హీరో వెంకటేష్ కు ఓ పద్దతి వుంది. ఆయన విషయాలు ఏవీ ఫైనల్ కాకుండా బయటకు వస్తే, ఆయనకు నచ్చదు. జస్ట్ కాజువల్ గా అలా అలా అనుకుంటున్నవి, ఏదో జరిగిపోయిందన్నంత రేంజ్ లో వార్తలయిపోతే ఆయనకు మండిపోతుంది. గతంలో ఒక డైరక్టర్ సినిమాను ఇలాగే క్యాన్సిల్ కొట్టారు. దానికి కారణం మరీ పెద్దదేం కాదు. ఆ డైరక్టర్ కథ ఇంకా ఒకె చేయించకుండానే, వెంకీతో సినిమా..వెంకీతో సినిమా అని ఎక్కడ పడితే అక్కడ వార్తలు హల్ చల్ చేయడమే.
ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాధ్ వ్యవహారం కూడా అలాగే వుందని వెంకటేష్ ఫీలవుతున్నారట. డిఫరెంట్ గా హీరోలను ప్రెజెంట్ చేస్తాడు అని ఒకే ఒక్క రీజన్ తో వెంకటేష్ ముందుకు వెళ్లి పూరితో సినిమా చేయాలని ఆలోచన చేసారు. ఈ సందర్భంలో ఆయన కు కొందరు వద్దని కూడా చెప్పారట. పూరికి హిట్ లు లేవని, ఇప్పుడు ఆయనతో చేయడం వేస్ట్ అని సలహాలు వెంకీకి అందాయని వినికిడి. కానీ ఆయన ఇదే రీజన్ చెప్పారట. హీరోలను బాగా చూపిస్తాడు అంటూ.
అంతకు మించి ఆ సినిమా ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదు. కథ లేదు, లైన్ లేదు. బడ్జెట్ ఊసు లేదు. అన్నీ సెట్ అయితే సురేష్ బ్యానర్ పై నిర్మించాలని మాత్రం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా మొత్తం ప్రాజెక్ట్ నే సెట్ అయిపోయినట్లు వార్తలు వచ్చేస్తుంటే వెంకీ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదేంటీ..మనం ఇంకా కథే వినలేదు కదా? అని ఆయన కామెంట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైగా వెంకీ ఇప్పుడు కథ విషయంలో చాలా పట్టుదలగా వున్నారట. బాబు బంగారం కథ విషయంలో దర్శకుడు మారుతికి వదిలేసానని, మరి కాస్త కేర్ తీసుకుని వుంటే ఇంకా బాగా వచ్చేదని వెంకీ ఫీలయ్యారట. అందుకే దర్శకుడు తిరుమల తో చేయబోయే సినిమా కథ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వున్నారు. దాంతో ఆ కథ అడుగు ముందు వెళ్లలేదు. అలా వుంది. వెంకీకి సంతృప్తి కలిగేదాకా ఆ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాదు.
మరి అలాంటిది పూరి కథ కూడా లేకుండా వెంకీతో సినిమా బడ్జెట్ వరకు ఎలా వెళ్లిపోయిందో అని ఆయన యూనిట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పూరి శిబిరం నుంచే ఈ ఫీలర్లు వెళ్లి వుంటాయని, వెంకీ చేత సినిమా కమిట్ చేయించడానికే ఇలాంటి గ్యాసిప్ లు విడుదల చేసి వుంటారని వారు భావిస్తున్నారు. ఈ విషయంలో మరిన్ని వార్తలు కనుక పదే పదే వస్తే, వెంకీ అసహనం పీక్ కు వెళ్లి, క్యాన్సిల్ అన్నా అంటారని, ఆయన గురించి తెలిసిన వారు కామెంట్ చేస్తున్నారు.