అయోమయాంధ్రప్రదేశ్.!

ప్రత్యేక ప్యాకేజి అయోమయం..  ప్రత్యేక హోదా  దూరం దూరం.. Advertisement సాయంత్రం ఢిల్లీ నుంచి హైద్రాబాద్‌కి విమానంలో చేరుకోవడం… పొద్దున్నే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన కోసం మళ్ళీ విమానయానం… మిగులు బడ్జెట్ తెలంగాణతో పోటా పోటీగా…

ప్రత్యేక ప్యాకేజి అయోమయం.. 
ప్రత్యేక హోదా  దూరం దూరం..

సాయంత్రం ఢిల్లీ నుంచి హైద్రాబాద్‌కి విమానంలో చేరుకోవడం… పొద్దున్నే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన కోసం మళ్ళీ విమానయానం…
మిగులు బడ్జెట్ తెలంగాణతో పోటా పోటీగా లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు..
కోటి జనాభా వున్న నగరాన్ని కలిగిన తెలంగాణలో ఒకటే మెట్రో రైలు ప్రాజెక్ట్. అదీ రాజధాని హైద్రాబాద్‌లో. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మూడు చోట్ల మెట్రో రైలు ప్రతిపాదనలు.
లోటు బడ్జెట్ మొర్రో.. అంటూనే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ లబ్ది కోసం చంద్రన్న కానుకలు..

ఇవి చాలవా? ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవాల్సిన అవసరమేమీ లేదని కేంద్రం అనుకోవడానికి.? రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, జపాన్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమంటే చిన్న విషయమేమీ కాదు. ఎంతగా ఏపీ ఖజానా పొంగి పొర్లితే తప్ప, ఆ రాష్ర్టం ఇలాంటి వైపరీత్యాలకు దిగుతుంది.? అన్న అనుమానం కలగడం సహజమే ఎవరికైనా. అందునా, కేంద్రంలో వున్నది నరేంద్ర మోడీ సర్కార్. అభివృద్ధి చెందిన రాష్ర్టం గుజరాత్‌ని ఆ స్థాయికి తీసుకొచ్చిన నరేంద్ర మోడీకి ఎన్ని డక్కామక్కీలు తిని వుండాలి.! ఏపీ సర్కార్ చేస్తోన్న పబ్లిసిటీ స్టంట్లు.. ప్రదర్శిస్తున్న డాబులు కేంద్రానికి క్లియర్‌గా కన్పిస్తున్నాయి.

డాబు అంటేనే బాబు.!

విజయవాడతోపాటు విశాఖలో మెట్రో రైలుకు శరవేగంగా పరుగులు తీస్తోంది ఏపీ సర్కార్.. అన్న విషయమొక్కటి చాలు, కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌పై ఓ అవగాహన రావడానికి. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న ఫీట్లు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టీడీపీ నాయకులు, మంత్రులు చేస్తున్న ‘డాబు’ వ్యాఖ్యలైతే అన్నీ ఇన్నీ కావు. కళ్ళ ముందు స్వర్గం చూపించేస్తోంటే, అదేదో నిజమని జనం అనుకోవడంలేదుగానీ, ప్రపంచానికైతే ‘ఏదో వుంది’ అన్న భ్రమ కలగకమానదు. దేశంలో ప్రతి రాష్ర్టం ఏపీ గురించి ఇప్పుడేమీ తక్కువ మాట్లాడుకోవడంలేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవాల్సిన అవసరమే లేదన్న అభిప్రాయం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వుంది. అందుక్కారణం, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలు, చేస్తున్న పనులే.

కొంప ముంచిన విజన్

ఏడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ పాత పేరుతో కొత్తగా లోటు బడ్జెట్‌తో ఏర్పడింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు కూడా. ఈలోగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కోసం కొత్త విజన్‌ని అసెంబ్లీలో ప్రకటించేశారు. జిల్లాకి ఓ ఎయిర్ పోర్ట్ కట్టేస్తారట. స్మార్ట్ సిటీలట, మెట్రో నగరాలట.. ఇంకేవోనట. డబ్బులెక్కడినుంచి వస్తాయ్? అన్న ప్రశ్నకు మాత్రం చంద్రబాబు దగ్గర సమాధానమే లేదు. ‘నేను మాట అన్నానంటే చేసి చూపిస్తాను.. నా సంగతేంటో ప్రజలకు తెలుసు’ అన్నారు చంద్రబాబు. ఏదీ, ఒక్క స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అయినా ఈ ఏడు నెలల్లో పట్టాలెక్కిందా.? అంటే దానికీ చంద్రబాబు వద్ద నో ఆన్సర్. అయితే చంద్రబాబు విజన్ కారణంగా ఓ ప్రయోజనం కలిగింది. అదీ తాత్కాలిక ప్రయోజనమే. అదే రిజిస్ట్రేషన్ల ఆదాయం. రాష్ర్టంలో మారుమూల గ్రామాల్లోనూ రియల్ వెంచర్లు వెలిశాయి. తద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. అయితే రాను రాను అది కూడా చతికిలపడింది. తక్కువలో తక్కువ 2000 రూపాయలు పలుకుతోంది గజం ధర ఆంధ్రప్రదేశ్‌లో ఏ మూలకి వెళ్ళినా. ఇది మారుమూల గ్రామాల్లో పరిస్థితి. రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారినా, దాని వల్ల ప్రభుత్వానికి ఒనగూరిన ప్రయోజనం పెద్దగా లేదు. కానీ, ప్రపంచం దృష్టిలో మాత్రం, ఆర్థిక బలుపు ఆంధ్రప్రదేశ్‌గా ముద్ర పడింది. విజన్ కొంప ముంచింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

మాటల పెట్టుబడులు

టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి అయితే పెట్టుబడులు ఏపీకి ప్రవాహంలా వస్తున్నాయని సెలవిచ్చారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రే ఇంతలా ఏపీ పట్ల డాబు కబుర్లు చెబితే, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి విదిలింపులు కాక, ప్యాకేజిలూ ప్రత్యేక హోదా లు ఎందుకు ఇస్తుంది.? ఛాన్సే లేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఏడు నెలల్లో ఏర్పాటయ్యింది లేదు. విశాఖలో ఐటీ రంగం అద్భుతంగా వెలిగిపోతుందన్నారు. ఒక్క పరిశ్రమా రాకుండానే విశాఖను హుద్‌హుద్ తుపాను తుడిచిపెట్టేసింది. ఐటీ సంగతి దేవుడెరుగు, విశాఖను పునర్నిర్మాణం చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. బిర్లా అన్నారు, అంబానీ అన్నారు, ఇంకెవరో అన్నారు. ఇవన్నీ ఇప్పటికి మాటలేక పరిమితమయ్యాయి. భవిష్యత్ గందరగోళంగానే కన్పిస్తోంది తప్ప ఎక్కడా క్లారిటీ లేదు. పెద్ద పెద్దోళ్ళతో ఫొటోలకు పోజులిస్తున్న చంద్రబాబు, జనం మధ్యకు వచ్చి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇదీ దీన్ని తీసుకొచ్చాను.. అని చెప్పలేని దుస్థితి. వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని పెదబాబు చంద్రబాబే కాదు, చినబాబు నారా లోకేష్ కూడా చెప్పారు. ఏవీ ఆ పెట్టుబడులు? ఎక్కడ పెట్టారు.? రుణమాఫీ అన్నారు.. అదెక్కడిదాకా వచ్చింది? అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది పరిస్థితి.

కాలు కింద పెట్టడానికెంత కష్టమో.!

‘నేను జనం మనిషిని’ అని చెప్పుకునే చంద్రబాబు, గడచిన ఏడు నెలల్లో నేలమీద నడిచినదానికన్నా, విమానాల్లో తిరిగిందే ఎక్కువేమో. పెట్టుబడులు రాబట్టడానికి.. అంటూ వివిధ దేశాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు, దేశీయంగానూ అనేక పర్యటనల్లో బిజీబిజీగా వున్నారు. పర్యటనకు కోట్లు ఖర్చువుతాయన్నది అందరికీ తెల్సిన విషయమే. ఆ ఖర్చులో సగం అయినా పెట్టుబడి రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిందా.? అంటే, ఇప్పటికిప్పుడు ఎందుకొస్తుంది.. భవిష్యత్ అంతా బంగారు లోకమే అని చెబుతారు తెలుగుదేశం పార్టీ నాయకులు. హైద్రాబాద్‌లో ఒక కాన్వాయ్, విజయవాడలో మరో కాన్వాయ్.. దానికి అదనంగా ఇంకో కాన్వాయ్. ఇదీ ప్రజాధనం దుర్వినియోగమవుతున్న తీరు. చంద్రన్న కానుకల మీదా, చంద్రన్న పర్యటనలమీదా వున్న శ్రద్ధ, అభివృద్ధో రామ‘చంద్రా’ అంటోన్నవారి మీద లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ‘మా ముఖ్యమంత్రి నేలమీద నడవడు.. గాల్లోనే చక్కర్లు కొడ్తాడు..’ అని జనం అసహనంతో మాట్లాడుకుంటున్నారంటే, ఏపీ ప్రజానీకం టీడీపీని గద్దెనెక్కించింది ఎంత పశ్చాత్తాపంలో వున్నారో అర్థం చేసుకోవచ్చు. విమానాల్లో తిరిగినా మీ కోసమే.. అని చంద్రబాబు చెప్పుకోవచ్చుగాక. రేపు కాకపోతే ఎల్లుండి.. కాకపోతే వచ్చే ఏడాది.. అదీ కాకపోతే పదేళ్ళ తర్వాత అయినా హైద్రాబాద్‌ని ఖాళీ చెయ్యాల్సిందే. మరి, అలాంటప్పుడు తాత్కాలిక రాజధానిలోనో ఇంకెక్కడో హైద్రాబాద్‌తో సమానంగా ఓ కార్యాలయాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ, దానికి చంద్రబాబు మనసొప్పుకోవడంలేదేమో.

చంద్రబాబు చెప్పినదాంట్లో ఇదొక్కటీ నిజం

‘హైద్రాబాద్‌లో వుండి ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలిస్తోంటే విదేశాల్లో వున్నట్టుంది..’ ఈ మాట చంద్రబాబు అన్నారంటూ పెద్ద వివాదమే తెరపైకొచ్చింది. ఆయన అన్నారో లేదోగానీ, ఇదే అర్థం వచ్చేలా ఇలాంటి డైలాగ్ ఆయన గతంలోకూడా చెప్పారు. చెట్టుకింద నుంచైనా సరే ఆంధ్రప్రదేశ్ నుండే పరిపాలన సాగిస్తా.. అని ఎప్పుడో చెప్పిన చంద్రబాబు, ఇప్పటిదాకా ఆ పని చెయ్యలేదు. ఎంచక్కా హైద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి వంటి ఏపీలోని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ వున్నప్పుడు, విమాన‘బాబు’ హైద్రాబాద్ నుంచి కాలు కదపడానికి ఎందుకు ఇష్టపడతారు.?

కేంద్రంతో సఖ్యత ఇలాగేనా.?

జపాన్‌తో సంప్రదింపులు జరిపేటప్పుడుగానీ, సింగపూర్‌తో మంతనాలు జరిపేటప్పుడుగానీ.. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ముందుంచాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై వుంది. మామూలుగా అయితే ఇదేమీ ‘మస్ట్ అండ్ షుడ్’ కాదు. కానీ, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌లో వుంది. ‘మీ ప్రమేయంతో..’ అన్న సంకేతాలు కేంద్రానికి పంపాలంటే, అన్ని విషయాల్లోనూ కేంద్రాన్ని కలుపుకుపోవాల్సి వుంటుంది ఏపీ సర్కార్. దురదృష్టవశాత్తూ అది జరగడంలేదు. ప్రపంచానికి పాఠాలు నేర్పాను నేను.. అని చంద్రబాబు చెబుతోంటే, నరేంద్ర మోడీకి అయినా ఇగో హర్ట్ అవకుండా వుంటుందా.? ఏ రాష్ట్రానికి ఆ రాష్ర్టం కొంతమేర సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం వున్నా, ఆంధ్రప్రదేశ్‌ది ప్రత్యేకమైన పరిస్థితి. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ అర్థం చేసుకోవడంలేదు. ఎప్పటికైనా అర్థం చేసుకుంటారో లేదో తెలియడంలేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం వున్నా, కేంద్రంతో సఖ్యత లేకపోవడమంటే అది టీడీపీకి కాదు నస్టం, ఆంధ్రప్రదేశ్‌కి. ‘మీ ముఖ్యమంత్రి సమర్థుడు.. ఆయనకు అన్నీ తెలుసు..’ అనేసి ఊరుకుంటున్నారు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నేతలు. ‘అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం..’ అంటూనే, ‘అన్నీ తెలిసిన అనుభవజ్ణుడు వున్నాడు కదా..’ అని కేంద్రం చేతులు దులుపుకుంటుండడంతో అయినా, టీడీపీ అధినేత చంద్రబాబు మేల్కొనాల్సి వుంది.

చూస్తుండగానే చంద్రబాబు డాబులతో ఏడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకంగా అందినదేమీ లేదు. జూన్ 2కి ముందు ఎలాంటి అయోమయం వుందో.. ఇప్పుడూ అదే అయోమయం వుంది. గడచిన ఏడు నెలల్లో చంద్రబాబుకి కాన్వాయ్‌లు వచ్చాయి.. ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం, కేంద్రం నుంచి విదిలింపులు తప్ప ప్రత్యేక ప్యాకేజి రాలేదు, ప్రత్యేక హోదా  దక్కలేదు. భవిష్యత్తులో దక్కుతుందన్న ఆశా కన్పించడంలేదు. ఎటు చూసినా అయోమయం. లోటు బడ్జెట్‌తో గందరగోళం. ఇదంతా చంద్రబాబు నిర్వాకం. వద్దన్నా వచ్చి పడింది విభజన పిడుగు సీమాంధ్రపైన.. కోరుకుంటే వచ్చింది చంద్రబాబు పరిపాలన సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్)లో.. కానీ విభజనతో జరిగిన నష్టం.. చంద్రబాబు పరిపాలనలో పూడ్చబడలేదు సరికదా.. ఆ నష్టం కొనసాగుతోందంతే.

సింధు