బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య సి నారాయణరెడ్డిగారి పుట్టిన రోజు సభ జరిగింది. తెలుగుజాతి అంతా తమవాడిగా భావించే ఆయనపై ఆ సభకు వచ్చిన కెసియార్ తెలంగాణ ముద్ర కొట్టేసి ఆయన పరిధి చిన్నది చేసేశారు. తీరా చూస్తే కెసియార్ ఆయన్ని అంతకుముందు ఒక్కసారే కలిశారట. సినారె కవిత్వం చదివి కాలేజీలో మంచి పేరు తెచ్చుకున్నానని చెపుతూనే స్వయంగా సన్మానాలూ అవీ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు ప్రత్యక్షమై సినారెను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం బాధాకరం. సినారె ఎన్నడూ ప్రాంతీయ వివక్షత ఫీలవలేదు, ఆయనా ఎవరిపై కనబరచలేదు. ''తల్లా పెళ్లామా?''లో అద్భుతమైన సమైక్యగీతం రాసిన ఆయన యిటీవలి విభజనోద్యోమం బలపడ్డాక 'అదంతా వృత్తి ధర్మంగా రాశాను, నా భావాలు దానిలో చొప్పించలేదు' అని చెప్పుకుంటున్నారు. ఆయన మర్చిపోయారు కానీ అభిమానులందరికీ 1969లో 'వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు' అని ఆయన యిచ్చిన నినాదం గుర్తుంది. అప్పట్లో ఆయన వుండే అశోక్‌నగర్ యింటి గోడలపై ఉద్యమకారులు రాశారు – 'వీర తెలంగాణా వాడా, వేరు తెలంగాణ కోరుకో' అని. ఇప్పుడాయన గతాన్ని మరచారు, 'తెలుగు జాతి మనది – నిండుగ వెలుగు జాతి మనది' అనే పాటను మార్చి '.. రెండుగ వెలుగు జాతి మనది' అంటున్నారు. రాష్ట్రాలుగా రెండయ్యామే తప్ప జాతిగా ఒక్కటే! అంటున్నారు. మనం ఒకే జాతి అని, మనది ఉమ్మడి వారసత్వం అనీ గుర్తించినట్లు మెలగుతున్నామా? విభజన జరిగినా పదేళ్లపాటు కొన్ని విషయాల్లో ఉమ్మడిగా వుండాల్సిందే అని విభజన చట్టం స్పష్టంగా చెప్పినా ఆచరణలో జరుగుతున్నదేమిటి?
ఆంధ్ర నుండి వచ్చే వాహనాలకు పన్ను వేస్తానంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించడం దేనికి? చేసిన చట్టాలను కూడా మార్చేసి, ఏప్రిల్ వరకు వున్న వెసులుబాటు పీకేసి, యిలా చేయడం ఏం ఆశించి? కోర్టు స్టే యిచ్చి ఆపాల్సివచ్చింది. ఇలా ఆపుతోందనేనా హై కోర్టు విడగొట్టాలంటూ తెలంగాణ అడ్వకేట్ జెఎసి ఆందోళనలు చేపట్టింది? కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక దానికి వేరే హై కోర్టు ఏర్పాటు చేయాలని ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది. ఆంధ్రా వాళ్లకు రాజధాని యింకా తేలలేదు. తేలాక, ఆ ప్రాంతం కాక మరో ప్రాంతంలో హై కోర్టు పెట్టాలని అనుకుని అక్కడకు ఎలాగూ షిఫ్ట్ చేస్తారు. ఈలోగానే ప్రస్తుత హై కోర్టులో సగం మీది, సగం వాళ్లది అంటే సెక్రటేరియట్‌లో కట్టినట్లే కంచె కట్టేయవచ్చు, కేసు అక్కడ వుంటే వెళ్లి వాదించం అనవచ్చు, ఆ కోర్టు మీద కాకి ఈ కోర్టు మీద వాలకూడదనవచ్చు. అందువలన న్యాయవ్యవస్థ నిదానిస్తూ వుండవచ్చు. ఈ లోగా ఏం కొంప మునిగిందని, కోర్టుకి గైరు హాజరు కావడాలూ, ప్రదర్శనలూ, పోలీసుతో కొట్లాట, దానిపై నిరసన…? కోర్టులో కేసులున్నవాళ్లు ఎంత అవస్థ పడుతున్నారో వీళ్లు గ్రహించటం లేదు.
ప్రతీ విషయంలో సహాయనిరాకరణ కనబడుతోంది. ఉద్యోగుల కుటుంబాలు త్రిశంకు స్వర్గంలో వేళ్లాడుతూ కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల కోసం చూస్తున్నాయి. కమలనాథన్ అంతా రెడీ చేశాక తెలంగాణ ప్రతినిథులు వాటిపై సంతకాలు పెట్టలేదు. ఏం అంటే సమాధానం లేదు. మార్గదర్శకాలు విడదులయ్యాక వాళ్ల ఉద్యోగులు ధిక్కరిస్తున్నారు. తాము చెప్పినట్లు జరగాలంటున్నారు. ఫిర్యాదులుంటే వచ్చి చెప్పుకోండి అంటే అది ఆంధ్ర సెక్రటేరియట్‌లో పెట్టారు, అక్కడికెందుకు వెళతాం అంటున్నారు, ఏవో లక్ష్మణరేఖలు ఎవరో గీసినట్లు. ప్రత్యేక తెలంగాణ కావాలన్న విషయంలో తప్ప ఆంధ్ర ఉద్యోగులతో మాకు పంచాయితీ లేదు, మేమంతా సోదరులమే అంటూ టీవీ కెమెరాల ముందు చెప్పిన నాయకులే యిప్పుడు ఆంధ్రులు ఆజన్మశత్రువులన్నట్లు మాట్లాడుతున్నారు. రేపుమర్నాడు ఏదైనా జాతీయ, అంతర్జాతీయ సదస్సు ఏ వైజాగ్‌లోనే పెడితే వీళ్లు వెళతారా? వెళ్లరా? ఏమిటీ అర్థం లేని పెంకెతనం? ఆరుగురు ఐయేయస్‌లు ఆంధ్రకు వెళ్లమని మొండిపట్టు పట్టడంతో నిర్ణయం జాప్యమైందట. ఐయేయస్‌లన్నాక ఎక్కడ వేసినా పనిచేయాలి. చివరకు కేంద్రం వెళ్లి తీరాల్సిందే అంది. విద్యుత్ పంపిణీపై కేంద్రం చర్చలకు పిలిస్తే తెలంగాణ అధికారులను పంపలేదు. చివరకు వెళితే వినియోగం ప్రాతిపదికన జరిగిన పంపిణీలో కూడా లెక్కలు తేడా వచ్చాయని చెప్పి 67 మెగావాట్లు ఆంధ్రకు యిచ్చారు. నువ్వు అక్కడ వుండి యిలా జరగనిచ్చావేమిటంటూ ఆ అధికారిని ఆ పదవిలోంచి తప్పించింది తెలంగాణ సర్కార్. ఎన్నికల కమిషనర్ అనుమతి లేకుండానే ఆయన ఆఫీసు నుండి పదిమంది ఉద్యోగులను ఉపసంహరించుకుంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం కలగజేసుకుని మందలించవలసి వస్తోంది.
ఇక విద్యార్థుల కౌన్సిలింగ్ గొడవైతే మరీ ఘోరంగా వుంది. విభజన ధర్మమాని యీ ఏడాది చేరాల్సిన విద్యార్థులు నాశనమవుతున్నారు. పదేళ్లపాటు ఉమ్మడి ఎడ్మిషన్లు అని స్పష్టంగా వున్నా తెలంగాణ కాలేజీలకు వేరే కౌన్సిలింగ్ నిర్వహిస్తాం అంటున్నారు. ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంటే దాన్ని మన్నించకండి అని తెలంగాణ విద్యార్థులకు సాక్షాత్తూ విద్యామంత్రి సలహా చెప్తున్నారు. డాక్యుమెంటు వెరిఫికేషన్‌కు సహకరించం అని పాలిటెక్నిక్ ఉద్యోగుల చేత చెప్పిస్తున్నారు. ఉన్నత విద్యామండలి ఏకపక్షం నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. వాళ్లు పిలిచినపుడు మీ అధికార్లను ఎందుకు పంపలేదు? ఇలా గొడవ చేయాలనేనా? మీ వాదనలు ఆ మీటింగులోనే వినిపించలేకపోయారా? నిన్న జెఎన్‌టియు విసిని రంగంలోకి దించారు. ఆయన అంటున్నాడు – 'చాలా కాలేజీలకు ప్రమాణాలు లేవని యుజిసి చెప్పింది, మా టీము వెళ్లి అక్కడి సౌకర్యాలు చూసి అప్పుడు ఎక్రెడిషన్ యివ్వాలా లేదా అని చెప్తాం, దానికి 2, 3 వారాలు పడుతుంది. ఎక్రెడిషన్ వున్న కాలేజీలకే కౌన్సిలింగ్ కాబట్టి అది యిప్పట్లో అవదు.' అని. కాలేజీలకు ప్రమాణాలు లేవన్న సంగతి ఆయనకు యిప్పుడే గుర్తుకు వచ్చిందా? ఎమ్‌సెట్ పరీక్షలయి నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా యీ టీము ఏం చేస్తోంది? 2, 3 వారాల్లో మీరు లోపాలు ఎత్తిచూపడం, వాళ్లు సవరించేయడం కూడా జరుగుతుందా? ఏమైనా అడిగితే కాలేజీకి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం బాకీ పడింది. అది యిచ్చి ఫ్యాకల్టీ గురించి, యిన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి అడగండి అంటున్నారు కాలేజీ యజమానులు. రాజకీయ మద్దతుతో ఏ ఫెసిలిటీ లేకుండా పెట్టిన కాలేజీలు కాబట్టే అక్కడ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు. అక్రమ నిర్మాణాలతో బాటు బోగస్ కాలేజీలు కూల్చేయండి, సమస్య లేదు. కానీ యివన్నీ ఎప్పటికి జరుగుతాయి? ఇవన్నీ యీ ఏడాదే పెట్టుకోవాలా? ఈ ఏడాది యిలా పోనిచ్చి వచ్చే ఏడాది చూసుకుందాం, యీ లోపున కాలేజీల ప్రమాణాలు పెంచుదాం అనుకోవచ్చుగా! లేదు, యిప్పుడే అమీతుమీ తేల్చేద్దాం అనుకుంటున్నారు.
ఈ పదప్రయోగం యిక్కడ చక్కగా అన్వయిస్తుంది. ఇది వాడేవాళ్లలో చాలామందికి తెలిసి వుండకపోవచ్చు – అమి అంటే బెంగాలీలో నేను అని, తుమి అంటే నువ్వు అని. నువ్వో నేనో ఎవరుండాలో తేలిపోవాలి అనే అర్థంలో అమీతుమీ తేల్చడం అనే సామెత వాడతారు. ఇప్పుడు తెలంగాణలో యిదే సమస్య – ఎవరు అమి, ఎవరు తుమి అని. 'జంతువులు కూడా తమ సొంత బిడ్డల్ని సాకుతాయి, ఆంధ్ర ప్రభుత్వం తన పిల్లలికి ఫీజు కట్టలేదా?' అంటున్నారు జగదీశ్వర రెడ్డి. మీ నిర్వచనం ప్రకారం స్థానికులు కారంటూ విడగొట్టినవాళ్లను సాకవలసిన అవసరం వాళ్లకేముంది? 371 డి ప్రకారం వాళ్లు తెలంగాణ వాళ్లే. ఆంధ్రకు చెందిన వారని మీరంటే సరిపోతుందా? విద్యార్థుల తలిదండ్రులు ఆస్తులు కొన్నది యిక్కడ, మీ భూముల విలువలు పెంచినది వారు, పన్నులు కడుతున్నది మీకు. అవన్నీ నిక్షేపంలా తీసుకుంటూ 'మీరు మా వారు కాదు' అంటూ వితండవాదన చేస్తున్నది మీరు. విద్యార్థుల తలితండ్రులు లేదా కుటుంబం 1956కు ముందు తెలంగాణలో నివసిస్తూ వుండాలి అంటున్నారు. విద్యార్థిగా వున్నవాడి తండ్రికి మహా వుంటే 50 ఏళ్లుంటాయి. 1964 తర్వాత పుట్టి వుంటాడు. 1956లో పరలోకంలో తప్ప తెలంగాణలో నివాసం వుండలేడు. అంటే విద్యార్థి తాతను లెక్కలోకి తీసుకోవాలన్నమాట. వీటన్నిటికీ రికార్డులు సరిగ్గా వుండాలి. అవి దొరుకుతాయా? ఈ ప్రభుత్వం యివ్వగలదా? ఏమడిగినా స్టాఫ్ లేదు, కౌన్సిలింగ్ అక్టోబరు 31 వరకు చేయలేం అంటోందే! మరి వీటికి ఎక్కణ్నుంచి వస్తారు? రాష్ట్రం వచ్చాక అదే వేతనానికి అదనపు గంటలు పనిచేస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మించేస్తాం అంటూ ఉద్యోగులు చాలాసార్లు చెప్పారు. అది నిజమనుకుంటున్నారేమో తెరాస నాయకులు. నిన్న హరీశ్ రావు ప్రభుత్వాఫీసుకి వెళితే అదనపు గంటల మాట దేవుడెరుగు, అసలు టైముకే రాలేదు చాలామంది. ఇన్నాళ్లూ ఆఫీసుల్లో కాంట్రాక్టు సిబ్బంది కారణంగా కాస్త పనులు అయ్యేవి. వాళ్లను రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇక వాళ్లూ కొమ్మెక్కి కూర్చుంటారేమో! కొత్త రాష్ట్రం వచ్చినంత మాత్రాన సిబ్బంది సామర్థ్యం అమాంతం పెరిగిపోదు. పోలీసులకు కొత్త కార్లు, యూనిఫాంలు అంటూ 300 కోట్ల రూ.లు ఖర్చు పెట్టారు. కానీ అసెంబ్లీలోకి ఆగంతకుడు వచ్చినపుడు పోలీసులు పనితీరు ఎంత లక్షణంగా వుందో అందరం చూశాం. యూనిఫాం మార్చగలరు కానీ మనుషుల్ని మార్చగలరా? అతనంతట అతను దొరికాడు కాబట్టి కానీ లేకపోతే దానిపై పార్లమెంటులో రభస, ఓ కమిటీ నియామకం, ఆరోపణలు, ప్రత్యారోపణలు బోల్డు జరిగి వుండేవి. ఇలాటి సిబ్బందిని పెట్టుకుని అన్ని పనులు చక్కబెట్టుకున్న తర్వాతనే కౌన్సిలింగ్ చేస్తామంటే విద్యార్థులు ఏమైపోతారు పాపం? స్థానికత సర్టిఫికెట్లు యివ్వడానికైనా స్టాప్ వుండాలా? వారిని సిటిజన్ కార్డుల చెకింగ్ అంటూ బయటకు తోలితే…?
తెలంగాణ ప్రభుత్వం రెండు ముఖాలతో పనిచేస్తోంది. ఒక ముఖంతో అంతర్జాతీయ నగరం, 4 జి వైఫై, లిట్టర్ ఫ్రీ రోడ్స్ అంటూ ఆధునికత ప్రదర్శిస్తోంది. మరో ముఖంతో పూర్తి సంకుచితత్వాన్ని, పొరుగువారితో అసహనాన్ని ప్రదర్శిస్తోంది. తన ప్రజలనే చీల్చి వేడుక చూద్దామనుకుంటోంది. ఫాస్ట్ స్కీము ద్వారా ప్రభుత్వం దృష్టిలో ఎవరు తెలంగాణయో, ఎవరు కాదో చాటి చెప్పి ఇప్పటిదాకా ప్రాంతీయస్పృహ లేనివారిలో సైతం కలిగిస్తోంది. రిజర్వేషన్ సౌకర్యం అనుభవించే వారి పట్ల యితరులు గుర్రుగా వుండడం, అవకాశం వచ్చినపుడు వారికి సహకరించకపోవడం చూస్తూనే వున్నాం. కులానికి తోడు యిప్పుడు ప్రాంతీయత కూడా వచ్చి చేరి సమాజాన్ని మరింత చిన్నాభిన్నం చేస్తోంది. అశాంతి నెలకొన్న సమాజం వున్నచోట పెట్టుబడులు ఓ పట్టాన రావు. తెరాస సర్కారు వల్లిస్తున్న పెద్దపెద్ద కబుర్లు కబుర్లుగానే మిగిలిపోయే ప్రమాదం వుంది. విభజన కోరుకున్నపుడే కొన్నాళ్ల ఉమ్మడి రాజధాని తప్పదని, కొన్నేళ్లపాటు కొన్నిట్లో కలిసి వుండక తప్పదని కెసియార్ తన సహచరులకు చెపుతూ వచ్చారు. ఇప్పుడు ఆయనే దాన్ని విస్మరిస్తున్నారు. తలతిక్కకు సర్దార్జీలను చెప్పుకుంటూ వుంటారు. చండీగఢ్‌లో పంజాబీలు, హరియాణవీలు భాషలు వేరైనా థాబ్దాలుగా ఉమ్మడి రాజధానిలో వుంటున్నారు. మనల్ని పదేళ్లపాటు వుండమన్నారు కేంద్రం వారు. పది వారాలు కూడా గడవకుండా యింత తన్నుకు ఛస్తున్నాం. ఇకపై తిక్క అనగానే సర్దార్జీల పేరు మానేసి, మన పేరే చెప్పాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)