అన్ని పార్టీలకూ ‘హై’ ఫీవర్‌!

‘హై’ ఫీవర్‌! అవును. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘హై’ ఫీవరే. ప్రజలకు కాదు. కేవల పార్టీలకే. ‘హై’ ఫీవరంటే, హైదరాబాద్‌ ఫీవర్‌. అన్ని జ్వరాలూ వచ్చిపోయాయి. ఇదొక్కటే బాకీ వుంది. పంచాయితీ, మండల, జిల్లా…

‘హై’ ఫీవర్‌! అవును. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘హై’ ఫీవరే. ప్రజలకు కాదు. కేవల పార్టీలకే. ‘హై’ ఫీవరంటే, హైదరాబాద్‌ ఫీవర్‌. అన్ని జ్వరాలూ వచ్చిపోయాయి. ఇదొక్కటే బాకీ వుంది. పంచాయితీ, మండల, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌, అసెంబ్లీ, పార్లమెంటు అన్నీ ఎన్నికల జ్వరాలూ వచ్చాయి. కొన్ని పార్టీలకూ టెంపరేచర్‌ డౌన్‌ అయిపోయి, వొళ్ళుకూడా చల్లబడి పోయింది. ఇక 2014 వరకూ మిగిలింది ఒకే ఒక జ్వరం: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ (జిహెచ్‌ఎంసి) జ్వరం. ఇక్కడ వేడి పెంచుకోవటానికి రెండు రాష్ట్రాలలోనూ తిష్ట వేసుకున్న రాజకీయ పార్టీల అధినేతలూ సిధ్ధమవుతున్నారు. అందుకు కారణం సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పే. హైదరాబాద్‌ వరకూ అందరికీ ఆశలు మిగిల్చింది. అంతే కాదు బెంగల్ని కూడా పెంచింది. 

టీఆర్‌ఎస్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) తెలంగాణ మొత్తం(ఖమ్మం మినహాయింపు) చక్రం తిప్పినా, హైదరాబాద్‌లో పెద్దగా పుంజుకోలేక పోయింది. ఆ మాట కొస్తే, హైదరాబాద్‌ ఎప్పుడూ, టీఆర్‌ఎస్‌కు ప్రాణ సంకంటమే. 2009 అసెంబ్లీ ఎన్నికలలో అయితే హైదరాబాద్‌ జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్‌ ఖాతాయే తెరవలేదు. ఆ తర్వాత వచ్చిన జిహెచ్‌ఎంసి ఎన్నికలలో ఇదే ఫలితం వస్తుందన్న భయంతోనే టీఆర్‌ఎస్‌ అధినేత అప్పట్లో నిరాహారదీక్ష పేరున ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్న విమర్శలు వున్నాయి. అలాంటిది, 2014 వచ్చేసరికి సీను మారిపోయింది. హైదరాబాద్‌ తో కూడిన తెలంగాణకు ఆయన ఏకంగా ముఖ్యమంతి అయి కూర్చున్నారు. కానీ చిన్న విషాదం. మొత్తం హైదరాబాద్‌ జిల్లా పరిధిలో వున్న 15 సీట్లలో ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్‌ కు వున్నది ఒక్క స్థానమే. రంగారెడ్డిలో అయితే 14 స్థానాలకూ కనీసం 4 స్థానాలనయినా గెలుచుకున్నది. కాబట్టి ఇప్పుడు జిహెచ్‌ ఎంసి అన్నది టీఆర్‌ఎస్‌ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. 

ఇందుకు కేసీఆర్‌ వోటు బ్యాంకులు స్పష్టంగానే కనిపిస్తున్నాయి: స్థానికులు(తెలంగాణ వాసులు), ముస్లింలు, క్రైస్తవులు, ఆంధ్రులు మినహా ఇతర స్థానికేతరులు.(ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారు.) ముస్లింల వోట్ల కోసం మజ్లిస్‌తో పొత్తు, ముస్లింలకు రిజర్వేషన్లు అనే రెండు పనులూ చేస్తున్నారు.క్రైస్తవులకు కూడా రిజర్వేషన్‌ ఇచ్చే ఆంశాన్ని యోచిస్తున్నారు. స్థానికుల వోట్లను కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల వైపు వెళ్ళకుండా టీఆర్‌ఎస్‌ వైపే రావాలంటే, ‘తెలంగాణ సెంటిమెంటు’నే  వాడాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే, ఆంధ్రులు తిట్టుకునేలాగా, తెలంగాణ వాసులు ఆనందపడేలాగా నిర్ణయాలు (1956 నుంచి వున్న తెలంగాణ వాసుల పిల్లలకే ఫీజు రీయంబర్స్‌ మెంటు, అక్రమ కట్టడాల కూల్చివేత, ఉద్యోగుల విభజనలో ఆప్షన్లకు వ్యతిరేకత వంటివి) తీసుకుంటున్నారు. కడకు ఆంధ్రులు మినహా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారిని సంతోష పెట్టటం కోసం మెట్రోరైలు గమనాన్ని కూడా సుల్తాన్‌ బజారు మీదుగా పోకుండా నిలుపు చేస్తానన్నారు(కింద నుంచి సొరంగ మార్గం వేయాలన్నారు.)

కాంగ్రెస్‌: 2014లో సీమాంధ్రలోనే కాదు, హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుని పోయింది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఒక్క స్థానమూ రాలేదు. రంగారెడ్డిలో మాత్రం రెండు స్థానాలు వచ్చాయి. తెలంగాణ ఇచ్చి కూడా హైదరాబాద్‌లో స్థానికుల ఆదరణకు నోచుకోలేక పోయిన కాంగ్రెస్‌, జిహెచ్‌ఎంసి విషయంలో ఎలాంటి వ్యూహం పన్నుతోంది. గత అయదేళ్ళూ జిహెచ్‌ఎంసీని కాంగ్రెస్‌, మజ్లిస్‌లు వన్‌ బైటూలు చేసుకుని పరిపాలించుకున్నాయి. కానీ అసెంబ్లీ ఫలితాలు ఇలా వెక్కిరించాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ కేవలం ‘స్థానికుల’(తెలంగాణ వాసుల) వోట్ల మీదనే కాకుండా, సెటిలర్ల వోట్ల మీద కూడా దృష్టి మళ్ళించాలనుకుంటోంది. అందులో భాగంగానే ఇటీవల జానారెడ్డి ముందుకు వచ్చి, కేసీఆర్‌ మీద జోరు పెంచారు. రెతుల రుణ మాఫీ చేయటంలో జాప్యాన్ని తప్పుపడుతూనే, మెల్ల మెల్లగా హైదరాబాద్‌లోని సెటిలర్ల రక్షణ మీద దృష్టి సారిస్తున్నారు. 

తెలుగుదేశం: అనూహ్యంగా 2014 అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వరకూ తెలుగుదేశం గణనీయమైన స్థానాలను గెలుచుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల కూడా టీడీపీకి లాభించిందని బీజేపీ వారి అభిప్రాయం. హైదరాబాద్‌లో టీడీపీకి 3, బీజేపీకి4 స్థానాలు వస్తే, రంగారెడ్డిలో టీడీపీకి 7, బీజేపీ ఒక స్థానం వచ్చింది. దాదాపు సెటిలర్లు అంతా టీడీపీకే మొగ్గు చూపటంతో పాటు, స్థానికుల వోట్లు కూడా పడివుంటాయన్నది ఒక అంచనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకూ, టీఆర్‌ఎస్‌ సర్కారుకూ మధ్య జరగుతున్న వివాదం వల్ల సెటిలర్లు టీడీపీకి మరింత దగ్గరవుతారు. అయితే 1956 స్థానికత పేరు మీద వదిలేసిన సెటిలర్ల పిల్లలకు ఫీజు రీయంబర్స్‌ మెంటు బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తీసుకోక పోతే, టీడీపీ వట్ల కొంత వైముఖ్యం వచ్చే అవకాశం కూడా లేక పోలేదు.

బీజేపీ: తెలంగాణలో బీజేపీకీ, ఆంధ్ర బీజేపీకీ చుక్కెదురయ్యింది. కేంద్రంలోని మోడీ సర్కారుకు ఆంధ్ర బీజేపీయే సన్నిహితమయిపోయింది. దాంతో ఈ సారి హైదరాబాద్‌లో తెలంగాణ పేరు మీద వచ్చే వోట్లు పెద్దగా రావు. కేవలం ముస్లిం వ్యతిరేకతో లోంచి వచ్చిన హిందూత్వ వోటునే ఉపయోగించుకోవాలన్న ఆరాటంలో కొంత వున్నట్లు కనిపిస్తుంది. సానియా మీర్జాను ‘పాకిస్తానీ కోడలు’ గా లక్ష్మణ్‌ అభివర్ణించటం వెనుక రహస్యం ఇదే కావచ్చు. 

మజ్లిస్‌: పాతబస్తీతో పాటు జిహెచ్‌ఎంసిలోని ఇతర డివిజన్లలో కూడా పాగా వేయలనే దృక్పథంతో, టీఆర్‌ఎస్‌ నుంచి పొత్తులో ఎక్కువ స్థానాలు పొందటం మీద దృష్టి పెడుతుంది.

మొత్తానికి మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉండబోతున్న హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికల పట్ల రెండు రాష్ట్రాల పార్టీలతో పాటు, ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు.