అన్నాడీఎంకే గొంతెమ్మ కోరికలు…!

'నా రూటే సపరేటు'…అనే సినిమా డైలాగ్‌ మాదిరిగా తమిళనాడులో ద్రవిడ పార్టీల రూటే వేరు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే ద్రవిడ పార్టీల్లో ప్రధానమైన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల విధానాలు, రాజకీయాలు ప్రత్యేకంగా కనబడతాయి.…

'నా రూటే సపరేటు'…అనే సినిమా డైలాగ్‌ మాదిరిగా తమిళనాడులో ద్రవిడ పార్టీల రూటే వేరు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే ద్రవిడ పార్టీల్లో ప్రధానమైన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల విధానాలు, రాజకీయాలు ప్రత్యేకంగా కనబడతాయి.

కరడుగట్టిన వ్యక్తి పూజకు, స్వామి భక్తికి నిలయాలైన ఈ పార్టీల వ్యవహారశైలి చిత్రవిచిత్రంగా ఉంటుంది. జయలలిత జీవించి ఉన్నన్న రోజులు ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా కొనసాగారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో ఇలాగే ఉంటుంది. జయలలిత కన్నుమూశాక పన్నీరుశెల్వం ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో ఈ సంప్రదాయానికి బ్రేక్‌ పడింది. అన్నాడీఎంకే నాయకులకు, మంత్రులకు ఇది నచ్చడంలేదు. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి వేరువేరుగా ఉండటం ఇష్టం లేదు. ఈ రెండు పదవులూ జయలలిత స్నేహితురాలు శశికళ నటరాజన్‌ తీసుకోవాలని వారి కోరిక. ఒకేసారి ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా చేశారు. ముఖ్యమంత్రి అవుతుందా? కాదా? అనేది తేలాల్సివుంది.

అయితే శశికళ నటరాజన్‌ ప్రధాన కార్యదర్శి అయిందిగాని అది ప్రజాస్వామ్యబద్ధ్గంగా జరిగిన ఎన్నిక ద్వారా కాదు. పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ ఆమెను ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇందుకు సంబంధించి చేసిన తీర్మానంలో ప్రస్తుతం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని, కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. అంటే శశికళ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నిక కావల్సివుంటుందన్నమాట. ఇదంతా లాంఛనప్రాయమైన వ్యవహారమే. ముఖ్యమంత్రి కావడమే అసలు సమస్య.

ఈ విషయం ఇలా ఉంచితే సమావేశంలో అన్నాడీఎంకే నాయకులు పలు తీర్మానాలు చేశారు. వీటిని తీర్మానాలు అనడం కంటే 'గొంతెమ్మ కోరికలు' అంటే సబబుగా ఉంటుంది. ఇవి తీరుతాయో లేదో చెప్పలేం. కాని ఇదంతా ఓవరాక్షన్‌ అని చెప్పొచ్చు. ఈ గొంతెమ్మ కోరికలేమిటి? జయకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రదానం చేయాలని, పార్లమెంటులో ఆమె విగ్రహం పెట్టాలని ఆమె చనిపోగానే అన్నాడీఎంకే నాయకులు డిమాండ్‌ చేశారు. 

ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసి దీనిపై విన్నవించారు. చనిపోయిన నాయకులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. భారతరత్న ఇవ్వడం కేంద్రం బాధ్యత అన్నట్లుగా, తీసుకోవడం తమ హక్కు అన్నట్లుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. భారతరత్న జాబితాలో అనేకమంది నాయకులున్నారు. ఇప్పుడు జయలలితను చేర్చారు. అన్నాడీఎంకే నాయకులు ఇంతటితో ఆగితే బాగానేవుండేది. కాని ఆగేట్లు లేరు. జయలలిత జన్మదినోత్సవాన్ని 'జాతీయ రైతుల దినోత్సవం'గా ప్రకటించాలట..! జయలలితకు-రైతులకు సంబంధం ఏమిటో అర్థం కావడంలేదు. ఆమె రైతు ఉద్యమ నేత కాదు. రైతుల కోసం పోరాటాలు చేసిన నాయకురాలు కాదు. 

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు రైతులకు కొన్ని ప్రయోజనాలు కలిగించివుండొచ్చు. దేశంలోని పురస్కారాల కోసం డిమాండ్‌ చేసిన అన్నాడీఎంకే నేతలు అంతర్జాతీయ పురస్కారాలు కూడా ప్రదానం చేయాలని తీర్మానించారు. జయకు 'నోబెల్‌ శాంతి బహుమతి' ఇవ్వాలని, రామన్‌ మెగసేసే అవార్డు ప్రదానం చేయాలని తీర్మానించారు. ఈ నాయకుల పురస్కారాల దాహం ఇంతటితో తీరిందో, లేక రాబోయే రోజుల్లో ఇంకా అడుగుతారేమో తెలియదు. నోబెల్‌, మెగసేసే పురస్కారాలు ఇవ్వడానికి జయలలితకు ఉన్న అర్హతలేమిటి? దేశానికి ఆమె చేసిన సేవ ఏమిటి? శాంతి బహుమతి కావాలంటున్నారు. మరి శాంతి కోసం ఆమె పాటుబడిన దాఖలాలు ఉన్నాయా? ఆమె అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకురాలు. ప్రతిభావంతురాలైన పొలిటికల్‌ లీడర్‌. సమర్ధురాలైన పరిపాలకురాలు. అంతవరకే. అన్నాడీఎంకే నాయకులు కోరుకుంటున్న పురస్కారాలు ఆమెకు ఇచ్చేవి కావు. అందుకు ఆమెకు అర్హత లేదని చెప్పొచ్చు.