విశ్వ నగరమా? చెత్త నగరమా?

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎలాంటి నగరం? ఇది విశ్వ నగరమా? చెత్త నగరమా? మొన్నటివరకూ హైదరాబాద్ అందమైన నగరం. ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాల్లో ఇది ఐదో స్థానంలో ఉంది. ఇప్పుడే కాదు నిజాం హయాం…

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎలాంటి నగరం? ఇది విశ్వ నగరమా? చెత్త నగరమా? మొన్నటివరకూ హైదరాబాద్ అందమైన నగరం. ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాల్లో ఇది ఐదో స్థానంలో ఉంది. ఇప్పుడే కాదు నిజాం హయాం నుంచీ ఐదో స్థానంలోనే ఉంది. ఈ మాట అనేకమంది అనేకసార్లు చెప్పారు. కేసీఆర్ కూడా ఇదే అన్నారు. అలాంటి నగరాన్ని ఆయనే ఇప్పుడు చెత్త నగరమని అంటున్నారు. ‘‘హైదరాబాద్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. నగరాన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మరింత ఘోరంగా తయారవుతుంది. హైదరాబాద్‌కు పట్టిన జబ్బు వదలాలంటే సాధారణ వైద్యం సరిపోదు. శస్త్రచికిత్స చేయాల్సిందే’’…ఇదీ కేసీఆర్ అభిప్రాయం. 

ప్రచారం అంతర్జాతీయం….నగరం సమస్యల నిలయం

హైదరాబాద్ అంతర్జాతీయ నగరమని కేసీఆరే కాదు అన్ని పార్టీల నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు చెబుతుంటారు. ఇతర దేశాధినేతలు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్‌ను యమ పొగిడారని మీడియాలో వార్తలు వస్తుంటాయి. కాని అంత సీన్ లేదని కేసీఆర్ మాటలను బట్టి అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ అనేకసార్లు హైదరాబాద్ పరిస్థితి బాగాలేదని చెప్పారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, తన హయాంలోనే హైటెక్ సిటీగా మార్చానని రాష్ర్ట విభజన తరువాత కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. దీనిపై కేసీఆర్ మండిపడి ‘దీన్ని హైటెక్ సిటీగా కాదు…లోటెక్ సిటీగా మార్చారు’ అని విమర్శించారు. ఇదే కేసీఆర్ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల వద్ద, పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా పొగిడి వారిని ఆహ్వానిస్తుంటారు. ఇప్పుడేమో చెత్త నగరంగా చెబుతున్నారు. కొంతకాలం క్రితం హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను నియమించిన కేసీఆర్ ఆమెకు కోటి రూపాయలు నజరానాగా సమర్పించారు కూడా. అంటే సానియా ఓ చెత్త నగరానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నట్లా? హైదరాబాద్‌లోని సమస్యల పరిష్కారానికి సాధారణ వైద్యం పనికిరాదని, శస్త్రచికిత్స అవసరమని కేసీఆర్ చెబుతుదాన్ని కాదనలేం. రోజూ కొన్ని ప్రాంతాలు కాలి నడకన తిరిగితే హైదరాబాద్ ఎంత అందంగా ఉందో అర్థమవుతుంది. దుర్గంధం వెదజల్లే భారీ చెత్తకుప్పలు, కంపుకొట్టే నాలాలు, గతుకుల, గుంతల రోడ్లు, అస్తవ్యస్తంగా ట్రాఫిక్….చెప్పుకుంటూపోతే హనుమంతుడి తోకంత అవుతుంది. వానాకాలం హైదరాబాద్ నరకానికి నకలుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా ప్రాంతాల్లో కార్లు మునిగిపోయేంత నీళ్లు నిలిచిపోతాయని కేసీఆర్ కూడా చెప్పారు. ప్రతి ఏడాది వానా కాలంలో నాలాల్లో పడి ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో లెక్క లేదు. నగరాన్ని మంచినీటి కొరత పీడిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆరేడు వందల అడుగుల లోతున బోర్లు వేసినా నీరు లేదు. కేసీఆర్ చెబుతున్న సమస్యల్లో దేన్నీ కొట్టిపారేయలేం. ఆయన చెబుతున్నదాని ప్రకారం హైదరాబాద్ చెత్త నగరాల జాబితాలోకి చేరుతుందిగాని విశ్వ నగరాల జాబితాలో చేరదు. 

చెత్త నగరమైనా చారిత్రక ప్రాధాన్యముంది

ఇదిలావుంటే… చూడదగిన ప్రపంచ పర్యాటక స్థలాలున్న నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని గత ఏడాది నవంబరులో నేషనల్ జియోగ్రాఫికల్ వాల్ట్ ఆర్గనైజేషన్ చేసిన సర్వే తేల్చింది. ఈ జాబితాలో తొలి స్థానం శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రెసిడియో పార్కు దక్కించుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెర్మెట్, వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్, ఫ్రాన్స్‌లోని కోర్సికా …ఇలా పలు ప్రదేశాలు పర్యాటకలు తప్పకచూడదగినవి. అయితే వీటన్నింటినీ తలదన్ని హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది. 2015లో హైదరాబాద్ ప్రపంచంలోనే చూదదగిన నగరమని ట్రావెలర్ మేగజైన్ తెలియచేసింది. పర్యాటకులకు కనువిందు చేసే చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలు హైదరాబాద్‌లో ఎన్నో ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల రాచరిక పాలనకు హైదరాబాద్ సజీవ సాక్ష్యం. ఇక్కడి నిర్మాణాలు చారిత్రక ప్రాధాన్యం ఉన్నవేకాకుండా ఆర్కిటెక్చర్ పరంగా కూడా అబ్బురపరిచేవిధంగా ఉంటాయి. చార్మినార్, అసెంబ్లీ భవనాలు, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోట, తారామతి బారాదరి, సాలర్జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, జూపార్క్, ఆధునిక నిర్మాణమైన హైటెక్ సిటీ….ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఇంత చారిత్రక ప్రాధాన్యమున్న ఈ నగరం అనేక సమస్యలతో అల్లకల్ల్లోలంగా ఉండటమే విచారించదగ్గ విషయం. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు, సెలబ్రిటీలు ఈ చారిత్రక పర్యాటక ప్రాంతాలను, సంపన్నులు నివసించే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ, మణికొండ, నెక్లెస్ రోడ్డు…ఇలా కొన్ని చూసి (చూపించి) ‘ఆహా…హైదరాబాద్ ఎంత అందమైన నగరం…! బ్యూటిఫుల్’ అని మెచ్చుకుంటారు. అసలు సమస్యలు వారికి తెలియవు. ప్రపంచ పర్యాటక నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో వచ్చేసరికి ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని వారసత్వ సంపద గల  నగరం (హెరిటేజ్ సిటీ) గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు.  

వాస్తు మార్పుల కంటే సమస్యల పరిష్కారం ముఖ్యం

హైదరాబాద్ నగర సమస్యలపై ఇంతగా కలవరపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా వాటిని పరిష్కరించే పని పెట్టుకోవాలి. విదేశీ పర్యాటకులు, సెలబ్రిటీలు నగరాన్ని ఎంతగా ప్రశంసించినా స్థానిక ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి కదా…! పర్యాటకులు వెళ్లే అనేక విదేశాలు ఎంతో శుభ్రంగా, చక్కటి వాతావరణంతో ఉంటాయి. ముఖ్యంగా రోడ్లు చాలా బాగుంటాయి. సరస్సులు, కొలనులు, చెరువులు మొదలైన నీటి వనరులు ఆహ్లాదకరంగా ఉంటాయి. చక్కటి ప్రజా రవాణా వ్యవస్థ ఉంటుంది. హైదరాబాదును కూడా ఆ విధంగా తీర్చిదిద్దితే అంతర్జాతీయ నగరమని నిజాయితీగా, గర్వంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వ నగరం చేస్తానని పదే పదే చెబుతున్నారు. ఏవేవో విదేశాల పేర్లు వల్లిస్తూ వాటి మాదిరిగా చేస్తానంటున్నారు. అలా చేయాలంటే ముందుగా మౌలిక సమస్యలు పరిష్కరించాలి. కాని కేసీఆర్ ఇప్పుడు వాస్తు పేరుతో సచివాలయం మారుస్తానని, ఛాతీ ఆస్పత్రి మారుస్తానని, అసెంబ్లీ అమ్మేస్తానని ఏవేవో మాట్లాడుతూ గందరగోళం చేస్తున్నారు. అవి అమ్మేసి, ఇవి అమ్మేసి, అవి కూల్చి, ఇవి కూల్చి మొత్తం మీద హైదరాబాద్ స్వరూపాన్నే మార్చేస్తానంటున్నారు. రవీంద్ర భారతి వంటి కళా ప్రాంగణాలను కూడా కూలగొడతానంటున్నారు. ఆయన ఏక కాలంలో కొన్ని వందల ప్రకటనలు చేస్తున్నారు. నిర్ణయాలు ప్రకటించేస్తున్నారు. చివరకు నగరాన్ని ఏం చేస్తారోనని ప్రజలకు దిగులు పట్టుకుంది. 

వీడని విదేశీ జపం

అధికారానికి వచ్చిన కొత్తల్లో సింగపూర్ చేస్తానన్నారు. కౌలాలంపూర్ చేస్తానన్నారు. ఆయా దేశాలకు వెళ్లివచ్చారు కూడా. కొన్నాళ్ల క్రితం పాత బస్తీకి వెళ్లి దాన్ని ఇస్తాంబుల్ నగరంలా చేస్తానన్నారు. ఓసారి కొందరు బ్రిటన్ ప్రతినిధులు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వెంటనే ఈయన తెలంగాణను చదవుల్లో లండన్ మాదిరిగా చేస్తానన్నారు. కొద్ది రోజుల కిందట టునీషియా ప్రతినిధులు కేసీఆర్‌ను కలుసుకున్నారు. హైదరాబాద్‌ను టునీషియాలా చేస్తానని ప్రకటించారు. జనవరి ఒకటో తేదీనాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభించిన కేసీఆర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నగరాన్ని ‘సిగ్నల్స్ ఫ్రీ సిటీ’గా మారుస్తామన్నారు. ఆ వెంటనే దీన్ని డల్లాస్ నగరంలా తీర్చిదిద్దుతామన్నారు. ఆయన బుర్రకు ఏ నగరం తడితే దానిలా మారుస్తానని అనడం ఒక ఆనవాయితీగా మారింది. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశహర్య్మాలు కడతానన్నారు. ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేని ఎత్తయిన ఆకాశ హర్య్మం నిర్మిస్తామన్నారు. ఇలా హైదరాబాద్ గురించి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. ఈయన ధోరణి చూస్తున్న ప్రతిపక్ష నేతలు ‘బంగారు తెలంగాణ చేసే సంగతి తరువాత కనీసం మట్టి తెలంగాణగానైనా ఉంచుతారా?’ అని ప్రశ్నిస్తున్నారు. 

ఎం.నాగేందర్