ్యం. భారత్ లాంటి కొన్ని దేశాల విషయంలో అమెరికా వైఖరి విచిత్రంగా కనిపిస్తుంటుంది. అమెరికా, భారత్ మధ్య స్నేహ సంబంధాలున్నాయా.? శతృత్వం వుందా.? అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. కారణమేంటో అందరికీ తెల్సిందే. ప్రపంచంలో అతి శక్తివంతమైన రెండు దేశాల్లో ఒకటి భారత్‌తో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటుంది. అదే రష్యా. కానీ రష్యాతో అమెరికాకి వున్నది శతృత్వం మాత్రమే. ఇప్పుడంటే రష్యా బలహీన పడిందిగానీ, ఒకప్పటి సోవియట్ యూనియన్ (రష్యా), అమెరికాతో సమానంగా, ఆ మాటకొస్తే అంతకన్నా ఎక్కువ శక్తివంతమైన దేశం.

భారతదేశానికి అన్ని దేశాలతోనూ స్నేహం కావాలి. దాయాది పాకిస్తాన్‌తో సైతం స్నేహాన్నే కాంక్షిస్తుంది. అదీ భారతదేశం గొప్పతనం. కానీ, దురదృష్టవశాత్తూ పాకిస్తాన్, భారత్‌తో స్నేహ హస్తం అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ వేదికలపై చెబుతూ, తెరవెనుక భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతుంటుంది. పాకిస్తాన్ వైఖరిని అమెరికాకి అర్థం కాదేమో అనికోవడానికి వీల్లేని పరిస్థితి. పాకిస్తాన్‌కి అమెరికా అండదండలున్నాయి. ఆ అండదండలు చూసుకునే, పాకిస్తాన్ వీలు చిక్కినపడల్లా భారత్‌పైకి ఏదో ఒక రూపంలో దూసుకొస్తుంటుంది.. అది తీవ్రవాదాన్ని పెంచి పోషించడం ద్వారా కావొచ్చు, లేదంటే సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని పెంచి పోషించడం ద్వారా కావొచ్చు. పాకిస్తాన్‌కి ఆయుధ సంపత్తి విషయంలో అమెరికా సహకారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్నట్టు, అమెరికాతో బద్దవైరం వున్న దేశాల్లో చైనా ప్రముఖమైనది. విచిత్రంగా పాకిస్తాన్‌కి ఇటు అమెరికా నుంచీ, అటు చైనా నుంచీ ఆయుధ సంపత్తి విషయంలోనూ, ఇతర విషయాల్లోనూ సంపూర్ణ సహకారాలుంటాయి.

అదే భారత్, రష్యాతో సన్నిహిత సంబంధాలు నడిపితే మాత్రం, అమెరికాకి గిట్టదు. ఆ కారణంగానే, బారత్ అమెరికా నుంచి అనేక విషయాల్లో ఆంక్షల్ని ఎదుర్కొంటూ వచ్చింది. పాకిస్తాన్ క్షిపణి, అణ్వాయుధ పరీక్షలు చేస్తే తూతూ మంత్రంగా స్పందించిన అమెరికా, అదే పని భారత్ చేసినప్పుడు మాత్రం తీవ్రంగా స్పందించింది. చాలా ఏళ్ళపాటు భారత్‌పై సాంకేతిక అంశాలకు సంబంధించి అనేక ఆంక్షలతో చికాకు ప్రదర్శించింది అగ్ర రాజ్యం అమెరికా. ఇదొక్కటి చాలు, అమెరికా భారత్ విషయంలో ఎలాంటి ద్వంద వైఖరిని అవలంభిస్తుందో చెప్పడానికి.

ఇప్పుడిదంతా ఎందుకంటే, అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, భారత దేశంలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భారత్, అమెరికా మధ్య అనేక అంశాపై చర్చలు జరగనున్నాయి, కొన్ని ఒప్పందాలూ జరగనున్నాయి. ఆ చర్చలు ఎలాంటి ఫలితాలిస్తాయి.? అమెరికాతో చేసుకోబోయే ఒప్పందాల వల్ల భారత్‌కి ఒరిగేదేమిటి.? అన్న చర్చ సహజంగానే సామాన్యుల్లో జరుగుతుంటుంది. భారత్, అమెరికా నుంచి ఆశించేవాటిల్లో ముఖ్యమైనది, భారత్‌ని వాస్తవిక కోణంలో అమెరికా చూడాలని. పాకిస్తాన్‌తోనో ఇంకో దేశంతోనే అమెరికా ఎలా వ్యవహరిస్తోందన్నది మనకు ముఖ్యం కాదు. మన దేశం విషయంలో అమెరికా స్నేహదృష్టితో వ్యవహరించాలి. ఒకవేళ అలా చేయలేకపోయినా, భారత్‌కి దాయాది దేశమైన పాకిస్తాన్‌తో, తీవ్రవాదం విషయంలో కఠిన వైఖరితో వుండాలనీ భారతదేశ ప్రజానీకం కోరుకుంటున్నారు.

తీవ్రవాదం ప్రపంచాన్ని వణికిస్తోన్న అతి భయంకరమైన వైరస్. దాన్నుంచి తప్పించుకోవడం అగ్రరాజ్యం వల్ల కూడా కావడంలేదు. అల్‌ఖైదా దెబ్బకు అమెరికా విలవిల్లాడిన రోజుల్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు.? అమెరికా చరిత్రలో అదో భయంకరమైన తీవ్రవాద దాడి. దాన్ని అమెరికా మర్చిపోతుందని అనుకోలేంగానీ, ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాదంపై అమెరికా అన్ని సందర్భాల్లోనూ ఒకేలా వ్యవహరించడంలేదన్నది నిర్వివాదాంశం. అల్‌ఖైదా వేటలో భాగంగా అమెరికా భద్రతాదళాలు పాకిస్తాన్‌లోనూ దాడులు చేసిన సందర్భాలున్నాయి. అదే, భారత్‌పైకి పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న తీవ్రవాదుల విషయంలో మాత్రం అమెరికా తగు రీతిలో స్పందించడంలేదు. అమెరికా అండ చూసుకుని పాకిస్తాన్ రెచ్చిపోతుందనే విషయం ప్రపంచానికి తెలిసినా, అమెరికా ఈ విషయాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేకపోవడం శోచనీయమే.

పాకిస్తాన్ మీదో, ఇంకో దేశం మీదో అమెరికా యుద్ధం చేయాలని కోరుకునే ‘చిన్న మనసు’ భారతదేశంలో ఎవరికీ లేదు. భారతదేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిన తీవ్రవాదం విషయంలో, భారత్‌కి అమెరికా ఎంతో కొంత సహాయపడాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా. ఆ విషయాన్నే, అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దృష్టికి భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకురానున్నారు. అమెరికా ఒత్తిడితో ఇటీవలే పాకిస్తాన్‌లో రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. ఈ ఒత్తిడి ముందు ముందూ కొనసాగి, తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపితే అది భారత్‌తోపాటు, పాకిస్తాన్‌కీ మంచిది. ఆ దిశగా అమెరికా, పాకిస్తాన్‌పై మరింత ఒత్తిడి తీసుకురావాలన్నదే సగటు భారతీయుడి కోరిక. మరి, అమెరికా ఆ దిశగా భారత్ పర్యటనలో, మోడీ ప్రభుత్వానికి, యావత్ భారతావనికీ భరోసా ఇస్తుందా.? వేచి చూడాల్సిందే.

వెంకట్ ఆరికట్ల