ఒబామా భయపడ్డారా.?

ప్రపంచాన్ని ఒంటి కన్నుతో శాసించే అత్యంత శక్తివంతుడైన అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా, ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహాల్‌ని సందర్శించేందుకు భయపడ్డారా.? ఈ ప్రశ్న చుట్టూనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భారతదేశంలో ఈ…

ప్రపంచాన్ని ఒంటి కన్నుతో శాసించే అత్యంత శక్తివంతుడైన అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా, ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహాల్‌ని సందర్శించేందుకు భయపడ్డారా.? ఈ ప్రశ్న చుట్టూనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భారతదేశంలో ఈ ఏడాది రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరు కానున్న విషయం విదితమే. ఈ టూర్‌లోనే ఒబామా, తాజ్‌మహాల్‌ని సందర్శించేందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి.

అయితే, ఒబామా తాజ్‌మహాల్‌ సందర్శనకు రావట్లేదంటూ ఆయన రక్షణ కోసం ఆగ్రాలో కొన్ని రోజులుగా పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్న అమెరికా రక్షణ అధికారులు ఆగ్రా పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు సాయంత్రంలోగా అమెరికా అధికారులంతా ఆగ్రా నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోనున్నారట.

వాస్తవానికి రిపబ్లిక్‌ డే ఉత్సవాల అనంతరం ఒబామా, ఆగ్రా చేరుకుని తాజ్‌మహాల్‌ని సందర్శించి, ఆగ్రా నుంచే అమెరికా పయనవ్వాలనేది తొలుత నిర్ణయించుకున్న టూర్‌. ఇందుకోసం ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళే రోడ్డు మార్గాన్ని అద్దంలా మార్చేశారు. తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో అయితే అనువణువూ గాలించి, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకూడదన్న కోణంలో అమెరికా భద్రతాధికారులే ప్రత్యేకంగా మోహరించారు.

ఇంతా చేశాక, ఇప్పుడేమో తాజ్‌మహల్‌ టూర్‌ని ఒబామా రద్దు చేసుకున్నారట. రద్దు వెనుక అసలు కారణం, భద్రతా పరమైన చిక్కులే అని తేలింది. ప్రపంచాన్ని శాసించే వ్యక్తి భయపడటమేంటి.. అనే డౌట్‌ రావొచ్చు ఎవరికైనా. అంత శక్తివంతమైన వ్యక్తి కాబట్టే, ఆయనకెలాంటి హానీ జరగకూడదన్న కోణంలో భద్రతాధికారులు నిర్ణయం తీసుకున్నారనుకోవాలి.