కాషాయం కాషాయమే, పసుపు పసుపే. మోడీ మోడీయే, బాబు బాబే. పొత్తు పొత్తే, యెత్తు యెత్తే. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, తెలుగు దేశం పార్టీల స్నేహం రాను రాను మరీ చికెన్‌లో ఇంగువ వేసినట్టు తయారయింది. చూడ్డానికి కలిసినట్టే వుంటుంది. రుచి చూస్తే తెలుస్తుంది.
బీజేపీ తన జాగ్రత్తలో తాను వుంది. తెలుగుదేశం అంటే బాబు, బాబు అంటే తెలుగుదేశం అయ్యాక, ఆ పార్టీతో ‘పొత్తు’ అంటే ఎలా వుంటుందో అన్ని రాజకీయ పార్టీలకూ తెలిసిపోయింది. ఇందులో ‘కుడి’ ‘ఎడమ’ ల తేడా లేదు. అందరికీ బాబు ఒకే అనుభవం మిగిల్చారు. కొన్నాళ్ళు కమ్యూనిస్టులు పెట్టుకున్నారు. పర్యావసానంగా వారి సంఖ్యను ‘ఒకట్ల’ సంఖ్యలోకి కుదించుకున్నారు. ఇదే బీజేపీ వారు (1999లో) బాబుతో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత కాలం వారు కూడా ‘పదుల’ స్థానం నుంచి ‘ఒకట్ల’ స్థానంలోకి వచ్చేశారు.
రెండు పదవీ కలాల పాటు, శాసన సభలో బీజేపీకి ‘జంట కమాలలే’ వుండేవి( అనగా ఇద్దరేసి మాత్రమే ఎన్నికయ్యే వారు.). పొత్తు వున్నప్పుడు బాగానే వుంటుంది కానీ, ముగిశాక ‘చిత్త’ వ్వటం ఖాయమనే నిర్ధారణకు ఈ పార్టీలు ఎప్పుడో వచ్చేశాయి. అందుకే పలు సందర్భాల్లో ఈ పార్టీల నేతలు బాబు కౌగిలిని ధృతరాష్ర్ట కౌగిలితో పోలుస్తూ వచ్చారు.(భీముడంతటి బలాఢ్యుణ్ణి సైతం తన కౌగిలి లో పిప్పి పిప్పి చెయ్యగల శక్తిమంతుడు ధృతరాష్ర్టుడు.) అయితే ఈ రహస్యం పూర్తిగా తెలిసే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తుపెట్టుకున్నది. ఫలితంగా రాష్ర్టంలో టీడీపి గెలిచింది. అయితే ఈ పొత్తు పాలనలో కూడా కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే, ఏం జరుగుతుంతో బీజేపీ వ్యూహ కర్తలు ముందే ఊహించారు. బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతం చెయ్యటానికి ఏమేం చెయ్యాలో అవన్నీ చేశారు.
ఆరు నెలలు గడిస్తే, వారు వీరవుతారంటారు. ఆరు నెలలేమిటి? కలసి పాలన మొదలు పెట్టి ఏడు నెలలు గడచి పోయాయి. వారు వీరూ కాలేదు; వీరు వారూ కాలేదు. రెండూ రెండు పాయల్లాగానే వుండి పోయాయి. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రంగ ప్రవేశం చేశారు. బీజేపీతో కలసి వుండాలా? తెగతెంపులు చేసుకోవాలా? అనే ప్రశ్న ఉదయించింది. ఎందుకంటే, కేంద్రంలో సర్కారు టీడీపీ మద్దతు లేకుండా కూడా కొనసాగగలదు. కలసి వుంటే బీజేపీ గతంలో లాగే క్షీణించటం మొదలవుతుంది. ఇప్పటికిప్పుడు విడిపోతే, బీజేపీకి నష్టం వుండదుకానీ, లాభం కూడా వుండదు.
అందుకే ‘విడాకుల’కీ, ‘కాపురాని’కీ మధ్యస్తస్థితిని ఒకదానిని అమిత్ షా కనుగున్నారు. అదే ‘విడి కాపురం’. లోకుల కోసం ఒకే ఇంటిలో వుంటూ కాపురం చేస్తున్నట్టు వుంటారు కానీ, ఎవరి పొయ్యి వారిది. అంటే, వీధిన పడి విమర్శ చేయకుండా, లోపల వుంటూనే ‘సన్నాయి నొక్కులు’ నొక్కటం.
అయితే ఈ ‘నొక్కు’లేవో బహిరంగంగా నొక్కుదామాని ఒక వర్గమూ, లేదూ, లోపలే నొక్కుదామని మరొక వర్గమూ బీజేపీలో అన్నాయి. వెలుపలకొచ్చి విపక్షంలా నిగ్గదీద్దామని ‘కొత్త తరం’ కార్యకర్తలూ, లోపల వుండే ‘పొగ’ పెడదామని పాత తరం నేతలూ అన్నారు. మొత్తానికి రెండూ పక్కనే పక్కనే అమలు జరుగుతున్నాయి.
అయితే తెలుగుదేశం పార్టీని దిగ్బంధనం చేసే వ్యూహాన్ని కొంత కేంద్రం నుంచి కూడా అమలు జరుగుతున్నాయి. బాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో అధిక భాగం కేంద్రం సహకారం లేకుండా జరగవు. ఇప్పుడు దాదాపు రాష్ర్ట ఖజానా డొల్లయింది. ‘పథకాలు బాబువి; నిధులు కేంద్రానివి’ అనే విధానానికి బీజేపీ చెల్లు చీటీ ఇవ్వబోతోంది. కేంద్రం నుంచి విడుదల చేసే ప్రతీ ‘పైసా’కోసం, బాబు ఢిల్లీకి పది సార్లు చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. అంటే బాబును ఏ ముఖ్యమైన హామీనీ పూర్తిగా అమలుచేయలేని స్థితికి తేవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది.
ఈ మాత్రం వ్యూహం కోసం ఏడు నెలలు ఉపేక్షించాల్సివచ్చిందా? అన్నది ప్రశ్న. నిజానికి పొత్తుపెట్టుకున్న తొలిరోజు నుంచే, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పాచికలను వేస్తోంది. ముందుగా 2014 ఎన్నికలలో కాంగ్రెస్ మట్టికరచిన కారణంగా ‘రాజకీయ నిరాశ్రయులయిన’ వారికి, బీజేపీ ఆశ్రయం కలిగిస్తూ వస్తుంది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైయస్సార్‌కాంగ్రెస్ మీద కన్ను వేసింది.
కాంగ్రెస్, వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీలలో వున్న ‘రెడ్డి’ సామాజిక వర్గం వారికి బీజేపీని ఒక ప్రత్యామ్నాయంగా సిధ్ధం చేయాలన్నది బీజేపీ ముందుగానే వేసుకున్న వ్యూహం. అయితే ‘కమ్మ’ సామాజిక వర్గానికి అప్రకటిత రాజకీయ వేదిక గా వుంటూ వస్తూన్న టీడీపీతో కలసి వున్నంత కాలమూ, ఈ కల నెరవేరదు. పైపెచ్చు రెంటికీ అనుసంధాన కర్త గా అదే సామాజిక వర్గానికి చెందిన వెంకయ్యనాయుడు ఈ రెండు పార్టీల చెలిమిని గతంలో కాపాడుకుంటూ వచ్చారన్న అభిప్రాయం పలువురిలో వుంది. కాబట్టి అమిత్ షా పాచిక అంత సులభంగా ఆంధ్రప్రదేశ్‌లో పారదు.
అయినప్పటికీ, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా అష్ట దింగ్బంధనం చెయ్యటానికి బీజేపీ కంకణం కట్టుకున్నదీ అన్న విషయం స్పష్టమవుతోంది.
సతీష్ చందర్