మోడీ సర్కార్ ‘ప్రత్యేక’ వంచన

‘బిడ్డకు పురుడు పోసి తల్లిని చంపేశారు..’ అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ, ఉమ్మడి తెలుగు రాష్ర్ట విభజనపై చేసిన వ్యాఖ్యల్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం.? ‘మేం అధికారంలోకి…

‘బిడ్డకు పురుడు పోసి తల్లిని చంపేశారు..’ అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ, ఉమ్మడి తెలుగు రాష్ర్ట విభజనపై చేసిన వ్యాఖ్యల్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం.? ‘మేం అధికారంలోకి వచ్చాక ఆంధ్రను అన్ని విధాలా ఆదుకుంటాం. కాంగ్రెస్ చేసిన అన్యాయం నుంచి ఆంధ్రను అభివృద్ధిలోకి తీసుకొస్తాం..’ అని నరేంద్ర మోడీ చెప్పిన ఎన్నికల కబుర్లు అన్నీ ఇన్నీ కావు. అలాగే, ‘మోడీ చెప్పారంటే చేస్తారు. అందుకే గుజరాత్ అంత అభివృద్ధి సాధించింది. గుజరాత్‌ని మోడీ అభివృద్ధి చేసిన తీరు చూసి, దేశాన్ని ఆయన అభివృద్ధి పథంలో నడిపిస్తారని నమ్మాం. అందుకే బీజేపీతో జత కట్టాం. మోడీ ప్రధాని అవుతారు, సీమాంధ్రని ఆదుకుంటారు’ అని బీజేపీ మిత్ర పక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడూ మోడీతో కలిసి ఎన్నికల ప్రచార వేదికల్ని పంచుకున్న సందర్భంలో ఉత్సాహంగా ప్రసంగించేశారు.

కానీ, ఏమయ్యింది.? ఆంధ్రప్రదేశ్‌కి ఎన్డీయే సర్కార్ కొత్తగా ఇచ్చిన వరాలేమీ లేకపోగా, యూపీఏ సర్కార్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌కి విభజన సందర్భంగా ఇచ్చిన హామీనే చాలావరకు తుంగలో తొక్కేయడం దురదృష్టకరం. ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎం.. ఇలా ఏవేవో జాతీయ స్థాయి విద్యా సంస్థల గురించి ప్రకటనలు మాత్రం చాలానే చేసేస్తోంది ఎన్డీయే సర్కార్. వాటిల్లో ఒకటీ అరా ముహూర్తానికీ నోచుకున్నాయి. ఆల్రెడీ  నెలల పుణ్యకాలం పూర్తయిపోతోంది. ఇంకో నాలుగేళ్ళలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేస్తుందోగానీ, అన్నిటికన్నా మిన్నగా సీమాంధ్రులు ఆశిస్తున్నది ప్రత్యేక హోదా కోసం. ప్రత్యేక హోదా, దాంతోపాటే ప్రత్యేక ప్యాకేజీ గురించి యూపీఏ సర్కార్ తరఫున, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రకటనకు పట్టిన గ్రహణం ఇంకా వీడలేదు. అసలు ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీగానీ, ప్రత్యేక హోదాగానీ వచ్చే అవకాశాలేమీ కన్పించడంలేదంటే, అది పూర్తిగా ఎన్డీయే సర్కార్ వైఫల్యం కిందే పరిగణించాల్సి వుంటుంది. ఆ వైఫల్యంలో బీజేపీతోపాటు, టీడీపీకి కూడా భాగస్వామ్యం వుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రకటించినపడు ‘ఐదేళ్ళు కాదు.. పదేళ్ళు..’ అంటూ ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాజ్యసభ సభ్యుడిగా నినదించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అపడేమో అలా డిమాండ్ చేసి, ఇపడు గత ప్రభుత్వ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తమ భుజాలపైన వున్నా, పాపాన్ని పాత ప్రభుత్వమ్మీద వేసేసి, తప్పించుకు తిరగాలని చూస్తున్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.  ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాలంటే వేరే రాష్ట్రాల్ని ఒప్పించాల్సి వుంటుందట. అది నిజమే అనుకున్నా, ఈ ఎనిమిదేళ్ళలో ఆయా రాష్ట్రాల్ని ఒప్పించడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలేంటి.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్ని ఇప్పటిదాకా ఎన్డీయే సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఒప్పించిందా.? అంటే అదీ లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తూ, సీమాంధ్రుల్ని నిలువునా మోసగించింది కాంగ్రెస్ పార్టీ. రాజధాని లేక, లోటుబడ్జెట్‌తో కొత్త రాష్ర్టం ఏర్పడితే దాని భవిష్యత్తేంటో తెలిసీ, కాంగ్రెస్ సర్కార్ సీమాంధ్రను నిలువునా ముంచేసింది. దానికి తగిన ఫలం కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లోకాక, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అనుభవిస్తోందనుకోండి.. అది వేరే విషయం.

అయినా, రాజకీయ పార్టీలకు వంచించడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఆ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ‘ఆ తానులో’ గుడ్డలే అనాల్సి వస్తుందంటే, గడచిన ఎనిమిది నెలలుగా కేంద్రంలోని మోడీ సర్కార్, ఆంధ్రప్రదేవ్ విషయమై అనుసరిస్తున్న వైఖరే కారణం అన్నది సగటు సీమాంధ్రుడి ఆవేదన. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసుకోవాలి.. అంటూ జాతీయ స్థాయి బీజేపీ నేతలు, ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేతలకు తీసుకుంటున్న క్లాస్ గురించి నిత్యం వింటూనే వున్నాం. ‘టీడీపీ తప్ప, ఏ పార్టీ నుంచి నేతలు వచ్చినా ఆహ్వానిస్తాం..’ అని చెబుతున్నారు బీజేపీ నేతలు నిస్సిగ్గుగా. కాంగ్రెస్ పార్టీనీ, ఆ పార్టీకి చెందిన నేతల్నీ ప్రజలు తిరస్కరించారు గత ఎన్నికల్లో. ఉమ్మడి తెలుగు రాష్ర్ట విభజనే దానికి కారణం. దురదృష్టవశాత్తూ ఎన్నికలకు ముందూ కొందరు నేతలు టీడీపీలోకి జంప్ చేసి, ఆ పార్టీ నుంచి ఎంపీలుగానూ, ప్రజా ప్రతినిథులుగానూ ఎంపికై, ‘విభజన మచ్చ’ని తుడిచేసుకున్నారు. టీడీపీ సంగతి కాస్సేపు పక్కన పెడితే, ఏపీలో పార్టీ బలోపేతం మీద పెట్టిన శ్రద్ధ, బీజేపీ అధిష్టానం, ఎన్నికల సమయంలో ఏపీకి పార్టీ పరంగా తాము ఇచ్చిన హామీల్ని, ప్రచార సారధిగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల్ని పక్కన పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

ఇక, టీడీపీ విషయానికొస్తే.. ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేస్తున్నాం.. అంటూనే, డాబుకు పోయింది టీడీపీ సర్కార్. ప్రత్యేక విమానాల్లో ప్రయాణాల మీద పెట్టిన శ్రద్ధ, ప్రత్యేక హోదాను సాధించడమ్మీద పెట్టలేకపోయారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఎనిమిది నెలలు తిరిగేసరికి ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయ్యిందని తెలిసింది బాబుగారికి. ఇపడేమో, కేంద్రమే ఆదుకోవాలంటున్నారు చంద్రబాబు. ఎన్డీయే సర్కార్ మాత్రం, ‘ఇతర రాష్ట్రాల్ని ఒప్పించాలి’ అంటూ ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై మాట్లాడుతోతంది. వాటి సంగతి తేలితే తప్ప, ఏపీ ఆర్థిక కష్టాల నుంచి బయటకు పడే అవకాశమే లేదు. ప్రధానిగా నరేంద్ర మోడీకి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తెలియకుండా వుంటుందా.? కాంగ్రెస్ తల్లిని చంపేస్తే, బీజేపీ, బిడ్డను ఆకలితో చంపేస్తోందన్న విమర్శలకు ఆయన ఏం సమాధానమిస్తారు.? ఏపీ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో, ఇది ‘వంచన’ అని సగటు సీమాంధ్రుడు ఆరోపిస్తే అది తప్పవుతుందా.!

వెంకట్ ఆరికట్ల