బ్రేకింగ్ న్యూస్.. న్యూస్ ఛానల్స్ కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాక ప్రముఖంగా విన్పిస్తోన్న మాట ఇది. అన్నీ సంచలన వార్తలే. సంచలనం కోసం విలువలకి పాతరేసేస్తున్నాయి దాదాపు అన్ని ఛానళ్ళూ. ఇందులో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనడానికి వీల్లేదు. ఓ వ్యక్తి బతికుండగానే ‘బ్రేకింగ్ న్యూస్’తో చంపేస్తున్నాయి. ఫలానా సెలబ్రిటీ కూతురు జంప్.. అంటూ ఆయా కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న సందర్భాలకూ కొదవేం లేదు.
కమెడియన్ ఎమ్మెస్ నారాయణ నిన్న చనిపోతే, కాస్త తొందరపాటుతో ముందే చంపేశారు మీడియాలో కొందరు. ఆ క్షణంలో ఎమ్మెస్ కుటుంబం పడ్డ క్షోభ అంతా ఇంతా కాదు. మరో కమెడియన్ ఏవీఎస్ విషయంలోనూ ఇలానే జరిగింది. అంతకు ముందు ఇంకో కమెడియన్ మల్లికార్జునరావు విషయంలనూ మీడియా ఓవరాక్షన్ ఇంతే.
ఇక, అవార్డుల విషయంలోనూ న్యూస్ ఛానళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించాయి. అవీ అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాల్లో కావడం గమనార్హం. కేంద్రం పద్మ పురస్కారాల్ని ప్రకటించిందంటూ నిన్న న్యూస్ ఛానళ్ళలో హడావిడి మొదలైంది. బ్రేకింగ్ న్యూస్‌లతో ఊదరగొట్టేశారు. సాయంత్రానికి తేలింది అదంతా హంబక్కేనని. మీడియా అత్యుత్సాహం ఏ రేంజ్‌లో వుందో చెప్పడానికి ఇదో నిదర్శనం మాత్రమే.
అవార్డుల విషయంలో ఎలా వున్నా, చావు పుట్టుకల విషయంలో కాస్త సంమయనం పాటించడం ఎలక్ట్రానిక్ మీడియా ఓ బాధ్యతగా పెట్టుకుంటే మంచిది. మనోభావాల సమస్య కాదిక్కడ.. భావోద్వేగాలు.. తప్పుడు వార్తలతో ఎంతమంది మానసిక క్షోభ అనుభవిస్తారో ఒక్కసారి ఆయా సంస్థల యాజమాన్యాలు ఆలోచించుకోవాలి.