బతుకమ్మ ఆడితేనే ‘రాజకీయ’ బతుకు..!

బతుకమ్మ…ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పండుగ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ పండుగ సందడితో ఉత్సాహంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని కొత్త జోష్‌ కనబడుతోంది. కేసీఆర్‌ అధికారంలోకి రాగానే తెలంగాణలో శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న…

బతుకమ్మ…ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పండుగ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ పండుగ సందడితో ఉత్సాహంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని కొత్త జోష్‌ కనబడుతోంది. కేసీఆర్‌ అధికారంలోకి రాగానే తెలంగాణలో శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న బోనాలు, బతుకమ్మ పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించడంతో గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ రెండు పండుగల నిర్వహణకు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసింది కూడా. చారిత్రకంగా, సంప్రదాయపరంగా బతుకమ్మ తెలంగాణలో జన జీవితంలో భాగం. బతుకమ్మ పాట ఒక్కటైనా రాని తెలంగాణ మహిళ (పాత తరంలో) ఒక్కరైనా ఉండరు. బతుకమ్మకు సంబంధించిన ప్రాచీన కథలు దాదాపు అందరికీ తెలిసివుంటాయి. బతుకమ్మ పాటలు, చరిత్ర గతంలో తెలుగు వాచకాల్లో ఉండేవి. ఇప్పుడున్నాయో లేదో తెలియదు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె కవిత బతుకమ్మను ఉద్యమానికి ఆయుధంగా వాడకున్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సవాలను జాతీయ నాయకులు ఉద్యమానికి ఆయుధంగా వాడుకున్నారని, ప్రజలను ఏకం చేయడానికి, వారిలో జాతీయ భావాలు, దేశభక్తి రేకెత్తించడానికి దాన్ని సాధనం చేసుకున్నారని చెబుతారు.
     
అదేవిధంగా కవిత కూడా ‘తెలంగాణ జాగృతి’ అనే సంస్థను ఏర్పాటు చేసి ఊరూవాడా బతుకమ్మను ఆడించింది. ఆ పండుగలను తెలంగాణ ఆత్మగా సమర్థంగా ప్రచారం చేసింది. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మను ఆంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేశారని, దానికి ప్రాచుర్యం కల్పించలేదని ప్రచారం చేసి తెలంగాణ సెంటిమెంటును రాజేశారు. ఈ విధమైన వ్యూహం ఉద్యమంలో బాగా ప్రభావం చూపించింది. తెలంగాణలో ఉన్నవారు బతుకమ్మ ఆడాల్సిందేనని, బతుకమ్మ ఆడనివారు తెలంగాణ ద్రోహులనే భావన కూడా కలిగించారు. దీంతో తెలంగాణలోని అనేకమంది ఆంధ్రావారు బతుకమ్మలు ఆడారు. పాడారు. ఆంధ్రాకు చెందిన నాయకురాళ్లే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు సహా అనేకమంది నాయకులు కూడా బతుకమ్మలు ఎత్తుకున్నారు. బతుకమ్మను ఎత్తుకుంటేనే తెలంగాణ సెంటిమెంటును గౌరవించినట్లవుతుందనే భావన కలిగించారు. దీంతో తెలంగాణకు మద్దతు ఇచ్చిన బాబు వంటి నాయకులు అనేకమంది బతుకమ్మలు ఎత్తుకున్నారు. 

సాధారణంగా తెలంగాణలోని పండుగలను అక్కడి రాజకీయ నాయకులు (నాయకురాళ్లు కూడా) నిర్వహించడం, వాటిల్లో పాల్గొనడం సాధారణమే. కాని ఏనాడూ బతుకమ్మలు ఆడని ఆంధ్రావారు కూడా ఉద్యమ సమయంలో బతుకమ్మలు ఆడారు. ఇదంతా వారి భద్రత కోసం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిపిఐ తెలంగాణకు మద్దతు ఇవ్వగా, సిపిఎం సమైక్యవాదానికి కట్టుబడింది. అయితే అది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సమైక్య ఉద్యమంలోనూ పాల్గొనలేదు. అందుకు వారి కారణాలు వారికి ఉన్నాయి. అది వేరే విషయం. కమ్యూనిస్టులు (ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా) సాధారణంగా పండుగలు పబ్బాలు జరుపుకోరని, సంప్రదాయ పండుగలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ కమ్యూనిస్టు నాయకుల్లో ప్రధానంగా సీపీఎం నాయకత్వంలో మార్పు వచ్చింది. ప్రజలు సంప్రదాయంగా జరుపుకునే పండుగల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధంగా ఉన్న ప్రజా సంఘాలవారు పాల్గొనడంలేదు కాబట్టి పార్టీ ప్రజలకు దూరమైపోతోందని, తద్వారా ఎన్నికల్లోనూ, ఇతరత్రా నష్టం కలుగుతోందనే భావన కలిగింది. పార్టీ సిద్ధాంతాల పేరుతో ప్రజల పండుగల్లో పాల్గొనకపోవడంతో వారికి దూరమైపోతున్నామనే అభిప్రాయం విస్తృతంగా కలిగింది. దీంతో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని, పాల్గొనాలని నాయకత్వం నిర్ణయించింది.

అందుకనుగణంగా ఊరూవాడా బతుకమ్మ ఆడుతున్నారు. పార్టీ నాయకురాళ్లు పాల్గొంటున్నారు. అయితే దీనికి సామాజిక కోణాన్ని జోడించారు. ‘ఆడపిల్లను పుట్టనివ్వండి….ఆడపిల్లను బతకనివ్వండి’ అనే సందేశంతో కమ్యూనిస్టులు బతుకమ్మలు ఆడుతున్నారు. బతుకమ్మ అంటే ‘బతుకు అమ్మ’ అనే అర్థం కూడా ఉంది కాబట్టి వారు దాన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే సంప్రదాయాన్ని గౌరవిస్తూనే సామాజిక దురాచారాన్ని ఎత్తిచూపడమన్నమాట. ఏది ఏమైనా తెలంగాణలో తమ రాజకీయ మనుగడ కోసం కమ్యూనిస్టులు బతుకమ్మ పండుగ ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. ‘సీపీఎం ప్రజలకు దూరమైంది. ఆ అంతరాన్ని తగ్గించుకునేందుకు బతుకమ్మ పండుగను సాధానంగా వాడుకోవాలి’ అని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ సందర్భంలో అన్నారు. సీపీఐది కూడా ఇదే పంథా అయివుండొచ్చు. పార్టీల సిద్ధాంతాలు ఎలాంటివైనా ప్రజలు జరుపుకునే పండుగల్లో పాల్గొనకపోతే, వారి సంతోషంలో పాలు పంచుకోకపోతే అది రాజకీయంగా కూడా నష్టం చేస్తుందన్న మాట…!

ఎం. నాగేందర్