రామ్ చరణ్ – శ్రీనువైట్ల కాంబినేషన్ సినిమాకు సంగీతం దర్శకుడిగా అనిరుధ్ ఫిక్సయ్యాడు. బాగానేవుంది. కానీ అనూప్ రూబెన్స్ ఎందుకు వీళ్ల కంటికి ఆనలేదు అన్నది టాలీవుడ్ లోపాయికారీ చర్చ. థమన్ రొడ్డ కొట్టుడు, దేవీ బిజీ బిజీ నేపథ్యంలో సరైన మ్యూజిక్ డైరక్టర్ కొరత స్పష్టంగా కొట్టవచ్చినట్ల కనిపించినపుడు అనూప్ తెరపైకి వచ్చాడు. వరుస హిట్ లతో ముందుకు వెళ్తున్నాడు.
మనం తరువాత, పిల్లా నువ్వులేని జీవితం, గోపాల గోపాల, టెంపర్ వంటి సినిమాలు చేసాడు. గోపాల గోపాల మ్యూజిక్ విని, పవర్ స్టార్ ఫ్లాట్ అయిపోయి, తన తరువాత సినిమా అనూప్ కే అని స్టేజ్ మీదే ప్రకటించేసాడు. మరి రామ్ చరణ్ కు ఎందుకు పట్టలేదన్నది అనుమానం. ఎన్టీఆర్ కూడా రభస టైమ్ లో అనూప్ వద్దని, ఇప్పుడు టెంపర్ కు ఓకె అన్నాడు.
మెగా బ్యాచ్ లో ఇప్పటికి అనూప్ పవన్ కు, సాయిధరమ్ తేజ సినిమాలకు మాత్రమే సంగీతం అందించాడు. చిత్రంగా, సాయి ధరమ్ తేజ సినిమా వెనుక, పవన్ కళ్యాణ్ సలహాలు, సూచనలు, సహాయాలు వున్నాయని టాక్ వుంది. అభిమానులు చాలా మంది అది నిజమే అంటారు కూడా.
మరి పవన్ కు నచ్చాడనే రామ్ చరణ్ ఇటు దృష్టి పెట్టలేదా అన్న అనుమానం కలుగుతోంది. అనిరుధ్ ట్రాక్ రికార్డు ఓకె కానీ మరీ సూపర్ డూపర్ అనలేం. పైగా తెలుగు ఆడియన్స్ కు కావాల్సిన మాస్ మ్యూజిక్ ఇవ్వాల్సి వుంది. ఆ తరహా ట్యూన్లు రాబట్టుకోవాల్సిన బాధ్యత శ్రీనువైట్ల పై వుంది మరి. బహుశా రామ్ చరణ్ కు దీని తరువాతి వెంచర్ కైనా అనూప్ నచ్చుతాడేమో?