ఆంధ్రకూ కావాలి ఓ ‘కళ్యాణ రాముడు’…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేంకటేశ్వర స్వామి ఆలయాలున్నా తిరుమల వెంకన్నకు ఉన్న  ప్రాధాన్యత వేరు. భక్తులకు ఆయనపై ఉండే గురి వేరు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించాలని వెంకన్న భక్తులు కోరుకుంటారు. తెలుగువారికి…

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేంకటేశ్వర స్వామి ఆలయాలున్నా తిరుమల వెంకన్నకు ఉన్న  ప్రాధాన్యత వేరు. భక్తులకు ఆయనపై ఉండే గురి వేరు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించాలని వెంకన్న భక్తులు కోరుకుంటారు. తెలుగువారికి వేంకటేశ్వరుడు అంటే ఎంతటి భక్తో, శ్రీరాముడన్నా అంతే ప్రేమ. రామాలయం లేని తెలుగు పల్లెలు ఉండవంటే అతిశయోక్తి కాదు. రామాలయాలు ఎన్ని ఉన్నా  భద్రాచలం రామాలయానికి  వెళ్లడంలో ఉన్న తృప్తి వేరు. శ్రీరామ నవమి వచ్చిందంటే భద్రాద్రి కలియుగ వైకుంఠమవుతుందని, ఆ కళ్యాణం చూడకపోతే ఈ జన్మ వృథా అని భక్తులు భావిస్తుంటారు. చలికాలం వెళ్లిపోయి ఎండాకాలం రాబోతోంది. మండే ఎండల్లోనే భద్రాద్రి రాముడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణానికి రాష్ర్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లడం, సర్కారు తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, కానుకలు సమర్పించడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు రాష్ర్టం విడిపోయి రాముడు కొలువైన భద్రాచలం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయింది. కాబట్టి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, కానుకలు తీసుకెళ్లే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్ట ప్రభుత్వం తరపున హాజరవుతారు. భద్రాచలం తెలంగాణలో ఉన్నా  ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలూ హాజరవుతారు. అది వేరే విషయం. అసలు విషయం ఏమిటంటే…ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలంతో సరిసమానమైన ఆలయం, అంతటి ప్రాశస్త్యం ఉన్న  గుడి లేవు. ఆంధ్ర ప్రభుత్వం తరపున అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రాచలం వస్తారా? రాలేరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు భద్రాచలం స్ధాయి  ‘కళ్యాణ రాముడు’ కావాలి. 

కళ్యాణ రాముడి కోసం అన్వేషణ

చంద్రబాబు  ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా  ఉండగా  ప్రభుత్వం తరపున  భద్రాచలం సీతారామ కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకెళ్లేవారు. కాని ఇప్పుడు ఆ అవకాశం కేసీఆర్‌కు దక్కింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వం తరపున శ్రీరాముని కళ్యాణం నిర్వహించేందుకు ఓ ఆలయం కావాలి. భద్రాద్రి ఆలయానికి ఉన్నట్లుగా  దానికి కూడా చారిత్రక ప్రాధాన్యం, విశిష్టమైన స్థలపురాణం మొదలైనవి  ఉండాలి.  ఇక నుంచి అక్కడ ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణోత్సవం జరగాలి. ఇదీ అక్కడి ప్రజల కోరిక. రాముని కళ్యాణానికి సమయం సమీపిస్తుండటంతో భద్రాద్రి తరహా ఆలయం కోసం అన్వేషణ ప్రారంభమైంది. దాంతోపాటు జిల్లాల నాయకుల మధ్య పోటీ కూడా పెరిగింది. ప్రతి జిల్లావారు తమ జిల్లాలోని పేరెన్నికగన్న రామాలయాన్ని ఎంపిక చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర జిల్లాల సంగతి ఎలా ఉన్నా  ప్రస్తుతం కడప జిల్లావిజయనగరం జిల్లాల మధ్య పోటీ నడుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ప్రసిద్ధ రామాలయాలు ఉండటమే  ఇందుకు కారణం. ఈ రెండూ ‘భద్రాద్రి హోదా’ కోసం పోటీపడుతున్నాయి. అయితే ఈ రెండింటిలోనూ ఒంటిమిట్ట ఆలయం వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే విజయనగరం జిల్లాలోని రామతీర్థంను ఎంపిక చేయించాలని ఆ జిల్లాకు చెందిన టీడీపీ నేత, విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఎన్నో ప్రత్యేకతల పురాతన ఆలయం ఒంటిమిట్ట

జిల్లా కేంద్రమైన కడపకు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయం ఎన్నో ప్రత్యేకతలు  ఉన్న  పురాతన ఆలయం. ఈ ఆలయం 450 ఏళ్ల కిందట నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. ఒంటోడు, మిట్టోడు అనే ఇద్దరు దొంగలు భక్తులుగా మారి ఈ ఆలయం నిర్మించారని కథనం. దీన్ని ఒక్కరోజులోనే నిర్మించారని, నిర్మాణం పూర్తయిన తరువాత వారు దేహ త్యాగం చేసి అక్కడే శిలావిగ్రహాలుగా మారిపోయారని చెబుతారు. వీరి విగ్రహాలు ఆలయంలోకి ప్రవేశించేచోటనే ఉన్నాయి. భద్రాచలంలోని రామాలయానికి ఎలాగైతే రామాయణంతో సంబంధం ఉందని చెబుతారో, ఒంటమిట్టకు కూడా రామాయణంతో సంబంధం ఉందని  ఇక్కడి స్థల పురాణం. ఈ ఆలయంలోని రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్టించాడని చెబుతారు. రామాయణం చదివిన వారికి అందులోని జాంబవంతుడి పాత్ర తెలుసు. కిష్కింద కాండ ఇక్కడే జరిగిందని భక్తుల నమ్మకం. ఇక దేశంలోని ఏ రామాలయానికి లేని రెండు ప్రత్యేకతలు ఈ ఆలయానికి ూన్నాయి. భద్రాద్రిలో రామ కళ్యాణం మిట్టమధ్యాహ్నం పన్నెండు గంటలకు జరుగుతుంది. దాన్నే ‘అభిజిర్లగ్నం’ అంటారు. ఇందుకు విరుద్ధంగా ఒంటిమిట్టలో రామ కళ్యాణం రాత్రిపూట చేస్తారు. ఇక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాల దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం  ఉండదు.  ఇలా దేశంలో ఎక్కడా లేదట…! ఆంజనేయస్వామి విగ్రహం గండి అనేచోట ఉంది.  ఈయన ‘గండి ఆంజనేయస్వామి’గా ప్రసిద్ధుడు. ఇక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలలో చెక్కడం ఓ ప్రత్యేకత.

ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప కళా సంపద ఉంది. ఆలయ ప్రధాన మండపాన్ని విజయనగర రాజులు కట్టించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని పురాతన చారిత్రక కట్టడంగా గుర్తించింది. ఇక ఈ ఆలయం గురించి చెప్పుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం…ప్రసిద్ధ వాగ్గేయకారుడు, తెలుగువారికి చిరపరిచితుడైన తాళ్లపాక అన్నమయ్యకు, తెలంగాణలోని వరంగల్ జిల్లా బమ్మెరలో జన్మించి మధురమైన మహా భాగవతాన్ని తెలుగు ప్రజలకు అందించిన పోతన్నకు ఒంటిమిట్ట ఆలయంతో అనుబంధం ఉంది. అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక ఒంటిమిట్టకు సమీపంలోనే ఉంది. అన్నమయ్య వేంకటేశ్వరస్వామితో పాటు రాముడిపై కూడా అనేక కీర్తనలు రాశారు. ఆ కీర్తనలకు ఆలంబన ఒంటిమిట్ట కోదండ రాముడే. పోతనామాత్యుడు కొంతకాలం ఇంటిమిట్ట రామాలయంలో ఉండి తన భాగవతాన్ని  ఈ రాముడికే అంకితం ఇచ్చారని చెబుతారు. ఈ ఆలయానికి ఇంతటి ప్రాశస్త్యం, చరిత్ర ఉన్నాయి. 

విజయనగరం జిల్లాలో రామతీర్థం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ద్వారకా తిరుమలను ‘చిన్న తిరుపతి’ అని వ్యవహరించినట్లే విజయనగరం జిల్లాలోని రామతీర్థంను ‘రెండో భద్రాద్రి’గా స్థానికులు వ్యవహరిస్తుంటారు. రామతీర్థంలోని రామాలయం కూడా పురాతనమైనదే. దీన్ని విజయనగర రాజులైన పూసపాటి వంశీయులు నిర్మించినట్లు చెబుతారు. ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఆ వంశం వారే. రామతీర్థం విజయనగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.  పర్వతసానువులతో  ఇక్కడి ప్రకృతి కనువిందు చేస్తుంటుంది. ఈ ప్రాంతం క్రీ.పూ.మూడో శతాబ్దం నుంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఇది ఒకప్పుడు బౌద్ధులకు, జైనులకు నిలయం కూడా. రాముడితో లేదా రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో రామతీర్థం కూడా ఒకటని 1903 నాటి ఆర్కియాలజీ సర్వే రిపోర్టు తెలియచేసింది. ఇక్కడ ఇప్పటికీ బౌద్ధుల, జైనుల సంస్కృతీ సంప్రదాయాలకు, ఆనాటి తీర్థంకరులకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘనికొండ, బోధికొండ, గురుభక్తుల కొండ మొదలైనచోట్ల ఈ రెండు మతాల ఆనవాళ్లూ కనబడతాయి. బౌద్ధారామాలు ఉన్నాయి. రామతీర్థంలో నిర్వహించే శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు జనం భారీగా తరలివస్తుంటారు. 

భద్రాచాలం తమదేనని వాదించిన ఆంధ్రులు

రాష్ర్ట విభజన ప్రక్రియ జరుగుతున్న సమయంలో భద్రాచలం ఆలయం కూడా తమేక చెందుతుందని, కాబట్టి దాన్ని ఆంధ్రలో కలపాలని సీమాంధ్రులు వాదించారు. వరంగల్ జిల్లాను విడదీసి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేసన సమయంలో గోదావరి జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను ఖమ్మం జిల్లాలో కలిపారని, అందులో భద్రాచలం కూడా ఒకటని అన్నారు. గోదావరి జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలిపిన మాట నిజమేగాని వాటిల్లో భద్రాచలం లేదు. అది గోల్కొండ రాజ్యంలోని పాల్వంచ ప్రాంతంలో భాగంగా ఉంది. అప్పట్లో పాల్వంచ ప్రాంతానికి తహశీల్దారుగా ఉన్న కంచెర్ల గోపన్న (రామదాసు) సర్కారు సొమ్ముతో భద్రాచలంలో ఆలయం కట్టిస్తే, అందుకు ఆగ్రహించిన రాజు అతన్ని జైల్లో పెట్టాడని, రామలక్ష్మణులు మారువేషాలతో వచ్చి, రాజు తానీషాకు ఆ డబ్బు ఇస్తే, ఆయన రామదాసును వదిలేశాడని అందరికీ తెలిసిన కథ. ఖమ్మం జిల్లా ఏర్పడినప్పుడు తెలంగాణలో కలిసిన ఆంధ్ర మండలాలను విభజన తరువాత తిరిగి ఆంధ్రలో కలిపిస విషయం తెలిసిందే. భద్రాద్రి ఆలయం మాత్రం తెలంగాణకు మిగిలిపోయింది. భద్రాద్రి తమకు దక్కలేదనే బాధ ఆంధ్రులకు ఉంది. అందుకే వారు ఆంధ్రప్రదేశ్‌కు ఓ భద్రాచలం తయారుచేయాలని ప్రయత్నిస్తున్నారు. అదేమిటనేది శ్రీరామ నవమిలోగా తేలిపోతుంది. 

 సునయన